ఈ కేసీయార్ మనకు తెలిసిన ఆ పాత కేసీయారేనా..? అబద్దాలో, నిజాలో జానేదేవ్… మాట్లాడుతుంటే ప్రత్యర్థులపై గండ్రగొడ్డలి పట్టుకుని భీకరంగా దాడిచేసే పరుశురాముడిలా కనిపించే ఆ కేసీయార్ ఏమయ్యాడు..? ఎందుకింత డిఫెన్స్‌లో పడిపోయాడు..?…… ఇదీ ఎల్బీ స్టేడియంలో కేసీయార్ స్పీచ్ విన్న తరువాత ఓ కేసీయార్ అభిమాని అభిప్రాయం… స్పీచ్ అయిపోగానే బీజేపీ స్పందించింది… అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు ఓ ప్రకటనలో… ‘‘గ్రేటర్ పీఠం చేజారుతున్నదనే భయం కేసీయార్ స్పీచులో కనిపించింది…’’ అని వ్యాఖ్యానించాడు… కేసీయార్ స్పీచ్ మరీ అంత పేలవంగా ఏమీ లేదు… బీజేపీ వెటకారం చేస్తున్నంత బేలతనం కూడా ఆ స్పీచులో లేదు… కానీ కేసీయార్ పొలిటికల్, పోల్ స్పీచుల్లో సహజంగా కనిపించే ఫైర్, అటాక్, దూకుడు మాత్రం కనిపించలేదు…
బీజేపీకి గనుక అధికారం ఇస్తే హైదరాబాద్ ఆగమాగం అయిపోతుంది… భూముల విలువలు పోతయ్, వ్యాపారాలు పోతయ్ అనే కోణంలోనే ‘‘భయవ్యాప్తికి’’ బాగా ప్రయత్నించాడు తను… అఫ్ కోర్స్, ఈ బ్యాలెన్స్డ్ స్పీచ్ నగరానికి అవసరమయ్యే ఓ పొలిటికల్ స్ట్రాటజీలో భాగమే అనుకుని సమర్థించుకుని, సమాధానపడటానికి ప్రయత్నించినా సరే… ఇవి చెప్పడానికి కేసీయార్ అవసరమా..? కేటీయార్ సరిపోడా అనే అసంతృప్తే…
Ads
హరీష్ రావు మీటింగులో కనిపించలేదు, మరో ఇద్దరు మంత్రులు లేరు… వంటి విశ్లేషణలు… కేసీయార్‌ను ఇప్పుడే బాగా చూసుకొండి, మళ్లీ ఎన్నికల దాకా కనిపించడు అంటూ విజయశాంతి వెటకారాలు సంధించినా… వాటికి పెద్దగా విలువ లేదు… రేపు అమిత్ షా ఏం మాట్లాడతాడు అనే అంశంపైనే కాస్త ఆసక్తి నెలకొంది… నడ్డా వచ్చినా, యోగి వచ్చినా, తేజస్వి సూర్య వచ్చినా… వాళ్ల మాటలకు అమిత్ షా మాటలకూ తేడా ఉంటుంది… అమిత్ షా మాట మోడీ మాటే…
గత ఎన్నికల ముందు వరకు టీఆర్ఎస్, బీజేపీ ప్రబల ప్రత్యర్థులు ఏమీ కావు… అవసరమైనప్పుడు బీజేపీ ప్రభుత్వానికి కేసీయార్ సాయం చేసినవాడే… కేసీయార్ జోలికి కూడా బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ రాలేదు… కానీ సీన్ మారిపోయింది… కేసీయార్ ఎప్పుడైనా సరే మనకు ప్రత్యర్థే అని బీజేపీ ఫిక్సయిపోయింది… గత ఎన్నికల ముందు అచ్చం చంద్రబాబులాగే యాంటీ-మోడీ కూటమి కోసం కేసీయార్ చేసిన ప్రయత్నాలు మోడీకి కోపం తెప్పించాయి… ఆ తరువాతే కేసీయార్, మోడీ సంబంధాలు వేగంగా క్షీణించిపోయాయి…
రేపు అమిత్ షా సేమ్, అదే చార్మినార్ దగ్గర ఉన్న అదే భాగ్యలక్ష్మి గుడి దగ్గరే తన ప్రచారం ప్రారంభిస్తాడు… అది సెంటిమెంట్ కాదు, మతం… మతాన్ని వాడాలనే అభిమతం… హిందుత్వను ఎగదోయడమే కాదు… ఒక ఊహ గనుక నిజమైతే… కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని, సీబీఐ దర్యాప్తు అవకాశాల్ని కూడా అమిత్ షా ప్రస్తావిస్తాడేమో… ఎందుకంటే..? బీజేపీ అస్త్రాల్లో అవినీతి అనేదీ ఉంది… దాన్ని ఇప్పటిదాకా ప్రచారంలో పెద్దగా వాడలేదు… అది అమిత్ షాకు వదిలేస్తారేమో…
అయితే ఇవన్నీ చూసి వణికిపోయే కేరక్టర్ ఏమీకాదు కేసీయార్… తన పొలిటికల్ కెరీర్లో బోలెడన్ని ఢక్కామొక్కీలు తిని రాటుదేలిన గడుసు పిండమే… కానీ… ఏమో… మొన్నటి దుబ్బాక దెబ్బ కాస్త గట్టిగానే పడినట్టుగా అనిపిస్తోంది… దానికితోడు గ్రేటర్లో బీజేపీ గనుక పుంజుకుంటే అది టీఆర్ఎస్కు ఏమంత శ్రేయోదాయకం కాదు… తెలంగాణ జనాభాలో మూడోవంతుకు మించి హైదరాబాదులో ఉంటారు… ఈ గ్రేటర్ ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి జాతీయ స్థాయిలోనూ నెలకొని ఉంది… అందుకే ఈసారి గ్రేటర్ పోలింగుకు చాలా ప్రాధాన్యం ఉంది… ఉంది…!!
Share this Article