.
Bhandaru Srinivas Rao ……. “అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ప్రవేశించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా గట్టిగా ప్రయత్నించి అనుమతి సంపాదించాను. ప్రెసిడెంట్ వెకేషన్ లో వున్నారు. అందువల్ల, శ్వేత సౌధంలో మీడియా వ్యవహారాలు చూసే ఒక ఉద్యోగిని మాటల్లో పెట్టి ‘ఓవల్ ఆఫీసు’ (వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ కార్యాలయం) ను కూడా చూసాను.
ఆయన కుర్చీ పక్కన రెండు బటన్లు కనిపించాయి. వొకటి నొక్కితే మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీయడానికి, రెండోది నొక్కితే అణు యుద్ధం ప్రారంభించడానికి అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు వీలుగా వాటిని అమర్చారని నాలో నేనే ఏదో వూహించుకుని ఆ విషయమే నా వెంట వచ్చిన ఆ తెల్ల పిల్లతో అన్నాను.
Ads
పెద్దగా వయస్సులేని ఆ అమ్మడు ఓ చిరునవ్వు నవ్వి ఇలా అంది. “ మీ ఊహల్నిఅలా అంతంత దూరం పోనివ్వకండి. ఆ ఎర్ర బటన్ నొక్కితే ప్రెసిడెంట్ కి కాఫీ కావాలని అర్ధం. పచ్చ బటన్ నొక్కితే బర్గర్ కూడా తీసుకు రావాలని సంకేతం.”
తెలియని విషయాలను గురించి మామూలుగా మామూలు మనుషులు వూహించుకునే తీరుతెన్నులపై, ఓ నలభై ఏళ్ళ క్రితం చదివిన ఈ జోక్, సియాటిల్ లోని ‘లేక్ వాషింగ్టన్’ (సరస్సు) లో ఓ ఆదివారం నాడు, ఆర్గోసి అనే ఒక పెద్ద మరబోటులో విహరిస్తున్నప్పుడు గుర్తుకు వచ్చింది. విశాలమయిన ఈ మంచినీటి సరస్సు కొన్ని మైళ్ల దూరం విస్తరించి వుంది.
నౌకావిహారంలో భాగంగా ఒక లేడీ గైడ్, చుట్టుపక్కల విశేషాలను మా అందరికీ ఎంతో ఆసక్తి కరంగా వివరిస్తూ, “అదిగో ఆ వొడ్డుపై చెట్ల గుంపు వెనక కనిపిస్తున్న సౌధాన్ని చూడండి. యావత్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడయిన వ్యక్తి అక్కడ నివసిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భవనం అది” అని చెబుతూ అందులోని విశేషాలను వర్ణించడం మొదలు పెట్టింది.
బిల్ గేట్స్ నెలసరి ఆదాయం, సరిగ్గా చెప్పాలంటే… చేసే వ్యాపారంలో అన్ని ఖర్చులు పోను మిగిలే నికర లాభం అన్నమాట, కొన్ని వందల కోట్లు వుంటుందని అంచనా. ఇంత డబ్బుగల ఆసామీ ఇల్లు ఎంత గొప్పగా వుంటుందో అని వూహించుకోవడం సహజమే మరి.
ఆ లేడీ గైడ్ చేయి చాపి చూపినవైపు చూపు సారించి చూస్తే, దూరంగా తీరం, ఎత్తయిన వొడ్డు, దానిపై వత్తుగా మరింత ఎత్తయిన వృక్షాలు, వాటి కొమ్మల మధ్య లీలగా కానవచ్చే ఓ భవనం, ఓస్ ఇంతేనా అనిపించింది.
బిల్ గేట్స్ నివాసం వున్న ప్రాంతం సియాటిల్ లో అతి ఖరీదయిన క్లయిడ్ హిల్ ఏరియా . అంత సంపన్నుడి ఇరుగూ పొరుగూ ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత వుండడం సహజం. అతగాడెవరో కాదు, ఒక సాధారణ పిజియో థెరపిస్ట్ అంటే నమ్మగలరా!
గేట్స్ నివాసం పక్కనే ఇల్లు కొనుక్కోవడం అతగాడికి ఎలా సాధ్యమయిందంటే, బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించిన కొత్తల్లో, అందులో కొన్ని షేర్లు కొన్నాడు. కాలక్రమేణా ఆ షేర్లు ఇంతింతై, వటుడింతై అన్నట్టుగా పెరిగిపోయాయి.
దానితో ఆ మామూలు డాక్టర్ కాస్తా, కోరిన కోరికలు తీర్చుకోగల పెద్ద ఆసామీ అయిపోయాడు. యెంతో డబ్బు గుమ్మరించి బిల్ గేట్స్ పొరుగునే ఇల్లు కొనుక్కుని కాలర్ ఎగరేసుకుని కాపురం ఉంటున్నాడు.
ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కాము… అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్. ఆ విమానం ఎక్కి కలియతిరిగే ఓ అపూర్వ అవకాశం లభించింది. అదీ పదిహేనేళ్ల కిందట.
ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలయిన మైక్రోసాఫ్ట్ , అమెజాన్, బోయింగ్ ప్రధాన కార్యాలయాలు సియాటిల్ లోనే వున్నాయి.
అప్పుడు ఇన్ఫోసిస్ తరపున బోయింగ్ విమానాల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్న మా అబ్బాయి సందీప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక అనుమతి పత్రాలతో ఒక రోజు బోయింగ్ కర్మాగారానికి వెళ్ళాము. అనేక వందల ఎకరాల విస్తీర్ణంలో వున్న ఈ ఫ్యాక్టరీని ప్రవేశ రుసుముతో సందర్శించే వీలుకల్పించారు.
ఎంతో భద్రత అవసరమయిన ఈ కర్మాగారాన్ని సందర్శించేందుకు ఉత్సాహపడే పర్యాటకులను ప్రవేశ రుసుముతో అనుమతించడం ద్వారా టూరిజంను వారు ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎవరైనా సిఫారసు చేస్తే అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ని, వాళ్ల పార్లమెంటును, కేపిటల్ హిల్స్ కూడా ఇదేవిధంగా సందర్శించే వీలు వుందని విన్నాను.
మిగిలిన సందర్శకులతో కలిపి మమ్మల్ని కూడా ప్రత్యేక బస్సుల్లో బోయింగ్ కర్మాగారం లోపలకు తీసుకు వెళ్లారు. అన్నీ చూపించి విషయాలను విశదపరిచేందుకు వెంట గైడ్లు కూడా వున్నారు.
అసలు బోయింగ్ విమానమే ఎంతో పెద్దగా వుంటుంది. అలాటిది వాటిని తయారు చేసే ఫాక్టరీ యెంత పెద్దగా వుంటుందో ఊహించుకోవచ్చు. విడి భాగాలను తయారు చేసి వాటినన్నిటినీ ఒకచోట చేర్చి విమానాన్ని నిర్మించే వివిధ దశలను మేము కళ్ళారా చూసాము.
అంతేకాకుండా బోయింగ్ విమాన నిర్మాణం ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపే డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. ఈ కర్మాగారం ఆవరణలోనే పెద్ద పెద్ద రన్ వేలతో కూడిన విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు.
రైట్ సోదరులు కనుక్కున్న తొలి విమానం నుంచి ఇంతవరకు తయారయిన అధునాతన యుద్ధ విమానాలు, ప్రయాణీకుల విమానాలు, సరకుల రవాణా విమానాలు, హెలికాప్టర్లు వుంచిన ఒక ప్రదర్శనశాల కూడా వుంది. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ‘ఎయిర్ ఫోర్స్ వన్’ పాత మోడల్ కూడా అక్కడ వుంది.
సందర్శకులు అందులోకి ఎక్కి కాక్ పిట్ తో సహా ప్రెసిడెంట్ కోసం విమానంలో ఏర్పాటు చేసిన పడక గది, సమావేశ మందిరం, పత్రికా విలేఖరులతో మాట్లాడే హాలు అన్నీ చూడవచ్చు. టెలిఫోన్, టెలెక్స్, కంప్యూటర్, ఇంటర్నెట్, టీవీ మొదలయిన అత్యాధునిక సమాచార పరికరాలన్నీ అందులో వున్నాయి.
అమెరికా ప్రెసిడెంట్ విమానంలోకి ఎక్కి అన్నీ చూడడం అన్నది నిజంగా ఒక మరపురాని అనుభూతి. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తూ వున్నానంటే, ఈ దేశంలో పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెప్పడానికే.
నిజానికి బోయింగ్ విమానాల కర్మాగారం రక్షణ అవసరాల దృష్ట్యా నిషేధిత ప్రదేశమయినా టికెట్లు పెట్టి మరీ ప్రజలకు చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఏటా ఎన్నో వేలమంది దీన్ని సందర్శిస్తూ వుంటారు….
Share this Article