Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పవన్‌ను దేవుడిని చేసేసినా సరే… పూర్ టీఆర్పీ బ్రో… టీవీక్షకులకూ నచ్చలేదు…

October 27, 2023 by M S R

పవన్ కల్యాణ్ అంటే తన అభిమానులకు దేవుడు… అలాంటి తనను ఏకంగా దేవుడిని చేసి, తీసిన సినిమా గతంలోనూ వచ్చింది… గోపాల గోపాల… అందులో వెంకీ కూడా ఓ హీరో… అదేదో హిందీ సినిమాకు రీమేక్… కాకపోతే పవన్, వెంకటేష్ స్టార్ హీరోలు కాబట్టి చాలా క్రియేటివ్ ఫ్రీడం తీసుకుని, ఒరిజినల్ సినిమాతో పోలిస్తే పలు మార్పులు చేశారు… తెలుగు మార్కెట్ స్థితిని బట్టి తప్పదు, తప్పలేదు…

మళ్లీ పవన్ కల్యాణ్ దేవుడిగా మరో సినిమా వచ్చింది… (అసలు ప్రతి తెలుగు హీరో ఓ దేవుడి తరహాయే… ప్రతి సినిమాలోనూ వాళ్ల హీరోయిజం ఆ రేంజులో ఉంటుంది అంటారా..? అది వేరే సంగతి)… దాని పేరు బ్రో… ఇందులో మెగా ఫ్యామిలీకే చెందిన సాయిధరమ్ తేజ కూడా ఉన్నాడు… ఇందులో ఓ ఫిలాసఫీని బలంగా చెప్పడానికి ప్రయత్నించారు, కానీ కమర్షియల్ సినిమా వాసనలు, పవన్ కల్యాణ్ తాలూకు ఇమేజ్ బిల్డప్పులు, పాత పాటల యవ్వారాలు మరీ ఎక్కువైపోయి, అసలు చెప్పదలుచుకున్న పాయింట్ పలుచన అయిపోయిందనే విమర్శ సినిమా రిలీజ్ సమయంలో వచ్చింది…

తాజాగా బార్క్ రేటింగ్స్ వచ్చినయ్… ఈనెల 15న జీతెలుగు చానెల్‌లో టీవీ ప్రీమియర్ ప్రసారం చేశారు… దానికి వచ్చిన రేటింగ్స్ జస్ట్, 5.82 మాత్రమే… ఇది హైదరాబాద్ కేటగిరీ… మొత్తం కలిపితే 8, 9 … అంతే… ఇద్దరు మెగా హీరోల సినిమా రేంజ్ చూసుకుంటే ఇది చాలా తక్కువ రేటింగ్స్… సినిమాయే సరిగ్గా ఆడలేదు, ఇక టీవీలో ఎవరు చూస్తారు అంటారా..? ఎస్, అసలు టీవీల్లో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్యే పడిపోతోంది… ఇది హీరోలందరికీ వర్తిస్తుంది… బలగం వంటి ఒకటీరెండు సినిమాలు తప్ప ఏ సినిమాకూ టీవీక్షణం బాగా పడిపోతోంది…

Ads

ఓటీటీ వీక్షణం పెరగడం ఒక కారణం కాగా… మౌత్ టాక్ సరిగ్గా లేని సినిమాల జోలికి ప్రేక్షకులు వెళ్లడం లేదు… వాళ్లకు అందుబాటులో బోలెడు వినోదమార్గాలున్నయ్… ఈరోజుకూ టీవీ ప్రేక్షకుల ఫస్ట్, అట్‌మోస్ట్ ప్రియారిటీ సీరియళ్లే… ఇది మరోసారి రుజువైంది… పాఠకుల కోసం బ్రో మూవీ మీద మిత్రుడు బెల్లంకొండ ప్రసేన్ రాసిన రివ్యూ మరోసారి, యథాతథంగా…



Prasen Bellamkonda……..  ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచుకోవాలి బంధం. చావనేది జీవితానికో అందం… అనే తాత్వికత జీర్ణం కావడం కష్టం . ఆ జీర్ణం కావాల్సింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కైతే మరీ మరీ కష్టం బ్రో.

విపశ్యన అని ఓ పదం ఉంది. టేకింగ్ ది థింగ్స్ యాజ్ దే ఆర్ అని ఇంచుమించు అర్ధం. మానవ జీవితానికి ఈ పదాన్ని అన్వయించినపుడు ‘జరిగేదే జరుగుతది ‘ అని అర్ధం చేసుకోవాలి. మనమేదో ఉద్దరించాం, పొడిచేసాం, ఇరగదీసాం అనుకుంటాం కానీ అదంతా ఉత్తదే… అన్నీ అవే జరిగిపోతాయి నీ ప్రమేయం ఏమీ ఉండదు నువు నిమిత్తమాతృడివి మాత్రమే అనేది ఇంకొంచెం విస్తృతమైన అర్ధం. బ్రో ఇతివృత్తం ఇదే.

నిజానికి ఇదొక తాత్విక ధ్రుక్కోణం. దాన్ని సినిమా చెయ్యడం, పైగా వ్యాపారాత్మక సినిమాగా మలచడం కష్టమే. ఆ కష్టం ‘ బ్రో ‘ లో స్పష్టం. బ్రో మూలం ‘వినోదాయ సీతం ‘లో ఈ వ్యాపారాత్మక సినిమాగా మార్చడం అనే సమస్య లేకపోవడం వల్ల కేవలం భావోద్వేగాలకే ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఆ కష్టం ఎదురవలేదు. అయితే ఇదే తాత్వికతతో గతంలోనూ సినిమాలొచ్చాయి. అదృష్టం, దేవుడు చేసిన మనుషులు, ఆంగ్ల స్లైడింగ్ డోర్స్ సినిమాల ఇతివృత్తం ఇదే.

1992 లో జయసుధ నిర్మాతగా పెద్ద నరేష్ హీరోగా వచ్చిన అదృష్టం నాకు చాలా ఇష్టమైన సినిమా. ఇదొక ఫ్లాప్ బస్టర్. ఆంగ్ల స్లైడింగ్ డోర్స్ కూడా మంచి సినిమా. అసలా పేరులోనే అర్ధమంతా ఉంది. అటుదిటు ఇటుదటు జరిపి ఏ తలుపు తెరుచుకు పోయినా చేరే గమ్యం మారదు అని. పూరీ జగన్నాథ్ సినిమా దేవుడు చేసిన మనుషులు. ఇది కూడా బాక్సాఫిస్ దగ్గర సూపర్ ఫట్టే. నువ్వు ఎక్కడ ఎలా మొదలైనా జీవన ప్రయాణంలో ఎన్ని మలుపులు తిరిగినా చేరేది ఒక్క దగ్గరికే అనే ఒక్క ముక్కనే ఈ సినిమాలన్నీ చెపుతాయి.

జీవితం రెండో ఛాన్స్ ఇస్తే? అనేదే కథ సారాంశం. అదృష్టం సినిమాలో నరేష్ ఒక కార్మికుడిగా మొదలై ఏ మజిలీ కైతే చేరుకుంటాడో అతనికి దేవుడు ఎదురై సెకండ్ ఛాన్స్ ఇచ్చి యజమానిని చేసినా . అదే మజిలీకి చేరుకుంటాడు. ప్రారంభం ఏదైనా ప్రయాణం ఎలాగున్నా ముగింపు మాత్రం ఒక్కటే అనేదే జీవిత సత్యం. ఇప్పుడీ బ్రో చెప్పేది కూడా అదే.

నేనీ ఉపోద్ఘాతం ఇంత పొడుగ్గా ఎందుకు చెపుతున్నానూ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇదంతా అర్ధం కాదు కనుక. కనుకనే బ్రో లో ఎలివేషన్లు ఎక్కువయ్యాయి కనుక. పంచ్ లు బాంగ్ ల మాటున తత్వం కొండెక్కింది కనుక. తత్వం బోధించడం కన్నా కిక్కెక్కించడానికే ఎక్కువ చెమటోడ్చారు కనుక.

అనేకానేక భవసాగరాలున్న ఓ వ్యక్తి చనిపోతాడు. సమయం అనే దేవుడు తారసపడి మృతుడికి 90 రోజుల రెన్యువల్ ఇస్తాడు. ఆ తొంబయ్ రోజుల పరిణామాలే బ్రో. సినిమా మొదట్లో మూడో సీన్ లోనే కథ జిస్ట్ ఇచ్చేసాడు త్రివిక్రమ్. నువు కారు ప్రమాదంలో చచ్చిపోతావ్. ఒకవేళ సెకండ్ ఛాన్స్ వచ్చి కారు ప్రమాదంలో చావకుంటే వెంటనే లారీ గుద్ది చస్తావ్. నీకు మూడో ఛాన్స్ వచ్చి లారీ నుంచి కూడా తప్పించుకున్నా ఆ పక్కనే ఉన్న ఇనుప సువ్వల మీద పడి చనిపోతావ్… ఎన్ని ఛాన్స్ లొచ్చినా జరిగేదే జరుగుతది అని చెప్పేసాడు త్రివిక్రమ్. 90 రోజుల పొడిగింపుతో నువు చేసిందేమీ లేదు నువు రాకున్నా అన్నీ ఇలాగే జరిగుండేవి అని తేల్చి చెప్పేస్తుంది సమయం.

పవన్ కళ్యాణ్ హీరో కావడం వల్ల సినిమాకు వెయిటూ వచ్చింది, భారమూ పెరిగింది. జెండాలో ఉండే స్టారు, బాలెట్ లో ఉండే చాయ్ గిలాసూ వచ్చాయి. చిటికేస్తే మారిపోయే టైం లూప్ లూ వచ్చాయి. పవన్ కళ్యాణ్ కోసమే వచ్చి పడ్డ ఆయన పాత పాటల మెడ్లీ ప్రయోగం తాళం తప్పింది. పవన్ కళ్యాణ్ నటన గురించి చెప్పక్కరలేదు. సాయి ధరం తేజ్ గురించి చెప్పడానికేమీలేదు. మిగతా వాళ్ళంతా పక్క వాయిద్యాలే. మొత్తంగా చూస్తే ఫ్యాన్స్ కు నచ్చి అర్ధం కాదు. ఫ్యాన్సేతరులకు అర్ధమై నచ్చదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!
  • ‘‘మీ రాజకీయ కక్షలకు కోర్టు వేదిక కాదు’’ – హరీశ్ రావుకు చుక్కెదురు !!
  • కపిల్ సాహూ ! టీవీకే విజయ్ గెలుపు వ్యూహకర్త ఇప్పుడిక జగన్ వెనుక !!
  • రామాయణమా… రావణాయణమా ? కథలోని ఆత్మ -హత్య చేయబడుతోందా ?
  • ఇందిరమ్మ బీమా ! రేవంత్ రెడ్డి తనే ఓ సీరియస్ లుక్కేయాలి !!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!
  • Empress Sridevi – బయోపిక్‌లో ప్రియాంక చోప్రా ! హింట్ ఇచ్చేసిందా !!
  • AI చాట్ జీపీటీని ఏళ్ల క్రితమే ఊహించిన యండమూరి !
  • దేవుడు ఆ రహస్యాన్ని చాన్నాళ్లు దాచాడు – కానీ ఇక దాగలేదు !!
  • స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions