Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబద్దాలు- తప్పుడు బాష్యాలు – కాళేశ్వరంపై అవే వక్రీకరణ కథలు !!

August 25, 2026 by M S R

.

నిజం కుంగింది… పియర్లు మాత్రమే కాదు!
కాళేశ్వరంపై NDSA రిపోర్టుకు గులాబీ బాష్యం.. కాంక్రీట్ బాగుంటే ఫౌండేషన్ కూడా బాగున్నట్టేనా?

“కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు… పేర్లకీ, పుకార్లకీ, పకీర్లకీ నిబద్ధులు” అన్నాడు శ్రీశ్రీ… యువత గురించి ఏమో గానీ, బహుశా నమస్తే తెలంగాణ వంటి కరపత్రికలు, గులాబీ క్యాంపులు పుట్టుకొస్తాయని ముందే ఊహించి ఉంటాడు… పాడిందే పాటరా, పాచిపళ్ల నమస్తే తెలంగాణ అని కూడా ఒకటి గుర్తొస్తుంది…

Ads

వివరాల్లోకి వెళ్దాం… ఈరోజు బ్యానర్ స్టోరీ, ఏమిటయ్యా అంటే… కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయాలా లేదానేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని ఎన్డీఎస్ఏ (National Dam Safety Authority ) కోర్టుకు చెప్పిందట… అంటే, రాష్ట్రం తన పరిధిలోనే ఉన్నా, అదే ఎన్టీఎస్ఏ రిపోర్టు అని బుకాయిస్తూ, రైతులకు ద్రోహం చేస్తూ, నీళ్లు ఎత్తిపోయడం లేదు, ఎక్కడ కేసీయార్‌కు మైలేజీ వస్తుందోనని ఏడుపు…. ఇలా రాసుకుంటూ పోయింది…

అంతేకాదు, మొన్నటికిమొన్న CWPRS అనే కేంద్ర సంస్థ పిల్లర్లు అలియాస్ పియర్ల నాణ్యత భేషుగ్గా ఉందని రిపోర్టు ఇచ్చింది, మరి నీళ్లు ఎత్తిపోయకపోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం రోగం..? అంటూ ఏదేదో రాసుకొచ్చింది…

ఇంకాస్త వివరాల్లోకి, నిజాల్లోకి వెళ్దాం… అడ్డమైన నాణ్యతతో బరాజులు నిర్మించి, లక్ష కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని గోదాట్లో పోసిన ద్రోహమే గాకుండా… ఇప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం మొత్తం కొట్టుకుపోయే ఓ మాలీషియస్ ప్రాపగాండాకు దిగుతున్న తీరును ఏమనాలి..? ఇది తెలంగాణ పత్రికా..? ఇది తెలంగాణ క్యాంపు వాదనా..?

kaleswaram

కాళేశ్వరం విషయంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే… ముందుగా అసలు విషయాన్ని తేల్చుకుందాం… NDSA ఏం చెప్పింది? (అన్ని పత్రికలూ ఏడాది క్రితమే పూసగుచ్చినట్టు రాశాయి, ఎన్డీఎస్ఏ నివేదికలో ఏముందో..?)

మేడిగడ్డ బరాజులో 7వ బ్లాక్‌లో 16 నుంచి 21 వరకు పియర్లు కుంగిపోయాయి… అవి పగిలాయి, స్థానభ్రంశం చెందాయి… రాఫ్ట్ కింద కేవిటీలు ఏర్పడ్డాయి… సాండ్ పైపింగ్, నిర్మాణ లోపాలు, డిజైన్ లోపాలు వంటి అంశాలను NDSA తన తుది నివేదికలో ప్రస్తావించింది… ఆ బ్లాక్‌కు తీవ్రమైన, తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం కష్టమైన రీతిలో భారీ నష్టం జరిగిందని చెప్పింది…

అంతేకాదు… ఆ బ్లాక్‌ను మళ్లీ గేట్ల ఆపరేషన్‌కు ఉపయోగించవద్దని స్పష్టం చేసింది… దాన్ని సురక్షితంగా డీకమీషన్ చేయడం లేదా తొలగించడం వంటి మార్గాలను పరిశీలించాలని సూచించింది… రాఫ్ట్ కింద ఉన్న కేవిటీలను పూడ్చడం, కొత్తగా స్ట్రక్చరల్ అనాలిసిస్ చేయడం, తగిన రీహాబిలిటేషన్ ప్లాన్ రూపొందించడం వంటి చర్యలు సూచించింది…

medigadda

ఇది “రెండు పియర్లు కాస్త కుంగాయి… మిగతాదంతా భేషుగ్గా ఉంది” అనే గులాబీ వాదనతో ఓసారి పోల్చండి..? ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల అత్యంత బాధ్యతారాహిత్యం కాదా..? అన్నారం, సుందిళ్ల విషయంలో కూడా NDSA మౌనం వహించలేదు. వాటికీ మేడిగడ్డతో పోలిన డిజైన్, నిర్మాణ పద్ధతులు ఉన్నాయని, అందువల్ల ఇలాంటి వైఫల్యాలకు అవి కూడా గురయ్యే అవకాశం ఉందని చెప్పింది. మూడు బ్యారేజీలకూ సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొంది…

ఇంత స్పష్టమైన నివేదికను ఇప్పుడు ఎలా వక్రీకరించాలి? అదే అసలు కథ… “కాంక్రీట్ బాగుంది… కాబట్టి బ్యారేజీ బాగుంది!” తాజాగా వచ్చిన CWPRS పరీక్షలను పట్టుకుని ఈ వాదన మొదలైంది.

అన్నారం, సుందిళ్లలోని కాంక్రీట్ నాణ్యతపై నిర్వహించిన పరీక్షల్లో పెద్దగా సమస్యలు కనిపించలేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇది ఒక సాంకేతిక పరీక్ష ఫలితం. దాన్ని ఎవరూ దాచాల్సిన అవసరం లేదు. నిజంగా కాంక్రీట్ బాగుంటే అది బాగుందని చెప్పాలి. కానీ ఇక్కడే అసలు మాయ మొదలవుతుంది.

kaleswaram

కాంక్రీట్ నాణ్యత ≠ బ్యారేజీ మొత్తం భద్రత… ఒక ఇంటి గోడకు వేసిన సిమెంట్ బలంగా ఉందనుకుందాం… దాని కింద నేల కదులుతుంటే ఆ ఇల్లు సురక్షితమైపోతుందా? బ్యారేజీ విషయంలో కూడా అంతే… కాంక్రీట్ బలం ఒక అంశం మాత్రమే.

ఫౌండేషన్ ఎలా ఉంది?

సబ్‌సాయిల్‌లో ఏం జరుగుతోంది?

సాండ్ పైపింగ్ ఉందా?

సీపేజ్ ఎలా ఉంది?

సెకెంట్ పైల్స్ సరైన లోతులో ఉన్నాయా?

రాఫ్ట్ కింద కేవిటీలు ఉన్నాయా?

స్కౌర్ ఎలా ఉంది?

హైడ్రాలిక్ డిజైన్ సరైనదేనా?

నీటిని ఎంత స్థాయిలో, ఎంతకాలం నిల్వ చేయవచ్చు?

ఇవన్నీ కలిసి బ్యారేజీ భద్రతను నిర్ణయిస్తాయి….

అందుకే “కాంక్రీట్ బాగుంది కాబట్టి కాళేశ్వరం నిర్మాణం మొత్తం బాగుంది” అనడం సాంకేతికంగా పిల్లల వాదన. ఫూలిష్ వాదన…

కాళేశ్వరం

మరీ విచిత్రం ఏమిటంటే… 2024లోనే Annaramలో కొన్ని secant piles నాణ్యతపై CWPRS పరీక్షల్లో తీవ్రమైన సమస్యలు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన తాజా పరీక్షల ఫలితాలు వేరే అంశాలను చూపిస్తే, వాటిని కూడా సమగ్ర సాంకేతిక విశ్లేషణలో చూడాలి. ఒక పరీక్షను పట్టుకుని మరో పరీక్షను కొట్టిపారేయడం శాస్త్రం కాదు.

“NDSA చెప్పేది సలహా మాత్రమే… నీళ్లు ఎత్తేది రాష్ట్రం!”… ఇది మరో అసత్యం… నీటి వినియోగం, ప్రాజెక్టు నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండొచ్చు… కానీ అందుకే డ్యామ్ సేఫ్టీ అంశంలో NDSA చెప్పినదాన్ని “వాళ్లకు సంబంధమే లేదు” అని పక్కన పెట్టలేం…

Dam Safety Act కింద NDSAకి డ్యామ్ వైఫల్యాల కారణాలను పరిశీలించడం, ప్రజా భద్రతకు సంబంధించిన సమస్యలపై దర్యాప్తు చేయడం, ఆపరేషనల్ పారామీటర్లు, రిమిడియల్ చర్యలపై తగిన సూచనలు/ఆదేశాలు ఇవ్వడం వంటి బాధ్యతలు ఉన్నాయి… అందుకే “నీళ్లు ఎత్తాలా వద్దా రాష్ట్రం ఇష్టం” అనే ఒక్క వాక్యంతో NDSA నివేదికలోని భద్రతా హెచ్చరికలను తుడిచేయడం సాధ్యం కాదు…

అసలు NDSA తొలి దశలోనే మేడిగడ్డ ప్రస్తుత పరిస్థితిలో రిజర్వాయర్‌ను నింపితే బ్యారేజీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని చెప్పింది… 2025లో కూడా రాష్ట్ర ప్రభుత్వం NDSA క్లియరెన్స్ లేకుండా నీటిని ఎత్తబోమని ప్రకటించింది.

medigadda

నిజానికి ఎవరు కాళేశ్వరాన్ని కాపాడాలి? కాంగ్రెస్ కాదు. బీఆర్ఎస్ కాదు. బీజేపీ కాదు. కాళేశ్వరాన్ని కాపాడాల్సింది ఇంజినీరింగ్.

ప్రజల డబ్బుతో కట్టిన ప్రాజెక్టును రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం, ప్రతిష్ఠల కోసం కాపాడాల్సిన అవసరం లేదు… తప్పు ఉంటే తప్పు అని చెప్పాలి. రిపేర్‌తో బతికే భాగాన్ని రిపేర్ చేయాలి… పనికిరాని భాగాన్ని తొలగించాలి… ఏం చేయాలో నిపుణులు చెప్పాలి… కానీ ‘ప్రాపగాండా జర్నలిజం కారణంగా… పియర్లు కుంగిపోయిన కాళేశ్వరంలో చివరికి నిజమే కుంగిపోయే ప్రమాదం ఉంది…

చివరగా… మొదట్లో కాళేశ్వరం బరాజులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని రిపోర్టు ఇచ్చిన ఎన్డీఎస్ఏ ఇప్పుడు నిజంగానే ఏం ప్రాబ్లం లేదు, నీళ్లు ఎత్తిపోసుకోవచ్చు అని గనుక కోర్టుకు చెప్పి ఉంటే, అసలు ముందుగా ఆ సంస్థను కదా ప్రశ్నించాల్సింది… అప్పుడేం చెప్పావు, ఇప్పుడేం చెబుతున్నావు అని..!!



కాళేశ్వరం దురవస్థపై, నిర్మాణలోపాలపై, ప్రమాదాలపై ఎన్డీఎస్ఏ 378 పేజీల సమగ్ర నివేదిక ఈ కథన రచయిత దగ్గర ఉంది… అవసరమైతే అందులోని ప్రతి అంశాన్ని పేజీ నంబర్లతో సహా ప్రజల ముందుంచుతాం…


 


https://www.hindustantimes.com/india-news/telanganas-kaleshwaram-project-flawed-ndsa-report-101745779891379.html

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అబద్దాలు- తప్పుడు బాష్యాలు – కాళేశ్వరంపై అవే వక్రీకరణ కథలు !!
  • రాఖీకి ఈ ర్యాంప్ లుక్ ఎందుకు..? దారితప్పుతున్న క్రియేటర్లు…!!
  • కులం నిజం – వివక్ష నిజం – కులాధిపత్యం గుప్పిట్లో టాలీవుడ్‌ !!
  • రేవంత్ రెడ్డే టార్గెట్ ! తెర వెనుక ఒక్కటవుతున్న వేర్వేరు శక్తులు !!
  •  2029 టార్గెట్‌గా చకచకా పావులు..! జమిలి, డీలిమిటేషన్, మహిళా కోటా…?
  • రేవంత్‌ రెడ్డి చాణక్యం ! ‘తెలంగాణ ఆత్మగౌరవం’ ఎవడబ్బ సొత్తు ?
  • సారీ, వారణాసి రాజమౌళీ… నీ డబ్బింగ్ ఆలోచనల్లోనే తప్పుంది !!
  • వారణాసిలో పెద్ద కర్మ ! తంతు అల్లాటప్పా ఏమీ కాదు, అదొక పరీక్ష !!
  • ఇప్పుడు చెప్పండి… ఎవరు ఒప్పో… ఎవరు తప్పో… మీవల్ల కాదు !!
  • నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడం కాదు ! ఈ సుందరి ఏమన్నదో తెలుసా ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions