.
సంధ్య థియేటర్… నో డౌట్, చాలా పాత థియేటర్… హైదరాబాద్ ప్రేక్షకులకు అనేక తెలుగు సినిమాల్ని ప్రదర్శించే ఓ సంగమస్థలి ఆర్టీసీ క్రాస్ రోడ్స్… అంతవరకే దాని విశేషం, కానీ దాన్నేదో పుష్కరిణిలాగా… అక్కడ సినిమా టీమ్ మొదటిరోజు లేదా ప్రీమియర్ షో ప్రేక్షకులతో చూస్తే అదొక పవిత్ర కార్యక్రమంలాగా ఈ తెలుగు హీరోలు భావించడమే ఓ దరిద్రం…
పిచ్చి ఫ్యాన్స్ వేసే వెర్రికేకలతో కిక్కు పొందడం హీరోల అభిలాష… బన్నీ నుంచి నాని వరకు అందరూ అంతే.., మరి సంధ్య థియేటరే దేనికి..? దాన్ని మించి అత్యంతాధునిక, హైటెక్, మోడరన్, విలాస థియేటర్లు బోలెడు వచ్చాయి.., అంతెందుకు..? ఈ సోకాల్డ్ హీరోలే కోట్లకుకోట్ల పెట్టుబడులు పెట్టి కడుతున్నారు కదా… ఇదే బన్నీకి లేదా మహేశ్ బాబుకు లేదా..?
Ads
వ్యాపారం చేసుకోవడాన్ని, సినిమారంగంలో సంపాదించిన సొమ్మును తిరిగి అదేరంగంలో పెట్టడం, ఎగ్జిబిటర్ల సిండికేట్ ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడానికి సొంత థియేటర్లు మంచి మార్గమే… ఐతే..? ఓసారి ఎకనమిక్ టైమ్స్ స్టోరీ ఏమంటున్నదో చూద్దాం…

థియేటర్ వ్యాపారంలోకి టాలీవుడ్ స్టార్స్…. టాలీవుడ్ హీరోలు ఇప్పుడు కేవలం సినిమాల్లో నటించడానికే పరిమితం కావడం లేదు. తమ చిత్రాలు ప్రదర్శించే వెండితెరలకు తామే యజమానులుగా మారుతున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మల్టీప్లెక్స్ బిజినెస్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
స్టార్ పవర్ తో మల్టీప్లెక్స్ హంగామా… ఏషియన్ సినిమాస్ (Asian Cinemas) భాగస్వామ్యంతో టాలీవుడ్ ప్రముఖ నటులు తమ సొంత మల్టీప్లెక్స్ చైన్లను ప్రారంభించారు…
మహేష్ బాబు (AMB Cinemas):- హైదరాబాద్, బెంగళూరుల్లో ప్రస్తుతం 16 స్క్రీన్‌లు ఉన్నాయి. 2028 నాటికి ఈ సంఖ్యను 50కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అల్లు అర్జున్ (AAA Cinemas):- హైదరాబాద్‌లో 5 స్క్రీన్‌లు నడుస్తుండగా, విశాఖపట్నంలో మరో 8 స్క్రీన్‌లు సిద్ధమవుతున్నాయి.
విజయ్ దేవరకొండ (AVD Cinemas):- మహబూబ్‌నగర్‌లో 4 స్క్రీన్‌లతో థియేటర్ నడుపుతున్నారు.
రవితేజ (ART Cinemas):- హైదరాబాద్‌లో 6 స్క్రీన్‌లతో అందుబాటులోకి వచ్చింది.
చిరంజీవి:- ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నితిన్:- వీరు కూడా త్వరలోనే థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
హీరోల బ్రాండ్.. ఏషియన్ ఎక్స్‌పర్టైజ్… ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ మోడల్‌లో నటులు తమ బ్రాండ్ ఇమేజ్‌ను అందిస్తుంటే, ఏషియన్ సినిమాస్ ఆపరేషన్స్ బాధ్యతలను చూసుకుంటోంది. నటులు సంపాదించిన డబ్బును తమకు బాగా తెలిసిన సినిమా రంగంలోనే పెట్టుబడిగా పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశంగా మారింది. (వీళ్లు తమ వంతు వాటా డబ్బుపెడతారు, మిగతాదంతా ఏషియన్ సినిమాస్ చూసుకుంటుంది)…
ఆక్యుపెన్సీ రేటులో రికార్డులు … సాధారణ థియేటర్లతో పోలిస్తే స్టార్ హీరోల మల్టీప్లెక్స్‌లకు ప్రేక్షకుల ఆదరణ చాలా ఎక్కువగా ఉంది.
AMB & AAA Cinemas:- సగటున 60% ఆక్యుపెన్సీ సాధిస్తున్నాయి.
సాధారణ ఏషియన్ థియేటర్లు:- 40% ఆక్యుపెన్సీ ఉంటుంది.
PVR INOX:-జాతీయ స్థాయిలో FY26లో 26% ఆక్యుపెన్సీ ఉంది.
తగ్గుతున్న సింగిల్ స్క్రీన్స్… ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 3,000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 1,800 నుండి 1,900 కి పడిపోయింది. ఈ ఖాళీని భర్తీ చేయడానికి మల్టీప్లెక్స్‌లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది.
హైదరాబాద్‌కు మళ్లీ IMAX:- మహేష్ బాబు, వెంకటేష్, రానా దగ్గుబాటి ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో హైదరాబాద్‌కు తిరిగి IMAX స్క్రీన్‌ను తీసుకువస్తున్నారు.
PVR ఇన్వెస్ట్‌మెంట్స్:- PVR INOX కూడా దక్షిణాదిలో కొత్తగా తెరిచే స్క్రీన్‌లలో 37% తెలుగు రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేయాలని చూస్తోంది.
రియల్ ఎస్టేట్ రంగానికి లాభాలు:- అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా థియేటర్లను వేరొకరికి లీజుకు ఇవ్వడం కంటే తామే స్వయంగా నడపడం వల్ల 30-40% ఎక్కువ లాభాలు వస్తున్నాయని తమ సొంత మల్టీప్లెక్స్‌లను ప్రారంభిస్తున్నాయి.
హిందీలో అజయ్ దేవగన్, మలయాళంలో మోహన్ లాల్ లాంటి నటులు థియేటర్లు నడుపుతున్నా తెలుగు చిత్రసీమలో ఉన్నంత వేగంగా ఏ ఇతర ప్రాంతీయ పరిశ్రమలోనూ నటులు ఎగ్జిబిషన్ రంగంలోకి రాకపోవడం విశేషం… మరి సంధ్యలోనే ఎందుకు చూడాలిరా..?! తొక్కుకుచావడానికా..?!
Share this Article