Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భారతీరాజా గొప్ప దర్శకుడే… కానీ కొన్ని వివాదాలు కూడా…

June 10, 2026 by M S R

.

Priyadarshini Krishna …. పదహారేళ్ల వయసుకు మాతృక అయిన 16 వయతినిలే, ఎర్రగులాబీలు వంటి అనేక సినిమాలు తీసి కొత్త తరం నటులను సృష్టించిన వెటరన్ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూశారు… ఆయన వయసు 84… కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు….

16 వయతినిలే ఆయన తొలి సినిమా…
భారతి రాజాగారి సినిమాలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి సినిమా ఫీల్డ్ కి డైరెక్షన్ కోసం వచ్చిన మాట వాస్తవం …
పదహారేళ్ల వయసు ఒరిజినల్ గా ఈయనే తీశారు అని తెలుసుకున్న వెంటనే అభిమానినయ్యాను…
తమిళులు అవటం మూలానా నేను ఆయన దగ్గర శిష్యరికం చెయ్యలేకపోయానే అని ఎన్నోసార్లు బాధపడ్డాను …

Ads

భారతి రాజా ఎన్నో ఎక్స్పేరిమెంట్స్ చేశారు… ఆరోజుల్లోనే సైకలాజికల్ థ్రిల్లర్స్ తీసి యువతను ఉర్రూతలూగించారు…
రజని, కమల్, శ్రీదేవికి స్టార్‌డమ్ ఇచ్చిన వారిలో ఈయనే ప్రథముడు…
6 జాతీయ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డులు, ఇంకా ఎన్నో అవార్డులు ఆయనను సత్కరించుకున్నాయి.
భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సన్మానించింది.

ఆయన మంచి నటుడు కూడా…
తూరుపువెళ్లే రైలుకి తమిళ మాతృక కూడా ఈయనే తీసారు… ఈయన కేవలం గ్రామీణ జీవితాలనే చిత్రీకరిస్తారు అనే అపవాదును చెరిపెయ్యడానికి ఎర్రగులాబీలు అనే సైకలాజికల్ థ్రిల్లర్ పూర్తి అర్బన్ లైఫ్ ని ప్రతిబింబిస్తూ తీశారు, ఆ తర్వాత టిక్ టిక్ టిక్ తీసి యువతని ఉర్రూతలూగించారు…

నిలాల్గల్ – నీడలు అనే సినిమాతో ఈయన పరిణితిపైన అందరికీ అనుమానాలు పోయాయి … ఆత్మబంధువుతో సున్నితమైన మానసిక, మానవీయ కోణాలను కూడా అంతే ప్రతిభతో చిత్రించగలరు అనేది నిశ్చయం అయింది.

తెలుగులో డైరెక్టుగా సీతాకోక చిలక సినిమాను కొత్త జంటతో తీసి సృజనకు భాషాభేదాలు ఎల్లలు లేవు అని నిరూపించుకున్నారు. దీనికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డుతో పాటుగా 5 నందులు కూడా దక్కాయి.

ఆరాధన – చిరంజీవి, సుహాసిని, జమదగ్ని, కొత్తజీవితాలు, యువతరం పిలిచింది, ఈతరం ఇల్లాలు వంటివి ఆయన నేరుగా తెలుగులో డైరెక్టు చేసిన సూపర్ హిట్ సినిమాలు ….

భానుమతి, బాలయ్య బాబు కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా మంగమ్మగారి మనుమడుకి కథను అందించారు… అలాగే రాజశేఖర్ నటించిన పల్నాటి పౌరుషం సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు…

భారతీయ సినిమాకి పేరుప్రతిష్టలు తెచ్చిన దర్శకులలో ముందువరుసలో తప్పకుండా వుంటారు… భారతీరాజా సినిమాలు ఫిల్మ్ స్టూడెంట్స్ కి రీసెర్చ్ మెటీరియల్ అనడంలో సందేహం లేదు …
ముఖ్యంగా స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ టెక్నికాలిటీస్ తప్పనిసరి పాఠాలు…
మేటి దర్శకులు తన మార్క్ వదిలి తరలి పోయారు….
శ్రద్ధాంజలి
సద్గతి ప్రాప్తిరస్తు



( ముచ్చట ) …  రాజకీయ, ప్రాంతీయ పరమైన వ్యాఖ్యలు & వివాదాలు… భారతీరాజా ఎప్పుడూ తమిళ సంస్కృతి, తమిళ గుర్తింపు పట్ల చాలా గట్టిగా గొంతు వినిపిస్తారు. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు దారితీశాయి…

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సమయంలో భారతీరాజా దానిని వ్యతిరేకించారు. “తమిళనాడును ఒక తమిళుడే పాలించాలి, బయటి వ్యక్తులు (కన్నడ/ మరాఠీ మూలాలు ఉన్న రజనీకాంత్) కాదు” అనే అర్థంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి…

కావేరి నదీ జలాల విషయంలో కర్ణాటకకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భారతీరాజా చాలా తీవ్రమైన వైఖరి తీసుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లను చెన్నైలో నిర్వహించవద్దని, ఆ సమయంలో క్రికెట్ మ్యాచ్‌లు పెట్టడం తమిళుల భావాలను గాయపరచడమేనని ఐపీఎల్ బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చారు…

శ్రీలంకలో తమిళులపై జరిగిన దాడుల విషయంలో ఆయన ఎల్లప్పుడూ తీవ్రంగా స్పందించేవారు. శ్రీలంక ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో కొంతమంది సినీ ప్రముఖులను కూడా ఆయన బహిరంగంగానే విమర్శించారు…

కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘సింధు భైరవి’ సినిమా క్లాసికల్ మ్యూజిక్ నేపథ్యంతో ఉంటుంది. అయితే ఈ సినిమాలో కర్ణాటక సంగీతాన్ని, ఒక నిర్దిష్ట వర్గాన్ని తక్కువ చేసి చూపించారనే విమర్శలు వచ్చినప్పుడు, బాలచందర్‌కు మద్దతుగా భారతీరాజా మాట్లాడటం అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

కొన్ని సినిమాల విషయంలో కథా హక్కులు, క్రెడిట్స్ విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్లు లేదా రచయితలతో చిన్నపాటి వివాదాలు నడిచాయి. అయితే ఇవి కోర్టుల వరకు వెళ్లినా పెద్దగా నిలవలేదు. షూటింగ్ స్పాట్‌లో భారతీరాజా చాలా కఠినంగా, పర్‌ఫెక్షనిస్ట్‌గా ఉంటారనే పేరుంది.

కొత్త నటీనటులను పరిచయం చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. అయితే షూటింగ్ సమయంలో ఆయన కోపానికి గురైన కొందరు నటీనటులు ఆ తర్వాత ఆయనతో పనిచేయడానికి కొంతకాలం వెనుకాడారు. కానీ, కాలక్రమేణా అవన్నీ సర్దుకుపోయాయి.

భారతీరాజా – ఇళయరాజా కాంబినేషన్ తమిళ సినిమా చరిత్రలోనే ఒక గోల్డెన్ ఎరా. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. అయితే, ఒకానొక దశలో ఇద్దరి మధ్య కొన్ని ‘ఈగో’ సమస్యలు రావడం వల్ల ఇళయరాజా స్థానంలో భారతీరాజా ఇతర సంగీత దర్శకులతో (ఏఆర్ రెహమాన్ వంటి వారితో) పనిచేశారు. చాలా కాలం పాటు వీరిద్దరి మధ్య మాటలు లేవు…

  • భారతీరాజా వివాదాలు ఎక్కువగా ఆయన భావోద్వేగ స్వభావం, తమిళ భాష, సంస్కృతిపై ఆయనకున్న విపరీతమైన అభిమానం వల్ల వచ్చినవే తప్ప, వ్యక్తిగతంగా ఆయన ఇండస్ట్రీలో అందరి చేత “దర్శక ఇమయం” (దర్శకత్వ శిఖరం) అని గౌరవించబడే వ్యక్తి.



భారతీరాజా

Gottimukkala Kamalakar ….
భారతీయ సినిమా రాజా భారతీరాజా…!
బాలూ ఇళయరాజాల లంగరు భారతీరాజా…!
కమల్ హాసన్; రజినీకాంత్ అనబడే నటుల్ని తారల్ని చేసిన భారతీరాజా..!
చిరంజీవి అనబడే తార నటుడని చూపించిన భారతీరాజా..!
శివాజీగణేశన్ అనే మేరునగంతో ఓ మోస్తరు బండరాయిని ఎత్తించిన భారతీరాజా..!
అరవనటులు అరవకుండా మాట్లాడేటట్టు నియంత్రించిన భారతీరాజా..!
సిల్కు స్మితకు నిండైన చీరకట్టి ఫక్తు సంసారిగా చూపించిన భారతీరాజా…!

మనిషి స్వభావంలో; ఉద్వేగాల్లో ఉన్న నాటకీయతని ఇంత స్వచ్ఛంగా; నగ్నంగా చూయించొచ్చా..? అని మనం అచ్చెరువొందేలా చేసిన భారతీరాజా…!
తన తర్వాత తయారైన ప్రతీదర్శకుడికీ ఒక రిఫరెన్స్ బుక్కైన భారతీరాజా..!
ఎనభయ్యేళ్ల ముదిమివయస్సులో కూడా ఎనిమిది రోజుల పసి బిడ్డంత నిష్కల్మషమైన చిరునవ్వు నవ్వగలిగిన భారతీరాజా…!
*****
ఇదేం శ్రద్ధాంజలి కాదు. సృజనశీలులకు మరణం ఉండదు. వాళ్ల స్ఫూర్తి గంగలా నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది..!



భారతీరాజా

Ashok Kumar Vemulapalli … పులుసు మరిగిపోతోందిరా .. కోటయ్యా .. అంటూ సిల్క్ స్మిత బాధ -కోపం -ఆవేదన -సిగ్గుతో చెప్పే ఈ డైలాగ్ సీతాకోకచిలుక సినిమాకి హైలెట్ .. తప్పు చేసిన భర్త నిర్వాకం పనివాడికి తెలియకూడదని ఆమె పదే తాపత్రయం , రహస్యాన్ని దాటాలనే ప్రయత్నం అన్నీ ఆ మాటల్లో కనిపిస్తాయి ..

తీరా తప్పు చేసిన భర్త కళ్ళముందే దొరికిపోవడంతో పనివాడు రాళ్ళపల్లి చూసిన చూపుకి సిగ్గుతో చచ్చిపోతూ అతన్ని క్షమించమని ప్రాధేయపడుతున్నట్టుగా , నా భర్తను కాపాడేందుకు నేను కూడా తప్పు చేసాను అనే భావన , భర్తవైపు రౌద్రంతో చూసే చూపు .. అన్నీ ఏకకాలంలో సిల్క్ స్మిత ముఖంలో మనం చూస్తాము ..

ఆమె బాధతో ఏడుస్తూ నేలమీద కూర్చుంటే ..శ రత్ బాబు తప్పుచేసినట్టు భార్యకు ముఖం చూపించలేని స్థితిలో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్లడం , అదే సమయంలో కుమిలిపోతూ తన గుడిసెలో భార్యని చూడడానికి వెళ్తున్న కోటయ్య.. ఇవన్నీ లాంగ్ ఫ్రేమ్ లో చూపిస్తారు భారతీరాజా .. దీనికి కరెక్ట్ గా సింక్ అయ్యే మ్యూజిక్ తోడై భావోద్వేగాలను రగిలించే ఈ సీన్ ఆ దర్శక ప్రతిభకు నిదర్శనం .. అలాంటి గ్రేట్ డైరెక్టర్ ఇవాళ శాశ్వతంగా ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయారు… సిల్క్ స్మితను అంగడి సరుకుగా చూపకుండా నటిగా గుర్తించాడు, అదీ భారతీరాజా…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారతీరాజా గొప్ప దర్శకుడే… కానీ కొన్ని వివాదాలు కూడా…
  • సర్కారు ఉంటేనేం, పోతేనేం… డీఎంకే లిక్కర్ వసూళ్లపై విజయ్ నజర్..!
  • తెలుగు వెండితెరపై 30 ఏళ్ల క్రితమే ‘హక్కుల కాక్రోచ్‌లు…
  • వినకుండానే నామినేషన్ రద్దా..? రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన తప్పేంటంటే..?
  • నత్వానీకి, మీనాక్షికి వేర్వేరు న్యాయాలు… డబుల్ స్టాండర్డ్స్..! సీట్ చోరీ…!
  • ఆ సీఎంకు ముందే ఎలా తెలుసు..? ఇదంతా ముందస్తు ప్లానేనా..!
  • ఆ నందగోపాలుడు చూపిన బాటే… ఇండియాను నిలబెడుతోంది…
  • రేవంత్‌పై ‘తీతా’ ఎర్రన్న విసుర్లు… అసలు సిసలు హిట్లర్ వారసులు…
  • “కేంద్ర మంత్రి కూతురికి ఒక న్యాయం, నా మొగుడికి మరో న్యాయం?’’
  • ATM లు- డిజిటల్ పేమెంట్స్- నగదు..! పరస్పర భిన్న దృశ్యాలు..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions