.
రాష్ట్రపతి పక్కన ఎప్పుడూ తప్పకుండా కనిపించే ఒక అధికారి అసలు ఉద్యోగం కేవలం రక్షణేనా? కాదు, వివరంగా చెప్పుకుందాం ఓసారి…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడికి వెళ్లినా ఆమె వెంటే కనిపించే ఒక యువ ఆర్మీ అధికారి సోషల్ మీడియాలో చాలామందికి సుపరిచితమే. యూనిఫామ్‌లో హుందాగా కనిపించే మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్‌కు కొంతకాలానికే ‘నేషనల్ క్రష్’ అనే ట్యాగ్ కూడా వచ్చేసింది. కానీ కెమెరాలో కనిపించే ఆ కొన్ని సెకన్ల వెనుక ఉన్న జీవితం మాత్రం అంత అందంగా ఏమీ లేదు.
Ads
12 ఏళ్ల సైనిక జీవితానికి, అందులో మూడేళ్లపాటు రాష్ట్రపతికి ఎయిడ్-డి-కాంప్‌గా పనిచేసిన తర్వాత 30 ఏళ్లకే రిషభ్ ఆర్మీ నుంచి ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నాడు. “ఇది నా జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయం” అని చెప్పిన ఆయన.. కుటుంబ బాధ్యతలే కారణమని వెల్లడించాడు. ఈ నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదు. దాదాపు నాలుగు నెలల పాటు ఆలోచించిన తర్వాతే యూనిఫామ్‌కు వీడ్కోలు పలికాడు.
కానీ అసలు ఆసక్తికరమైన విషయం రిషభ్ ఎందుకు ఆర్మీ వదిలారన్నదానికంటే… రాష్ట్రపతికి ADCగా ఉండటం అంటే అసలు ఏమిటన్నదే!
అసలు ADC కావాలనుకోలేదట! విచిత్రం ఏమిటంటే.. రిషభ్ అసలు ADC కావాలని కోరుకోలేదట. మరో దేశానికి చెందిన సైనికులతో ఇండియాలో జరుగుతున్న ఓ ఎక్సర్‌సైజ్‌లో ఉన్నప్పుడు ఆయన CO నుంచి ఫోన్ వచ్చింది. “నువ్వు ADC పోస్టుకు షార్ట్‌లిస్ట్ అయ్యావు.. ఏం చేయాలనుకుంటున్నావు?” అని అడిగారట.
రిషభ్ సమాధానం కూడా ఆసక్తికరమే. “ఇక్కడికి వెళ్తాను.. అక్కడికి వెళ్తాను.. కానీ అక్కడికి మాత్రం వెళ్లను” అన్నాడట. చివరికి తన సీనియర్ల సలహాతో ఒకసారి ప్రయత్నిద్దామని అనుకున్నాడట. అయితే CO మాత్రం “ట్రై చేయడం అంటూ ఏమీ లేదు. వెళ్తే వెళ్లాలి.. లేకపోతే లేదు. ఫెయిల్ అయితే నీకు చాలా కష్టం” అని తేల్చిచెప్పాడట.
అలా మొదలైన ప్రయాణమే చివరికి ఆయనను దేశ ప్రథమ పౌరురాలి చుట్టూ అత్యంత సన్నిహితంగా మెసిలే అధికారుల్లో ఒకరిగా నిలబెట్టింది.
రాష్ట్రపతి పక్కన నడవడం అంత ఈజీ కాదు! బయట నుంచి చూస్తే ADC అంటే రాష్ట్రపతి వెనుక రెండు అడుగుల దూరంలో నడుస్తూ కనిపించే ఓ ఆర్మీ అధికారి అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆయన పని అంతకంటే చాలా పెద్దది.
రాష్ట్రపతి ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ ఏం జరగాలి? ఎవరిని కలవాలి? ఎవరి నుంచి ఏ సమాచారం రావాలి? ఏ అధికారితో సమన్వయం చేయాలి? చివరి నిమిషంలో ఏ మార్పు వచ్చినా దాన్ని ఎలా నిర్వహించాలి? ఇవన్నీ ADC బాధ్యతల్లో భాగమే.
రిషభ్ చెప్పిన ప్రకారం, రాష్ట్రపతి ప్రధానితో మాట్లాడాలనుకున్నా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి ఆ సంభాషణ జరిగేలా చేయడం కూడా ADC బాధ్యతల్లో ఒకటి. ఆయన మాటల్లో చెప్పాలంటే.. అందరినీ ఒకే పేజీపైకి తీసుకురావడమే ఈ ఉద్యోగంలో అత్యంత కష్టమైన భాగాల్లో ఒకటి.
అంటే రాష్ట్రపతి దగ్గర కనిపించే అధికారి కేవలం ప్రోటోకాల్ కోసం నిలబడే వ్యక్తి కాదు. ఒక కార్యక్రమం సజావుగా సాగడానికి కనిపించకుండా పనిచేసే మేనేజర్ కూడా.
ఒక హెల్మెట్ కూడా మిస్ కాకూడదు! అయితే ఈ ఉద్యోగంలో అసలైన ట్విస్ట్ భద్రత. రిషభ్ చెప్పిన వివరాల ప్రకారం, రాష్ట్రపతి చుట్టూ కొన్ని సందర్భాల్లో సుమారు ఒక కిలోమీటర్ పరిధిని సెక్యూర్ చేస్తారు. ఆయుధాలు, లోహ వస్తువులు, ప్రమాదకరమైన పదార్థాలు వంటివి ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇంతటి భద్రత ఎందుకు అవసరమో ఆయన చెప్పిన మరో విషయం అర్థమయ్యేలా చేస్తుంది. రాష్ట్రపతిని కలిసే వ్యక్తి ఆమెకు నమస్కారం చేయడానికి ముందుకు వచ్చినా, చేయి కలపడానికి వచ్చినా.. అతని ఉద్దేశం ఏమిటో ఎవరికి తెలుసు? చివరికి రాష్ట్రపతి తాగే నీటి గ్లాసును కూడా ఎవరు పెట్టారు? అందులో ఏమైనా ఉందా? అనే స్థాయిలో జాగ్రత్త ఉంటుందని రిషభ్ వివరించారు.
అందుకే రాష్ట్రపతి దగ్గర ఎవరైనా కనిపించినప్పుడు.. “ఎందుకు ఇంత దగ్గరకు రానివ్వరు?” అనిపించే దృశ్యాల వెనుక ఒక కారణం ఉంటుంది.
రాష్ట్రపతి భద్రత కోసం ఇలాంటి శిక్షణ! ఇంకా ఆసక్తికరమైన విషయం ADCల శిక్షణ. రిషభ్ చెప్పిన వివరాల ప్రకారం, శిక్షణలో 70– 80 కిలోల బరువుతో ఉండటం, ఆహారం, నీరు, నిద్రకు తీవ్రమైన పరిమితులు విధించడం వంటి కఠిన పరిస్థితులు ఉంటాయి. 30–40 రోజుల పాటు శారీరక, మానసిక సామర్థ్యాలను పరీక్షించే విధంగా శిక్షణ ఉంటుందని ఆయన వివరించాడు.
ఒక కిలోమీటర్ వరకు ఒక రూట్‌లో నడిపిస్తారు. దారిలో ఎక్కడో చెట్టు వెనుక హెల్మెట్ పెడతారు. ఇంకెక్కడో మరో వస్తువు ఉంచుతారు. నడక పూర్తయిన తర్వాత “ఏం చూశావు?” అని అడుగుతారు. అదే ఈ శిక్షణ ఉద్దేశం. శరీరం అలసిపోయినా.. మెదడు మాత్రం అలసిపోకూడదు.
చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించే సామర్థ్యం తగ్గకూడదు. రాష్ట్రపతి భద్రతలో ఒక చిన్న వస్తువు కూడా చిన్నదే కాదు కాబట్టి. కానీ ఈ ఉద్యోగం అతని సొంత జీవితాన్ని మాత్రం తీసుకుంది
ఇక్కడే రిషభ్ కథకు అసలు మానవీయ కోణం వస్తుంది… “నేను పెళ్లి చేసుకోలేదు. రాష్ట్రపతి ADCలకు పెళ్లి చేసుకోకూడదనే నిబంధన ఉంది. కుటుంబానికి దూరంగా ఉండాలి. బయట సాధారణ మనిషిలా తిరిగి జీవితాన్ని ఆస్వాదించలేను. అదే నేను చెల్లించిన మూల్యం” అని ఆయన చెప్పాడు.
ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఆర్మీ వదిలింది పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పడం తప్పు. రిషభ్ స్వయంగా తన రిటైర్మెంట్‌కు కుటుంబ బాధ్యతలే కారణమని చెప్పాడు. సోషల్ మీడియాలో వచ్చిన పెళ్లి, భార్యలు, వ్యక్తిగత సంబంధాలపై పుకార్లను కూడా ఆయన ఖండించాడు.
అంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఒక ప్రేమకథకు క్లైమాక్స్ కాదు. తన జీవితంలో ఇంకో అధ్యాయానికి చోటు కల్పించుకోవాలనే నిర్ణయం.
ముర్ములో తల్లిని చూసుకున్నాడు… అన్నింటికంటే భావోద్వేగమైన విషయం మాత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయనకు ఏర్పడిన అనుబంధం.
2014 నుంచి తన సొంత తల్లితో కలిసి గడిపిన సమయం చాలా తక్కువగా ఉందని రిషభ్ చెప్పారు. రాష్ట్రపతిని మొదటిసారి చూసినప్పుడు తన తల్లి ఎదురుగా నిలబడి ఉన్నట్లుగా అనిపించిందని గుర్తుచేసుకున్నాడు. ఆమె తనపై చూపిన వాత్సల్యం తన తల్లిని గుర్తు చేసేదని చెప్పారు.
అందుకే ఈ కథలో ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తుంది. దేశ ప్రథమ పౌరురాలిని కాపాడే ఉద్యోగం అతనికి వ్యక్తిగత జీవితాన్ని దూరం చేసింది. కానీ అదే ఉద్యోగం అతనికి ఒక తల్లి లాంటి అనుబంధాన్ని కూడా ఇచ్చింది…!!
Share this Article