.
తీతా… అంటే తీసేసిన తాసిల్దారు… అంటే జనం సీఎం కుర్చీ పీకిపడేసిన ముఖ్యమంత్రి… పేరు పినరై విజయన్… అలా జనం తనను పీకిపడేయటానికి ఉన్న కారణాల్లో ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… యూడీఎఫ్ గెలుపు కోసం కేరళలో ప్రచారానికి వెళ్లిన రేవంత్ రెడ్డి అభివృద్ధి అనే కోణంలో పినరై విజయన్ పాలనను బాగా గోకాడు… అది జనంలోకి బలంగా వెళ్లింది…
విజయన్‌కు బాగా కాలింది… ఠాట్, మేం డెవలప్‌మెంటులో తోపులం అన్నట్టుగా ఏవో లెక్కలు చెప్పాడు ట్వీటులో… ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రంలోని ప్రత్యర్థులకు గాకుండా, గెస్ట్ ప్రచారకర్తకు జవాబులు చెప్పుకున్న తీరు ఓ విశేషం… సరే, దానికి మళ్లీ రేవంత్ రీకౌంటర్ ఇచ్చాడు… వెరసి విజయన్ కుర్చీ కాళ్లు విరిగిపోయాయి… కూలబడ్డాడు…
Ads
ప్రస్తుతానికి పనేమీ లేదు… రేవంత్ రెడ్డికి సంబంధమున్న వార్తలు చదువుతూ, పళ్లు నూరుతూ, కారాలు-మిరియాలు నూరుతున్న దశలో… తనకు హైడ్రా వ్యాఖ్యల వివాద వార్త దొరికింది… అసలు రేవంత్ రెడ్డి ఏమన్నాడో, ఏ సందర్భంలో అన్నాడో, ఏ అర్థంలో ఉన్నాడో తనకు అర్థం కాలేదు, కాదు కూడా… వెంటనే ‘‘ఇదంతా ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆ ఫాసిస్టు ధోరణులు కనిపిస్తున్నాయి, గతంలో రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి కదా’’ అని ఏదో మాట్లాడాడు…
నమస్తే తెలంగాణ వంటి పత్రిక(?)లకు తప్ప ఇంకెవరికీ అది అచ్చేయదగిన వార్తలా కనిపించలేదు, కాదు కూడా… తీసి పక్కన పడేశాయి, ఇదేమో కళ్లకద్దుకుని, కేసీయార్ భాషలోనే చెప్పాలంటే ఆ దబ్బనం పార్టీ నేత ప్రకటనను అచ్చేసుకుంది… ‘‘పేదల ఇళ్లు కూల్చడానికే హైడ్రా’’ అని రేవంత్ అన్నట్టుగా, దాన్ని విజయన్ ఖండించినట్టుగా అచ్చేసింది…
రేవంత్ రెడ్డి అన్నది కబ్జాదారులపైకి ఎక్కుపెట్టిన హైడ్రా అస్త్రం, దురాక్రమణల్ని కూల్చేయడానికి అని..! సరే, ఆ వార్త చదువుతుంటే, విజయన్ ధోరణి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు… బెంగాల్‌లో, కేరళలో ఈ నయా హిట్లర్లు సాగించిన నరమేధాలు, అరాచకాలు, హత్యాకాండలు గుర్తొచ్చాయి… కేరళలో వందల మంది జాతీయ వాద కార్యకర్తల్ని పొట్టనపెట్టుకుంది సీపీఎం…
ఇక బెంగాల్‌లోనైతే చెప్పనక్కర్లేదు… పక్కా హిట్లర్ పాలన… కొన్ని ప్రముఖ ఉదాహరణలు విజయన్‌కు గుర్తున్నాయో లేదో… కొన్ని మచ్చుకు చెప్పుకుందాం…
పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) – CPI(M) సుమారు 34 ఏళ్ల పాలనను (1977-2011) విమర్శకులు తరచూ “సర్వాధికార (Authoritarian)” లేదా “హిట్లర్ తరహా” కఠిన పాలనతో పోలుస్తుంటారు… ఒకే పార్టీ చేతుల్లో సంపూర్ణ అధికారం కేంద్రీకృతం కావడం, ప్రతిపక్షాల అణచివేత, వ్యవస్థలన్నింటినీ పార్టీ పరిధిలోకి తెచ్చుకోవడాన్ని బట్టి ఈ విమర్శలు వచ్చాయి…
మరిచ్‌ఝాపి ఊచకోత (1979)…: జ్యోతిబసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో, బంగ్లాదేశ్ నుండి వచ్చిన వేలాది మంది దళిత హిందూ శరణార్థులు సుందర్బన్స్ పరిధిలోని ‘మరిచ్‌ఝాపి’ దీవిలో స్థిరపడ్డారు. వారిని అక్రమ వలసదారులుగా పేర్కొంటూ, ప్రభుత్వం ఆ దీవిపై కఠినమైన ఆర్థిక, వైద్యపరమైన దిగ్బంధనాన్ని విధించింది. ఆ తర్వాత జరిగిన పోలీసు, పార్టీ కేడర్ కాల్పులు, ఆకలి, వ్యాధుల కారణంగా వందలాది (కొన్ని అంచనాల ప్రకారం వేలాది) మంది శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు… భారత దేశంలో ఇంత అమానవీయంగా, అనాగరికంగా, క్రూరంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదు…
బిజోన్ సేతు ఊచకోత (1982): దక్షిణ కోల్‌కతాలో పగటిపూట అందరూ చూస్తుండగానే ‘ఆనంద మార్గ్’ సంస్థకు చెందిన 16 మంది సన్యాసులు, ఒక సన్యాసినిని టాక్సీల నుండి కిందకు లాగి, దారుణంగా కొట్టి, సజీవ దహనం చేశారు. ఈ ఆధ్యాత్మిక సంస్థపై సిపిఐ(ఎం) కేడర్‌కు ఉన్న రాజకీయ అనుమానాలే దీనికి కారణం…
సాయీన్‌బారి హత్యలు (1970): లెఫ్ట్ ఫ్రంట్ అధికారికంగా అధికారంలోకి రాకముందు జరిగిన సంఘటన ఇది. బర్ద్వాన్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే ప్రముఖ ‘సాయీన్’ కుటుంబంపై సిపిఐ(ఎం) శ్రేణులు దాడి చేసి, ఇద్దరు సోదరులను చంపేశారు. చనిపోయిన కొడుకుల రక్తంతో తడిసిన అన్నాన్ని వారి తల్లితో బలవంతంగా తినిపించారని స్థానికులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
పార్టీ ఆధీనంలో యంత్రాంగం: గ్రామ పంచాయతీల నుండి పోలీస్ స్టేషన్లు, యూనివర్సిటీల వరకు ప్రతి వ్యవస్థనూ పార్టీ కమిటీలే నియంత్రించేవి. స్థానిక మేజిస్ట్రేట్లు లేదా ప్రజాప్రతినిధుల కంటే, సిపిఐ(ఎం) ‘లోకల్ కమిటీ సెక్రటరీ’లకే ఎక్కువ పవర్ ఉండేది. వారి ఆదేశాల మేరకే పోలీసులు నడుచుకునేవారు.
ప్రభుత్వ ఉద్యోగాల రాజకీయీకరణ: పాఠశాల ఉపాధ్యాయుల నియామకాలు, ప్రొఫెసర్ల పోస్టులు, ప్రభుత్వ పదోన్నతులు కేవలం పార్టీ సభ్యత్వం ఉన్నవారికి లేదా లెఫ్ట్ ఫ్రంట్ పట్ల పూర్తి విధేయత ప్రదర్శించేవారికి మాత్రమే దక్కేలా చూసేవారు…
సైంటిఫిక్ రిగ్గింగ్ (Scientific Rigging): ఎన్నికలు క్రమంగా జరిగినప్పటికీ, సిపిఐ(ఎం) “సైంటిఫిక్ రిగ్గింగ్” పద్ధతిని కనిపెట్టింది… ఓటర్ల జాబితా నుండి ప్రతిపక్ష మద్దతుదారుల పేర్లను తొలగించడం, నకిలీ ఓట్లను చేర్చడం, పోలింగ్ ఏజెంట్లను భయపెట్టడం, పోలీసుల సహకారంతో బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడటం వంటివి ఇందులో భాగం…
గ్రామాల్లో ఏకపక్ష ఆధిపత్యం: మిడ్నాపూర్, కేష్‌పూర్, గర్బేటా వంటి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను ఊళ్ల నుండి తరిమేయడం, వారి ఇళ్లను లూటీ చేయడం లేదా తగులబెట్టడం వంటి చర్యల ద్వారా ఆయా ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి (Territorial Control) తెచ్చుకునేవారు.
నందిగ్రామ్, సింగూర్ (2006-2007): టాటా నానో కార్ల ఫ్యాక్టరీ (సింగూర్), కెమికల్ హబ్ (నందిగ్రామ్) కోసం రైతుల నుండి సారవంతమైన భూములను ప్రభుత్వం బలవంతంగా సేకరించడానికి ప్రయత్నించింది. రైతులు దీనిని నిరసించినప్పుడు, పోలీసులు, పార్టీకి చెందిన సాయుధ దళాలు (వీరిని ‘హర్మద్’ అని పిలిచేవారు) కలిసి రైతులపై విరుచుకుపడ్డారు. మార్చి 2007లో నందిగ్రామ్‌లో జరిగిన పోలీస్ కాల్పుల్లో 14 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు… మిస్టర్ ఎర్ర విజయన్, చాలా? ఇంకా చెప్పాలా..?
- దుర్మార్గమైన పాలన, పార్టీ విధానాలకు సీపీఎం పెట్టింది పేరు… పైగా ఈ నియంత పోకడల్ని ఆర్ఎస్ఎస్‌కు వర్తింపజేస్తూ వ్యాఖ్యాలు చేయడం మరో దుర్మార్గం… ఎక్కడ ఏది జరిగినా ఆర్ఎస్ఎస్‌ను నిందించడాన్ని సైకలాజికల్ పరిభాషలో ఏమంటారో వెతకాలి..!!
Share this Article