Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిత్య యవ్వనుడు నాగార్జున ఆరోగ్య రహస్యం ఓ పే-ద్ద ఫుడ్ మిస్టరీ !

August 30, 2026 by M S R

.

ఆయన తినే రైస్ మనం తినలేం… నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు చంద్ర… అనే హెడింగుతో టీవీ9 సైటులో ఓ వార్త… అదీ సగటు యూట్యూబ్ చానెల్ అయిపోయింది కదా, సరే, 67 ఏళ్ల వయస్సులో కూడా ఇంత ఎనర్జిటిక్‌గా, ఎంత స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాడు, ఏమిటో ఆ కారణాలు, డైట్ తెలుసుకుందాం అని చదివితే… తుస్…

ఎవరికి ఏది తోస్తే అది చెప్పేయడం, రాసేయడం… చదివేవాడు రాసేవాడికి లోకువ… చెప్పేవాడికి వినేవాడు లోకువ… ముందుగా ఓ వార్త సారాంశం చెబుతాను…

Ads

‘‘నాగార్జున ఆహారం విషయంలో అత్యంత క్రమశిక్షణతో ఉంటారు. వారంలో ఐదు రోజులు మామూలు ఆహారమే. కానీ “మితంగా తీసుకోవాలి” అనే సూత్రాన్ని పాటిస్తాడు. ఎక్కువగా తినడు. ఉదయం అల్పాహారంలో ఒక ఇడ్లీ, లేదా ఒక వడ, లేదా ఒక గారె మాత్రమే తీసుకుంటాడు… మళ్ళీ ఆకలి వేసినప్పుడే తింటాడు, ఆకలి లేనిదే తినడు… చాలా మందిలాగా ఆకలి ఉన్నా లేకపోయినా దొరికింది తినేయడు…

(సేమ్, రవితేజ భోజనం విషయంలోనూ ఇదే పదే పదే చెప్పించారు ఈమధ్య ఇరుముడి ఇంటర్వ్యూల్లో)… మధ్యాహ్న భోజనంలో నాగార్జునకి కొన్ని ప్రత్యేకమైన వంటకాలు తప్పనిసరిగా ఉండాలి. రోజూ బెండకాయ, హాట్ చిప్స్ ఆయన డైట్‌లో ఉంటాయి. అన్నం విషయంలో దంపుడు బియ్యం (పొట్టు తీయనివి) మాత్రమే…

అన్నం చాలా మెత్తగా, దాదాపు చివిడిపోయినట్లు ముద్దగా ఉండాలి… అది అందరూ తినలేరు… దీంతో రసం, ఒక అరటిపండు కూడా ఆయన ఆహారంలో భాగం. నాగార్జునకి ఇష్టమైన ఆహారం పాంప్లెట్ చేప… సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, మిరియాలు, ఆలివ్ ఆయిల్‌లో నానబెట్టి, ఆ మిశ్రమాన్ని చేపలపై వేసి ఆ డిష్ తయారు చేస్తారు.

ఆదివారం నాడు మటన్ లేదా చికెన్ కూడా తీసుకుంటాడు, అదీ రెండు లేక మూడు ముక్కలకు మాత్రమే పరిమితం… షూటింగ్‌కు రాగానే పరగడుపున ఒక పెద్ద రాగి గ్లాసులో ఈ జ్యూస్‌ను చంద్ర స్వయంగా తయారుచేసి ఇచ్చేవాడు. ఈ జ్యూస్‌లో నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్‌రూట్, అలాగే పటికబెల్లం ముక్క లేదా తేనె కలిపి మిక్సీ చేస్తారు. ఈ జ్యూస్ జుట్టు రాలకుండా ఉండటానికి ప్రధాన రహస్యం..’’

……… హమ్మయ్య, ఇదండీ ఆ వార్త సారాంశం… నాగార్జున తనే స్వయంగా చెప్పాడు, తినడం కాదు, తిన్న కేలరీలన్నీ జిమ్‌లో కనీసం రోజూ గంటసేపు కరగదీస్తాను అని… తను ఫిట్‌గా ఉండటానికి కారణం రెగ్యులర్ జిమ్… ఇంట్లోనే సొంత జిమ్ ఉంది… కానీ ఒక ఇడ్లీ లేదా ఒక వడ లేదా ఒక గారె మాత్రమే బ్రేక్‌ఫాస్ట్ అనేది అబ్సర్డ్… జిమ్ చేసేవాడికి ఆ బ్రేక్‌ఫాస్ట్ సరిపోతుందా..?

“బ్రేక్‌ఫాస్ట్ ధనికుడిలా, మధ్యాహ్న భోజనం రాజులా, రాత్రి భోజనం బిచ్చగాడిలా చేయాలి” అనేది మన ఆరోగ్యానికి సంబంధించి పెద్దలు చెప్పిన ఒక అద్భుతమైన సామెత… అది ఇప్పటికీ అనుసరణీయం… అసలు బ్రేక్‌ఫాస్ట్‌ను అవాయిడ్ చేయడం అంటేనే ఏదో అనారోగ్య సమస్య ఉందని లెక్క… లేదా పొద్దున ఏమీ తినడానికి గతిలేనివాడని లెక్క… సో, ఒక ఇడ్లీ లేదా ఒక వడ అనేది ఎలాంటి వ్యాఖ్యానమో అర్థమైంది కదా… అది ప్రముఖ చానెల్ సైటులో ఓ వార్త..!!

నిజానికి నాగార్జునే మరో ఇంటర్వ్యూలో చెప్పాడు… వీకెండ్ సండే ఓ బీర్ తాగుతాను, మాంసాహారం తింటాను, తెల్లవారే అదంతా కరగదీస్తాను అని..! డయాబెటీస్ మన రాష్ట్రాల్లో బాగా పెరిగాక దంపుడు బియ్యం చాలామంది తింటున్నారు… అదేమీ విశేషం కాదు, నాగార్జునకు మధుమేహం ఉందో లేదో తెలియదు…

జుట్టు రాలకుండా ఉండేందుకు… షూటింగుకు రాగానే పరగడుపున ఓ ప్రత్యేక జ్యూస్ తాగుతాడు అనేది మరో పిచ్చి వ్యాఖ్యానం… ఎవడూ పరగడుపున షూటింగుకు రాడు, అలా వస్తే ఏదో చెప్పలేని వ్యాధి ఉన్నట్టు లెక్క… ఐనా వార్తలోనే చెబుతారు మళ్లీ… ఒక ఇడ్లీ లేదా ఒక వడ తింటాడు అని…

మహేశ్ బాబు చాలా స్ట్రిక్టుగా ఆహార నియమాన్ని పాటిస్తాడు, తనే చెబుతుంటాడు… తను కూడా రెగ్యులర్ జిమ్, అందుకే తను ఈరోజుకూ కాలేజీ కుర్రాడిలా ఉంటాడు… ఇక విజయనిర్మల కొడుకు నరేష్‌ ఫుడ్ రీల్స్, వీడియోలు ఇంకాస్త విభిన్నం… అవి మరెప్పుడైనా చెప్పుకుందాం… కమాన్, హ్యావ్ యువర్ బ్రేక్ ఫాస్ట్… విత్ వన్ ఇడ్లీ ఆర్ వన్ వడ…!!

చివరగా… ఆమధ్య ఓ లేట్ నైట్ డిన్నర్ వెళ్లాను… ఓ నాలుగు దశాబ్దాల సీనియర్ నటుడు, వేల కోట్ల రియల్ ఎస్టేట్ సామ్రాజ్య నిర్మాత ప్లేటులో అన్నం, అందులో ఫుల్లు గడ్డ పెరుగు కలుపుకుని తింటున్నాడు… తనే అంతకుముందు రోజు ఏదో ఇంటర్వ్యూలో చెప్పిన ఆణిముత్యాలు గుర్తొచ్చాయి… ‘రాత్రిళ్లు అన్నం అస్సలు ముట్టను, పాతికేళ్లుగా పెరుగును దగ్గరకు రానివ్వలేదు, సాయంత్రం 7, 8 కే నా డిన్నర్ పూర్తవుతుంది…’ అర్థం అవుతోందా మీకు !!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిత్య యవ్వనుడు నాగార్జున ఆరోగ్య రహస్యం ఓ పే-ద్ద ఫుడ్ మిస్టరీ !
  • రేవంత్ బీ సీరియస్ ! మంచి చెప్పరు – ఎదురుదాడి చేయరు – కొన్ని దిద్దుకోరు !!
  • ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు !!
  • ప్చ్.., ఏజ్ గ్యాప్ – కెమిస్ట్రీ పండలేదు – మరీ అక్కాతమ్ముళ్లలాగా !!
  • రాముడు ముంచుతాడో తేల్చుతాడో – మునుపెన్నడూ ఎరుగని భారీ పందెం !!
  • The Economist – ‘కొత్త హైదరాబాద్ ప్లాన్’ను అర్థం చేసుకుంది !!
  • రాఖీ సురేఖ కొలువు కాపాడుతుందా..? రాఖీ కట్టే కొత్త చెల్లెలు వస్తుందా?
  • ఈ నవ్వు వందలసార్లు చూసి ఉంటారు కదా… ఇదొక్కసారి చదవండి…
  • పుతిన్ అణుదాడి చేస్తాడు ! బ్రిటన్ మీదా కీవ్ మీదా చూడాల్సి ఉంది !
  • అబ్బే.., జగన్ రెడ్డి, కేసీయార్ పార్టీలు పెద్దగా పుంజుకోలేదట…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions