Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రంభ ఊర్వశి మేనక..! కామెడీ అంటే వీళ్లకు మరీ కామెడీ అయిపోయింది!

September 4, 2026 by M S R

.

కామెడీ సినిమా తీయాలంటే ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి… కామెడీ అంటే ఏంటి? ఈ సినిమా చూసిన తర్వాత ఆ ప్రశ్న దర్శకుడికే పరీక్ష పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ‘రంభ ఊర్వశి మేనక’లో అన్నీ ఉన్నాయి. రంభ ఉంది. ఊర్వశి ఉంది. మేనక ఉంది. ఇంద్రుడు ఉన్నాడు.

మ్యాజిక్ బుక్ ఉంది. దేవకన్యల పవర్స్ ఉన్నాయి. హీరోకి అప్పులు ఉన్నాయి. అప్పుల వాళ్లు ఉన్నారు. శవాలు ఉన్నాయి. అమ్మ సెంటిమెంట్ ఉంది. లేనిదొక్కటే… కామెడీ! కానీ సినిమా మాత్రం మొదటి నుంచి చివరి వరకు మనకు ఒకటే చెబుతూనే ఉంటుంది… “ఇది కామెడీ సినిమా!”… ఐరనీ అంటే ఇదే…

Ads

అసలు ఈ సినిమాను చూస్తుంటే ఒక దశలో అనుమానం వస్తుంది. కామెడీ అంటే ప్రేక్షకుడు నవ్వడమా? లేక సినిమాలో పాత్రలు ఏదో ఒకటి చేస్తూ ఉంటే,  అదే కామెడీయా? ఇక్కడ రెండో నిర్వచనాన్ని ఫాలో అయినట్టుంది.

అల్లరి నరేష్

సూరి చిన్నప్పటి నుంచి హీరో కావాలని కలలు కంటాడు. తండ్రి హీరో కాలేకపోయాడు కాబట్టి కొడుకైనా హీరో కావాలని కోరుకుంటాడు. ఇంట్లో ఉన్న మ్యాజిక్ బుక్‌లో ముగ్గు వేస్తే రంభ, ఊర్వశి, మేనకలు వచ్చి కోరికలు తీరుస్తారట. ఇది నిజంగా మంచి కామెడీ ఐడియానే.

25 ఏళ్లుగా హీరో అవ్వడానికి ముగ్గులు వేస్తున్నోడు… చివరికి హీరో అవుతాడా? అనే ఆసక్తి కలగాలి. కానీ ఇక్కడ దర్శకుడు ఆ పాయింట్‌ను పట్టుకుని కామెడీ చేయడం మానేసి… ముగ్గుల మీదే సినిమా వేసేశాడు! సూరి మ్యాజిక్ బుక్‌ను నమ్ముకుని ఊరంతా అప్పులు చేస్తుంటాడు. అప్పుల వాళ్లు ఇంటికి వస్తే ఏదో ఒక మాయమాట చెప్పి పంపిస్తుంటాడు.

ఇక్కడ బోలెడంత కామెడీ ఉండాలి. అప్పులవాళ్లకు ఒక్కొక్కరికి ఒక్కో కథ చెప్పడం, మ్యాజిక్ బుక్ పేరు చెప్పి మోసం చేయడం, చివరికి నిజంగానే దేవకన్యలు దిగిరావడం… ఇది పక్కా కామెడీ బంగారు గని. కానీ ఆ గనిలోకి వెళ్లి సినిమా తీసినవాళ్లు బంగారం తీసుకురాలేదు. రాళ్లు తీసుకొచ్చారు.

అంతేకాదు… ఇంతకుముందు అల్లరి నరేష్ సినిమాల్లో కనీసం “ఏదో ఒక సీన్‌లో నవ్వుతాం” అనే ఆశ ఉండేది. ఇందులో ఆ ఆశ కూడా అప్పుల వాళ్లలా ఇంటి ముందు నిలబడి తిరిగి వెళ్లిపోతుంది. అల్లరి నరేష్‌ను చూస్తుంటే కూడా ఒకటే అనిపిస్తుంది.

  • ఇరవై ఏళ్ల క్రితం ఆయన చేసిన కామెడీని ఎవరో పెన్‌డ్రైవ్‌లో పెట్టి… “ఇదిగో కొత్త సినిమా” అంటూ ఇప్పుడు రిలీజ్ చేసినట్టుంది.

అదే అరుపులు. అదే ఎక్స్‌ప్రెషన్స్. అదే పరుగులు. అదే వెర్రి చేష్టలు. అదే రకం డైలాగులు. అంటే ప్రేక్షకుడు కూడా ఒకసారి వెనక్కి చూసుకోవాలి… “అయ్యా… నేను 2005లో కూర్చున్నానా? లేక 2026లోనా?”

కాలం మారింది. కామెడీ మారింది. ప్రేక్షకుడి అభిరుచి మారింది. మీమ్స్ వచ్చాయి. రీల్స్ వచ్చాయి. స్టాండప్ కామెడీ వచ్చింది. డార్క్ కామెడీ వచ్చింది. సిచ్యుయేషనల్ కామెడీ వచ్చింది. సూక్ష్మమైన కామెడీ వచ్చింది. కానీ మన సినిమా మాత్రం ‘ఎవరైనా అరుస్తే నవ్వాలి’ అనే సిద్ధాంతం దగ్గరే ఆగిపోయింది.

ఒక పాత్ర అరుస్తుంది. మరొకరు పరుగెడతారు. ఇంకొకరు పడిపోతారు. మరొకరు ఏదో వింతగా మాట్లాడతారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ పెరుగుతుంది. కట్!

దర్శకుడికి అంతా కామెడీ అయిపోయింది. ప్రేక్షకుడికి మాత్రం సినిమా ఇంకా అయిపోలేదు! ఇక దేవకన్యలు వచ్చాక అయినా పరిస్థితి మారుతుందేమో అనుకుంటాం. రంభ, ఊర్వశి, మేనకలు భూమ్మీదకి వచ్చారు.  ముగ్గురు దేవకన్యలు ఒకే సినిమాలో దొరికితే కామెడీ రాయడానికి ఇంకేం కావాలి?

కానీ వాళ్ల చేతుల్లో పవర్స్ లేవు. అది కథలో సమస్య.  కానీ అసలు సమస్య ఏంటంటే… దర్శకుడి చేతుల్లో కామెడీ పవర్ కూడా లేనట్టుంది! దేవకన్యలను తాకితే చనిపోతారనే కాన్సెప్ట్ మాత్రం కొంత కొత్తగా ఉంది. అదీ కామెడీగా ఆడించవచ్చు. కానీ ఇక్కడ కూడా సీన్ తయారయ్యేలోపు శబ్దం మొదలవుతుంది.

శబ్దం పెరుగుతుంది. పాత్రలు పరుగెడతాయి. ఏదో జరుగుతుంది. ప్రేక్షకుడు మాత్రం “ఇందులో నేను ఎక్కడ నవ్వాలి?” అని వెతుక్కుంటాడు. ఇక అప్పుల వాళ్లు ఒక్కొక్కరుగా చనిపోవడం మరో వింత. సినిమా పేరు ‘రంభ ఊర్వశి మేనక’. జానర్ కామెడీ.

హీరో అప్పుల్లో ఉన్నాడు. దేవకన్యలు వచ్చారు. ఇంద్రుడు వచ్చాడు. అప్పుల వాళ్లు చస్తున్నారు. ఇంత మెటీరియల్ పెట్టుకుని కూడా కామెడీ పండకపోవడం చిన్న విషయం కాదు. ఇది టాలెంట్‌కు సంబంధించిన సమస్య కాదు. సినిమా మీదే కామెడీ చేయాల్సినంత పరిస్థితి.

వెన్నెల కిశోర్ ఇంద్రుడిగా కొంత రిలీఫ్ ఇస్తాడు. పాత్రలో లుక్, బాడీ లాంగ్వేజ్ మారడం బాగుంది. కానీ ఆయనకూ సరైన మెటీరియల్ ఇస్తే ఇంకా బాగా చేసేవాడు. సురభి చిన్ని పాత్రలో ఫర్వాలేదు. రాశీ సింగ్, విష్ణు ప్రియా, ప్రిషా సింగ్ తమ పాత్రల్లో జస్ట్ కనిపించారు. (ఇందులో విష్ణుప్రియ ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ కేటగిరీ, తెలుసు కదా)

వీకే నరేష్, శ్రీనివాస్ రెడ్డి కూడా తమకు చేతనైనంత చేశారు. కాదు, పాపం ఈమధ్య కొన్ని మంచి పాత్రలు వేస్తూ వీకే నరేష్ మంచి పర్‌ఫామెన్స్ ఇస్తున్నాడు… మరి ఇదేమిటయ్యా..? డబ్బుల కోసం మరీ ఈ పాత్రలా..? ప్చ్, అల్లరి నరేష్, వీకే నరేష్‌కన్నా జబర్దస్త్ పొట్టి నరేష్ నయం అనిపిస్తున్నాడుగా…

చివరికి మిగిలింది అమ్మ సెంటిమెంట్. అది మాత్రం కొంత పనిచేస్తుంది. అల్లరి నరేష్‌ కూడా అక్కడ కామెడీ నటుడిగా కాకుండా నటుడిగా కనిపిస్తాడు. తల్లి కోసం పడే తపన, ఆమెను బతికించుకోవాలన్న ఆరాటం కొంతవరకు మనసుకు తాకుతుంది. అంటే…

దేవకన్యలు నవ్వించలేకపోయారు.
ఇంద్రుడు పెద్దగా కాపాడలేకపోయాడు.
అప్పుల వాళ్లు కూడా నవ్వించలేకపోయారు.
చివరికి అమ్మ సెంటిమెంటే సినిమాకు కాస్త ఆక్సిజన్ పెట్టింది.

దర్శకుడు చంద్రమోహన్ చింతాడ ఎంచుకున్న కథలో తప్పు లేదు. కథలో మ్యాజిక్ ఉంది. కథనంలో మాత్రం మ్యాజిక్ మిస్సయింది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రంభ ఊర్వశి మేనక..! కామెడీ అంటే వీళ్లకు మరీ కామెడీ అయిపోయింది!
  • ఇటు రేవంత్ – అటు ఒవైసీ… ఇద్దరివీ తెలివైన ప్రసంగాలు
  • మహిళా జడ్జిలకు కూడా తప్పని లైంగిక వివక్ష – వేధింపులు !
  • వేణు ఊడుగుల – మరో కొత్త ఆలోచనాత్మక సినిమాకు శ్రీకారం !
  • ఏదీ వదలడు- పుల్ల ఐస్ కూడా అమ్మగలడు… కానీ దానికీ ఓ లెక్కుంది !!
  • మంధానా ! ఈ పేరులోనే ఏదో వైబ్ ! ఇద్దరూ ఇద్దరే… నేషనల్ క్రష్ !!
  • Konda Family – ప్రస్తుతానికి ఎటూ వెళ్లే దారి లేదు! ప్లాన్-బి సస్పెన్స్ !!
  • మరేమనుకున్నారు? చేతికీ పగలుంటాయి! దిక్కుమాలిన ఫాంటసీ!!
  • గణితంలో తిర్యగ్రేఖ – రాజకీయ గణితంలో కొండా సురేఖ !!
  • అన్నీ మంచి శకునములే ! తలనొప్పులూ తలెత్తుకునేలా చేశాయి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions