Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీడియా ర్యాంకులకూ, జర్నలిస్టు అజ్ఙాన ప్రవర్తనకూ లింకేమిటబ్బా..!!

May 20, 2026 by M S R

.

మోదీ ప్రెస్‌మీట్లు ఎందుకు పెట్టడు అనేది వేరే చర్చ… అదేమీ నిర్బంధ కర్తవ్యం ఏమీ కాదు… అది తన ఇష్టం… ఇండియన్ మీడియా వేసే ప్రశ్నలు, వాటికి జవాబుల ఆధారంగా గోకీ, గీకీ, ఈకలు పీకి పెంట పెంట చేసే ధోరణి కూడా మోదీకి తెలుసు… దీనికి తగినట్టు లెఫ్ట్, రాహుల్ వంటి పరిణతిలేని నేతల స్పందనలు ఎలా ఉంటాయో కూడా తెలుసు తనకు… సరే, దానిపై డిబేట్ ఇక్కడ అక్కర్లేదు గానీ… నార్వే జర్నలిస్టు ఓవరాక్షన్, ఫూలిష్ యాక్షన్ మాత్రం చెప్పుకోవాల్సిందే…

ఇండియాలో కొందరు జర్నలిస్టులు ఉంటారు… సేమ్, ఆమె కూడా… “ప్రెస్ ఫ్రీడమ్” పేరుతో హద్దులు దాటితే… విమర్శలు రావడం సహజమే! వివరాల్లోకి వెళ్దాం… ఈ వివాదాన్ని భావోద్వేగాల కంటే సాధారణ ప్రోటోకాల్, మీడియా సంస్కృతి, అంతర్జాతీయ రాజకీయ దృక్కోణాల కోణంలో చూసినప్పుడు కొన్ని అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి…

Ads

ముందుగా నేపథ్యం చెప్పాలి కదా… నార్వేలో ఇద్దరు ప్రధాన నేతలు తాము చెప్పాల్సిందేదో చెప్పారు, మోదీ వెళ్లిపోతున్నాడు… ఓ లేడీ జర్నలిస్టు Helle Lyng ( నార్వేలోని Dagsavisen అనే పత్రికకు పనిచేస్తోంది) ఆమె గట్టిగా వెనుక నుంచి “Why don’t you take some questions from the freest press in the world?” అంటూ ప్రశ్న అడిగిన వీడియో వైరల్ అయింది…

నా ప్రశ్న తీసుకోలేదు, జవాబు చెప్పలేదు, నేను ధైర్యంగా అడిగాను… అంటూ సెల్ఫ్ బాండింగ్, ప్రమోషన్ చేసుకుంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది… సేమ్ అదే బాపతు ధృవ్ రాఠీ, ప్రకాష్ రాజ్ తదితరులు వెంటనే ఆమెను ప్రేమిస్తూ ఫాలో అయిపోయారు… రాహుల్ గాంధీ తనకు అలవాటైన రీతిలో ఏదో పిచ్చి వ్యాఖ్య చేశాడు… ఇండియాలోని మోదీ వ్యతిరేకులు పండుగ చేసుకున్నారు… వివరాల్లోకి వెళ్దాం…

1. అది పూర్తి స్థాయి “ప్రెస్ మీట్” కాదు … మొదట గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే… ఆ కార్యక్రమం సంప్రదాయ మీడియా ప్రశ్నోత్తర సమావేశం కాదు…. ప్రతి జర్నలిస్టు తప్పనిసరిగా ప్రశ్న అడగాల్సిన  , ప్రతి ప్రశ్నకు నాయకుడు సమాధానం చెప్పాల్సిన వేదిక గానీ కాదు… అటువంటి సందర్భాల్లో ఎవరు మాట్లాడాలి, ఎవరికి అవకాశం ఉంటుంది, ఏ అంశాలపై స్పందించాలి అన్నది పూర్తిగా నిర్వాహకులు, నాయకుల నిర్ణయం…

2. జర్నలిస్టు ప్రశ్న అడిగిందంటే జవాబు చెప్పాల్సిందే అనడం తప్పు

ప్రజాస్వామ్యంలో ప్రశ్న అడిగే హక్కు ఉన్నట్టే, జవాబు ఇవ్వాలా వద్దా అనేది కూడా రాజకీయ నాయకుడి ఎంపికే… ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియా సమావేశాల్లో నేతలు కొన్ని ప్రశ్నలను పట్టించుకోరు, కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెబుతారు… దాన్ని వెంటనే “హక్కుల ఉల్లంఘన”గా లేదా “మీడియా అణచివేత”గా చిత్రీకరించడం అతిశయోక్తి అవుతుంది… ఐనా మీడియా ఫ్రీడంలో నంబర్ వన్ అని పేరుంటే ఇక ఆ జర్నలిస్టులు జ్ఞాన సంపన్నులా..? అసలు మీడియా ర్యాంకులకూ జర్నలిస్టులు ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన నిర్బంధతకూ సంబంధం ఏమిటి..?

3. “ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్” = సంపూర్ణ సత్యం కాదు

కొంతమంది వెంటనే “నార్వే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో నంబర్ వన్ దేశం” అంటూ వాదన మొదలుపెట్టారు. సంబంధం లేని వాదనలు మనకు అలవాటే కదా… అసలు ఆ ఇండెక్స్ ఒక అభిప్రాయ ఆధారిత కొలమానం మాత్రమే. అది శాస్త్రీయం కాదు. పైగా ఆ ర్యాంకింగ్స్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు కూడా ఉన్నాయి. మన దేశం దాన్ని చెత్తబుట్టలో వేసే కాగితంగా చూస్తుంది… దాని ప్రామాణికత, శాంపిల్స్, అభిప్రాయ సేకరణ తీరు అత్యంత నాసిరకం…

ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో ఎక్కడో ఉన్న దేశానికి చెందిన మీడియా ప్రతినిధి ప్రశ్న అడిగిందంటే, ఎదుటివారు తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిందే అన్న భావనలో తర్కం లేదు… ఫూలిష్ నెస్ తప్ప…

4. “నేను ధైర్యంగా అడిగాను” అనే వ్యక్తిగత పాపులారిటీ రాజకీయాలు

ఈ ఘటన తర్వాత ఆ జర్నలిస్టు సోషల్ మీడియాలో తనను తాను “నిజం కోసం పోరాడిన వ్యక్తి”గా ప్రొజెక్ట్ చేసుకోవడం కూడా విమర్శలకు దారితీసింది. జర్నలిజం అంటే వార్త సేకరణా? లేక వ్యక్తిగత ఇమేజ్ బిల్డింగా? అనే ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో కొందరు జర్నలిస్టులు కూడా యాక్టివిస్టుల్లా వ్యవహరిస్తున్నారు అనే విమర్శ కొత్తది కాదు. ఎక్కడో దూరంగా ఉండి, అరవడంలో… ఒక ప్రశ్న అడగడంలో ధైర్యం ఏమున్నట్టు..?

5. చైనా అనుకూల ధోరణులపై పాత విమర్శలు

ఆ జర్నలిస్టుపై గతంలో కూడా చైనా అనుకూల వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వచ్చాయి. అందుకే ఆమె ప్రశ్న వెనుక నిజమైన జర్నలిస్టిక్ ఉద్దేశమా? లేక ముందే నిర్ణయించుకున్న రాజకీయ ఫ్రేమ్‌వర్క్‌లో వేసిన ప్రదర్శనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

6. నార్వే మీడియా కార్టూన్ వివాదం

నార్వేలోని ఒక పత్రిక Aftenposten మోదీని ఓ పాములు పట్టుకునేవాడిగా చిత్రించిన ఓ కార్టూన్ మీద కూడా విమర్శలు వచ్చాయి… దేశానికి వచ్చిన అతిథిని అవమానించడం… ఐనా ఆ దేశాలకు జాతివివక్ష సహజమే కదా… సరే, ఆ కార్టూన్ సంగతి వేరు… అది ఆ దేశంలో పెద్ద పత్రిక అట… “వ్యంగ్యం” పేరుతో ఏదైనా చేయొచ్చా? లేక సంస్కృతి, మర్యాద, దౌత్య సంబంధాలకు కొన్ని హద్దులు ఉండాలా? అనే చర్చ అప్పుడే మొదలైంది. అంటే సమస్య ఒక్క ప్రశ్నతో ప్రారంభమైనది కాదు; దానికి ఒక నేపథ్యం కూడా ఉంది…

7. ప్రతి ప్రశ్నకు జవాబు రావడం ప్రపంచంలో ఎక్కడా జరగదు

అమెరికా అధ్యక్షుల నుంచి యూరప్ నేతల వరకు — ప్రపంచవ్యాప్తంగా మీడియా సమావేశాల్లో చాలా ప్రశ్నలు జవాబుల్లేకుండానే ముగుస్తుంటాయి. అది అసాధారణం కాదు. ఎవరైనా ప్రశ్న అడిగారంటే సమాధానం చెప్పకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని చెప్పడం రాజకీయ అతిశయోక్తి మాత్రమే.

8. కార్యక్రమం ముగిసిన తర్వాత అరుస్తూ ప్రశ్నించడం కూడా చర్చనీయాంశమే

అంతా ముగిసిన తర్వాత గట్టిగా అరుస్తూ ప్రశ్న వేయడం చాలామందికి అసభ్యకరంగా కనిపించింది. ప్రశ్న అడగడం హక్కే అయినా, దానికి కూడా ఒక ప్రోటోకాల్, సందర్భం, ప్రవర్తనా శైలి ఉంటాయి. ప్రత్యేకంగా అంతర్జాతీయ దౌత్య వేదికల్లో మర్యాదా ప్రమాణాలు మరింత ముఖ్యమవుతాయి.

మీడియా స్వేచ్ఛకు కూడా బాధ్యత, సందర్భబద్ధత, వృత్తి నైతికత అవసరం… ప్రశ్న అడగడం జర్నలిస్టు హక్కు అయితే, జవాబు ఇవ్వాలా వద్దా అనేది నాయకుడి నిర్ణయం. అదే ప్రజాస్వామ్యపు మరో భాగం…

9. హక్కుల ఉల్లంఘనకూ మీడియా ర్యాంకింగులకూ లింకేమిటి

మీడియా ఫ్రీడమ్ ర్యాంకులకూ దేశంలో హక్కుల ఉల్లంఘనలకూ లింకేమిటి..? ఎవరి హక్కుల ఉల్లంఘన గురించి ప్రస్తావిస్తోంది ఆమె… మీడియా హక్కుల గురించా..? ఇతర మానవ హక్కుల ఉల్లంఘన గురించా..? అన్నట్టు ఈ వివాదం తరువాత ఆమె ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలు రద్దయ్యాయి… సో, ప్రపంచంలో చాలామంది ప్రకాష్ రాజ్‌లు జర్నలిస్టుల రూపాల్లో జస్ట్ ఆస్కింగ్ అంటూ తమ వాస్తవ స్థాయిని ప్రదర్శిస్తుంటారన్నమాట..!! ఇండియన్ ప్రసిద్ధ జర్నలిస్టుల పేర్లు గుర్తొస్తున్నాయి గానీ… వద్దులే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తను దెయ్యమా..? వామ్మో, నన్నే ఎందుకు పలకరిస్తున్నాడు..?!
  • ప్రతిపక్షం అంటే ఇదీ… ఇటాలియన్ ట్రూ స్పిరిట్ అంటే ఇదీ…
  • ఇంతకీ అతను ఖతం అయిపోయినట్టేనా..? మరి ఇవేం రాజకీయాలు..?!
  • Still గుర్తుండిపోయే ఫోటోగ్రాఫర్… ఆయన పేరే ‘స్టిల్ భూషణ్…
  • Alia Bhatt … ‘Alpha’ మోడల్… ఏ చట్రంలోనూ బందీ కాదు…
  • ఈవీవీ మార్క్ అప‘హాస్యం ట్రాక్… లేటు వయస్సుల రొమాన్స్…
  • పంప్డ్ స్టోరేజీ..! తెలంగాణ పవర్ సెక్టార్‌లో ఓ నిశ్శబ్ద విప్లవం..!
  • పేదల వాహనం..! పల్లె బాటలపై ఈరోజుకూ తోపు టూవీలర్ ఈ మోపెడ్..!
  • సీరియస్ స్టోరీ..! ఈ నేరానికి పేరేమిటి..? అసలు ఇది నేరమేనా..?
  • అయ్యా, నవీన్ బాబూ… ఒక్క ప్రశ్న… ఈ సినిమా ఎందుకు తీసినట్టు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions