Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పోనీ, మీ కేసీయార్‌తో ఒక్క హామీ ఇప్పించు చాలు… నాట్లు వేసేద్దాం…

September 13, 2026 by M S R

.

ముందుగా ఓ వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించిన తాజా వార్త చదవండి…. రాను రాను బీఆర్ఎస్ పార్టీ ఎంతటి క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నదో ఓ మాంచి నిఖార్సయిన ఉదాహరణ… ఆయన పేరు జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి… తను నల్గొండ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఏమంటాడంటే..?

సాగర్ ఆయకట్టు కింద పూర్తి స్థాయిలో మొత్తం నాట్లు వేయండి… రైతులారా నీళ్ల కోసం మేము పేగులు తెగే దాకా కొట్లాడుతాం… పంటలకు నీళ్లు ఇచ్చి తీరాలి… ఎడమ కాల్వకు, వరద కాల్వకు, AMRP కింద, లో లెవల్ కింద, SLBC కింద మొత్తం ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సిందే…. లేదంటే బరాబర్ కొట్లాడుదాం…

Ads

ఎట్లా నీళ్లు ఇవ్వరో చూస్తాం, ఈ ప్రభుత్వం అంతు చూస్తాం… ఖబడ్దార్ ముఖ్యమంత్రీ, మా నీళ్లు మాకు ఇవ్వాలి…  దున్నపోతులలాగా నిద్ర పోతున్నారు… మంత్రులకు సోయి లేదు… ఇక బడిత పూజ చేయాలి… తెగించి కొట్లాడాలి…

200 TMC లు శ్రీశైలంలో నాగార్జునసాగర్‌లో మన నీళ్లు ఉన్నయ్… ఆ నీళ్లు మనవే… మన హక్కు… కేసీఆర్,  KTR నాయకత్వంలో ఎంతవరకు అయినా కొట్లాడుతాం….వెలిగొండ ప్రాజెక్టు ద్వారా, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ చేస్తున్న నీటి దోపిడీని అరికట్టాలి అని KRMB కి లేఖ రాయాలి….

పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లను దోచుకుంటున్నాడు… నీళ్ల దొంగ చంద్రబాబు… ఇప్పటివరకు 200 TMC లను దోచుకుని పోయాడు….. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి దోపిడీ చేస్తున్నారు.. గేట్ మొత్తాన్ని ఊడబీకి నీటిని తోడుకొని పోతున్నారు…

సరే, ఇవేగాకుండా కలగాపులగం టైపులో 22ఏ నుంచి కరెంటు ఇస్తలేరు దాకా నానా అంశాలూ ఏకబిగిన చెప్పుకుపోయాడు… చంద్రబాబు పోతిరెడ్డిపాడు గేటును ఊడబీకి నీళ్లు ఎత్తుకుపోతున్నాడు అనేవరకు కొంత వాజీబు వాదనే… హఠాత్తుగా ఆ గేటు ఊడిపోవడం కుట్రేనట… ఎలాగూ టెలిమెట్రీ కూడా పనిచేయనివ్వరు…

కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో, ఏం చేయడమో విమర్శిస్తే రాజకీయాల్లో సహజమే… కానీ రైతుల్ని ఉసిగొల్పి నాట్లు వేయించాలనే క్షుద్ర ఆలోచన దేనికి..? రాజకీయాల్లో జనాన్ని మోసగించే తాంత్రిక ఎత్తుగడలు ఇవి…

అసలు ఇప్పుడున్న నీళ్లు తాగునీటికే సరిపోతాయా లేదానే ఆందోళన ఉంది… ఎప్పుడైనా ఫస్ట్ ప్రయారిటీ తాగునీళ్లకే… అదనంగా ఏం నీళ్లున్నాయని రైతులు నాట్లు వేయాలి, వేస్తారు సరే, ఈ తోపు నేతల మాటల్ని నమ్మి సాగు చేస్తారు సరే, పేగులు తెగేదాకా ప్రెస్‌మీట్లు పెట్టి శోకాలు పెడతారు సరే, కానీ ఆ పంటలన్నీ ఎండిపోతే… ఎవరు నష్టపోయేది… ఈ జగదీష్ రెడ్డి కాదు, కేటీయార్ కాదు, జనానికి మొహం చాటేస్తున్న అతిరథమహారథమహోగ్రరథ కేసీయార్ అసలే కాదు…

అంటే మీ క్షుద్ర రాజకీయపు ఎత్తుగడలకు రైతులు మోసపోవాలా..? పోనీ, అయ్యా, మాజీ మంత్రి జగదీషూ… మీ నేత కేసీయార్‌తో ఒక్క హామీ ఇప్పించు… ‘‘మా పార్టీ దగ్గర మస్తు పైసలున్నయ్… 1800 కోట్లు ఏం చేసుకుంటాం, మా సొంతానికీ బాగానే డబ్బులున్నయ్, మాకు దీటుగా మా జగదీష్ ఉన్నాడు… నష్టపోయే ప్రతి రైతుకూ పరిహారం పార్టీ తరఫున ఇస్తాం’’… తరువాత నాట్లు వేసుకొండి అని పిలుపునివ్వు, ఇప్పించు..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పోనీ, మీ కేసీయార్‌తో ఒక్క హామీ ఇప్పించు చాలు… నాట్లు వేసేద్దాం…
  • విజయవాడ నాయకులందరికీ నిజంగా ఒక అవమానం…
  • ఆ బిన్ లాడెన్ వారసుడు హమ్జా ఇంకా బతికే ఉన్నాడా ।?
  • మా ఓట్లు పోయినట్లేనా ‘సర్’?
  • AMR … ఈడీ భారీ దాడులపై తెలుగు మీడియా సైలెన్స్ దేనికి..?
  • కొన్ని పుస్తకాలు బయటికి రావు ! ఏ పార్టీ ప్రభుత్వమూ మినహాయింపు కాదు !!
  • AIలో ఫోటో అప్‌లోడ్ చేస్తే అకౌంట్‌లో డబ్బులు పోతాయా? నిజమేంటి?
  • ‘‘ఆ రీసెర్చ్ కోసం- బ్లడ్ క్యాన్సర్ సోకిన నీ కూతుర్ని ఇస్తావా?”
  • 40 స్క్రీన్లకు పడిపోయిన సినిమా… 2,500 స్క్రీన్లకు ఎలా వెళ్లింది?
  • పూలమ్మి పాలమ్మి వేల కోట్లు ఆర్జించిన మల్లారెడ్డి ఫిక్స్..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions