.
Subramanyam Dogiparthi …….. అగ్ని జమదగ్ని , అగ్గిపెట్టుందా !? ఈ సినిమా వచ్చినప్పుడు జనంలో మారుమోగిన ఊతపదాలు . ఆడోళ్ళతో సహా అందరూ అగ్గిపెట్టెల్ని మెయింటైన్ చేస్తారీ సినిమాలో . ఈ లైటర్ పార్ట్ పక్కన పెడితే సినిమా నిజంగా అగ్నిపర్వతమే .
అలాగే డబ్బుల లావా కురిపించింది . 12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . షిఫ్టులతో కొన్ని సెంటర్లలో సిల్వర్ జూబిలీ ఆడింది . ఒక చోట 225 రోజులు కూడా ఆడింది .
Ads
కృష్ణ కోసమే తయారుచేసిన కధ . తన తల్లికి ద్రోహం జరిగిందనే వ్యధతో తండ్రి మీద , తండ్రి కుటుంబం మీద కక్ష , ద్వేషాన్ని పెంచుకునే పాత్ర . సమాజ విద్రోహులను కొట్టి లేనివాళ్ళకు బదిలీ చేసే రాబిన్ హుడ్ పాత్ర .
ఈనాడు , ప్రజారాజ్యం వంటి సినిమాల్లో లాగానే అగ్నిగుండం పాత్ర . కృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపిన పాత్ర . కృష్ణకు ఇంత గొప్ప పాత్రని సృష్టించిన పరుచూరి బ్రదర్సుని మెచ్చుకోవలసిందే .
కృష్ణ ద్విపాత్రాభినయం . కృష్ణ తండ్రి పాత్రలోని జగ్గయ్యకు ఇద్దరు భార్యలకు ఇద్దరు కుమారులు ఒకే రూపంలో పుడతారు . వారిలో ఒకరు జమదగ్ని అయితే మరొకరు ఆ జమదగ్నిని అరెస్ట్ చేసేందుకు నియమించబడే యస్సై చంద్రం . చంద్రం పాత్రలో కూడా కృష్ణ బాగా నటించారు .
ఈ రెండు పాత్రల తర్వాత చెప్పుకోవలసిన పాత్ర విజయశాంతిదే . గ్లామర్+ రొమాన్స్+ మూడు రసాలు కలబోసిన పాత్ర . బాగా నటించింది . మరో కధానాయిక రాధ . గ్లామరుతో పాటు కూస్తంత కామెడీ కూడా పండించింది .
తర్వాత శారద పాత్ర . కాసేపే ఉన్నా ప్రేక్షకులు మరచిపోలేరు . విలన్లుగా రావు గోపాలరావు , నూతన్ ప్రసాద్ , ప్రభాకరరెడ్డి , అల్లు రామలింగయ్యలు .
పాపం ! సత్యనారాయణది కమేడియన్ పాత్ర . కాస్త అపహాస్యం కూడా అయిందని అనిపిస్తుంది . ఇతర ప్రధాన పాత్రల్లో జగ్గయ్య , అన్నపూర్ణ , పూర్ణిమ , నాగేష్ , సారధి , సాయికుమార్ , పి జె శర్మ , రాధాకుమారి , రావి కొండలరావు , ప్రభృతులు నటించారు . మాస్టర్ అర్జున్‌ని ప్రత్యేకంగా అభినందించాలి . బాగా నటించాడు .
ఈ సినిమా ఘన విజయానికి రాళ్ళెత్తిన వారిలో ముఖ్యులు సంగీత దర్శకుడు చక్రవర్తి , పాటల్ని వ్రాసిన వేటూరి , డాన్సులను కంపోజ్ చేసిన సలీం , పాటల్ని పాడిన బాలసుబ్రమణ్యం , యస్ జానకి , సుశీలమ్మలు .
ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ . రాఘవేంద్రరావు చాలా ఎఫెక్టివుగా చిత్రీకరించారు . రొమాంటిక్ డ్యూయెట్లన్నీ అదరగొట్టేసారు . ఈ గాలిలో ఎక్కడో అలికిడి పాటలో కృష్ణ ఫొటోని విజయశాంతి లవ్వాడుతూ పాడే పాటని చాలా రొమాంటిగ్గా తీసారు రాఘవేంద్రరావు .
ఫొటోలతో కూడా శృంగార రసాన్ని పండించగల దర్శకేంద్రుడు దొరకటం తెలుగు ప్రేక్షకుల అదృష్టం .
ఆ రోజుల్లో కృష్ణ అభిమానుల హుషారుకు పగ్గాలు లేని పాట వెయ్యి వెయ్యి చెయ్యి చెయ్యి నంబర్ వన్ . రాధ , కృష్ణల మీద ఉండే ఈ పాటలో కృష్ణ నలభై డ్రెస్సులు వేస్తాడు .
మరి అభిమానుల సంతోషానికి అవధులు ఉంటాయా !?
వీరిద్దరిదే మరో డ్యూయెట్ గోడ దూకి వచ్చాను చందమామ . వేటూరి ఏదయినా దూకిస్తాడు . మరో అల్లరి డ్యూయెట్ రావే ఇంగ్లీష్ రంభ . రాధ , కృష్ణలు కలిసి రావు గోపాలరావు , సత్యనారాయణలను గోల చేసే డ్యూయెట్ . బాగుంటుంది . వయ్యారాలు సింగారాలు గ్రూప్ డాన్స్ ఫక్తు రాఘవేంద్రరావు స్టైల్లో ఉంటుంది . వెరశి పాటలన్నీ సూపర్ డూపర్ .
సినిమా షూటింగ్ మద్రాస్ , హైదరాబాద్ , ఊటీలలో 30 లక్షల రూపాయల బడ్జెటుతో నిర్మించారు అశ్వినీదత్ . కనక వర్షం కురిసింది . వంద రోజుల ఫంక్షన్ మద్రాస్ తాజ్ కోరమాండల్‌లో జరిగింది . జమదగ్ని భవనం భారీ సెట్ చాలా ఇంపోజింగుగా ఉంటుంది . పద్మాలయా స్టూడియోలో వేసారు .
ఈ రౌద్ర , శృంగార , ఏక్షన్ , డ్రామా , మ్యూజికల్ , సెంటిమెంట్ సినిమా ఆరోజుల్లో చూడని వారు ఎవరూ ఉండరు . అప్పుడప్పుడు టివిలో కూడా వస్తుంటుంది . సినిమా యూట్యూబులో ఉంది .
చూడనివారు తప్పక చూడండి . పాటల వీడియోలను మాత్రం అస్సలు మిస్ కాకండి . కనుల విందుగా ఉంటాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article