.
టొరంటోలో ప్రస్తుతం నేను ఉండే ఇంట్లో వాష్ రూమ్‌లో నీళ్లు రాకపోతే, చెంబులో నీళ్లు పట్టుకుని కార్‌లో ఒక గంటలో అమెరికా చేరుకుని కూర్చొని వచ్చేస్తాను. అంతకుమించి, అమెరికా గురించి చెప్పడానికి, చెప్పుకోడానికి పెద్దగా ఏమీ ఉండదు.
కొందరు అమెరికా గురించి లేనిది ఉన్నట్లు గొప్పగా మాట్లాడతారు, మరికొందరు మాత్రం తక్కువ చేసి చూస్తారు. కానీ, నా అనుభవంలో, ఖమ్మం జిల్లాలోని అడవి పక్కన ఉన్న మా ఊరికి, అమెరికాకు మధ్య పెద్ద తేడా ఏమీ అనిపించదు.
Ads
నేను అమెరికా వెళ్ళిన కొత్తలో చాలా ఆశ్చర్యపోయాను— మధ్యాహ్నం 12కే లంచ్, సాయంత్రం 7 గంటలకే డిన్నర్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో అయితే, లంచ్ అంటే మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు, రాత్రి భోజనం అంటే 9-10 గంటల మధ్య నాకు అలవాటు. కానీ ఖమ్మం జిల్లాలో మా ఊర్లో కూడా అమెరికాలో లాగే పొద్దున్నే 7 గంటలకే అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు, మధ్యాహ్నం 12కే లంచ్, రాత్రి 7కే డిన్నర్ ముగిస్తారు. మా ఊర్లోనే కాకుండా, నాకు తెలిసి భారతదేశంలోని చాలా పల్లెటూర్లలో ఇదే పద్ధతిలో ఉంటుంది.
నిజానికి, మరెన్నో విషయాల్లో కూడా మన పల్లెటూర్లకు, అమెరికాకు పెద్దగా తేడా ఉండదు. బయటకు కనిపించేది, చెప్పుకునేది ఒక రకంగా ఉంటే, లోపల జరిగేవి మరొక రకంగా ఉంటాయి. ఆ డీటెయిల్స్ తర్వాత.
నేను అమెరికాలో అడుగు పెట్టినప్పుడు జార్జ్ బుష్ అధ్యక్షుడు. నా Ph.D కోసం మొదట టెక్సాస్ వెళ్లాను, జార్జ్ బుష్ స్వస్థలం కూడా టెక్సాస్ కావడం ఆసక్తికరం. ఆ తర్వాత నేను చికాగో మారినప్పుడు, చికాగో పట్టణానికి చెందిన నల్ల మల్లయ్య బరాక్ ఒబామా అధ్యక్షుడయ్యాడు.
కొంతకాలం తర్వాత ఉద్యోగం కోసం న్యూయార్క్ వెళ్లగా, ఆ నగరానికి చెందిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. చివరికి, నేను డెలావేర్‌లోని ఆస్ట్రాజెనికా కంపెనీలో పని చేస్తున్నప్పుడు, డెలావేర్ స్వస్థలమైన జోసెఫ్ అమెరికా అధ్యక్షుడయ్యాడు, అంటే అందరూ జో బైడెన్ అని పిలుస్తారు, నిజానికి ఆ పిలగాడి పేరు జోసెఫ్.
ప్రస్తుతం అయితే నేను అమెరికాకి వెళ్ళేది – సినిమా లేదా క్లబ్ కి తప్పితే అక్కడ పెద్దగా పనులు ఏమీ లేవు. రేపు ఈ పాటికి అమెరికా ప్రజలు క్యాలిఫోర్నియాకు చెందిన కమలమ్మ ని అధ్యక్షులు గా ఎన్నుకుంటారో, లేదా న్యూయార్క్‌కు చెందిన ట్రంప్ ని ఎన్నుకుంటారో తెలుస్తుంది. ఎవరు గెలిచినా, అమెరికా ప్రయోజనాలు, తమ స్నేహితుల ప్రయోజనాలు, తమకు మద్దతుగా నిలిచిన వారి ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటారు.
పదవులు కూడా తమ వర్గానికే ఇస్తారు. ట్రంప్ గెలిస్తే అమెరికాలో టెస్లా, ఒరాకిల్ షేర్లు కొంటా. కమలా హారిస్ గెలిస్తే ఇండియాలో HDFC బ్యాంక్, రిలయన్స్ షేర్లు కొంటా. ఎవరు గెలిచినా నిజానికి మనకు పెద్దగా లాభం లేదు, నష్టం లేదు.
అమెరికాలో ఏదైనా సాధించవచ్చు, మన దగ్గర అయితే ప్రతి విషయానికీ పాలిటిక్స్ అనే మాట వినిపిస్తుంది, అది వ్యక్తి పరిధిని, విస్తృతిని బట్టి ఉంటుంది. నిజానికి, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కి, అమెరికాలోని బీవర్లీ హిల్స్‌కి పెద్ద తేడా లేదు. బంజారాహిల్స్‌లో మనం ఒక చిన్న బడ్డీ కొట్టు పెడితే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి వారు ఏమీ అనరు. కానీ అదే వాళ్లు అక్రమంగా కట్టుకున్న కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేస్తే, వెంటనే మన మీద పరువునష్టం దావా వేస్తారు.
అమెరికాలో కూడా అంతే; సాధారణ జీవితం కోసం ఇళ్ళు, కారు కొనుగోలు చేసి, SLR కెమెరాతో ఫోటోలు తీసుకుంటే ఎవరూ పట్టించుకోరు. కానీ అక్కడ జరుగుతున్న కొన్ని అక్రమాలు ప్రపంచంలోనే ఎక్కడా జరగవు, ఆ లోతులు, అగాధాలు చూసిన వారికే తెలుస్తుంది. ఏదో బతుకు తెరువు కోసం పోయి బతుకుతున్నవారికి అయితే అంతా బాగున్నట్లు కనిపిస్తుంది. మన దగ్గర బడ్డీ కొట్టు వాళ్ళకి బంజారా హిల్స్ కనపడ్డట్లు కనిపిస్తుంది అమెరికా అంతా.
అలా అని అమెరికా గురించి ఎక్కువ జనాలు మాట్లాడుకున్నట్లు, ఆడవాళ్లంతా బట్టలు విప్పుకుని తిరగరు. అక్కడ కూడా మనలాగే ఫ్యామిలీ కల్చర్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి ఇళ్ళు , కార్లు కొనుక్కొని తమ కుటుంబం, స్నేహితులతో కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని అనుకుంటారు. మన పల్లెటూర్లలో ఆలోచన విధానం, ప్రవర్తన ఎలా ఉంటుందో, అమెరికాలో కూడా దాదాపు అలాగే ఉంటుంది.
ఇంకా అమెరికాలో టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ ఎక్కువ, మన్నూ, మషాణం అనుకునేది, అనేవాళ్లు ఏమీ తెలియని మూర్ఖులు, బతకటానికి లేదా తాము ఎక్కువ అని చెప్పుకోటానికి మాట్లాడే మాటలు తప్పితే కొత్తగా అమెరికాలో ఏమీ ఉండదు. డిజైన్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెల్లిజన్స్ మొదలగునవి అన్నీ మన పల్లెటూర్లలో ఎప్పటి నుంచో ఉన్నాయి.
డబ్బు, సంపద ఎక్కువగా ఉన్నప్పుడు, ఎవరి వద్ద జ్ఞానం ఉన్నదో వారిని కలుపుకొని, మరింత సంపాదన చేసే విధంగా పనిచేస్తారు. అందుకే అమెరికాలో డబ్బు ఎక్కువగా ఉండటం వలన, తెలివి తేటలు, జ్ఞానం ఉన్నవారిని గౌరవించి తమ దగ్గర ఉంచుకుంటారు. అయితే, అమెరికాలో ఉన్నన్ని రాజకీయాలు మరెక్కడా ఉండవు. నిజానికి, అమెరికా ఒక మాయాబజార్ లాంటిది— ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు కనిపిస్తుంది. బయట నుంచి చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది, లోతుగా పరిశీలిస్తే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. ఆ వివరాలు మాట్లాడుకోకపోవడమే మంచిది.
నేను లాగులు వేసుకోకముందు నుంచే ఒక మాట వింటూ ఉన్నా, అది – ఈ సారి ఎన్నికలు ప్రత్యేకం అని. దీనెమ్మా జీవితం, పంచాయతీ వార్డ్ మెంబర్ నుంచి ప్రధాని ఎన్నికల వరకు ప్రతి దేశంలో, ప్రతి ఎన్నికలప్పుడు వినే మాట ఇదే; అమెరికాలో కూడా ఇప్పుడు అదే వినిపిస్తుంది, ఈసారి జరుగుతున్న ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి అని…
కావాలంటే చూడండి మన దగ్గర మరియూ అమెరికాలో కూడా మరొక నాలుగు సంవత్సరాల తర్వాత ఇదే వింటాం ; ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ప్రత్యేకమైనవి అని… అమెరికా మీడియాని మించిన వ్యభిచార మీడియా ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు, అది వేరే విషయం.
చివరగా అమెరికాలో పని చేస్తున్న మన వాళ్ళలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు, పనికి మాలిన మూర్ఖులు కూడా ఉన్నారు. అమెరికాలో ఉన్నారు అని మంచి లేదా చెడు – అలా ఉండదు… సాధారణంగా జనరైలేషన్ కి నేను వ్యతిరేకం,
ఫలానా దేశంలో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు, ఫలానా ప్రాంతం వాళ్ళు ఇలా ఉంటారు అనే చీడ భావజాలం నాకు నచ్చదు. ఏదైనా డబ్బు మరియూ ఆయా వ్యక్తుల స్వభావం, వ్యక్తిత్వం, పరిస్థితులు మొదలగు చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది అంటాడు ఒక రోమన్ తత్వవేత్త…… – సామాన్యుడు జగన్నాథ్ గౌడ్
Share this Article