.
పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ క్లోజ్… ఇది గతం… అవిప్పుడు పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు… పెళ్లంటే ‘ఆంక్షలు’ కాదు.. కెరీర్‌కు ‘రెక్కలు’! ఫహద్ – నజ్రియా జంట ఇండస్ట్రీకి అందుకే డిఫరెంట్…
సినిమా ఇండస్ట్రీలో ఒక అలిఖిత నియమం ఎప్పటి నుంచో నడుస్తోంది. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఇక అంతే సంగతులు! ఒకవేళ పెళ్లి తర్వాత కూడా నటించాలనుకుంటే.. హోమ్లీ క్యారెక్టర్స్ చేయాలని కండిషన్లు పెట్టడం, లేదా అసలు సినిమాలే చేయనివ్వకుండా ఆంక్షల వలయం సృష్టించడం సర్వసాధారణం. ఎంతోమంది ప్రతిభావంతులైన తారలు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయిన చరిత్ర మన కళ్ల ముందే ఉంది.
Ads
కానీ, ఈ ‘స్టీరియోటైప్స్’ అన్నింటినీ బద్దలు కొట్టి, పెళ్లంటే బంధనం కాదు.. ఒకరినొకరు గౌరవించుకుంటూ కెరీర్‌లో ఎదిగే అద్భుతమైన ప్రయాణం అని నిరూపిస్తున్నారు ఫహద్ ఫాసిల్ – నజ్రియా నజీమ్. అందుకే వీరు ఇండస్ట్రీలోనే మోస్ట్ డిఫరెంట్ అండ్ బెస్ట్ కపుల్!

ఆంక్షలు లేవు.. కేవలం లవ్ అండ్ సపోర్ట్!
కేవలం 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న నజ్రియా.. ఇండస్ట్రీలో అప్పుడప్పుడే స్టార్‌డమ్ టేస్ట్ చూస్తోంది. అలాంటి టైమ్‌లో పెళ్లి అనగానే చాలామంది ‘ఇక నజ్రియా చాప్టర్ క్లోజ్’ అనుకున్నారు. దానికి తగ్గట్టే పెళ్లి తర్వాత నాలుగేళ్ల పాటు ఆమె వెండితెరకు దూరంగా ఉంది. అయితే, ఇది ఫహద్ పెట్టిన ఆంక్షల వల్ల కాదు.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాక తన వ్యక్తిగత స్పేస్ కోసం నజ్రియా స్వయంగా తీసుకున్న బ్రేక్!
సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్లకు ఫ్యామిలీ నుంచి, భర్త నుంచి ‘సినిమాలు వద్దు’ అనే ఒత్తిడి ఉంటుంది. కానీ ఫహద్ విషయంలో అది రివర్స్ అయింది. నజ్రియాలోని నటిని ఫహద్ ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చాడు.
నజ్రియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి భర్త ఫహద్ ఇచ్చిన సపోర్ట్ చిన్నదేం కాదు. 2018లో అంజలి మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘కూడే’ సినిమాతో నజ్రియా రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత భర్త ఫహద్ ఫాసిల్‌తో కలిసి చేసిన ‘ట్రాన్స్’ సినిమాలో వైల్డ్ అండ్ బోల్డ్ క్యారెక్టర్‌లో నటించి అందరినీ విస్మయపరిచింది.
ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్: పెళ్లయిన హీరోయిన్లు గ్లామర్ రోల్స్ చేయకూడదు, బోల్డ్ క్యారెక్టర్స్ చేయకూడదు అనే ఆంక్షలను ఫహద్ అస్సలు పట్టించుకోలేదు. పైగా ఆ ‘ట్రాన్స్’ సినిమాను స్వయంగా ఫహద్ ఫాసిల్ తన సొంత బ్యానర్‌పైనే నిర్మించడం విశేషం! భార్య టాలెంట్‌కు భర్తే నిర్మాతగా మారి ప్రోత్సహించడం కంటే గొప్ప సపోర్ట్ ఏముంటుంది?

టాలీవుడ్ ఎంట్రీ.. ప్రొడ్యూసర్‌గా సరికొత్త ప్రయాణం!
నజ్రియా కేవలం నటిగానే ఆగిపోలేదు. ఫహద్‌తో కలిసి నిర్మాణ భాగస్వామిగా (Producer) మారి ‘కుంబళంగి నైట్స్’, ‘కప్పేలా’ వంటి విలక్షణమైన, నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న సినిమాలను నిర్మించింది. ఆ తర్వాతే మన తెలుగులో హీరో నాని పక్కన ‘అంటే సుందరానికి’ సినిమాలో లీలా థామస్‌గా అలరించింది. పెళ్లి తర్వాతే ఆమె పరిధి మరింత విస్తరించింది తప్ప ఎక్కడా తగ్గలేదు.
ఒకరి విజయాల్లో.. మరొకరి భాగస్వామ్యం!
నిజమైన భాగస్వామ్యం అంటే ఒకరి గెలుపును చూసి మరొకరు గర్వపడటం. ఫహద్ ఫాసిల్ ఈరోజు మలయాళ ఇండస్ట్రీ దాటి పాన్-ఇండియా లెవెల్లో విలక్షణ నటుడిగా (పుష్పలో షెకావత్ సార్‌గా, విక్రమ్‌లో అమర్‌గా) దూసుకుపోతుంటే.. అతడి వెనుక నజ్రియా ఇచ్చే మానసిక స్థైర్యం ఎంతో ఉంది. అలాగే, నజ్రియా ఏ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నా ఫహద్ పూర్తి స్వేచ్ఛనిస్తాడు.
పెళ్లి అనేది హీరోయిన్ల కెరీర్‌కు ఫుల్‌స్టాప్ కాదు.. సరైన తోడు దొరికితే అది సరికొత్త అధ్యాయానికి ‘కామా’ మాత్రమే అని ఫహద్- నజ్రియా లైఫ్ స్టోరీ నిరూపిస్తోంది. సాంప్రదాయ ఆంక్షల గిరి గీసుకోకుండా, ఒకరికొకరు రెక్కలుగా మారిన ఈ జంట నిజంగానే ఇండస్ట్రీలో చాలా డిఫరెంట్.. వెరీ స్పెషల్!
Share this Article