.
కొన్ని వార్తలు కలిచివేస్తాయి… అలాంటిదే ఇది… రూల్స్ గెలిచాయి.. మానవత్వం ఓడింది: ఒక అస్థిపంజరం చేసిన నిరసన ప్రయాణం… చట్టాలు మనుషుల కోసం పుట్టాయి…. కానీ కొన్నిసార్లు అవే చట్టాలు మనిషిలోని ఆత్మగౌరవాన్ని, విచక్షణను ఎలా చంపేస్తాయో చెప్పడానికి ఒడిశాలోని కెందుఝర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం… ఇది కేవలం ఒక వార్త కాదు… వ్యవస్థలోని మొండితనానికి పట్టిన అద్దం…
ఆకలి.. ఆవేదన.. ఒక పోరాటం … జితు ముండా… లోకం తెలియని గిరిజనుడు… అతని సోదరి కలరా ముండా ఇటీవలే మరణించింది… ఆమె తన తర్వాత వదిలి వెళ్ళిన ఆస్తి అంతా కలిపి ఒక బ్యాంకు ఖాతాలో ఉన్న 19,300 రూపాయలు మాత్రమే… ఆకలితో అలమటిస్తున్న జితుకు, ఆ డబ్బులు తన సోదరి ఇచ్చిన చివరి ఆసరాగా కనిపించాయి…
Ads
కానీ, బ్యాంక్ మెట్లెక్కిన జితుకు ‘నిబంధనల’ గోడలు ఎదురయ్యాయి… “మీ సోదరి చనిపోయిందని ఆధారమేంటి?”, “ఖాతాదారుడు లేకుండా డబ్బులు ఇవ్వలేం” అంటూ బ్యాంక్ సిబ్బంది చెప్పిన మాటలు అతనిలో గందరగోళాన్ని నింపాయి… నిరక్షరాస్యుడైన ఆ పేదవాడికి డెత్ సర్టిఫికెట్లు, వారసత్వ పత్రాల కంటే.. తన కళ్ల ముందే అక్క చనిపోయిందనే నిజం తప్ప ఇంకేమీ తెలియదు…
సమాధిని చీల్చుకొచ్చిన నిరసన … నెలల తరబడి బ్యాంక్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, జితు ముండా ఆఖరి ప్రయత్నం చేశాడు… అది ఎవరూ ఊహించని… గుండెల్ని పిండేసే ప్రయత్నం… రెండు నెలల క్రితం తను స్వయంగా పూడ్చిపెట్టిన తన అక్క సమాధి దగ్గరకు వెళ్లాడు… తవ్వాడు… ఆ అస్థిపంజరాన్ని భుజాన వేసుకున్నాడు…
3 కిలోమీటర్లు… తన సోదరి అస్థిపంజరంతో అతను నడిచిన ప్రతి అడుగు, మనుషుల కంటే కాగితాలకే విలువ ఇచ్చే మన వ్యవస్థపై ఒక వేటు… “ఇదిగో నా అక్క.. చనిపోయిందని చెప్పినా నమ్మలేదు కదా, ఇప్పుడు చూడండి” అని బ్యాంకు ముందు ఆ అస్థిపంజరాన్ని ఉంచినప్పుడు అక్కడున్న వారందరి గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది…
వ్యవస్థ కళ్ళు తెరిచింది… కానీ చాలా ఆలస్యంగా! ఈ దృశ్యాన్ని చూసి హడలిపోయిన బ్యాంక్ అధికారులు, వెంటనే పోలీసులను ఆశ్రయించారు… పోలీసులు వచ్చి జితును శాంతింపజేసి, అతనికి ఆ డబ్బు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు… అతని సోదరి అవశేషాలకు గౌరవప్రదంగా తిరిగి అంత్యక్రియలు నిర్వహించారు…
డబ్బు చేతికి రావచ్చు, కానీ ఆ వ్యక్తి అనుభవించిన మానసిక వేదనను ఏ చట్టం పూడ్చగలదు? ఒక పేదవాడు తన ఆత్మీయుల శవాన్ని, తోడబుట్టిన శవాన్ని తవ్వి తీయాల్సి వచ్చిందంటే, మన వ్యవస్థ ఎంత జడత్వంతో ఉందో అర్థమవుతోంది… నిబంధనలు ముఖ్యం కావొచ్చు, కానీ వాటి కంటే ‘మనిషి’ ముఖ్యమనే ఇంగితజ్ఞానం కోల్పోయినప్పుడు ఇలాంటి విషాద గాథలే మనకు మిగులుతాయి…
ఈ వార్త చదువుతుంటే కన్నీళ్లు వచ్చాయంటే, మనలో ఎక్కడో ఇంకా కాస్త తడి మిగిలి ఉందని అర్థం… ఇది రాస్తుంటే నిన్న చూసిన ఓ వీడియో గుర్తొచ్చింది… రీసెంట్ కేసు… ఎప్పటిలాగే మన మెయిన్ స్ట్రీమ్ దళసరి చర్మాలకు కనిపించనట్టుంది… మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడో… ఒకాయన చావుబతుకుల్లో ఉన్నాడు… ఐసీయూలో ఉన్నాడు, బ్యాంకులో డబ్బులున్నాయి… భార్య వెళ్లి అడిగితే ఇవ్వడం లేదు, తిరిగీ తిరిగీ అలిసిపోయింది…
మరోవైపు డబ్బులు పుట్టడం లేదు, ఎవరో న్యాయవాది కోర్టు దాకా తీసుకుపోయాడు… కోర్టు తన అసాధారణ న్యాయాధికారాలతో, వెంటనే ఆ డబ్బును ఆమెకు ఇవ్వాలని ఆదేశించింది… అరుదైన కేసు… మానవత్వం ప్రతిబింబించిన కేసు… తన మొగుడి చికిత్సకు తన మొగుడి డబ్బు ఉపయోగపడకపోతే ఇక ఆ డబ్బు దేనికి..? అడ్డుపడిన బ్యాంకు అధికారుల మూర్ఖత్వానికి జవాబు ఏమిటి..? ఛ…
Share this Article