సద్దుమణగలేదు… చంద్రబాబు ఫ్యాన్స్, ఫ్రెండ్స్ ఫాఫం తమ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక జూనియర్ ఎన్టీయార్ వైపు మళ్లిస్తున్నారు… ఇంకా పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి… ఏమిటి తనపై ఆరోపణ..? జూనియర్‌కు చంద్రబాబు మీద కృతజ్ఞత లేదు, కుటుంబసభ్యుడనే సోయి లేదు, అందుకే స్పందించలేదు, దుబాయ్‌కు హాలీడే ట్రిప్ మీద వెళ్లిపోయాడు, ఇక్కడ ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కిమ్మనడా..? అసలు టాలీవుడ్‌ను ఆయన ఎంత ఎంకరేజ్ చేశాడో కదా, వాళ్లకూ చంద్రబాబు మీద కృతజ్ఞత లోపించింది… ఇలా ఏవేవో సాగుతున్నయ్…
ప్రధాన ప్రశ్నలు… జూనియర్ ఎన్టీయార్ ఎందుకు స్పందించాలి..? ఎందుకు కృతజ్ఞత ఉండాలి…? ఎస్, సాక్షాత్తూ హరికృష్ణ కొడుకే అయినా అధికారికంగా, బహిరంగంగా గుర్తించడానికి, కుటుంబంలో కలుపుకోవడానికి ఎన్టీయార్ కుటుంబం ఒప్పుకోలేదు చాలా ఏళ్లపాటు… తనకు వరుస హిట్స్ వస్తుండటం, ఎన్టీయార్ నటవారసుడిగా అవే రూపురేఖలతో, అదే నటనా సామర్థ్యంతో ఎదుగుతున్న తీరు చూసి, పనికొస్తాడు అనుకున్న చంద్రబాబు జూనియర్‌ను హరికృష్ణ కొడుకుగా అంగీకరింపచేశాడు… ఆ కృతజ్ఞత ఉండాలి, నిజమే… కానీ..?
జూనియర్ విశ్వాసఘాతకుడేమీ కాదు… ఆమధ్య చంద్రబాబు కోసం విపరీతంగా తిరిగి ప్రచారం చేశాడు, యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్ బెడ్ మీద పడుకుని మరీ ‘సైకిల్‌కు వోట్లు గుద్దండీ’ అని గొంతు చించుకుని వీడియో విడుదల చేశాడు… తరువాత ఏం జరిగింది..? చంద్రబాబు మార్క్ కార్యకర్త- కరివేపాకు సిద్ధాంతం ఏమిటో అర్థం చేసుకున్నాడు… లోకేష్ తన రాజకీయ వారసుడిగా తెర మీదకు బలంగా వచ్చాడు… బాలయ్య ఈరోజుకూ జూనియర్‌ను సహించడు… మరి జూనియర్‌కు కూడా పొలిటికల్ యాంబిషన్స్ ఉంటాయి కదా… చంద్రబాబు కార్యకర్తగా ఉంటే ఇక ఎన్నేళ్లయినా అలాగే ఉండిపోవాలి కదా… రాబోయే తరంలో లోకేష్‌కే దాస్యం చేయాలి కదా… ఆ సోయి వచ్చింది జూనియర్‌కు…
Ads
తనను ఆ కుటుంబం (కల్యాణరాం మినహా) ఎలా చూస్తుందో అర్థం చేసుకున్నాడు… ఇప్పుడీ రాజకీయ జంఝాటాలు వద్దనీ, కేవలం కెరీర్‌పైనే కాన్సంట్రేట్ చేయాలనీ నిర్ణయించుకున్నాడు… అందుకే తన సోదరి పోటీ చేస్తున్నా సరే పట్టించుకోలేదు… గతంలోలా ఎన్టీయార్ వర్ధంతి, జయంతి కార్యకలాపాలను కూడా పట్టించుకోలేదు… ఎన్టీయార్ నాణెం ఆవిష్కరణకూ పోలేదు… ఎన్టీయార్ శతజయంతినీ పట్టించుకోలేదు… తన కెరీర్ తను… అంతే… సో, ఇప్పుడు చంద్రబాబు కోసం అంగీలు చింపుకుని, జగన్ కన్నెర్రకు గురైతే వాళ్లో వీళ్లో దేనికి… ఆ కుటుంబమే పట్టించుకోదు… మరి జూనియర్ అడుగులు కరెక్టా కాదా..?
తను దుబాయ్ వెళ్లింది కూడా హాలీడే ట్రిప్ మీద కాదు… ట్రిపుల్ ఆర్ సినిమాలో తన నటనకు సైమా అవార్డు ఇస్తే దాన్ని తీసుకోవడానికి వెళ్లాడు… ఐతేనేం, అక్కడి నుంచే స్పందించవచ్చు కదా అంటారా..? అసలు స్పందించాలని ఉంటే కదా…!! అసలు సినిమా ఇండస్ట్రీ ఎందుకు లైట్ తీసుకుంటోంది..? ఇదీ ప్రశ్నే… సినిమా వాళ్లెవరైనా తమ కోణంలో, సేఫ్ సైడ్ ఆలోచిస్తారు, అడుగులేస్తారు… బాలయ్యకు తప్పదు… ఆర్థిక, కుటుంబ బంధం వాళ్లది… వాళ్ల ఇంటికి పిల్లనిచ్చిన వియ్యంకుడు… సొంత పార్టీ ఎమ్మెల్యే… అన్నీ బాగుంటే తెలుగుదేశానికి చీఫ్ స్థానంలో ఉండాల్సినవాడు… తనకెలాగూ తప్పదు…
పవన్ కల్యాణ్‌ది సినిమా బంధం కాదు, అది రాజకీయ బంధం… ఆ కథ వేరు… అశ్వినీదత్‌ది అమరావతి మార్క్ ఆర్థిక, భూబంధం… మహేశ్‌కు స్పందించాల్సిన అవసరం లేదు, అసలే తను రాజకీయ చికాకులకు దూరం… పైగా తన బావ గల్లా జయదేవ్ మీద జగన్ తన ప్రతాపాన్ని ప్రయోగిస్తున్నాడు… ఈ స్థితిలో జగన్‌తో తను కూడా గోక్కోవడం తనకు ఇష్టం లేదు… ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో కారణం ఉంది… ఇక చంద్రబాబు సినిమా ఇండస్ట్రీకి చేసిన మేళ్లు ఏమున్నయ్..? ఉన్నా సరే, సినిమావాళ్లకు కృతజ్ఞతలు, చట్టుబండలు మన్నూమశానం ఏమీ ఉండవు… ఉండవు…
Share this Article