.
Subramanyam Dogiparthi …. ఫేక్షనే ఊపిరిగా బతికే ప్రాంతాలలో ఇలాంటి వంశ ప్రతిష్ట , కుటుంబ పరువు , రక్తం పరువు వంటి కేకలతో తామే నాశనం అవటం కాకుండా చుట్టుపక్కల జనాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటారు . ఓ ఊళ్ళో రెండు బలిసిన కుటుంబాల మధ్య ఫేక్షన్ , ఫ్యూడ్ లతో మనకు ఎన్నో సినిమాలు వచ్చాయి . ముఖ్యంగా చిరంజీవి , బాలకృష్ణలు హీరోలుగా రాయలసీమ ప్రాంత నేపధ్యంలో చాలా వచ్చాయి . ఈమధ్య కాస్త రెస్ట్ ఇచ్చినట్లుగా ఉన్నారు .
సూర్యా మూవీస్ బేనర్లో నిర్మాత A M రత్నం మళయాళంలో సూపర్ హిట్టయిన గాడ్ ఫాదర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసారు . టైటిల్ పెద్దరికం. ఆయనే దర్శకత్వం కూడా వహించాడు . మళయాళంలో నటించిన N N పిళ్ళై తెలుగులో తన పాత్రను తానే ధరించాడు . 1992 జూన్లో వచ్చిన ఈ పెద్దరికం సినిమా పేరు చెప్పగానే ఎవరికయినా ఈయనే గుర్తుకు వస్తారు .
Ads
ఈ పిళ్ళై గారు గొప్ప రంగస్థల నటుడు , నాటక రచయితే కాకుండా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ INA లో కమాండర్ గా పనిచేసిన స్వాతంత్ర్య సమరయోధులు కూడా . ఆయన కేవలం నాలుగు సినిమాలలో మాత్రమే నటించారు . వాటిల్లో ఒకటి మన పెద్దరికం , రెండోది దీని మాతృక అయిన గాడ్ ఫాదర్ .
ఈయనకు ధీటుగా నటించింది మన భానుమతమ్మ . పల్నాటి యుధ్ధంలో నాగమ్మ , బ్రహ్మనాయుడులు గుర్తుకొస్తారు వీరిద్దరిని చూస్తుంటే ఈ సినిమాలో .
మరో విశేషం ఏమిటంటే సినిమాలో ఇద్దరికీ నలుగురేసి కొడుకులు . పిళ్ళై గారి కొడుకులకు విష్ణువుకు సంబంధించిన పేర్లు . భానుమతమ్మ గారి కొడుకులకు శివయ్యకు సంబంధించిన పేర్లు .
ఇంక సినిమాలో వీళ్ళ పేర్లు . పిళ్ళై పేరు పర్వతనేని పరశురామయ్య . భానుమతమ్మ పేరు అడుసుమల్లి బసవపున్నమ్మ . పేర్లను కూడా భలే పికప్ చేసారు రత్నం గారు , పరుచూరి బ్రదర్స్ . పరశురామయ్య గారు తన నలుగురు కొడుకులకు పెళ్ళి చేయని స్త్రీ ద్వేషి , వివాహ ద్వేషి . గేటుకు స్త్రీలకు ప్రవేశం లేదు అని బోర్డ్ కూడా తగిలిస్తాడు . ఆయన నలుగురు కొడుకులుగా విజయకుమార్ , రామిరెడ్డి , చంద్రమోహన్ , జగపతిబాబు .
ఈయన బధ్ధశత్రువు బసవపున్నమ్మ గారి నలుగురు కొడుకులు బాలయ్య , నర్రా వెంకటేశ్వరరావు , చలపతిరావు , ఉదయ ప్రకాష్ . రెండు కుటుంబాలకు ఆస్థాన లాయర్లు కూడా 24×7 పని చేస్తుంటారు వీళ్ళ కోసం . పరశురామయ్య గారి లాయర్ పరుచూరి వెంకటేశ్వరరావు , బసవపున్నమ్మ గారి లాయర్ అల్లు రామలింగయ్య .
బహుశా ఈ సినిమా కధ గుర్తు ఉండనివారు ఉండరేమో ! రెండు కుటుంబాల మధ్య పంతాలు , పోరాటాలు జరుగుతూ ఉంటాయి . ఒకరిని ఒకరు చావు దెబ్బ తీయాలని ట్రై చేస్తూ ఉంటారు . పట్నంలో చదువుతున్న జగపతిబాబుని ప్రేమిస్తున్నట్లు నటించమని బసవపున్నమ్మ మనమరాలిని పురమాయిస్తుంది .
వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమలో పడతారు . మలుపులు , వంపులు పుష్కలంగా తిరిగి ఇద్దరి పెళ్లి కావటంతో సినిమా శుభాంతం అవుతుంది . పరశురామయ్య గారు స్త్రీ ప్రవేశ నిషేధ బోర్డుని పీకేసి ఆడా మగా అందరినీ ఇంట్లోకి రమ్మంటాడు . ఈ పెళ్ళి ప్రహసనంలో చంద్రమోహన్ భార్య కవిత పాత్ర కూడా బాగుంటుంది .
ప్రతీ పాత్రకు చోటు ఉంటుంది సినిమాలో . అంత బిర్రుగా ఉంటుంది కధ , స్క్రీన్ ప్లే . దర్శకుడు ఎక్కడా బోరించకుండా చకచకా లాక్కెళ్ళిపోతాడు ప్రేక్షకులను . ఇందులో సుధాకర్ నటనను ప్రేక్షకులు అసలు మరచిపోలేరు . అతనికి ఈ సినిమాలో నటనకు బెస్ట్ కమేడియన్ నంది అవార్డు కూడా వచ్చింది .
నటి సుకన్యకు ఇదే మొదటి సినిమా . బాగా నటించింది . జగపతిబాబుకు మొదటి గట్టి హిట్ . ఇతర పాత్రల్లో అనిత తదితరులు నటించారు . పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ చాలా పదునుగా ఉంటాయి . రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో భువనచంద్ర , సిరిసిల్ల వాసి వడ్డేపల్లి కృష్ణలు పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర , జేసుదాస్ , స్వర్ణలత శ్రావ్యంగా పాడారు . ముఖ్యంగా జేసుదాస్ , స్వర్ణలతలు పాడిన ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం చాలా శ్రావ్యంగా ఉంటుంది .
ప్రియతమా ప్రియతమా తరగని పరువమా , నీ నవ్వే చాలు పూబంతి చామంతి జగపతిబాబు , సుకన్యల మీద సాగే డ్యూయెట్లు బాగుంటాయి . మరో పాట ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనా పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది . అన్ని పాటల చిత్రీకరణ బాగుంటాయి .
2004 లో హిందీలో హల్చల్ అనే టైటిలుతో రీమేక్ అయింది . అక్షయ ఖన్నా , కరీనాకపూర్ , అమ్రీష్ పురి , లక్ష్మి తదితరులు నటించారు . మన తెలుగు సినిమా 39 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . సినిమా యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడండి . Undoubtedly , a very good action , faction entertainer .
Share this Article