Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

 2029 టార్గెట్‌గా చకచకా పావులు..! జమిలి, డీలిమిటేషన్, మహిళా కోటా…?

August 25, 2026 by M S R

.

 2029 టార్గెట్‌గా చకచకా పావులు…
జమిలి, డీలిమిటేషన్, మహిళా కోటా ఒకే దారిలోనా?

భారత రాజకీయాల్లో 2029 ఎన్నికలు మరోసారి కీలక మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు ఇంకా మూడేళ్ల దూరంలోనే ఉన్నా… కేంద్రం మాత్రం ఇప్పటి నుంచే ఆ ఎన్నికల చుట్టూ పెద్ద రాజకీయ, రాజ్యాంగ మార్పులకు సంబంధించిన పావులు కదుపుతోందా అన్న చర్చ మొదలైంది.

Ads

ఒకటి కాదు.. మూడు కీలక అంశాలు ఒకేసారి తెరపైకి రావడమే ఇందుకు కారణం…. అవేమిటంటే..?

వన్ నేషన్–వన్ ఎలక్షన్.
డీలిమిటేషన్.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్.

ఇవి స్థూలంగా భారత ఎన్నికల వ్యవస్థనే కుదిపేసే పరిణామాలు… ఈ మూడు అంశాలూ విడివిడిగా కనిపిస్తున్నా.. 2029ను దృష్టిలో పెట్టుకుని చూస్తే వాటి మధ్య ఒక రాజకీయ లింక్ ఉందన్న అనుమానాలు సహజంగానే తలెత్తుతున్నాయి.

99 శాతం మద్దతు ఉందట! జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ జాయింట్ కమిటీ ఇప్పుడు ఇచ్చిన తాజా సంకేతం ఈ చర్చకు మరింత వేడి పెంచింది.

జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి ప్రకారం.. కమిటీ ఇప్పటివరకు సంప్రదించిన వర్గాల్లో దాదాపు 99 శాతం మంది దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. జూలైలోనే ఆయన 2029 లోక్‌సభ ఎన్నికలతో జమిలి ఎన్నికలను అమల్లోకి తీసుకురావడానికి ఒక వ్యవస్థను రూపొందించే దిశగా కమిటీ పనిచేస్తోందని చెప్పారు. తాజాగా మరోసారి 2029 అవకాశాన్ని బలంగా ప్రస్తావించారు.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది… 99 శాతం మద్దతు అంటే రాజకీయ పార్టీలన్నీ జమిలికి అంగీకరించాయని కాదు. జేపీసీ సంప్రదించిన సివిల్ సొసైటీ సంస్థలు, నిపుణులు, విద్యావేత్తలు, ఇతర వర్గాల అభిప్రాయాలు ఇందులో భాగం.

రాజకీయ పార్టీల మధ్య మాత్రం ఏకాభిప్రాయం ఇంకా దూరంగానే ఉంది. ఆగస్టు 24న జరిగిన జేపీసీ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కూడా ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే.. జమిలికి రోడ్డు కనిపిస్తోంది కానీ దారిలో రాజకీయ ముళ్లు ఇంకా చాలానే ఉన్నాయి. ప్రత్యేకించి బీజేపీ ఏం చెప్పినా ఎడ్డెమంటే తెడ్డెమనే కాంగ్రెసే ప్రధాన అడ్డంకి…

మరి 2034 ఎందుకు కాదు.. 2029 ఎందుకు? ప్రస్తుత రాజ్యాంగ, చట్టపరమైన వ్యవస్థలో జమిలి ఎన్నికల పూర్తి సమకాలీకరణకు 2034 వరకు వెళ్లే టైమ్‌లైన్‌ ఉండేది. కానీ ఇప్పుడు 2029నే ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోందన్నది అసలు ఆసక్తికరమైన పరిణామం.

  • ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ తాజా కథనం ప్రకారం… ఎన్డీయేలో 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించే అవకాశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇది ఇంకా అధికారిక నిర్ణయం కాదు. కానీ 2034 నుంచి 2029కు టైమ్‌లైన్‌ను ముందుకు తీసుకురావాలన్న ఆలోచన రాజకీయ స్థాయిలో పరిశీలనలో ఉందన్న సంకేతం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

అదే జరిగితే.. ఇప్పటికే పదవీకాలాలు వేర్వేరు దశల్లో ఉన్న అసెంబ్లీలను ఎలా ఒకే ఎన్నికల చక్రంలోకి తీసుకురావాలన్నదే పెద్ద రాజ్యాంగ సవాలు. జమిలి ఒక్కటే కాదు.. ఇదే సమయంలో మరో పెద్ద పని కూడా జరుగుతోంది. డీలిమిటేషన్.

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లులు 2026లోనే పార్లమెంటులోకి వచ్చాయి. ప్రతిపాదిత వ్యవస్థలో లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను భారీగా పెంచే అవకాశం ఉంది. ప్రస్తుత 543 స్థానాల నుంచి గరిష్ఠంగా 850 వరకు వెళ్లేలా రాజ్యాంగంలో మార్పులు ప్రతిపాదించబడ్డాయి.

ఇది సాధారణ నియోజకవర్గాల పునర్విభజన కాదు… దేశంలో జనాభా పెరుగుదల ఆధారంగా రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల పంపిణీ మారితే.. దక్షిణాది రాష్ట్రాలు వర్సెస్ ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ సమీకరణాలపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే డీలిమిటేషన్ ఇప్పటికే పెద్ద రాజకీయ వివాదంగా మారింది.

కర్ణాటక, తమిళనాడు సహా దక్షిణాది నుంచి దీనిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 543 స్థానాల సంఖ్యను కొనసాగించాలని, మహిళా రిజర్వేషన్‌ను అదే పరిమితిలో అమలు చేయాలని కోరారు.

మహిళా రిజర్వేషన్ కూడా 2029కే ? ఇక్కడ మరో కీలక లింక్ వస్తుంది. మహిళలకు లోక్‌సభ, అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టం ఇప్పటికే రాజ్యాంగంలోకి వచ్చింది. కానీ దాని అమలు డీలిమిటేషన్, జనగణనతో అనుసంధానమై ఉంది.

2029 నుంచే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటే డీలిమిటేషన్ ప్రక్రియను చాలా ముందుగానే పూర్తి చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల స్పష్టం చేశాడు. తాజా జనగణన గణాంకాల ప్రక్రియ ఆలస్యమైతే మహిళా రిజర్వేషన్ 2034 వరకు వెళ్లే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నాడు.

అంటే 2029 లక్ష్యంగా చూస్తే డీలిమిటేషన్‌ను వేగవంతం చేయడం ఒక కీలక అవసరం. అందుకే ఈ మూడు అంశాలు ఒకదానితో ఒకటి కలుస్తున్నాయన్న రాజకీయ విశ్లేషణ మొదలైంది.

డీలిమిటేషన్ జరిగితే కొత్త సీట్ల వ్యవస్థ.
కొత్త సీట్ల వ్యవస్థలో మహిళా కోటా.
అదే సమయంలో లోక్‌సభతో అసెంబ్లీ ఎన్నికలను సమకాలీకరించే జమిలి వ్యవస్థ.

మరి పార్లమెంట్ ఇంకా ఎందుకు ప్రొరోగ్ కాలేదు? ఇదే ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికరమైన ప్రశ్న. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కానీ ఆగస్టు 23 నాటికి సమావేశాలను అధికారికంగా ప్రొరోగ్ చేయలేదు. దీంతో ప్రభుత్వం ఏదైనా కీలక బిల్లును తీసుకురావడానికి ఈ పరిస్థితిని ఉపయోగించుకుని, ప్రత్యేక సమావేశాలు ప్లాన్ చేస్తోందా? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

కొన్ని సందేహాలు…  జమిలి ఎన్నికల బిల్లు ఈ వర్షాకాల సమావేశాల్లోనే వస్తుందని చెప్పడానికి ప్రస్తుతం బలమైన ఆధారం లేదు. జేపీసీ నివేదిక సమర్పణ గడువు శీతాకాల సమావేశాల చివరి వారం వరకు పొడిగించబడింది. అందువల్ల జమిలిపై అసలు శాసన ప్రక్రియ శీతాకాల సమావేశాల వైపు వెళ్లే అవకాశమే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ విషయంలో మాత్రం 2029 లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే రాజకీయ సంప్రదింపులు జరుపుతోంది. ఆగస్టులో వాటిపై ప్రత్యేక సమావేశం ఉంటుందన్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించినప్పటికీ.. బిల్లులను తిరిగి తీసుకురావడంపై సంప్రదింపులు జరిగిన విషయం మాత్రం పలు నివేదికల్లో వచ్చింది.

అసలు గేమ్ 2029లోనేనా? … ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. 2029లో లోక్‌సభ ఎన్నికలు సాధారణ ఎన్నికలుగా జరిగితే ఒక విషయం. అదే ఎన్నికలతో పాటు దేశంలోని మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగితే మరో విషయం.

దానికి ముందు డీలిమిటేషన్ పూర్తయి, లోక్‌సభ స్థానాల సంఖ్య మారి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వస్తే… అది కేవలం ఎన్నికల షెడ్యూల్ మార్పు కాదు. దేశ రాజకీయాల మ్యాప్‌నే మార్చే ప్రక్రియ అవుతుంది. 2029కి ఇంకా మూడేళ్లు ఉన్నా.. ఢిల్లీలో మాత్రం పావులు ఇప్పుడే చకచకా కదులుతున్నాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  •  2029 టార్గెట్‌గా చకచకా పావులు..! జమిలి, డీలిమిటేషన్, మహిళా కోటా…?
  • రేవంత్‌ రెడ్డి చాణక్యం ! ‘తెలంగాణ ఆత్మగౌరవం’ ఎవడబ్బ సొత్తు ?
  • సారీ, వారణాసి రాజమౌళీ… నీ డబ్బింగ్ ఆలోచనల్లోనే తప్పుంది !!
  • వారణాసిలో పెద్ద కర్మ ! తంతు అల్లాటప్పా ఏమీ కాదు, అదొక పరీక్ష !!
  • ఇప్పుడు చెప్పండి… ఎవరు ఒప్పో… ఎవరు తప్పో… మీవల్ల కాదు !!
  • నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడం కాదు ! ఈ సుందరి ఏమన్నదో తెలుసా ?
  • ఏయ్, తప్పు..! సాదిక్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేయకూడదు !!
  • నిజమే అనసూయా… అసలే సోషల్ మీడియాలో బికినీల కాలమిది !!
  • కంగనా అంటే అంతే ! Who Cares అంటూ రోజుకొకరికి ఇచ్చి పడేస్తోంది !
  • ఓహో… వన్ గ్రామ్ ఫ్రీ ఉంగరంపై మేనమామ రూపం అట !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions