Gottimukkala Kamalakar…………………….. బిడ్డింటికి బాటేది…?
బొమ్మన్ ఇరానీ వాచిపోయిన కాళ్లతో కుంటుతూ కుంటుతూ వెళ్లి రావు రమేష్ ఇంటి తలుపు తట్టాడు.పెళ్లి కాని ప్రదీప్ వెళ్లి తలుపు తీసి ఆశ్చర్యంగా చూస్తూ ” ఎవరూ…?” అని అడిగాడు.
“ఇది కోర్టుకెప్పుడూ వెళ్లని లాయర్ రావు రమేష్ గారి ఇల్లే కదండీ..? ఆయనకో హోటల్ ఉంది, అది తాకట్టులో ఉందీ..!” అంటూ మెల్లగా కళ్లద్దాలు తీస్తూ కళ్లు చికిలిస్తూ ఏదో చెప్పబోయాడు బొమ్మన్.
Ads
“య్యా…! కమిన్” అంటూ షాన్ మెండిస్ పాటల్ని బ్లూటూత్ ద్వారా స్పాటిఫైలో వింటూ లోపలికి చేత్తో సైగ చేస్తూ పిలిచాడు ప్రదీప్.
ఇంట్లో గుమాస్తా రఘుబాబు లాల్చీ మీద కోటేసుకు తిరుగుతున్నాడు. పనిమనిషి హేమ ఉన్నా, రజిత పట్టుచీర కట్టుకుని వంటింట్లో మజ్జిగ కలుపుతోంది. ప్రణీత కమీజ్ మీద చీర కట్టుకుని బైట క్లాసికల్ డ్యాన్స్ ఆడుతోంది. రూంలో సమంతా రూత్ ప్రభు మోకాళ్ళ పైకి డిజైనర్ డ్రస్సేసుకుని పబ్బుకెళ్లడానికి తయారౌతూ లావవుతున్నానని దిగులు పడుతోంది. ఇంకో ఇద్దరు ముగ్గురు హడావిడిగా తిరుగుతున్నారు.
ఇల్లంతా కలియ జూసిన బొమ్మన్ కాళ్ల నెప్పుల వల్ల ఎక్కువ సేపు నించోలేక అక్కడున్న ఓ సోఫాలో మెల్లగా కూలబడబోతుండగా అదేదో సబ్యసాచి ముఖర్జీ డిజైన్డ్ చీర కట్టుకుని, మొహం మాడ్చుకుని పై ఫ్లోరు నుండి ఒక్కో మెట్టు దిగుతూ వచ్చింది నదియా..!
ఒకరి చూపులు మరొకరి చూపులతో కలుసుకున్నాయి. బొమ్మన్ కళ్ళు అపరాధ భావనతో నీళ్లు నింపుకోగా, నదియా కళ్లు ఆగ్రహంతో నిప్పులు కురుస్తున్నాయి. బొమ్మన్ మాట పెగలడం లేదు. బొమ్మన్ సోఫాలోంచి మెల్లగా లేవబోతున్న సమయంలో..
రావు రమేష్ వచ్చాడు…!
అతడు కూడా ఇంట్లో కోటేసుకున్నాడు. అప్పుడెప్పుడో బులెట్ తగిలిన చెయ్యి కొంచెం బలహీనంగా ఊగుతోంది. బొమ్మన్ ని చూడగానే మళ్లీ ఎక్కడ షూట్ చేస్తాడో అన్ని భయం రావు రమేష్ కళ్లలో కదలాడింది. కానీ బొమ్మన్ రమేష్ దగ్గరికి తన కాళ్ల నెప్పులు మరిచిపోయి చకచకా వెళ్లి, అతని రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకుని వెక్కివెక్కి ఏడవడం మొదలెట్టాడు.
“ఏంటిలా వచ్చారు..? నేనేదో మీ లీగల్ టీమ్ లో చివరి వరసలో కూర్చునే అర్హత కూడా లేని వానాకాలం వకీలుని..!” అంటూ వెటకారంగా అన్నాడు రమేష్.
“నేనేం మాట్లాడినా తప్పవుతుంది అల్లుడుగారూ…! నన్ను క్షమించండి. నా కూతురితో గొడవేసుకుని, నా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూనే నిరంతరం కుమిలిపోతున్నాను. మీరూ, అమ్మాయీ, మీ సమస్త కుటుంబం మీ పనుల్నీ, మీ మియాపూర్ ఇంటినీ, మూసీలో వదిలేసి మిలాన్ లో నా ఇంటికి రండి. కిన్వా, మిల్లెట్లూ, సలాడ్లూ తింటూ బతికేద్దాం..!” అని గద్గద స్వరంతో గంభీరంగా అన్నాడు బొమ్మన్.
“కాళ్లలో పట్టు తగ్గినా, కంఠంలో బెట్టు తగ్గలేదా..? ఆ కుంటి కాళ్లతో ఇక్కడిదాకా రాకుంటే అడ్డగాడిదలా ఎదిగాడట..! మమ్మల్ని పిలవడానికి నీ మనవణ్ని పంపొచ్చుగా..!” అంది నదియా.
“వాడి పేరెత్తకమ్మా..! నువ్వు హార్వార్డ్ లో చదివావా, వాడు ఇంటరే పాసవలేదు. వాడికి తుపాకులు పిచ్చి. గాల్లోకి ఆపిల్స్ ఎగరేసి పేలుస్తుంటాడు. వాడి షూ మోయడానికి అసిస్టెంట్లు కావాలి. పాపం జీతం కోసం పనిచేసుకునే వాళ్లను వాళ్ల వయసైనా చూడకుండా కొడుతుంటాడు. వెధవకి పెట్రోలూ డీజిళ్లకు తేడా తెలియదు. మన మామూలు గన్నుకి సరిపడని ఆరడుగుల బుల్లెట్టమ్మా వాడు. వాడొస్తే పెంట పెంట చేస్తాడని ఓపిక చేసుకుని నేనే వచ్చా..!” అంటూ బావురుమన్నాడు బొమ్మన్.
రావురమేషూ, నదియా కంగారు పడిపోయారు. రజిత పరుగుపరుగున మజ్జిగ తెచ్చిచ్చింది. బొమ్మన్ మజ్జిగ తాగడానికి స్ట్రా లేదా..? అని అడిగాడు.
అందరూ తనని విచిత్రంగా చూశారు. నందాల ఫ్యామిలీ ఫ్యామిలీ తేడా అని అర్ధం అయ్యింది.
“మీ కష్టం చూడలేను. ఇక్కడి కష్టాలు పడలేను. మనం మిలాన్ వెళదాం నాన్నా..! వాడి తింగరితనం తగ్గాలంటే,నాతింగరి కూతురిని ఇచ్చి పెళ్లి చేయడమే కరెక్టు..!” అంటూ నదియా ఇంతకాలం కూర్చుని తిన్నాక మిగిలిన ఆస్తులన్నీ పోసాని కృష్ణమురళి కి ఫాన్సీ రేటుకి అమ్మి సంసారం మొత్తాన్ని హేమా రఘుబాబులతో సహా మిలాన్ లో పుట్టింటికి షిఫ్టు చేసింది.
“ఇంతకాలం చేసుకున్న పాపానికి దీన్నొక్కదాన్నే నోరు మూసుకు భరించాను. ఆరోజు బులెట్ నా గుండెకి తగిలినా చస్తే దరిద్రం అంతటితో వదిలిపోయేది. ఇప్పుడు తన తండ్రీ, మేనల్లుడూ నాకు ఉమ్మడి మొగుళ్లయ్యారు దైవమా..!” అంటూ రోజూ మౌనంగా రోదించసాగాడు రావు రమేష్
Share this Article