ఆక్సిజన్ మాత్రమే కాదు, వేక్సిన్లే కాదు… డాక్టర్లందరూ ఆధారపడుతున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు ఇప్పుడు మరో ప్రధాన సమస్య… ప్రభుత్వాలకు ఎలాగూ కార్పొరేట్ హాస్పిటల్స్ మీద కంట్రోల్ లేదు, డ్రగ్ మాఫియా మీద అసలే లేదు… ఏదో అలా జనం కోసం ‘కఠిన చర్యలు తప్పవు’ అని ప్రెస్మీట్లలో చెబితే సరి… రెమ్‌డెసివర్ డ్రగ్ దోపిడీ ఎన్నిరకాలుగా సాగుతున్నదంటే… 1) హాస్పిటల్సే చౌకగా తెప్పించుకుని అడ్డగోలు రేట్లకు రోగులకు ఎక్కించేయడం… రోజుల తరబడీ ఇస్తున్నారు… 2) బయట కృత్రిమంగా కొరత సృష్టించి, బ్లాకులో విపరీతమైన ధరలకు అమ్మడం… కొన్నిచోట్ల ఒక్క వయల్‌కు 20 వేలు, 30 వేల వరకూ వెళ్తోంది ధర… 3) నకిలీ రెమ్‌డెసివర్ వయల్స్ కూడా అక్కడక్కడా బయట పడుతున్నయ్… అవీ సోషల్ మీడియాలో ఉదాహరణలు, ఫోటోలతో సహా చెబుతున్నారు నెటిజన్లు… 4) మరీ ఘోరం, ఒకచోట ఎవడో హాస్పిటల్ స్టాఫ్ రోగులకు ఇవ్వాల్సిన వయల్స్ ఖాళీ చేసి, వాటిలో మందు ఉన్నట్టే భ్రమింపజేయడానికి మినరల్ వాటర్ నింపేసి, వాటిల్లో నుంచి చోరీచేసిన డ్రగ్ వేరే వాళ్లకు అమ్ముకుంటూ పట్టుబడ్డాడు… రెమ్‌డెసివర్ జాడల్ని డాక్టర్లే చెబుతారు కొన్నిచోట్ల… తెలుసుగా, అంతా కమీషన్ల బాగోతమే…
కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా రోగుల అటెండెంట్లను తరుముతాయి… ఇది తీసుకురాపో, అది తీసుకురాపో, లేకపోతే రోగి ప్రాణాల మీద ఆశలు వదులుకో… మొన్న ఒక రోగి బంధువును ఇలాగే పరుగులు పెట్టించారు… అది టోసిలిజుమాబ్ (యాక్టెమ్రా) ఇంజక్షన్ కోసం… నమ్మశక్యం కాని అంశం తెలుసా..? సదరు రోగి కుటుంబం 40 వేల ధర ఉన్న ఒక్క ఇంజక్షన్ కోసం 3 లక్షలు పెట్టడానికి సిద్దపడింది… ఐనా దొరకలేదు… ఎన్నిరకాల సోర్సెస్ ఉపయోగించినా సరే..! అదీ ఓ స్మగుల్డ్ సరుకులాగా ఎవరో రహస్యంగా వచ్చి, డబ్బు తీసుకుని, ఇంజక్షన్ ఇచ్చి వెంటనే జారుకుంటారట… నిజానికి ఇది రోగికి మరీ అత్యవసర స్థితిలోనే వాడుతున్నారు… అసలు ఇది వాడొచ్చా లేదా అనే విషయంలోనే బోలెడు భిన్న వాదనలు, అభిప్రాయాలున్నయ్… ఐనా డాక్టర్లు తరుముతూనే ఉన్నారు… దొరికేవాళ్లకు దొరుకుతున్నయ్… పర్సులు మొత్తం ఖాళీ చేస్తూ…
Ads
నిజానికి సమస్య ప్రధానంగా ఆక్సిజన్ లెవల్స్ దగ్గర వస్తోంది… కరోనా వైరస్ ప్రభావమే ప్రధానంగా ఊపిరితిత్తుల మీద ఉంటుంది… ప్రస్తుత మ్యుటెంట్ ఇంకాస్త ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తోంది… ఆక్సిజన్ కోసం రోగులు హాస్పిటల్స్ వెళ్తున్నారు… మళ్లీ బెడ్స్ కోసం పైరవీ… ఒకసారి అక్కడ చేరగానే ఇక మందులు, పరీక్షల దోపిడీ ఎప్పుడూ ఉన్నట్టే… ఈసారి ఇంకాస్త ఎక్కువ మోతాదులో…! హాస్పిటల్ నుంచి ఎలాగోలా బయటపడతాం సరే… కానీ ఇంటి దగ్గర ఎందుకైనా మంచిది, ఆక్సిజన్ ఉండాలి ఎలా..? బయట దొరకడం లేదు… అందుకే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొంటున్నారు ఈమధ్య ఎక్కువగా… ఇప్పుడే ఇలా ఉంటే, వచ్చే నెలలో ఇక ‘సత్తెనాశ్’ అన్నట్టుగా మీడియా ప్రచారం ప్రారంభించింది… ఈ ఆక్సిజెన్, ఈ డ్రగ్స్, ఈ వేక్సిన్లు… దేవుడా…!!
Share this Article