రజినీకాంత్ చంద్రముఖి సీక్వెల్‌లో కంగనా రనౌత్… ఇదీ వార్త… ఆమే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కూడా… కాబట్టి కన్‌ఫరమ్… ఫాఫం, రాఘవ లారెన్స్‌కు ‘‘కాంచన నష్టాలు కమ్ కంగనా కష్టాలు’’ తప్పేట్టు లేవు… ఈ చంద్రముఖిని తట్టుకోవడం కష్టమే… నిజానికి గత జూన్ నుంచే కాదు, అంతకుముందు నుంచే చంద్రముఖి సీక్వెల్ అని ఎవరెవరో చెబుతున్నారు… కానీ లారెన్స్ ప్రధానపాత్రలో నటిస్తాడు అని ప్రకటించాక క్లారిటీ వచ్చింది…
కాంచనలోలాగే ఓ ఆడవేషం వేసుకుని, తనే రాజనర్తకి అయిపోయి, లకలకలక అంటాడేమో అని కూడా జోకులు పుట్టుకొచ్చాయి… కానీ లారెన్స్ సినిమా అంటే తనదే లీడ్ రోల్, తనే సినిమాను డామినేట్ చేస్తాడు… అఫ్‌కోర్స్, బాగానే చేస్తాడు, అందులో డౌట్ లేదు… కానీ ఇప్పుడు కంగనా టీంలో వచ్చి చేరింది కదా… లారెన్స్ రోల్ కుదించబడటం ఖాయం… ఆమె పాత్రకు ప్రయారిటీ పెరగడం కూడా ఖాయం… లేకపోతే కుదరదు, అసలే ఆమె పురుచ్చి తలైవి… మరీ మణికర్ణికలాగా అందరినీ తరిమేయకపోవచ్చు గానీ అరకొర ప్రయారిటీకి ఆమె ఒప్పుకోదు…
Ads
నిజానికి ఇది హీరోయిన్ సెంట్రిక్ కథ… దాన్ని మరీ హీరోయిక్ కథగా మార్చి, రజినీకాంత్ ఇమేజీ బిల్డప్పుల కోసం చంద్రముఖి సినిమాకు నానా తిప్పలు పడ్డాడు దర్శకుడు… ఓసారి కాస్త పూర్వంలోకి వెళ్లివద్దాం పదండి… మణిచిత్రతాజు సినిమా… దీని ఒరిజినల్… 1993లో… మోహన్‌లాల్ హీరోగా, సురేష్ గోపి- శోభన జంటగా రూపొందిన ఈ మూవీ దర్శకుడు ఫాజిల్…
కథలో ఔచిత్యం దెబ్బతినకుండా… కథే హీరోగా… ఒక సమస్యను ఫోకస్ చేశాడు… ఒక అమ్మాయికి తలెత్తిన Multiple Personality Disorder (Dissociative Identity Disorder) అనే ఓ మానసిక జబ్బు, తద్వారా ఎదురయ్యే సమస్యలతో కథ చివరకు భూతాలు, క్షుద్రశక్తులనే సందేహాల దాకా వెళ్తుంది… చివరకు ఓ మానసిక వైద్యుడు సమస్యను సరిగ్గా అర్థం చేసుకుని పరిష్కరిస్తాడు… సినిమాలో శోభన నటన అపూర్వమేమీ కాదు, బట్ పర్లేదు… నిజానికి ఇది ఓ శాస్త్రీయ చిత్రం… సమస్యను సరైన కోణంలో ప్రజెంట్ చేస్తుంది… మోహన్‌లాల్ గానీ, సురేష్ గోపి గానీ కథకు బద్దులయ్యారు…
ఆ కథలో మానసిక వైద్యుడికి సమస్య అర్థమైంది… ఆ కథేమిటో ప్రేక్షకుడికి కూడా అర్థమైంది… కానీ ఆ కథలోని ఆత్మ తరువాత మన సినిమావాళ్లకే అర్థం కాకపోవడం ఓ దరిద్రం..! ఇదేమిటో అర్థం కావాలంటే మనం ఇంకొన్ని వివరాల్లోకి వెళ్లాలి… మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమా కాబట్టి కన్నడంలో విష్ణువర్ధన్ హీరోగా నో రిస్క్ అనుకుని 2004లో ‘ఆప్తమిత్ర’గా రీమేక్ చేశారు… పి.వాసు దర్శకుడు… శోభన స్థానంలో సౌందర్యను తీసుకున్నారు… జస్ట్, విష్ణువర్ధన్ ఇమేజీకి తగినట్టు కొన్ని మార్పులు చేసుకున్నారు తప్ప కథలో వేళ్లు కాళ్లు పెట్టలేదు… మరీ సూపర్ హీరోయిజం బిల్డప్పులు, ఆ పాత్ర ప్రాధాన్యం పెంపు గట్రా లేవు… సమస్యనే ఫోకస్ చేశారు… సౌందర్యకు మంచి ప్రయారిటీ ఇచ్చారు… అక్కడా సూపర్ హిట్… సౌందర్య అపూర్వంగా చేసింది…
మలయాళం, కన్నడంలో హిట్టయింది కదా… రజినీకాంత్ కన్నుపడింది… అదే వాసు దర్శకుడు… 2005లో ఫటాఫట్ నిర్మించేశారు… రజినీకాంత్ కోసం సూపర్ హీరోయిక్ ఫైట్లు, డాన్సులు, సాంగ్స్ పెట్టేశారు… సరిపోతాయో లేదో అని డౌటొచ్చి వెగటు సరసాలు, జోకులు కూడా పెట్టారు… కానీ ఆ కథలో దమ్ము ఆ సినిమాను హిట్ చేసింది… తెలుగులో కూడా రిలీజ్ చేశారు… జ్యోతిక కూడా శోభన, సౌందర్య స్థాయిలో నటించింది… నిజానికి అది ఆ పాత్ర కేరక్టరైజేషన్ గొప్పదనం… నాలుగు సౌత్ భాషల్లో సూపర్ హిట్ కదా… హిందీలో భూల్ భులయ్యా అని తీశారు… హిట్… అందులో విద్యాబాలన్ ప్రధానపాత్ర… ఆమె నటనకు పేరుపెట్టలేం కదా…
ఇక్కడ వాసు ప్రతిభ ఏమీ లేదు… మలయాళ ఫాజిల్ అడుగుల్లోనే రీమేక్ అడుగులతో నడిచాడు… చంద్రముఖి పాపులారిటీని సొమ్ము చేసుకోవడం కోసం ఎప్పుడైతే సీక్వెల్ ప్రయత్నాలు మొదలయ్యాయో ఇక దాన్ని భ్రష్టుపట్టించేశారు… కన్నడంలో మళ్లీ అదే విష్ణువర్దన్… ఆప్తరక్షక అని పేరు పెట్టారు… నాగవల్లి అనే పాత్ర సృష్టించి… ఒరిజినల్ చంద్రముఖి కథలోని ఆత్మను అర్థం చేసుకోకుండా… ఇందులో పక్కా టీవీ సీరియళ్ల బాపతు పాములు, భూతాలు, భయాలు, అఘోరాల్ని, అసహజ కథనాన్ని వదిలారు… ఓ చెత్త కథ… దీన్ని తెలుగులో నాగవల్లి పేరిట వెంకటేశ్ హీరోగా తీశారు… అనుష్కతోపాటు రిచా గంగోపాధ్యాయ్, శ్రద్ధా దాస్, కమలినీ ముఖర్జీ ఎందరున్నా సినిమాను ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు… చెత్త కథనం…
కన్నడంలో తీసిన ఆప్తరక్షకను సబ్‌కారక్‌వాలా పేరిట హిందీలో డబ్ చేసి వదిలారు… ఎవరి ఇష్టారాజ్యం వాళ్లు… ఈమధ్య భూల్ భులయ్యా సెకండ్ కూడా తీశారు… చంద్రముఖి-2 తీస్తామని, రజినీకాంత్, లారెన్స్ ప్రధానపాత్రలు అని అప్పట్లో ప్రకటనలు చేశారు… విశేషం ఏమిటంటే… దీనికీ వాసుయే దర్శకుడట… తరువాత ఏమైందో తాజాగా కేవలం లారెన్స్ ప్రధానపాత్రగా ఈ సీక్వెల్ వస్తుందని ప్రకటించారు… ఇదీ ఆ నాగవల్లి బాపతు కథేనా..? లేక చంద్రముఖికి మరో సీక్వెలా..? నాగవల్లి కథను చెడగొట్టినట్టే చంద్రముఖి-2 ను కూడా భూతాలు, దెయ్యాల కథగా మార్చేస్తారా..? అసలే లారెన్స్…
ఈ డౌట్లు దేనికీ అంటే… లారెన్స్ అనగానే కాంచన సీరిస్ సినిమాలు గుర్తొస్తాయి… తను ఎంటర్‌టెయిన్ చేయగలడు… కానీ ఎంతసేపూ రకరకాల హారర్, థ్రిల్లర్, కామెడీ తరహా సీన్లుంటయ్… చంద్రముఖి సినిమా కథ వంటి దమ్మున్న కథలు కావు… జస్ట్, టైంపాస్ పల్లీ తరహా… అందుకే లారెన్స్ ప్రధానపాత్రలో చంద్రముఖి-2 సినిమా అనగానే… పైగా ఆ వాసుయే దర్శకుడు అని చదివాక… ఫాఫం చంద్రముఖి అనిపించింది…!! ఇక కంగనా దగ్గరికి వద్దాం…
సీక్వెల్ అంటే… అదే చంద్రముఖి కథను పొడిగించడం… అంతేతప్ప మరో కథను రాసుకుని, ఇదే చంద్రముఖి-2 అంటే కుదరదు… నాగవల్లి ఫ్లాప్‌కు అది కూడా కారణమే… ఓ మానసిక వ్యాధి నుంచి హీరోయిన్ బయటపడింది… అక్కడ ఆమెకు గానీ, ఆ కుటుంబానికి గానీ ఇంకేదో సమస్య ఎదురవ్వాలి… మళ్లీ దెయ్యాలు, భూతాలు కావు, శాస్త్రీయంగా ఎస్టాబ్లిష్ చేయాలి… లారెన్స్‌కు మరీ హీరోయిక్ ఇంపార్టెన్స్ ఇస్తే కంగనా ఒప్పుకోదు… తన పక్కన నటించడానికి అంగీకరించడమే విశేషం… లారెన్స్ తక్కువ అని కాదు, కంగనాకు తనను తాను ఎక్కువగా ఊహించుకుంటుంది కదా… ఐతే ముందే ఆమెకు కథ చెప్పి ఒప్పించి ఉంటారు… లారెన్స్ కూడా వోకే అని ఉంటాడు… కాస్త జాగ్రత్తగా తీస్తే మటుకు కంగనా మ్యాగ్జిమం ఇచ్చేయగలదు… పైగా తను మంచి డాన్సర్… ఆశిద్దాం…
Share this Article