.
మహేష్ భట్… ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు… బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు… వయస్సు 77 ఏళ్లు… మొన్న పుట్టిన రోజూ జరుపుకున్నాడు సంబరంగా… ఐతే ఓ కొత్త విషయం చెప్పాడు ఓ పోడ్ కాస్ట్‌లో…
అదీ బిడ్డకు సంబంధించిన ది పూజా భట్ షోలో… ఎంతవారలైనా, మూఢనమ్మకాలకు ఒక్కసారి లొంగిపోతే ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారని చెప్పే ఆసక్తికరమైన సంఘటన ఇది…
Ads
ఇరవై ఏళ్ల వయసులో.., తను చిత్రనిర్మాతగా సంఘర్షిస్తున్న రోజుల్లో.., అనేక సవాళ్ల నడుమ తన అదృష్టాన్ని మార్చుకోవడానికి ఒక తాంత్రికుడిని ఆశ్రయించాడు… చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలకు అలవాటే… విజయం వరించినన్ని రోజులూ ఎవరూ కనిపించరు…
కానీ అననుకూల పరిస్థితులు వస్తే మాత్రం ఇలా హఠాత్తుగా రకరకాల పూజలు, తాంత్రిక శక్తులలో పడిపోతారు… ఆ తాంత్రికుడు ఏవో సూచనలు చేశాడు… భవిష్యత్తులో పెట్టుబడి పెట్టబోయే వ్యక్తికి, అంటే ఇన్వెస్టర్‌కు మహేష్ భట్ ఏకంగా మనిషి మాంసం తినిపించడానికి ప్రయత్నించినట్లు వెల్లడించాడు…
తాంత్రికుడి దర్శనం
ఆ రోజుల్లో మహేష్ భట్‌తో పాటు కష్టాలు పడుతున్న ఆయన స్నేహితుడు అరుణ్ దేశాయ్ ఒక ప్లాన్‌తో వచ్చాడు… సినిమా ఫైనాన్షియర్‌ను కలిసేందుకు బీహార్‌లోని గయాకు వెళ్లాలి.., అయితే మార్గమధ్యంలో వారణాసిలోని తన గురువును కలుద్దామని అరుణ్ చెప్పాడు…
వారణాసిలో, ఆ తాంత్రికుడిని కలిసేందుకు పేద ప్రజలు క్యూలో ఉన్నారు… మహేష్ భట్ ఆరోజును గుర్తు చేసుకుంటూ.., “ఆయనో యువకుడు, తాంత్రికుడు, చేతిలో రమ్ బాటిల్‌తో నాట్యం చేస్తూ ఉంటాడు…” అని చెప్పాడు… తనను చూసిన వెంటనే, తాను అతని పద్ధతులను నమ్మడం లేదని ఆ తాంత్రికుడు ఇట్టే గ్రహించాడట… మరుసటి రోజు రమ్మని, తమకు పరిష్కారం చూపుతానని తాంత్రికుడు వారికి మాట ఇచ్చాడు…
‘మనిషి మాంసం’ ఇచ్చాడు
మరుసటి రోజు వెళ్లినప్పుడు, ఆ తాంత్రికుడు తన బీరువా తెరిచి, గుడ్డలో చుట్టిన ఒక వస్తువును తీశాడు… దానిలోంచి ఒక ముక్క తీసి, పుడీయా (పొట్లాం) కట్టి ఇచ్చాడు… ఇది ఘాట్ల నుండి తీసిన మనిషి మాంసం అని చెప్పాడు… ‘దీన్ని తీసుకెళ్లి నీకు డబ్బు పెట్టబోయే వ్యక్తికి తినిపించు, అతను నీకు డబ్బు ఇస్తాడు’ అని చెప్పాడు ఆ తాంత్రికుడు… అది తీసుకుని… ఆహా, ఓ ఖజానాకు తాళపు చెవి దొరికినట్టేనని అప్పుడు సంబరపడ్డామనీ భట్ చెప్పాడు…
పాన్‌లో కలిపి తినిపించారు
ఆ ‘మాంసం’ ముక్కను తీసుకుని, మహేష్ భట్, అరుణ్ దేశాయ్ గయా చేరుకున్నారు… అక్కడ ఒక జమీందార్‌ను కలుసుకున్నారు, ఆయన దోమతెర వెనుక కూర్చుని ఉండేవారు, చుట్టూ తుపాకులు పట్టుకున్న సెక్యూరిటీ ఉండేదని భట్ గుర్తు చేసుకున్నాడు…
ఆ ‘మాంసం’ ముక్కను అతనికి ఎలా తినిపించాలా అని ఆలోచించిన తర్వాత, వారికి ఒక ఉపాయం తట్టింది..: పాన్‌లో పెట్టి ఇవ్వడం…! తదుపరి సమావేశంలో, వారు ఒక పాన్ కొనుగోలు చేసి, అందులో ఈ ముక్కను పెట్టి, ఎలాగోలా బ్రతిమిలాడి ఆ జమీందార్‌ను తినేందుకు ఒప్పించారు… ఆ వ్యక్తి దాన్ని నోటి దగ్గరకు తీసుకువచ్చి, మెల్లిగా నమలడం ప్రారంభించాడు… పడిపోయిందిలే పిట్ట అనుకున్నారు భట్, తన మిత్రుడు…
ఫలితం శూన్యం
ఆ తర్వాత మహేష్ భట్ గయా నుండి వెనుదిరిగాడు… ఒక నెల తర్వాత, తన జీవితం మారబోతోందని నమ్మకంతో మహేష్ ఉత్సాహంగా ఉన్నాడు… కానీ, తన స్నేహితుడు అరుణ్‌ను కలిసినప్పుడు, ఆ మనిషి నుండి వారికి ఎలాంటి ఫైనాన్సింగ్ దొరకలేదనే విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు… తంత్రాలు, మంత్రాలు, ఈ అఘోరా టైప్ పూజలు ఫలించవనే కఠోర సత్యం అర్థమైంది తనకు..!!
Share this Article