Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెదరాయుడు… అప్పట్లో థియేటర్‌లో ఆ సినిమా చూడటమే ఓ థ్రిల్…

June 16, 2025 by M S R

.

" చొక్కా ఏదిరా"……. దాదాపు అరిచినంత పని చేశాను. టికెట్ల కోసమని పద్మవ్యూహంలో అభిమన్యుడిలా గుంపులోకి దూసుకెళ్లి బనియన్ తో, చేతిలో తడిసిపోయిన కలర్ పేపర్ ముక్కలతో బయటికొచ్చిన మా రెడ్డిని చూడగానే నా నోటి వెంట వచ్చిన మాటలవి.

ఒళ్లంతా చెమట కారుతోంది. సడన్ గా ఎవడైనా చూస్తే మైనింగ్ గనుల్లో పనిచేసే డైలీ లేబర్ అనుకుంటాడు. అలా ఉంది అవతారం. అయినా రిలీజైన పదో రోజు కూడా అంత రద్దీ ఏంటో నాకు అర్ధం కాలేదు. మేము వెళ్లిన థియేటర్ పేరు మెహబూబియా…

Ads

ఎప్పుడో మా తాతల కాలం నుంచే దానికి పెద్ద హిస్టరీ ఉందట. అందులోనే శివ, జగదేకవీరుడు అతిలోకసుందరి, నారి నారి నడుమ మురారి లాంటి సూపర్ హిట్లు అమ్మానాన్నాలతో కలిసి చూసినట్టు బాగా గుర్తు. ఏదో రాజు గారి బంగాళాలా మహా విశాలంగా ఉండేది. సీటింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ.

మూడు తరగతులు. నేల క్లాసు అప్పటికే కనుమరుగైపోయింది. అక్కడ బెంచీలు వచ్చేశాయి. అయినా హిట్టు టాకు వచ్చిన సినిమాకు అందరికీ సమాన హక్కులు అనే రాజ్యాంగసూత్రాన్ని అనుసరించి హాలు ఓనర్లు క్లాసు మాసు సంబంధం లేకుండా ఎంతమందొచ్చినా లేదనుకుండా లోపలికి పంపేవాడు.

ఇవాళ సినిమా చూడకపోతే ఈ జన్మే వృధా అనేలా చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకటే తోసుకుంటున్నారు. టికెట్ కౌంటర్ల దగ్గర మంద లోపలికి దూరి నలిగిపోతున్న వాళ్ళకు ఊపిరి ఎలా ఆడుతుందో ఎవడైనా చెప్పగలిగితే వాడికి సైంటిస్ట్ అయ్యే తెలివితేటలు ఉన్నట్టే.

డాన్సులు, మసాలా యాక్షన్ ఫైట్లు, ఐటెం సాంగులు ఇవేవి లేని ఓ పల్లెటూరి సినిమాకు ఇంత రష్షా. మోహన్ బాబు లాంటి హీరోకు భారీ కలెక్షన్లు వస్తున్నాయా. నా అనుమానాలను చట్టబండలు చేసే సాక్ష్యాలు కళ్ళముందు కనిపిస్తుంటే నేనేమంటాను. ఆ చిత్రరాజం పేరు ‘పెదరాయుడు’

===============
తొమ్మిదో తరగతిలోకి అడుగుపెట్టబోతున్న ప్రీ టీనేజ్ వయసు. సరిగ్గా మా బాస్ చిరంజీవి బిగ్ బాస్, పెదరాయుడు ఒకేరోజు విడుదలయ్యాయి. అప్పట్లో మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో జోకులేసుకునేవాళ్ళం. మెగాస్టార్ దెబ్బకు అపోజిషన్ హీరో కాస్తా ‘పేద’రాయుడవుతాడని కామెడీ చేసుకున్నాం. అది రివర్స్ అవుతుందని మాకేం తెలుసు.

అప్పటికే ఎంట్రన్స్ వైపు జనం పరుగులు చూస్తుంటే ఏదో ఒలింపిక్స్ జరుగుతున్నంత ఆత్రం పడుతున్నారు. మాకూ తప్పదని తెలుసు. ముందు వెళ్లిన వాడే రాజు. ఓవరాక్షన్ చేసి లేటుగా వెళ్ళామా అంతే సంగతులు. సీట్లకు నెంబర్లు ఉంటాయని తెలియని ఇన్నోసెంట్ ఊరు మా ఆదోని. అందుకే రన్నింగ్ రేస్ లో భాగం కావడం తప్ప వేరే ఆప్షన్ లేదు.

లోపలికెళ్ళాక గుండెలు జారిపోయాయి. ఒక్కటంటే ఒక్క సీటు లేదు. మొత్తం ఫుల్లు. వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదు. అటు చూస్తేనేమో స్క్రీన్ మీద నెమలి బొమ్మ పడిపోయి శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అని స్టార్ట్ అయ్యింది. ఇక లాభం లేదని మా గ్యాంగ్ మొత్తం ఏటవాలుగా ఉండే బాల్కనీ మెట్ల మీద వరసకు ముగ్గురు చొప్పున కూర్చున్నాం. హై స్కూల్ లో చేరాక మొదటిసారి బండల మీద ఆసీనులై అలా సినిమా చూడటం.

===============
గ్రామపెద్దగా పాపారాయుడు. ఆయనకో ఇద్దరు తమ్ముళ్లు. ఫోటో చూడగానే పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్న భారతితో పెద్ద తమ్ముడి డ్యూయెట్. ఇంట్రో సీన్ లోనే పవర్ ఫుల్ తీర్పిచ్చేశారు రాయుడు గారు. అప్పుడనిపించి అడిగాను

“అరేయ్ రెడ్డిగా, మనం తిన్నగా ఇంట్లో మమ్మీ డాడీ, స్కూల్ లో టీచర్ల మాటే వినము, అలాంటిది ఈ సినిమాలో ఓ పట్టు పంచె కండువా కట్టుకున్న ఈ రాయుడు లాంటోళ్ళ జడ్జ్ మెంట్ కి ఊరంతా గొర్రెల్లా అలా తలూపుతారేంట్రా”
వాడు చీకట్లోనే నావంక సీరియస్ గా చూసి
” నీ సోది ప్రశ్నలు ఆపి ముందు సినిమా చూడు. డిస్ట్రబ్ చేశావో నీ సైకిల్ తాళం నా వద్దే ఉంది. ఇట్టే విసిరేస్తా. వెతికేలోపు మీ తాతలందరూ దిగి వస్తారు”

అంతే నోటికి ఆటోమేటిక్ గా లాక్ పడిపోయింది. వాడు నిజంగా అన్నంత పని చేస్తే ఇంటికి నడిచి వెళ్ళాక నాన్న జరిపే బడిత పూజ గుర్తొచ్చి గమ్మునైపోయి సినిమా చూడటం మొదలుపెట్టా. రసవత్తరంగా సాగుతోంది. సెంటిమెంట్ తో విజిల్స్ కొట్టించడం ఈ ఆరవ సాంబార్ డైరెక్టర్లకు తెలిసినంత ఇంకెవరికి తెలియదేమో.

అది తమిళ మూవీ రీమేక్ అని తెలిసేంత పరిజ్ఞానం అప్పుడు లేదు కాబట్టి అదంతా రవిరాజా పినిశెట్టి, సత్యమూర్తిల స్వంత ప్రతిభ అనుకున్నా. ఏ మాటకామాటే కోటి పాటలు దుమ్ము లేపుతున్నాయి. మోహన్ బాబుకు పైసా డాన్స్ రాకపోయినా కెమెరామెన్ టాలెంట్ తో ఏదో స్టెప్స్ వేసిన భ్రమైతే కలిగించాడు.

అమ్మా భారతి… ఈ డైలాగుకి మేము పెట్టిన కేకలు అంతా ఇంతా కాదు. ఆ రిలేషన్ షిప్ కొటేషన్ మీద తర్వాత ఎన్ని జోకులు వేసుకున్నామో లెక్క లేదు. గుడి మెట్ల దగ్గర జయంతి కళ్ళు తిరిగి పడిపోతే మోహన్ బాబు ఆమెను తాకకుండా పూజారికి డాష్ ఇచ్చి నీళ్లు తాగించే సీన్ కి వాహ్ ఏం తీశాడురా అని అనుకోని ప్రేక్షకుడు లేడు. ఇక తన తప్పు తెలుసుకుని సౌందర్య మోహన్ బాబు కాళ్ళ మీద సన్నివేశానికి రెస్పాన్స్ మాములుగా లేదు. అలా అలా ఇంటర్వల్ వచ్చేసింది.

===============
లైట్లు పడక ముందే ఎవరైనా చూస్తే పరువు పోతుందనే భయంతో వెంటనే క్యాంటీన్ దగ్గరికి పరుగులు పెట్టాం. చప్పగా ఉందో పుల్లగా ఉందో లేక తీయగా ఉందో అర్థం కాకపోయినా ఏదో బిల్డప్ కోసం తాగుతున్న గోలి సోడా పట్టుకుని రజనీకాంత్ ఎంట్రీ గురించి ఆ తర్వాత రాబోయే సీన్ల గురించి చర్చలు మొదలెట్టాం.

అందరి దగ్గరా చిల్లర పోగేసి నాలుగు స్నాక్స్ ప్యాకెట్స్ కొనుక్కుని స్టార్ట్ అయ్యిందన్న సౌండ్ వినిపించాక లోపలికి వెళ్లి యధావిధిగా భూమాత ఏర్పాటు చేసిన ఆసనాల మీద కూర్చున్నాం.
అప్పుడు మొదలైంది తుఫాను.
"ఆపరా"

సౌండ్ బాక్సులు పగిలిపోయే రేంజ్ లో సాయి కుమార్ బేస్ వాయిస్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ. మాకు మాములు ఎనర్జీ రాలేదు. ఒక్కసారిగా కెవ్వుమంటూ జనంతో పాటు పెట్టిన కేకలకు గొంతు కాసేపు బొంగురు పోయింది. ఇది కదా కావాల్సిన కిక్కు అని ఎక్కడలేని ఉత్సాహం ఒంట్లోకి వచ్చేసింది.

అప్పటికే బాషా ఎఫెక్ట్ తో నేను చిరంజీవి తర్వాత రజనికే పెద్ద ఫ్యానైపోయా. పైన దేవుడి రథం ముందు జనంలా స్లోగా తిరుగుతున్న ఫ్యాన్ ని థియేటర్ వాడు ఆపేసినా గుర్తుపట్టలేనంత తన్మయత్వంలో మునిగితేలుతున్నాం. విలన్ చేసిన రేప్ సీన్ కేసు పాపారాయుడు కోర్ట్ కి హియరింగ్ కి వచ్చింది.

మా ఆనందం చెప్పలేను. తూటాల్లా పేలుతున్న డైలాగులకు ఓ రేంజ్ లో హాలు మొత్తం ఈలలు, కేకలు. వన్స్ మోర్ అని అరుస్తున్నాం కానీ అది అరణ్య రోదనే. మాములుగా పండలేదా ఎపిసోడ్. అలా చూస్తుండగానే పాపారాయుడుని వెనుక నుంచి కాల్చేశారు.

అంతే… ఒక్కసారిగా నిశ్శబ్దం… చుట్టపు చూపుగా వచ్చిన మా అత్తయ్య వంద రూపాయలు నాకిస్తే ఎందుకు చిన్నపిల్లాడికి డబ్బని మా అమ్మ వారించి బలవంతంగా వెనక్కు ఇప్పించినప్పుడు కలిగే ఎక్స్ ప్రెషన్ మళ్లీ ఇక్కడ కలిగింది.

===============
అరగంటకే రజనీకాంత్ ఎపిసోడ్ అయిపోయింది కానీ టికెట్ డబ్బులకు పూర్తి న్యాయం చేసింది మాత్రం తలైవానే అనుకుంటూ ఇక అక్కడి నుంచి రిలాక్స్ అవుతూ చూశాం. కదిలే కాలమా పాటకు ఒక్కొక్కళ్ళు తన్మయత్వంతో చూస్తున్నారు.

క్లైమాక్స్ వచ్చేసింది. తమ్ముడికి తప్పుడు తీర్పు ఇచ్చినందుకు పెదరాయుడు స్పాట్ లోనే పోయాడు. సెకండ్ రాయుడు డ్యూటీలోకి ఎక్కడం మేము లేచి పరుగున సైకిల్ సస్టాండ్ వద్దకు వెళ్లడం ఒకేసారి జరిగాయి.

ఆ తర్వాత ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా వేర్వేరు కారణాలతో పెదరాయుడుని థియేటర్లోనే నాలుగు సార్లు చూశా. ఈ రోజు పెదరాయుడు 30 ఏళ్ళు పూర్తి చేసుకుందని తెలిసి కాలం ఇంత వేగంగా కదిలిందా అనిపించింది. కానీ జ్ఞాపకాలు ఇంకా ఫ్రెష్ గా రివైన్డ్ కావడం నాకూ ఆశ్చర్యంగానే ఉంది. ఏది ఏమైనా నా సినిమా ప్రయాణంలో పెదరాయుడుది పాత్ర పెద్దదే…

చివరిగా ఒక్క మాట…… ” THE RELATION SHIP BETWEEN FB FRIENDS AND MOVIE POSTS SHOULD BE LIKE VILLAGE AND PALLE VELUGU BUS. BUT NOT LIKE VILLAGE AND METRO TRAIN ”
అర్థమైతే ఆదరించండి. అసలు అర్థమే లేదనుకుంటే ఇంకో సినిమా గురించి చెప్పే దాకా వెయిట్ చేయండి “…….. Ravindranath Sriraj

(ఇది నాలుగేళ్ల క్రితం పోస్ట్. ఈ సినిమాలాగా నాకు వ్యక్తిగతంగా క్లాసిక్ లాంటి రచన. కొత్త మిత్రుల కోసం రీ రిలీజ్ చేయడం జరిగింది..)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హహహ… ప్రోమో చూస్తేనే నవ్వొచ్చింది… భలే కామెడీ ప్రోమో బాసూ…
  • ప్రాభవం కోల్పోతున్న చై-నా… ప్రచారాలే తప్ప ఒకప్పటి ర్యాంకులేవి..?!
  • ఎర్ర బెండ మరీ అంత ధరా..? సర్వరోగ నివారిణా..? నిజమేనా..?
  • పెదరాయుడు… అప్పట్లో థియేటర్‌లో ఆ సినిమా చూడటమే ఓ థ్రిల్…
  • డియర్ శేఖర్ కమ్ములా… “ఎప్పుడూ నువ్వు నీలాగానే ఉండు…”
  • మన నిర్మల్ అబ్బాయే… అక్షరాలా చెట్లకు డబ్బులు కాయిస్తున్నాడు…
  • ఒకరిద్దరు సరిపోవడం లేదు… ఏకంగా కథలోకి ముగ్గురి ఎంట్రీ…
  • ఈ సినిమావాళ్లు ఇంతే… మానవ సహజ ఉద్వేగాలు అస్సలు పట్టవ్…
  • ఆ నాలుగు చానెళ్లపై కత్తి..! కేబుల్ టీవీల్లో కేవలం అస్మదీయ చానెళ్లే..!!
  • …. ఇకపై ఈ సర్కస్ ఫీట్ క్యాచులు చెల్లవు… అవి సిక్సులే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions