Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజంగానే NDA నుంచి CBN మళ్లీ బయటికి రావాలనుకున్నాడా?

June 25, 2026 by M S R

.
నిన్నటి వార్తే… ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ ఓ వివరణ ఇచ్చాడు. ‘ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుని, బయటికి వచ్చేయాలని చంద్రబాబు ఆలోచించి, ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో, మాజీ ఉపరాష్ట్రపతితో భేటీలు వేశాడని ప్రచారం జరిగింది. అదంతా ఓ వదంతి. ప్రధానికి కూడా ఈ విషయం చెప్పాను, ఆయన నవ్వి తేలికగా తీసుకున్నారు. మేం ఎన్డీయేలో ఉంటామని పదే పదే నిరూపించుకోవాల్సి వస్తోంది’

….. ఇదీ తన వివరణ. నిజానికి అంతకుముందు ఈ ప్రచారం కొన్ని ఎలైట్ సర్కిళ్లలో ఉందేమో తెలియదు గానీ, లోకేష్ అనవసరంగా అక్కడ వివరణకు ప్రయత్నించి, ప్రజలందరికీ తెలిసేలా చేసి, నిజంగానే ఏదో జరుగుతోందా అనే సందేహాలకు చాన్స్ ఇచ్చాడు. కొన్ని ప్రచారాలను అలా వదిలేయాలి, వివరణలకు వెళ్తే మరింత నష్టం, కౌంటర్ ప్రొడక్ట్. లోకేష్ గుర్తించినట్టు లేడు. (మోడీ లోకేష్‌ను ఎంకరేజ్ చేస్తున్న దశలో ఈ వివాదం, ఈ ప్రచారాలు లోకేష్‌కే నష్టం)

ఈమధ్య నాగేశ్వర్ వివాదం తెలుసు కదా. అమిత్ షాను పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి జగన్ మీద యాక్షన్ కోరితే, టీడీపీ ఇన్‌స్టంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టరమ్ ఫ్రెండ్ అని వ్యాఖ్యానించాడని కదా తను వ్యాఖ్యలు చేసింది. అది పెద్ద రచ్చయింది. సరే, ఆ వివాదం ఎలా ఉన్నా… నిజంగానే జనంలో మళ్లీ సందేహాలు ముసురుకుంటున్నాయి.

Ads

నిజంగానే ఎన్డీయేపై టీడీపీ అసంతృప్తిగా ఉందా? బయటికి వచ్చేయాలని అనుకుంటోందా? ఇది నిజమో కాదో తెలియదు, కానీ జరగదని మాత్రం చెప్పలేం, రాత్రికిరాత్రి విధేయతలు మార్చుకోవడంలో చంద్రబాబు ప్రసిద్ధహస్తుడే. ఇదే మోడీని తిడతాడు, మళ్లీ కావిలించుకుంటాడు, గతంలో ఎన్డీయేలో ఉన్నాడు, బయటపడ్డాడు. తన మద్దతు, తన దోస్తీ ఎప్పులూ చంచలమే, విశ్వసనీయం కాదు, అది అందరికన్నా మోడీకి బాగా తెలుసు.

ప్రభుత్వ మనుగడకు జేడీయూ, టీడీపీ మీద ఆధారపడితే, ఎన్నిరకాల ఒత్తిళ్లతో రాజీపడాలో కూడా తెలుసు. కానీ రెండేళ్లలో సీన్ మారిపోయింది. టీఎంసీ రెబల్స్, ఠాక్రే సేన రెబల్స్ గట్రా బీజేపీ కనుసన్నల్లోకి వచ్చేశారు. ఇప్పుడు చంద్రబాబు చక్రాలు తిప్పి ఎన్డీయే మీద ఏ ఒత్తిళ్లూ తీసుకొచ్చే సిట్యుయేషన్ లేదు. పోనీ, ఎన్డీయే నుంచి బయటికి వస్తాడనే అనుకుందాం, తను ఒంటరిగా ఉండలేడు, గతంలో కాంగ్రెస్‌తో కూడిన పరాభవం ఇప్పట్లో మరిచిపోలేడు. మరెందుకు ఎన్డీయేను వదిలేస్తాడు? ఏ ఫెడరల్ ఫ్రంటో, టెంటో పెట్టి ఆర్గనైజ్ చేసే ఓపిక, చొరవ, వయస్సు కూడా లేవిప్పుడు.

అవునూ, చంద్రబాబు భేటీ వేసిన ఆ ఉపరాష్ట్రపతి ఎవరు? ఆ పారిశ్రామికవేత్త ఎవరు? ఏం జరిగి ఉంటుంది? పోనీ, ప్రచారంలో ఉన్న వదంతే అనుకుందాం… గతేడాాది నవంబరులో ‘జమీన్ రైతు’ ఓ స్టోరీ వచ్చింది… దాని సారాంశం ఏమిటంటే?

lokesh

‘‘రిలయన్స్‌ అనిల్‌ అంబానీ తమ వద్ద తీసుకొన్న అప్పులలో ఫ్రాడ్‌ జరిగిందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జూన్‌ నెలాఖరులో ఒక ప్రకటన చేసింది. ఆ వెంటనే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి బ్యాంకులన్నీ వరసబెట్టి, అనిల్‌ అంబానీ విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌ అని ప్రకటించాయి. ఆ వెంటనే సిబిఐ రంగంలోకి దిగి కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత ఇడి ముందుకొచ్చి, అనిల్‌ అంబానీ ఆస్తులను జప్తు చేసింది. మోడీ ప్రధానిగా వున్న సమయంలో అంబానీ కుటుంబ సభ్యుడి మీద ఈ స్థాయిలో దండయాత్ర జరగడం పారిశ్రామిక వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నది.

ఇదే అనిల్‌ అంబానీ, ఇదే బ్యాంకుల నుంచి తీసుకొన్న అప్పులు తిరిగి కట్టలేని స్థితిలో వున్న సమయంలో ప్రధాని మోడీ తన వెంట ఫ్రాన్స్‌ దేశానికి తీసుకు వెళ్లి, రాఫెల్‌ కంపెనీతో ఆయన ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి సహకారం అందించారు. ఆ క్రోనీ క్యాపిటలిజం జగమెరిగిన సత్యం. దాని విషయంలో ప్రతిపక్షాలు ఎంత రచ్చ చేసినా మోడీ సమాధానం చెప్పలేదు. అంబానీ, అదానీ కుటుంబాలతో మోడీకి, బిజెపి పార్టీకి వున్న విడదీయరాని బంధం తెలియని వారు లేరు.

మరి అలాంటప్పుడు అనిల్ అంబానీ మీద ఈ కేసులేమిటి? ఈ ఇడి దాడులేమిటి అనేదే ఆశ్చర్యం. వీటికి ముందు కొన్ని కీలక రాజకీయ సమావేశాలు జరిగాయి. విశాఖపట్నం వద్ద పరిశ్రమల స్థాపన కోసం రాంబిల్లి, అచ్యుతాపురం సందర్శించాడు అనిల్‌ అంబానీ. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఒక సమావేశం జరిగిందని వినికిడి. అది జరిగిన కొన్ని రోజుల తర్వాత జూన్‌ 18 తేది లోకేష్‌ ఢిల్లీ వెళ్లి, అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ను కలిసి ముచ్చట్లాడాడు.

ఆ వెంటనే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ధన్కర్‌ను కలిశాడు. వీరిద్దరి కలయిక తర్వాత, వున్నట్లుండి ధన్కర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఒక్క క్షణం ఆలస్యం లేకుండా ఆ రాజీనామాను ఆమోదింప చేశాడు ప్రధాని మోడీ. కనీసం మర్యాదపూర్వకంగా కూడా రాజీనామా పునఃపరిశీలించుకోండి అని ధన్కర్‌ను ఎవరూ అడగలేదు. కాగితం తమ చేతికి రావడం, ఆమోద ముద్ర వేయడం వెంట వెంటనే జరిగిపోయాయి. జూలై 21 తేది ఈ సంఘటన జరిగింది.

lokesh

అనిల్‌ అంబానీ విశాఖపట్నం పరిశ్రమల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సందర్భంలో దేశ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయట. అదానీ విషయంలో మోడీ మరీ ఎక్కువగా ఆదరణ చూపుతున్నారని, దేశంలోని సంపద మొత్తం అదానీకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నదని అనిల్‌ అంబానీ వ్యాఖ్యానించాడట. దానితో పాటుగా మోడీ ధోరణి పట్ల బిజెపిలో చాలామంది అసంతృప్తిగా వున్నారని, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ వారిలో ఒకరని చెప్పాడట. మీకు వీలున్నప్పుడు ఉపరాష్ట్రపతిని ఒకసారి కలిసి మాట్లాడండి అని చెప్పి వెళ్లిపోయాడట అనిల్‌ అంబానీ.

ఆ ప్రేరణతోనే లోకేష్‌ ఢిల్లీ వెళ్లి, ధన్కర్‌ గారిని కలిశారన్నది సమాచారం. ఆ సమావేశం జాతీయ నాయకులలో ఆసక్తి కలిగించింది. లోకేష్‌ కలిసిన కొద్ది రోజులకే అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉపరాష్ట్రపతి నివాసానికి వెళ్లడంతో ఏదో జరుగుతున్నదనే అనుమానం జాతీయ నేతలలో పొడసూపింది. దాని ఫలితమే ఉపరాష్ట్రపతిగా ధన్కర్‌ ఆకస్మిక రాజీనామా.

లోకేష్‌ సమావేశాలు ఢిల్లీ పెద్దల దృష్టిలో అనుమానాలకు ఆస్కారం కలిగిస్తున్నాయని తెలియగానే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా మోడీ అపాయింట్‌మెంట్‌ తీసుకొని, స్వయంగా వెళ్లి, ఈ సమావేశాలకు ప్రాధాన్యత లేదని, అనిల్‌ అంబానీ ఇచ్చిన సలహా మేరకే లోకేష్‌ అట్లా కలిశాడని, తన మనసులో ఎటువంటి కల్మషం లేదని మోడీకి సవినయంగా విన్నవించాడట చంద్రబాబు నాయుడు. అనిల్‌ అంబానీ ఏమేమి చెప్పాడు అన్న వివరాలు తీసుకొన్నాడట మోడీ. ఆ వెంటనే బ్యాంకులు అనిల్‌ అంబానీ అప్పులను ఫ్రాడ్‌గా, ఆయన్ను విల్‌ఫుల్‌ డిఫాల్టరుగా ప్రకటించడం జరిగిపోయాయి.

ఆ ఢిల్లీ పర్యటన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ధోరణి పూర్తిగా మార్చుకొన్నారు. అవసరం వున్నా లేకపోయిన, సందర్భం వచ్చినా, రాకపోయినా ప్రధాని మోడీని ఆకాశానికెత్తి పొగడడం ఒక అలవాటుగా మార్చుకొన్నాడు. మోడీ దేముడితో సమానం అనే స్వరంలో వున్నాయి ఆయన కురిపిస్తున్న ప్రశంసల జల్లు. వాటిని విని బిజెపి రాష్ట్ర నేతలు ఆశ్చర్యపోతున్నారు. మేము కూడా ఈ స్థాయిలో మా మోడీని కీర్తించలేక పోతున్నామని వ్యాఖ్యానిస్తున్నారు బిజెపి నేతలు.

dhankad

ముఖ్యమంత్రిలో ఈ మార్పుకు కారణం – మోడీ మనసులో తన మీద అనుమాన బీజం పడిందనే భయమేనని పరిశీలకుల అంచనా. మోడీ కన్నెర్ర చేస్తే ఎంతటివాడైనా మాడి పోవలసిందే కదా? ఆ రిస్క్‌ తీసుకొనే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు. అందువల్ల మోడీని ప్రసన్నం చేసుకోవడానికి తన స్థాయిని పక్కన పెట్టి పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు.

ఈ పరిణామాలన్నిటి మీదా ఢిల్లీ ఉన్నత స్థాయి వర్గాలలో చర్చ నడుస్తూ వుంది. తన విషయంలో నోరు జారిన పాపానికి అనిల్‌ అంబానీని, ధన్కర్‌ను కూడా వదలి పెట్టలేదంటే, మోడీతో ఎంత ప్రమాదమో తలచుకొని భయపడి పోతున్నారు….. ఇదీ ఆ వార్త.

ఇక్కడ మళ్లీ సందేహాలు. నిజంగానే ధన్కర్ హఠాత్ రాజీనామా వెనుక ఏం జరిగిందనేది ఈరోజుకూ మిస్టరీయే. లోకేష్, ఆప్, ధన్కర్ భేటీలతో మోడీ ఏదో జరుగుతోందనే అనుమానించాడా? అందుకే ధన్కర్ మీద వేటు పడిందా? అనిల్ అంబానీ ఓ వ్యాపారి, తనసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. అలాంటప్పుడు మోడీ మీద, తనకు మద్దతునిచ్చే చంద్రబాబు దగ్గర మాటలు తూలుతాడా? పోనీ, ధన్కర్ స్థాయి ఏమిటి? లోకేష్ తనను కలిస్తే ఒరిగేది ఏమిటి? ఏమో, బహుశా ఇప్పట్లో ఇవి జవాబులు దొరకని ప్రశ్నలు!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజంగానే NDA నుంచి CBN మళ్లీ బయటికి రావాలనుకున్నాడా?
  • అక్కడ వేటూరి రాసింది తప్పే! అన్వయం కుదరని ఓ శబ్దగారడీ!
  • సాయిబాబా శివస్వరూపుడా? ఇది సనాతన సమర్థనీయమేనా?
  • సాయిబాబాకు ఆనం పొర్లుదండాలు దేనికి? వణికిపోవడం దేనికి?
  • సాయిబాబా గుడి సర్వమత వేదికా? చాదర్‌ఘాట్ కేసు ఏమంటోంది?
  • అక్కడ నేను ఇంకా బతికే ఉంటాను – మనిషిగా కాదు, ఒక విత్తనంగా!
  • Emoji Mathematics – చాటుమాటు చాట్ మూటల మాటలు
  • సాహసి CM విజయ్! బెరుకు లేదు- పెరియార్ భావజాలానికి తిరస్కృతి
  • తుంగభద్రపై ముగ్గురు ముఖ్యమంత్రులతో కేంద్రం కీలక భేటీ
  • బహుళ ప్రశంసల బడ్డీ మదర్ ! – ఎవరు ఈ IAS లక్ష్మీ ప్రియ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions