.
అన్నా.., ఏశ నాగుల కట్ట మీద పాట ఎట్లుందే, ప్యారడైజుసినిమాలోని పాట, నాని- కీర్తి సురేష్ అదరగొట్టిన్రు, మస్తు ట్రెండింగ్ తెలుసా… మొన్న డల్లాస్‌లో ఈ పాట పాడితే అమెరికా మొత్తం ఊగిపోయింది… ఇప్పుడు ఇండియాలో ట్రెండింగ్… నువ్వు ఒక్క ముక్కయినా రాయకపోతివి……… ఒకాయన నిందాపూర్వక మెసేజ్
నిజమే… కానీ రెండుమూడుసార్లు ఒక్క ముక్కయినా పూర్తిగా అర్థమైతే కదా… రచయిత కాసర్ల శ్యామ్ మీద నాకేమీ అభ్యంతరాల్లేవు, తెలంగాణ వ్యవహారికంలో లైవ్‌లీ అంశాలనే బాగా పట్టుకుంటాడు, రాస్తాడు… ఎటొచ్చీ… ఆ సంగీత దర్శకుడెవరో ముందు సమజ్ కాలేదు గానీ… నీకో పేద్ద దండంరా బాబూ…
.
ఆ ఇన్‌స్ట్రుమెంటల్ వీర మోతలో ఒక్కటంటే ఒక్క పదమైనా సరిగ్గా అర్థమ్యేలా చెవులకు వినిపిస్తే ఒట్టు… ఆ లిరిక్స్ ఏమిటో తెలిస్తే కదా ఏమైనా రాసేది..? ఎంతసేపూ ఏశ నాగుల కట్ట మీద అని ఓ వందసార్లు వినిపించింది పాటలో… దాంతోపాటు తాగుదాం, ఊగుదాం అని మరో రెండు పదాలు…
Ads

.
మొత్తానికి తెలంగాణ ఫోక్‌ను భ్రష్టుపట్టించే యజ్ఞమేదో సీరియస్‌గానే సాగుతున్నట్టుంది నాని నేతృత్వంలో… అసలు ఆ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు తెలుగు ఏం తెలుసు..? అచ్చ తెలంగాణ పదాలన్నీ (?) కలిపి ఖైమా కొట్టి కొట్టి వదిలాడు… హాయిగా ఆ సన్‌రైజర్స్ కావ్య పాపను పెళ్లాడి, లైఫ్ ఎంజాయ్ చేయక, మా భాష మీద ఈ కక్షేమిట్రా బాబూ నీకు..?!
నిజానికి ఇది నాలుగేళ్లుగా బాగా నలుగుతున్న పాటే.., రీమిక్స్ పేరిట, దాన్ని ఓ మిక్సీలో వేసి, రుబ్బి, కొత్తగా వదిలారు… పాటంతా వింటే ఏశ నాగుల కట్ట మీద, తాగుదాం, ఊగుదాం, దొరలు తాగు ఇప్పసారై అనేదే పదే పదే ఊదరగొట్టి గొట్టి, ఏదో సగటు ఫోక్ డీజే సాంగ్ తరహాలో రిలీజ్ చేశారు… ఇంతకీ దొరలు తాగే ఇప్ప సారై అంటే ఏమిటో దర్శకుడు ఓదెల శ్రీకాంత్ చెప్పాలి…
ఇతనే కదా, ఇదే నానితో దసరా అనే సినిమా తీసింది… అందులోనూ తెలంగాణ కల్చర్ అంటే ఇక తాగుడు, ఊగుడు అన్నట్టే చూపించాడు… ఇప్పుడూ అదే ధోరణి…
బుడ్డ పరకలకూ బుడ పరకలకూ, కట్టకూ, గట్టకూ తేడా తెలియదు ఆ గాయని ఎవరో… అన్నట్లు, శ్యాం, ఊగి ఊగి సేర్లు తెగాలే అంటివి కదా పాటలో, ఈ సేర్లు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చినయ్..? దొరలు తాగే ఇప్పసారై అంటూ బొచ్చెడు నురగ కల్లు బింకీలను చూపిస్తాడు, ఆ దర్శకుడు… అంటే ఏమిటి సార్..?
కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ అనుకుంటా ఇది… పాపం మహానటి దురవస్థ… అసలు హీరోయిన్ కాయదు లోహర్… అన్నట్టు ఇందులో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు గట్రా కూడా ఉన్నారు… ఈ పాటలో కాదు, సినిమాలో…
చివరగా… ఈ పాట చూసి ఓ ఆంధ్రా మిత్రుడి పోస్టు ‘‘నాని సినిమాను కాస్త తెలుగులో కూడా రిలీజ్ చేయండయ్యా’’ అని… అచ్చం, మొన్న ఇడుపు కాయితం సినిమా టైటిల్ మీద విమర్శలాగే… సరే, మీ తెలుగే తెలుగా, తెలంగాణ భాష తెలుగు కాదా అనే డిబేట్ ఇక్కడ పెట్టడం లేదు గానీ…. అసలు ఈ పాట తెలంగాణ వాళ్లకే సమజైతలేదు, నడుమ మీ లొల్లి ఏమిటి బ్రదర్, దొరల్ తాగే ఇప్పసారైలాగా… జెర సైసు… ఈ భాషకు ఇంకా పేరు పెట్టలేదు..!!
అసందర్భమే కావచ్చుగాక… కానీ 13 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం మీద నాని చేసిన వ్యాఖ్య హఠాత్తుగా గుర్తొచ్చింది… ఆ ట్వీట్ కూడా దొరికింది… తను స్టార్‌గా నిలబడటానికి మళ్లీ ఈ తెలంగాణమే అక్కరకొచ్చింది… కాస్త ఈ యాసను ఖూనీ చేసేముందు కాస్త కృతజ్ఞత చూపవయ్యా నానీ…
Share this Article