.
సంపన్నుల స్వర్గం
నిరుపేదల నరకం
ఏడు కోట్ల వాచి
పన్నెండు కోట్ల కారు
Ads
నీరింకిన నేలలు, తడారిన గొంతులు కరువుదీరా పాడుకోవడానికి విద్వాన్ విశ్వం 1957లో రాసిన కావ్యం- పెన్నేటి పాట. కోటి గుండెల కంజరి కొట్టుకుంటూ పెన్న ఇరుగట్ల జనం వినిపించే విషాద గానమిది. యాభై ఏళ్ల వరుస కరువులకు వందల ఎకరాల సంపన్న భూస్వామి నారపరెడ్డి కొడుకు రంగారెడ్డి…రంగడు అయి చివరికి రామిగాడు అయి…పశువుల కొట్టంలో కూలీ చేసుకుని బతికే దయనీయమైన కథ ఇది. ఒక కోటీశ్వరుడి కొడుకు పూటకు పట్టెడన్నం దొరక్క గంజి తాగడానికి కరువు ఎలా కారణమయ్యిందో చెప్పిన వాస్తవ చిత్రణ ఇది. ఆ సందర్భంలో పెన్నేటి పాట కావ్యనాయకుడు రంగడు పనిచేసే కలవారి ఇంటిని, వారి వైభోగాన్ని, వారి అభిరుచులను ఇలా వర్ణిస్తున్నాడు కవి.
ఆ ఇంట్లో ఏది కావాలంటే అది ఉంది. ఆ ఇల్లు దాటగానే ఏదీ ఉండదు. అంతా రాళ్లు.
ఆ ఇంట్లో ఎక్కడ చేయి పెట్టినా నగదు, నగలు, కళాఖండాలు. ఆ ఇల్లు దాటితే అంతా మొండి గోడలు.
ఆ ఇంటి ఇనుపపెట్టెల నిండా మూలిగే డబ్బు. ఆ ఇల్లు దాటితే జబ్బు.
ఆ ఇంట్లో ఊరి చెమట సంపదగా కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఊరి మీద ఆ ఇంటి భూతం నీడపడి తిరుగుతున్నట్లుంటుంది.
ఆ ఇంటి గోడల నునుపు అద్దమై…ఏది అద్దమో! ఏది గోడో తెలుసుకోలేనంతగా తళతళలతో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆ ఇంటి పెంపుడు పిల్లి కూడా ఊళ్లో పులిలాంటి పెద్ద రైతును శాసించగలుగుతుంది.
ఆ ఇంట్లో తేన్పులే కానీ…ఆకలి కేకలు, బాధల నిట్టూర్పులు వినపడవు. ఆ ఇంట్లో లక్ష్మి- సరస్వతులు గజ్జెకట్టి నాట్యం చేస్తుంటారు. ఆ ఇంట్లో లేనిది లేదు- మానవహృదయం తప్ప.
ఆ ఇంటి పెద్ద గొప్ప విద్యావంతుడు. ఎప్పుడూ భాగవత పారాయణం చేస్తూ ఉంటాడు. ఆ ఇంటి ఇల్లాలి చల్లని చూపులకే పెరట్లో మల్లెలు పూస్తూ ఉంటాయి. ఆ ఇంటి అబ్బాయి ఇంగ్లాండ్లో ప్రజాస్వామ్యం మీద పరిశోధన చేసి…పట్టా పుచ్చుకుని…వచ్చాడు. ఆ ఇంటి అమ్మాయి ఈమధ్యే సాంఘిక శాస్త్రంలో పట్టా పుచ్చుకుంది. ఆ ఇంట్లో ఏ గోడకు చూసినా వేలాడే చిత్రాలు. ఏ మూల చూసినా అపురూపమైన కళాఖండాలు. ఎక్కడా దుమ్మూధూళి ఉండదు. ఆత్మ తప్ప ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి.
ఊళ్లో మూడొందల మట్టి మిద్దెలు కట్టడానికి అయిన ఖర్చు…ఆ ఇంట్లో ఆరుబయట ఒక అరుగు కట్టిన ఖర్చు కంటే చాలా తక్కువ. ఆ ఊరిని అమాంతం మింగి ఉబ్బినట్లుగా ఆ ఇల్లు ఒక్కటే బలిసి ఉంది.
కావ్యం కాబట్టి ఇదంతా వర్ణన. నిజజీవితంలో ఇలా ఎందుకుంటుందని మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేకుండా…ఎన్ని దశాబ్దాలైనా…ఎన్ని శతాబ్దాలైనా…ఎంతటి సమసమాజ శ్రేయోరాజ్యంలో అయినా ఇలాంటి ఊరినంతా మింగి ఉబ్బి ఉండే ఇళ్లు కనిపిస్తూనే ఉంటాయి. నిజానికి ఇలాంటి ఇళ్లు ఇప్పుడు ఊరికొకటి కాదు. లెక్కలేనన్ని. ఒక్కో ఇంటిమీద ఒక్కో పన్నీటి పాటో లేక కన్నీటిపాటో రాయడానికి ఎందరు విద్వాన్ విశ్వమ్ లు పుట్టాలో?
అన్నట్లు-
భారత్ మార్కెట్లోకి ఒక్కొక్కటి పన్నెండు కోట్ల రేటున్న రోల్స్ రాయిస్ కార్లు వచ్చినట్లు ఒక వార్త. ఒక రాష్ట్ర మంత్రి గారి గారాల కొడుకు ఒక్కొక్కటి ఏడు కోట్ల విలువ చేసే ఏడు చేతి గడియారాలు అక్రమ హవాలా మార్గంలో ముచ్చటపడి కొన్నట్లు… కేంద్ర ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్- ఈడి ఆ మంత్రి గారి ఇంటి మీద మెరుపుదాడి చేసినట్లు మరొక వార్త.
మనలో మన మాట-
అత్యంత సంపన్నుల యాభై కోట్ల గడియారాల్లో కాలం వేరు వేరుగా ఉంటుందా? ఒకే కాలాన్ని అత్యంత సంపన్నులు వేరు వేరు గడియారాల్లో ఒకేసారి చూసుకుంటారా?
కాలం చాలా విలువైనది అంటే ఏమో అనుకున్నాం.
మరీ ఇన్ని వందల, వేల కోట్ల విలువైనదా!
“ఎవరికైనా టైమ్ బాగుండాలి-
దేనికైనా టైమ్ రావాలి” అంటే ఇదా?
ఇట్స్ రిచ్ లివ్ టైమ్!
ఇట్స్ పూర్ డై టైమ్!
అంతా కాలమహిమ!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article