.
Chakri Rao ….. సినిమా పరిశ్రమలో కొత్త హీరోల వైఫల్యాల్ని గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. చాలామంది కొత్తగా వచ్చిన వారు నటుడిగా తామేంటో తమకి తెలియక ముందే , ఇప్పటికే ఉన్న ఒక స్టార్ హీరోలా కనిపించాలని ప్రయత్నిస్తారు. ఎవరో ఒకరిని అభిమానించడం వరకు అది సహజం. కానీ ఆ అభిమానాన్ని తమ వ్యక్తిత్వంగా మార్చుకుని, అదే నడక, అదే బాడీ లాంగ్వేజ్, అదే చూపు, అదే డైలాగ్ టెంపో, అదే ఎలివేషన్‌తో తెరపైకి రావడం మొదలుపెడితే అక్కడినుంచే సమస్య మొదలవుతుంది.
కొంతమంది చిన్నప్పటి నుంచి చూసిన హీరోల ప్రభావంతో పెరుగుతారు. వాళ్ల సినిమాలు చూసి స్టేజ్ మీద డైలాగులు చెప్పి, అద్దం ముందు మేనరిజమ్స్ ప్రాక్టీస్ చేస్తూ హీరో కావాలని కలలు కంటారు. ఇంకొందరేమో “నువ్వు ఆ హీరోలా ఉన్నావ్” అని చుట్టుపక్కల వాళ్లు చెప్పిన మాటల్ని నిజంగా నమ్మేస్తారు. ఆ పోలికనే తమ బలం అనుకుంటారు. ఫలితంగా మొదటి సినిమానే తమకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకోవడం కాకుండా, ఇప్పటికే ఉన్న ఒక స్టార్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తారు.
కానీ ప్రేక్షకుడు అంత అమాయకుడు కాదు.
Ads
వాళ్ళకి తెరపై కనిపిస్తున్నది కేవలం ఒక నటుడే కాదు, ఆ నటుడి వెనక ఉన్న నిజాయితీ, కష్టం కూడా చదువుతాడు. అందుకే ఒక పెద్ద స్టార్ హీరో ఒక డైలాగ్ చెప్పినప్పుడు అది కేవలం ఆ ఒక్క సినిమాకి సంబంధించిన మాటలా అనిపించదు. ఆ మాట వెనక అతని గత సినిమాలు, విజయాలు, ఫైట్లు, ఎమోషన్స్, అభిమానుల విశ్వాసం అన్నీ కలిసి విశ్వసనీయత ఇస్తాయి. ప్రేక్షకుడు ఆ డైలాగ్ వింటున్నప్పుడు, “ఇతను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు అసాధ్యాన్ని సాధించాడు” అనే ఒక సామూహిక జ్ఞాపకాన్ని తోడు తెచ్చుకొని ఫీల్ అవుతాడు.
అందుకే ఒక స్టార్ హీరో భారీ డైలాగ్ కి హాల్‌లో ఉద్వేగంతో విజిల్స్ పడతాయి. ఎందుకంటే ప్రేక్షకుడు ఆ పాత్రను మాత్రమే కాదు, ఆ హీరో ఇన్ని సంవత్సరాలుగా చేసిన జర్నీ కూడా కనపడుతుంది.. అదే భారీ డైలాగు ఒక కొత్త హీరో మొదటి సినిమాలో వచ్చి చెప్పితే ప్రేక్షకుడికి అది empty గా అనిపిస్తుంది. “ఇతను ఏం చేశాడనీ ఇంత పెద్ద డైలాగులు ?” అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఎందుకంటే స్టార్ హీరోకి డైలాగ్ వెనక చరిత్ర ఉంటుంది. కొత్త హీరోకి మాత్రం డైలాగ్ వెనక శూన్యం ఉంటుంది.
కొత్త హీరోల పెద్ద తప్పు ఏమిటంటే, ప్రేక్షకుడి ప్రేమను సంపాదించకముందే గౌరవాన్ని డిమాండ్ చేయడం. కానీ ప్రేక్షకుడు ఎవ్వరినీ మొదటి రోజే దేవుడిలా ఎత్తుకోడు. ముందుగా అతనితో కనెక్ట్ అవ్వాలి. అతని బాధను చూడాలి. అతని ఓటమిని అనుభవించాలి. అతను భయపడటం, తడబడటం, అవమానాలు భరించడం చూడాలి. అప్పుడు మాత్రమే “ఇతను మనలో ఒకడు” అనే అనుభూతి కలుగుతుంది.
అందుకే విజయవంతమైన కొత్త హీరోల ప్రారంభ దశ సినిమాలు గమనిస్తే అందులో అజేయత్వం కంటే బలహీనత ఎక్కువగా కనిపిస్తుంది.
నాని మొదట వచ్చినప్పుడు అతను పక్కింటి అబ్బాయిలాగా కనిపించాడు. అతని పాత్రలు జీవితంతో తడబడేవి, ప్రేమలో అయోమయంలో పడేవి, చాలా సహజంగా ఉండేవి. అందుకే ప్రేక్షకుడు ముందుగా అతన్ని తమలాంటి మనిషిగా అంగీకరించారు. ఇప్పుడిప్పుడే మాస్ వేషాలు వేస్తున్నాడు. అయినా పెద్దగా ఆదరణ లేదు.
రవితేజ ప్రారంభ దశలో చేసిన పాత్రలు కూడా అలాంటివే. అతను మొదటి నుంచే అజేయుడిలా రాలేదు. కోపం, అవమానం, బాధ, ఆవేశం కలిసిన సాధారణ యువకుడిగా కనిపించాడు. తన్నులు తిని, మళ్లీ లేచి, చివరికి గెలిచే పాత్రల్లో ప్రేక్షకుడు తనను తాను చూసుకున్నాడు. కానీ…. అదే ఆటిట్యూడ్ అదే మానరిజం ఎన్నో సినిమాలలో రిపీట్ అయ్యేసరికి మొనాటని వచ్చేసింది. ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
ధనుష్ ను మొదట చాలామంది “హీరోలా లేడు” అని ఎగతాళి చేశారు. కానీ అదే అతని బలమైంది. అతను తెరపై పరిపూర్ణుడిలా కాకుండా, జీవితంతో కొట్టుమిట్టాడే యువకుడిలా కనిపించాడు. అందుకే ప్రేక్షకుడు అతనిపై జాలి, దగ్గర భావన, ప్రేమ పెంచుకున్నాడు. తర్వాత అతను స్టార్ అయ్యాడు.
విజయ్ దేవరకొండ కూడా మొదట “పెళ్లి చూపులు”లో ఒక గందరగోళ యువకుడిగానే ప్రేక్షకుడికి పరిచయమయ్యాడు. పెద్ద ఎలివేషన్ డైలాగులు, అతిశయమైన మాస్ హంగులు లేకుండానే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యాడు. ఆ కనెక్షన్ వచ్చిన తర్వాతే అతని అటిట్యూడ్‌ని ప్రేక్షకుడు అంగీకరించాడు. కానీ ఇప్పటికీ భారీ డైలాగులు చెప్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే అతడి జర్నీ చాలా తక్కువ.
ఇది సినిమాకి సంబంధించిన ఒక పెద్ద సత్యం. ప్రేక్షకుడు పరిపూర్ణుడిని అంతగా ప్రేమించడు. కష్టపడుతూ లేచే వ్యక్తిని ప్రేమిస్తాడు. ఎప్పుడూ గెలిచే వ్యక్తి కంటే, చాలాసార్లు ఓడి చివరికి గెలిచే వ్యక్తితోనే ఎక్కువగా ప్రయాణిస్తాడు. ఎందుకంటే మనిషి జీవితమే అలాంటిది. మనమంతా బలహీనతలతో, భయాలతో, అవమానాలతోనే జీవిస్తున్నాం. కాబట్టి తెరపై కూడా అలాంటి వ్యక్తినే నిజమని నమ్ముతాం.
అందుకే కొత్త హీరో మొదటి సినిమాల్లో పెద్ద పోటుగాడిలా కాకుండా, కథా బలం ఉన్న సినిమాలు, అమాయక పాత్రలు, ప్రేమ కథలు, ఓటమి నుంచి లేచే ప్రయాణాలు చేయడం చాలా అవసరం. పెద్ద విలన్ ఎదుట తడబడాలి. చాలాసార్లు ఓడిపోవాలి. కొట్టించుకోవాలి. చివరికి “ఇప్పుడు గెలవకపోతే అంతే” అనే స్థాయికి వెళ్లి ఎమోషన్‌తో ఎదిరించాలి. అప్పుడు ప్రేక్షకుడు ఆ హీరో కోసం చప్పట్లు కొడతాడు.
ఎందుకంటే ఆ గెలుపు కేవలం పాత్ర గెలుపు కాదు — ప్రేక్షకుడు తనలో చూసుకున్న ఒక సాధారణ మనిషి గెలుపు. స్టార్‌డమ్ అనేది మొదటి రోజే ఎవడికి వాడు ప్రకటించుకునేది కాదు. ప్రేక్షకుడు నెమ్మదిగా ఇచ్చే గుర్తింపు. అది భారీ డైలాగులతో బలవంతంగా తీసుకోలేరు. ప్రయాణంతో మాత్రమే సంపాదించాలి…
Share this Article