Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వందోసారి చూస్తున్నా సరే… కఠినాత్ముడైనా సరే… కళ్లు తడుస్తాయి…

April 20, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. ఏయన్నార్ నట చరిత్రలో ఓ గొప్ప శ్రవణ దృశ్య కావ్యం 1991 సంక్రాంతికి వచ్చిన ఈ సీతారామయ్య గారి మనవరాలు . ఎంత కర్కశుడయినా వందో సారి చూస్తున్నా కళ్ళు చెమర్చవలసిందే . ఇంత ఆర్ద్రత , ఎమోషన్స్ , సెంటిమెంట్ , శ్రావ్య సంగీతం అన్నీ కలిసి ఉండే సినిమాలు ఎప్పుడో కాని రావు . ఈ సినిమాలో నటించిన ప్రతీ కళాకారుడు , సాంకేతిక బృంద సభ్యుడు అదృష్టవంతుడే .

ముఖ్యంగా మీనా . 14 ఏళ్ల వయసులో నట భీష్ముడు , 66 ఏళ్ళ ఏయన్నారుతో ధీటుగా నటించే అవకాశం కలగటం , దానిని సద్వినియోగం చేసుకోవటం ఆమె అదృష్టం . ఇంక మహానటుడు ఏయన్నార్ గురించి చెప్పేదేముంది ? విగ్గు లేకుండా నటించటానికి తటపటాయించారట . వెంటనే యస్ చెప్పకపోతే విసుక్కున్న నిర్మాత దొరైస్వామి రాజు వేటూరిని పెట్టి తీస్తానని చెప్పాడట . ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు .

Ads

మూడో స్థానం రోహిణీ హట్టంగడి . భర్త మాట జవదాటని భార్యగా , కొడుకు దూరమయ్యాడనే బాధపడే తల్లిగా , అమెరికా నుండి వచ్చిన మనవరాలిని చూసుకుని మురిసిపోయే నానమ్మగా అద్భుతంగా నటించింది . ఆ తర్వాత కొడుకుగా రాజా చాలా బాగా నటించాడు . తర్వాత నాకు నచ్చిన నటుడు , పిల్ల నటుడు , మాస్టర్ అమిత్ . తండ్రిని ఆటపట్టించే వాడిగా , మీనాకు దోస్తుగా భలే నటించాడు .

ధన వర్షం , ప్రశంసల వర్షం , పురస్కార వర్షం కురిసిన ఈ సినిమాకు మూలకధ నవ్వినా కన్నీళ్ళే అనే నవల . 1985 లో ఆంధ్రప్రభ పోటీలలో గెలుపొందిన ఈ నవలని వెంకట హరగోపాల్ అనే SBI ఉద్యోగి తన భార్య పేరయిన మానస అనే కలం పేరుతో వ్రాసారు . సినిమాగా తీసే అవకాశం ఏమయినా ఉందేమో అని చాలామందిని కలిసారట . క్రాంతికుమారుకి , నిర్మాత దొరైస్వామి రాజుకి నచ్చటంతో సినిమా అయింది .

క్రాంతికుమార్ ఎంత అద్భుతంగా దర్శకత్వం వహించారో ! ఎంత బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారో ! గొప్ప టీంని ఎన్నుకున్నారు . ఈ టీంలో ముందుగా మెచ్చుకోవలసింది సంగీత దర్శకుడు కీరవాణిని . పాటలకు అందించిన సంగీతం ఒక ఎత్తయితే బేక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లలో గుండెల్ని పిండేస్తుంది . ఈ తరం సంగీత దర్శకులు నెలకో సారయినా ఓ గంటయినా ఈ సినిమాను చూడమని నా ప్రార్ధన .

వేటూరి వారు మరోసారి తన విశ్వరూపాన్ని చూపారు . వెలుగు రేఖల వారు తెలవారి తామొచ్చి ఎండా ముగ్గులు పెట్టంగ , చిలక ముక్కు వారు చీకటితోనే వచ్చి చిగురు తోరణ కట్టంగ . ఏయన్నార్ షష్టిపూర్తి సందర్భంగా వచ్చే ఈ పాటను చాలా బాగా చిత్రీకరించారు . మరో శ్రావ్యమైన పాట పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది సందేళ , లాగేసె సల్లంగా దాన్ని నీలాగా సన్నాయి జళ్ళోన సంపెంగ . ఏం సాహిత్యం ! ఏం శ్రావ్యత ! ఏం చిత్రీకరణ ! అద్భుతం .

మరో గొప్ప పాట కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనక మాలక్ష్మి . చిత్ర అదరగొట్టేస్తే మీనా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది నటనతో . తన మేనత్త మామని , అత్తని , భర్తని కన్విన్స్ చేసి ఆమెను తనతో పాటు తీసుకుని పోయి తాతయ్య కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంది . ఇలాంటి పాట మాకు చిన్నప్పుడు పాఠ్యపుస్తకంలో బొమ్మలతో ఉండేది . దాని వివరాలు నాకు గుర్తు రావటం లేదు . నాలాంటి పాత తరం వాళ్ళకు ఏమయినా గుర్తుకు వస్తే పంచుకోగలరు . ఈ పాట పాడిన చిత్రకు నంది అవార్డు కూడా వచ్చింది .

మరో గొప్ప పాట ఏయన్నార్ , మీనాల మీద . ఫొటోగ్రఫీ డైరెక్టర్ కె యస్ హరిని ప్రత్యేకంగా అభినందించాలి . సినిమా అంతా , గోదావరి గ్రామాల అందాన్ని , గోదావరి అందాన్ని ప్రేక్షకులకు చూపడం ఒక ఎత్తయితే ఈ పాటకు ఆయన ఇచ్చిన ఫొటోగ్రఫీ ఒక ఎత్తు . త్యాగరాజ కృతిని కూడా బాగా వాడుకున్నారు క్రాంతికుమార్ , వేటూరి . భద్రగిరి రామయ్య పాదాలు కడగంగ పరవళ్ళు తొక్కింది గోదారి గంగ ; పాపికొండల నున్నా పాపాలు కరగంగ పరుగుళ్ళు తీసింది భూదారి గంగ ; సమయానికి తగు పాట పాడెనే . Marvellous .

ఓ సీతా హల్లో మై సీతా అంటూ సాగే పేరడీ పాట . మాయాబజార్ సినిమాలోని సుందరి నీవంటి దివ్య స్వరూపంబు అంటూ రేలంగి , సావిత్రిల పాటని సుధాకర్ , మీనాల మీద బాగొచ్చింది . సంగీతం , సాహిత్యం , శ్రావ్య గాత్రం . ఈ త్రయం సినిమా విజయానికి దోహదపడ్డాయి . సినిమాలో దాసరి కూడా కనిపిస్తాడు.

చాలా సన్నివేశాలలో మాటలు గుండెల్ని పిండేస్తాయి . నేనయితే మరవలేనీ డైలాగ్ రాజా తన చితాభస్మాన్ని తాను పుట్టి పెరిగిన గోదారిలో కలపమని కూతుర్ని అడిగే డైలాగ్స్ విన్నప్పుడల్లా కళ్ళు చెమర్చాల్సిందే . ఇలాంటి డైలాగ్స్ ఏయన్నార్ , మీనా , మురళీమోహన్ల మధ్య ఎన్నో !

ఈ గొప్ప క్లాసిక్ 1991 అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది . ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకుడు , ఉత్తమ నటుడు మూడు ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి . మూడు నంది అవార్డులు . రెండవ ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకుడు , ఉత్తమ ఫిమేల్ సింగర్ అవార్డులు . ఉత్తమ దర్శకుడు , ఉత్తమ చిత్రం సినిమా ఎక్స్ప్రెస్ అవార్డులు కూడా వచ్చాయి .

బాలసుబ్రమణ్యం , చిత్ర , జిక్కి పాటల్ని పాడారు . తార చక్కని నృత్యాలను కంపోజ్ చేసింది . ఈ గొప్ప చిత్రం తూర్పు గోదావరి జిల్లాలోని లోళ్ళ , కడియం , ఆత్రేయపురం , ములకపల్లి , చుట్టుపక్కల షూటింగ్ జరుపుకుంది .

హిందీ , కన్నడం , మళయాళం భాషల్లోకి రీమేక్ అయింది . కన్నడంలో సూపర్ డూపర్ హిట్టయిందట . ఈ సినిమా తీసే సమయానికి డాలర్ 15 రూపాయలు మాత్రమే . మీనా చదివింపు ఇచ్చేటప్పుడు రూపాయికన్నా డాలర్ 15 రెట్లు ఎక్కువ అని ఏయన్నారుతో అంటే ఇక్కడ రూపాయి అక్కడ డాలర్ అని దబాయించటం బాగుంటుంది . పెళ్ళిలో మనవరాలిని మురిపెంగా దొంగ చూపులు చూడటం చాలా బాగుంటుంది . ఇలా వందల సీన్లు ఉన్నాయి సినిమాలో .

సినిమా యూట్యూబులో ఉంది . అప్పుడప్పుడు టివిలో కూడా వస్తూ ఉంటుంది . భారతీయ కుటుంబ ఆప్యాయతలు , సాంప్రదాయాలు , వాటి సున్నితత్వం అద్భుతంగా చూపబడిన ఈ సినిమాని ఎన్ని సార్లయినా చూసి ఆస్వాదించవచ్చు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వందోసారి చూస్తున్నా సరే… కఠినాత్ముడైనా సరే… కళ్లు తడుస్తాయి…
  • టీ20 కెప్టెన్‌గా ‘సర్పంచ్ సాబ్‘..! జోరుగా ప్రచారం.., జరిగితే శుభమే..!!
  • లెన్స్‌కార్ట్ బాగోతాల అసలు దోషి ఓనరే… అడుగడుగుకో అబద్ధం, వంచన…
  • ప్రజల్లోకి రీ-ఎంట్రీ..! ఈ ఒక్క సభ కోసమేనా..? ఇక ప్రజల్లోనే ఉంటాడా..?
  • బ్యాక్ టు బేసిక్స్..! పుస్తకాలు- పెన్నులు మళ్లీ…! మనమూ మారదాం..!!
  • మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్ లింక్… ఇదుగో క్లారిటీ…
  • తెలంగాణపై విషం కాదు తేజస్వీ… ఇదుగో మీవాడే… కిక్కుమనవేమి…
  • సంక్రాంతి విందులో ఖర్జూరాలు..! మరో వివాదంలో లెన్స్‌కార్ట్..!!
  • B-Grade Reply… దురంధర్‌కు కౌంటర్ కొట్టబోయి పాకిస్థానీలు నవ్వులపాలు..!!
  • … ఇంతకీ హీరో శోభన్ బాబు చేసింది నేరమా..? న్యాయమా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions