శవానికీ భరించలేనంత నొప్పి… శోకం… నిజమే… కావల్సిన రెమ్డెసివర్ మందు దొరకదు… బ్లాక్… మాఫియా… దొంగలు… హాస్పిటల్లో బెడ్ దొరకదు… పైరవీలు, ఒత్తిళ్లు, ప్రలోభాలు… బెడ్ దొరికినా ఆక్సిజన్ దొరకదు… ఆక్సిజన్ దొరికినా కావల్సిన ఇంజక్షన్లు దొరకవు… అంతకుముందు టెస్టింగ్ కిట్స్ దొరకవు… రిజల్ట్స్ రావు… చివరకు చస్తే గౌరవప్రదమైన అంత్యక్రియలూ దక్కవు… ఖర్చుకు భయపడి శవాల్ని వదిలేసి వెళ్తున్నారు శవాల బంధువులు… ఇదీ ఈనాడు ఫస్ట్ పేజీ స్టోరీ… పరిస్థితి తీవ్రత ప్రజెంటేషన్లో అంతగా ప్రతిఫలించలేదు కానీ రాసింది వాస్తవమే… పాజిటివ్ రిపోర్ట్ వస్తే తప్ప హాస్పిటల్లో చేర్చుకోరు, ఈలోపు సిట్యుయేషన్ సీరియస్ అయితే అది రోగి ఖర్మ… పాజిటివో, నెగెటివో రిపోర్ట్ సకాలానికి రాదు…
గౌరవప్రదంగా ఈలోకం విడిచివెళ్లడం శవాలకు ఉండే హక్కు… అనాథల్లా కాలిపోవడమో, ఖననమైపోవడమో హక్కుల ఉల్లంఘన… ఎహె, బతికినోళ్ల హక్కులకే దిక్కు లేదు, చచ్చినోళ్లకు హక్కులేందీ అంటారా..? శవంగా మారి తమ అయ్యనో, తమ అవ్వనో డబ్బుల్లేక, హాస్పిటల్ నుంచి తీసుకుపోలేక, చివరిసారిగా దండం పెట్టి కాట్లో కలిపేయలేని ఓ వారసుడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏమిటో… ఆధార్ కార్డు ద్వారానే కదా హాస్పిటల్లో జాయిన్ చేసుకునేది, చికిత్స ఇచ్చేది, అన్ని వివరాలూ రికార్డ్ అవుతూనే ఉన్నాయి కదా… చచ్చాక మళ్లీ పోలీసోళ్లు లేదా జీహెచ్ఎంసీ వాళ్ల నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ దేనికి..? ఆలోచించేవాళ్లు ఎవరు..? తెల్లారిలేస్తే భీకరమైన పత్రిక ప్రకటనలు తప్ప..!
Ads
అంబులెన్సుకు డబ్బులు, స్మశానవాటికలో డబ్బులు… ఒకవేళ సొంతూరికి తీసుకుపోదామంటే రెట్టింపు ఖర్చు… మరెలా చావాలి ఓ పేద బంధువు..? నిజానికి ఇది ఒక్క గాంధీ సమస్యే కాదు… చాలాచోట్ల ఉన్నదే… ఇంకా తీవ్రంగా కూడా ఉండి ఉండవచ్చు… మనం ఎన్నుకున్న ప్రభుత్వాల నిర్వాకం… మనమే అనుభవించాలి… దీన్నే కర్మఫలం అంటారు… సరే గానీ… ఇంకాస్త నిజాల్లోకి వెళ్దాం ఓసారి… ఇలాంటి వార్తల్ని ఖచ్చితంగా మెచ్చుకుందాం కానీ అదే సమయంలో, తమ గుండెల్లోనే దాచుకునే తీవ్ర స్థాయి వార్తల్ని కూడా చెప్పుకుందాం… ఒక కాటికాపరి లేదా ఒక అంబులెన్స్ డ్రైవర్ అవినీతి సరే… బెడ్లు, ఆక్సిజన్లు, మందులు దొరకని పాపిష్టి రోజులకు కారకులైన పాలకుల కమ్ దిమాకులూ సరే… కానీ అసలు రోగం మాటేమిటి..?
మంచినీళ్ల సీసా ధరకు వేక్సిన్ ఇస్తానన్నాడు భారత్ బయోటెక్ పెద్దమనిషి… సర్కారు నుంచి సాయం పొందాడు… తీరా ఏం చేశాడు..? ఏకంగా 1200 రూపాయల్ని ప్రకటించాడు… రాష్ట్ర ప్రభుత్వమైతేనేం, 600 కడితే టీకా ఇస్తానన్నాడు… అంతా తనిష్టమే… ప్రభుత్వం లేదు, పాలసీల్లేవు, ప్రశ్నించేవాడు లేడు… మరి ఈ దోపిడీ తీవ్రత ఎంత..? ఇవి రాయలేం… ఇదే ఈనాడుకు చుట్టం… మళ్లీ కోవిషీల్డ్ వాడు ధర తగ్గించగానే… పాపం, పోనీలే అనుకుని రాష్ట్రాలకు ఇచ్చే ధరను తగ్గించింది భారత్ బయోటెక్… ప్రజారోగ్య సంక్షోభం దృష్ట్యా ధర తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నామని ఓ ప్రకటన పారేశారు… ఎంత దయ..? ఏం ఔదార్యం..? ఏం సార్థకజీవనం..? ఎంత త్యాగం..? అబ్బబ్బ… సీరం వాడు అంతే, రేప్పొద్దున డాక్టర్ రెడ్డీస్ అంతే, హెటిరో అంతే… ఎవరూ తక్కువ కాదు, రెమ్డెసివర్ ధర కూడా అంతేగా… ఆ కంపెనీలు దయతో ఈమధ్య కాస్త తగ్గించుకున్నాయి కానీ ఆ ధరల మీద నియంత్రణ ఎవడికి ఉంది..? నిజానికి కరోనాకే కాఠిన్యం తక్కువ… వీళ్లందరితో పోలిస్తే… అది జస్ట్, చంపేస్తుంది… అంతే తప్ప చావు భయంతో వ్యాపారం చేయదు..!!
Share this Article