.
ఇద్దరూ లక్ష్ములే… ఇద్దరిదీ ఎదురీతే! గరివిడి నుంచి గరికపాటి వరకు… రెండు జీవితాలు, రెండు పోరాటాలు! పేరులో పోలిక ఉంది. జీవితంలోనూ కొన్ని పోలికలున్నాయి. ఇద్దరూ మహిళలే. ఇద్దరూ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నవాళ్లే. ఇద్దరూ పురుషాధిక్య సమాజంలో తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడినవాళ్లే. అయితే ఒకరు బుర్రకథను నమ్ముకుంటే… మరొకరు నటనను నమ్ముకుంది. ఒకరు జానపద కళారంగంలో తన ముద్ర వేస్తే… మరొకరు వెండితెరపై తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
వాళ్లే గరివిడి లక్ష్మి… గరికపాటి వరలక్ష్మి! ఇటీవల ఓటీటీలో వచ్చిన ‘గరివిడి లక్ష్మి’ సినిమా చూస్తుంటే, అనుకోకుండా మరో లక్ష్మి గుర్తుకొస్తుంది. తెలుగు సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసిన నటి జి.వరలక్ష్మి. ఇద్దరి పేర్లలోని సామీప్యతే కాదు… జీవితాన్ని చూసిన తీరులోనూ కొన్ని ఆసక్తికరమైన పోలికలు కనిపిస్తాయి.
Ads
ముందుగా గరివిడి లక్ష్మి విషయానికొస్తే… ఆమె బుర్రకథను కేవలం వినోద సాధనంగా చూడలేదు. ప్రజలకు విషయాలు చేరవేసే మాధ్యమంగా ఉపయోగించుకుంది. గ్రామీణ జీవితం, సామాజిక సమస్యలు, సామాన్యుల అనుభవాలు… ఇలా ప్రజలకు దగ్గరగా ఉండే అంశాలను తన కళ ద్వారా చెప్పింది. అలాంటి కళాకారిణి జీవితమే ఓ సినిమాగా రావడం ఆసక్తికరం.
అయితే ఈ సినిమా చర్చలో మరో అంశం కూడా ఉంది. ఆర్.పి.పట్నాయక్ ‘చిత్రం’ సినిమాలో గరివిడి లక్ష్మి పాట, సాహిత్యం, ట్యూన్ ఉపయోగించుకున్న వ్యవహారం. అసలు ఆమెతోనే పాడిస్తానని చెప్పి పాడించకపోవడం, తగిన గుర్తింపు ఇవ్వకపోవడంపై వచ్చిన విమర్శలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో చివర్లో ఆర్.పి.పట్నాయక్‌తో వివరణ ఇప్పించడం, ఒరిజినల్ గరివిడి లక్ష్మి సినిమా చూసినట్టు చూపించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఓ చిన్న బడ్జెట్ సినిమా అయినా సహజత్వానికి పెద్దపీట వేయడం, నటీనటుల నుంచి సహజమైన నటన రాబట్టడం బాగుంది. ఇక్కడే మరో లక్ష్మి గుర్తుకొస్తుంది. ఆమె గరికపాటి వరలక్ష్మి.

తెలుగు, తమిళ చిత్రసీమల్లో ఎన్నో పాత్రలు పోషించిన జి.వరలక్ష్మి సాధారణ నటి కాదు. హీరోయిన్గా ఎదిగింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించింది. దర్శకురాలిగానూ తన ప్రతిభను నిరూపించుకుంది. అయితే ఆమెను మిగతా నటీమణుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టేది నటన ఒక్కటే కాదు. జీవితాన్ని తనకు నచ్చినట్టు జీవించాలన్న పట్టుదల కూడా!
ఆమె వ్యక్తిత్వానికి అద్దం పట్టే మాటలు కొన్ని… ‘‘ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోయే ఈ ప్రయాణంలో మనకు మనమే మొదటి ప్రాధాన్యత కావాలి. తల్లిదండ్రులైనా, తోబుట్టువులైనా, భర్త అయినా, పిల్లలైనా… ఎవరికీ మన జీవితంలో మనకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు’’… ఇదీ ఆమె ఫిలాసఫీ.
ప్రేమ, అభిమానం, అనురాగం… వీటి వెనుక కూడా స్వార్థం ఉంటుందని నమ్మిన మనిషి ఆమె. ఇతరుల ప్రేమ కోసం ఎదురుచూస్తూ, వాళ్ల ఆదరణ కోసం అర్రులు చాచడం వృథా అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.
ఆ మాటలు చెప్పింది ఎవరో కాదు… జి.వరలక్ష్మి! మహానటి సావిత్రి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఆలోచింపజేస్తాయి. తనతో కలిసి ‘పెళ్లి చేసి చూడు’ సినిమాలో చిన్న పాత్రలో నటించిన సావిత్రి, ఆ తర్వాత గొప్ప నటిగా ఎదిగిందని గుర్తు చేసుకుంటూనే, వ్యక్తిగత జీవితంలో ఎదురైన విషాదాలను ప్రస్తావించింది.
సావిత్రి జీవితాన్ని తాను చూసిన కోణంలో విశ్లేషించింది. పురుషుడి ఆధిపత్యం, స్త్రీల మానసిక సంఘర్షణ, తెరమీద వెలుగులు విరజిమ్ముతూ లోలోపల దహించుకుపోయే నటీమణుల విషాదం గురించి మాట్లాడింది. అయితే తన జీవితంలోనూ తప్పటడుగులు ఉన్నాయని ఆమె దాచుకోలేదు.
1946లో అప్పటికే పెళ్లైన దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావును పెళ్లాడింది. తర్వాత అజిత్ సింగ్‌ను వివాహం చేసుకుంది. ఆ నిర్ణయం తప్పని ఏడాదిలోనే తెలుసుకుని మద్రాసుకు తిరిగొచ్చింది. తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించాలని చెప్పుకుంది. తన జీవితానికి సంబంధించి ఎవరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అదే ఆమె ప్రత్యేకత.
సినిమాల్లోనూ ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. ‘కన్నతల్లి’లో తల్లి పాత్రతో మెప్పించింది. ఏఎన్నార్, నంబియార్ ఆమె కొడుకులుగా నటించారు. పి.సుశీల గాయనిగా పరిచయమైన చిత్రాల్లో ఇదొకటి. ‘పరోపకారం’, ‘మేనరికం’, ‘జ్యోతి’, ‘మేలుకొలుపు’ వంటి చిత్రాల్లోనూ నటించింది.
గ్లామర్ హీరోయిన్గా కెరీర్ కొనసాగకపోయినా, ఎలాంటి పాత్ర ఇచ్చినా తన నటనతో దానికి న్యాయం చేసింది. ‘గోరంత దీపం’, ‘రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ వంటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు గుర్తుండిపోతాయి.
దర్శకురాలిగా ‘మూగజీవులు’ చిత్రాన్ని రూపొందించి నంది అవార్డు అందుకుంది. తన సోదరి కుమార్తెకు నాగరత్నగా పేరు మార్చి సినిమాల్లో పరిచయం చేసింది. తమిళ చిత్రసీమలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.
- వ్యక్తిగత జీవితంలో ఎన్నో మలుపులు. పెళ్లిళ్లు, విడిపోవడాలు, కుటుంబ విషాదాలు, కొడుకు కె.ఎస్.ప్రకాష్ ఆకస్మిక మరణం… అన్నీ ఎదుర్కొంది. అయినా తనకు నచ్చిన జీవనశైలిని వదులుకోలేదు.
మెరీనా బీచ్‌కు వెళ్లడం, సముద్రపు గాలి పీల్చడం, మంచి నాటకాలు చూడటం, పాటలు వినడం, విలాసవంతమైన జీవితం గడపడం… ఇవే తనకు ఇష్టమని చెప్పుకుంది. తన జీవిత అనుభవాలతో ‘తప్పటడుగులు’ పేరుతో బయోపిక్ తీయాలని స్క్రిప్టు కూడా సిద్ధం చేసుకుంది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
2006 నవంబర్ 26న ఆమె కన్నుమూసింది. ఇప్పుడు గరివిడి లక్ష్మి, గరికపాటి వరలక్ష్మి ఇద్దరినీ ఒకేసారి గుర్తు చేసుకోవడానికి కారణం కేవలం పేర్లలోని పోలిక కాదు.
ఒకరు తన కళను నిలబెట్టుకోవడానికి పోరాడింది. మరొకరు తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడింది. ఇద్దరి జీవితాల్లోనూ సమాజపు అడ్డంకులు ఉన్నాయి. ఎదురైన అవమానాలూ ఉన్నాయి. తమ నిర్ణయాల పర్యవసానాలను ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి.
అయితే ఒక ముఖ్యమైన తేడా ఉంది. గరివిడి లక్ష్మి కథలో కళాకారిణి హక్కులు, గుర్తింపు, గౌరవం ప్రధానంగా కనిపిస్తే… గరికపాటి వరలక్ష్మి జీవితంలో వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్ర ఆలోచన, తనకు నచ్చినట్టు జీవించాలన్న తపన ఎక్కువగా కనిపిస్తాయి.
ఒక లక్ష్మి బుర్రకథతో సమాజానికి తన గొంతు వినిపించింది. మరో లక్ష్మి వెండితెరపై నటనతో తన ఉనికిని చాటుకుంది. ఇద్దరూ తమ కాలానికి, తమ రంగానికి ప్రత్యేకమైనవాళ్లే. పేర్లు కలిశాయి. పోరాటాలు గుర్తుకొచ్చాయి. అందుకే ఈ ఇద్దరు లక్ష్ముల కథల్ని ఒకసారి కలిపి చూడాలనిపించింది!
Share this Article