Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ పే-ద్ద కథ… చిరంజీవి తొలి అడుగులు, ఆనాటి అవస్థల కథ…

October 5, 2025 by M S R

.

Director Vamsy  మంచి దర్శకుడే కాదు, మంచి రచయిత… ఎప్పటివో అంశాలను అలాగే గుర్తుపెట్టుకుని, అచ్చంగా మన కళ్ల ముందు కనిపిస్తున్నట్టుగా రాయగల కలం… మంచి ఫ్లో…

ఈమధ్య చిరంజీవి పునాది రాళ్లు సినిమా గురించి అందరూ రాశారు కదా… వంశీ అయిదేళ్ల క్రితమే రాసిన ఓ పోస్టు కనిపించింది… చిరంజీవికి దానికీ సంబంధం ఏమిటో మొత్తం చదివాక తెలుస్తుంది…

Ads

అది చదువుతుంటే… చిరంజీవి చెన్నైలో అవకాశాల కోసం శ్రమిస్తున్న ఆరోజుల్లో చెన్నై సినిమా వాళ్ల జీవితం కనిపించింది… మొత్తం సౌత్ సినిమా ఇండస్ట్రీకి అడ్డా చెన్నై… ఎందరెందరో సినిమా ఆకర్షణలో పడి, చెన్నై చేరి నానా యాతనలూ పడే రోజులు…

ఆ పోస్టు ఇక్కడ… యథాతథంగా… వంశీకి ధన్యవాదాలతో…



ఔను… మా కాంపౌండ్‌‌లో మర్డర్ జరిగింది.
కోడంబాక్కం కళ్యాణమంటపాన్ని ఆన్చివున్న ఆ రోడ్లో ముందు కొచ్చేస్తే కనిపించే ఆ ఒత్తవాడై స్ట్రీట్‌‌ డెడ్‌‌ఎండ్‌‌లో వుంది మా జాగ్‌‌తే రహో బిల్డింగ్.
బయటికి కనిపించదు. పచ్చటి రెండు గోడల మధ్య ఇనపగేటు దాన్ని తెరుచుకుని లోపలికెళ్తే కిందో యాభై పోర్షన్లూ, పైనో యాభై పోర్షన్లూ వున్న పేద్ద భవనం.

ఏ వూరూ పేరూ లేని ఆ కాంపౌండ్లో రకరకాల పన్లు చేసుకునే రకరకాల లోయర్ ఇన్‌‌కమ్ జనాలు. ఇంతకు ముందు నేనున్న లీలా నిలయం కూడా ఇలాంటిదిదే గానీ దీనికంటే పెద్దదీ, పాతదీ అది.
సరే, ఫస్ట్‌‌ఫ్లోర్లో కనిపించే ఆరు కామన్ బాత్రూముల తర్వాత మా పోర్షను. పక్కనే ఇడ్లీలు సావిత్రిగారి పోర్షను. ఆ తర్వాత ఎవరెవరోగానీ లాస్ట్‌‌ పోర్షన్లో ఫైటర్ రెడ్డి. స్టంట్ మాష్టర్ రాఘవులు గారి దగ్గర పర్మనెంటు ఫైటర్‌‌గా పనిచేసే ఆ రెడ్డిగారికో నలభై అయిదేళ్ళుంటాయి.

ఆ వేళ పొద్దుట గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెకుండే మలయాళీ టీచర్ జెన్సీ గబగబా వెళ్తా పళని సామి పోర్షన్‌‌ గుమ్మం లోంచి బయటికొచ్చిన రక్తం చూసి పెద్దగా కేక పెట్టి పడిపోయింది.
తలుపులు తెరుచుకునొచ్చిన జనం ఏంటీ ఏంటంటా మూగితే చూపించింది.
కిటికీ తలుపుతోసి చూస్తే లోపల నేలమీదేసినా పరుపు మీద పడున్న పళనిసామి శవం.

పరుగెట్టుకుంటా వెళ్ళి కోడంబాక్కం పోలీస్ స్టేషన్లో కంప్లయింటిచ్చేటప్పటికి విల్లీస్ జీపులో దిగిన పోలీసులు లోపల గెడేసున్న పచ్చరంగు చెక్క తలుపులు బద్దలగొట్టి తెరిస్తే గదంతా పాకి ఎండిపోయిన రక్తం. పొత్తి కడుపులో కత్తిపోట్లు….. ఆ పళనిసామి శవం పక్కనే పడున్న ఉల్లిపాయలు కోసుకునే కత్తి.
అడుగులో అడుగేసుకుంటా ఆ చిన్ని పోర్షన్లో కలతిరిగినా పోలీసులకి అది ఆత్మహత్యో, హత్యో అర్థంగాటం లేదు. దాంతో ఆ పోర్షన్ మెయిన్‌‌డోరు గొళ్ళెం పెట్టేసి దాని కేసిన తాళం కప్పకి సీలు వేసెళ్ళిపోయేరు.

***
పైనున్న మా పోర్షన్లో వున్న తన గది చాప మీద దొర్లుతున్న మా రూమ్మేటు రాజారెడ్డి కలల మీద కలలుకంటున్నాడు.
ఈ మధ్య ఒకటికాదు రెండు కాదు రకరకాల సినిమా కంపెనీల చుట్టూ హీరో వేషాల కోసం కల తిరిగిన మా రాజారెడ్డికి ఆనాక కబురు చేస్తాం, రేపు న్యూస్ చెపుతాం అంటా మాటిచ్చిన రకరకాల సినిమా కంపెనీల్లో తమిళం వాళ్ళే ఎక్కువున్నారు. అన్నీ కొత్త హీరోల్తో మొదలెట్టబోతున్న కంపెనీలే.
దాంతో మా వాడి కలలు మామూలుగా లేవు. అప్పుడే సినిమా బ్లాకండ్ వైట్‌‌ నించి కలర్‌‌కి మారుతున్న రోజులేమో మావాడి కలలు కూడా ఈస్ట్‌‌మన్ కలర్లోనే వున్నాయి.

***
మధ్యాహ్నానికి దిగిపోయిన క్రైం బ్రాంచ్ పోలీసులు, చాలా ఆవేశంగా ఇన్వెస్టిగేషన్ చేసేకా ఆ పళని సామిది ఆత్మహత్య కాదు హత్య అన్న డౌట్‌‌ని రైజ్ చేసి వెళ్ళిన కాసేపటికే ఎర్రటి పోలీస్ స్టిక్కర్ వేసున్న తెల్లటి అంబాసిడర్‌‌ కారులో దిగిపోయినా పెద్ద మనిషి మాంచి ఎత్తుగా పుష్టిగా వున్నాడు. చాలా దగ్గరకి ట్రిమ్ చేసి దువ్విన క్రాఫు, చిన్ని చిన్ని నీలంగళ్ళ షర్టు, కాకీ టెరికాటన్ పాంటూ, బ్రౌన్‌‌కలర్ బూట్లూ అడుగు తీసి అడుగేస్తున్న అతన్ని చూస్తుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి.

సి.ఐ.డీ అంట. నలుగురు కానిస్టేబుల్స్‌‌తో మా కంపౌండంతా కలతిరిగినతను “నో డౌట్ ఇది హత్యే. హంతకుడు ఈ కాంసౌండ్లోనే వున్నాడు” అంటా మెయిన్ గేటుగ్రిల్ దగ్గరకి లాగి చాలా పెద్ద తాళం కప్ప వేయించేసేడు.
ఈ కౌంపౌండ్లో వున్న ఆడా మగా, చిన్నా పెద్దా, ముసలీ ముతకా ఇలా ప్రతి ఒక్కళ్ళనీ ఎగ్జామిన్ చేసి ఆ హంతకుడో, హంతకురాలో ఆ మనిషిని పట్టుకుని అరెస్ట్‌‌ చేసేదాకా ఈలోపలి వాళ్ళు బయటికెళ్ళకూడదు. బయటి వాళ్ళు లోపలికి రాకూడదు. అంటా ఆర్డరేసేసేటప్పటికి ,ఉచ్చాపేడా బందయిపోయిన మాకేం చెయ్యాలో అర్థంగాటం లేదు.

ఇంక రెక్కాడితేగానీ డొక్కాడని ఆ లోయర్ మిడిల్ క్లాసు జనాల పరిస్థితి మామూలుగా లేదు.
ఆళ్ళందరి సంగతీ అలా వుంచితే వి. మధుసూదనరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా పనిచేస్తున్న నేను అక్కినేని నాగేశ్వర్రావూ, వాణిశ్రీ యాక్ట్ చేస్తున్న విచిత్ర జీవితం సినిమా షూటింగ్‌‌కి రేపు సాయంత్రం ట్రైన్లో హైదరాబాదెళ్ళాలి. చందమామా, బాలమిత్ర టైపు బొమ్మరిల్లూ, బాలానందం పత్రికల్లో బొమ్మలేసే మా ఇంకో రూమ్మేటు శ్రీకర్, అర్జంటుగా బయటికెళ్ళాల్సిన అవసరం.ఇంక కాబోయే హీరో రాజారెడ్డయితే చాలా అవస్థలు పడిపోతున్నాం.

ఈ సంగతి తెల్సిపోయిన కూరగాయల బండి ముత్తురాజూ, కిరాణా కొట్టు కర్పగం తాళమేసిన మా గేటు ముందే దుకాణాలు పెట్టేస్తుంటే ఆ ఇనప గేట్లోంచి చేతులు బయటపెట్టి కొనుక్కుంటున్నారు మా జనాలు.
కిబ్స్‌‌లుంగీ, కట్‌‌బనీనులో బయటికొచ్చి ఆ వాతావరణం చూసిన రాజారెడ్డి గిజగిజలాడిపోతా “ఓ సారేమయ్యిందో తెల్సా వంశీ?” అన్నాడు.
“ఏమయ్యిందీ?” అన్నాను చిరాగ్గా.

“బాపుగారి డైరెక్షన్లో వచ్చిన మన ఊరి పాండవులు సినిమా గుర్తుందా?” అన్నాడు.
“ చెప్పు?” అన్నాను.
“దాంట్లో వున్న అయిదుగురు కుర్రోళ్ళలో ఒక కుర్రోడి వేషానికి నన్ననుకుని, రిపబ్లిక్ గార్డెన్స్‌‌ (ఎన్టీ రామారావు గారు బేచిలర్‌‌గా వున్నప్పుడు అద్దెకున్న రూము)లో ఉంటున్నప్పుడు అక్కడి కొచ్చేరు నిర్మాత జయకృష్ణగారు. సరిగ్గా అదే టైముకి చిత్తూరు జిల్లాలో వున్న మా సొంతూరు మల్ల సముద్రం వెళ్ళడం వల్ల ఆ వేషం ఇంకెవడికో పోయింది” అంటా తెగ ఇదయిపోతుంటే “ఫ్లాష్‌‌బేక్ సరే ఇప్పుడేమంటావు?” అన్నాను.
“ఏమనడం లేదెహె ఈ గేటు తాళమేసెయ్యడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్సొస్తయ్యేమో నాకిస్తానన్న ఆఫర్సు ఇంకెవడికన్నా పోతాయేమో అని భయంగా వుంది” అంటా తెగ టెన్షన్ పడిపోడం మొదలెట్టేడా రాజారెడ్డి.

***
నాలుగు రోజులు గడిచిపోయినియ్యి. మా కాంపౌండులో సమస్యలు చాలా పెరిగిపోయినియ్యి. పళనిసామి మర్డర్ కేసు పెద్ద పెద్ద మలుపులు తిరిగిపోతుంది.
అమ్మన్ క్రియేషన్స్ అనే తమిళ సినిమా కంపెనీ వాళ్ళు మొత్తం కొత్తోళ్ళతో తీస్తున్న ఆ సినిమా కి హీరోగా ఇంటర్వ్యూ కెళ్ళిన రాజారెడ్డి ఆల్మోస్ట్‌‌ సెలక్టయి పోయేడు. ఇంకో సారి మీటయ్యి మాటాడుకున్నాకా ఫైనలైజ్ చేసేద్దాం…. ఇదిగో తెలుంగు తంబీ నువ్వే మా హీరోవి. మీ ఫ్రెండ్స్‌‌కి పార్టీ కూడా ఇచ్చేసుకోవచ్చు” అంటా నవ్వుతా సాగనంపేడా సినిమా డైరెక్టరు.

ఆ రాజారెడ్డి నోట్లోంచదంతా విన్న నేను “ఆ డైరెక్టర్ పేరేంటీ?” అన్నాను.
“భారతీరాజా అంట”
షాకయిపోయిన శ్రీకర్ “భారతీరాజా!!!” అన్నాడు. నేనైతే పెద్ద కేకేసేసేను.
మాషాకులూ కేకలూ విన్న రాజారెడ్డి “పిచ్చి కుక్క కరిచినట్టు ఏమయిందీ? ఎందుకలా అరుస్తున్నారు?” అన్నాడు.
“భారతీరాజా అంటే ఎవరనుకుంటున్నావ్?” అన్నాను.
“ఆ మధ్యో సినిమా తీసేడంట గదా” అన్నాడు రాజారెడ్డి.

“ఏడిసేవ్…. కమల్‌‌హాసల్, రజనీకాంత్, శ్రీదేవిలతో “పదనారువయదినిలే” అని చాలా చిత్రమైన సినిమా తీసిన డైరెక్టరా భారతీరాజా….ఐతే ఆ భారతీరాజా దగ్గర ఛాన్సొచ్చిందా నీకు?” అన్నాను.
“అవును ఇక్కడీ పోలీసులు చూస్తే బయటికెళ్ళనియ్యటం లేదు” అన్నాడు రాజారెడ్డి.
“మరేంటి మార్గం?” అన్నాను.
“మార్గమంటావేంటీ? ఈ పోలీసోళ్ళతో ఫైటింగ్ చేసన్నా సరే గేటు తాళం తీయిస్తాను చూడు” అంటా అరుపుల్లా ంటివి వినబడితే ఆ పక్కకి చూసేడు.

ఆ పోలీసోళ్ళ దగ్గర తేడాగా మాటాడేడని చావగొట్టేస్తున్నారా ఇడ్లీల సావిత్రి రెండో మొగుడ్ని.
“ఏరా! మా కండిషన్‌‌కి ఎదురు తిరుగుతా బయటికెళ్ళిరావాలంటా మా కానిస్టేబుల్స్‌‌ని బెదిరాస్తావా? చూడు నిన్నెలా బుక్ చెయ్యాలో అలా బుక్ చేసి పారేస్తాం” అంటుంటే బెదిరిపోయి భోరుమంటున్న సావిత్రి “ఆ మనిషినేం చెయ్యకండి మరెళ్ళడులే” అంటుంది.

***
రెండు రోజుల తర్వాత…….తాళమేసున్న మాగేటు ముందో నీలం రంగు అంబాసిడరాగింది.
అందులోంచి దిగిన వైదీ అనే ప్రొడక్షన్ మేనేజరు “యాక్టర్ రాజారెడ్డి కావాలి” అన్నాడు.
తన పేరు విని గేటు దగ్గరకి పరుగెట్టుకుంటా వచ్చేసిన రాజారెడ్డి “నేనే ఎవర్నువ్వు?” అన్నాడు.
విష్ చేసినా మేనేజరు “పోగాదే పచ్చక్కిళి అనే సినిమా ఆఫీసు నించొస్తున్నాను సార్” అన్నాడు.

“అలాగా…. ఆ సినిమా ఆఫీసుకి చాలా సార్లొచ్చి నా ఫొటోలిచ్చి వెళ్ళేను గదా?… రూపని హీరోయిన్ గా బుక్ చేసేమనీ, హీరోయింకా ఫైనలైజ్ కావాల్సి వుందనీ చెప్పేరు మీ ఆఫీసులో ….కదా?” అన్నాడు రాజారెడ్డి.
“అవును సార్… నాలుగు రోజుల్నించి మన ఆఫీసంతా మీ గురించే డిస్కషను. హీరోగా మిమ్మల్నే ఫైనలైజ్ చేసినట్టున్నారు. అర్జంటుగా తీసుకురమ్మని ఈ కారు ఇచ్చి పంపించేరు సార్” అన్నాడా వైదీ.

“ఔనా!!!” అంటా పరమానందంగా గంతులేసినా రాజారెడ్డి ఆ పోలీసులకేసి అదోలా చూస్తా” కానీ, ఈళ్ళిక్కడ్నించి కదలనీయడం లేదు వైదీ?” అన్నాడు.
“అసలోడ్ని కలిసి అడిగి చూడండి సార్” అనగానే ఆ సి.ఐ.డి ఆఫీసర్ దగ్గర కెళ్ళిన రాజారెడ్డి “నేను తమిళనాడులో కాబోయే సూపర్‌‌ స్టార్‌‌ని. నా కోసం మా సినిమా కంపెనీ నించి కారొచ్చింది. తాళం తీసి నన్ను బయటికి పంపించాలి మీరు” అన్నాడు.

“హంతకుడెవరో తేలే దాకా బయటికి పంపడం కుదరదు” అన్నాడా సి.ఐ.డి.
“అవతల నా కాల్‌‌షీటు పోతుంది.”
“కాల్ షీటు పోయినా సైకిల్ సీటు జారినా పంపడం అనేది కుదరదుగాక కుదరదు.
మాటా మాటాపెరిగేకా “రేపు నేను స్టార్ నయ్యేకా నీతో వార్ పెరుగుతుంది” అన్నాడు రాజా రెడ్డి.
“ఇలా పేలేడనే ఆ ఫైటర్ రెడ్డిని చావగొట్టింది”.
“ఆడు ఫైటింగ్స్‌‌లో డూపు, నేను యాక్టింగులో టాపు.
మాటా మాటా పెరిగినియ్యి. చాలా ఎక్కువగా నోరు చేసుకున్న మా రాజారెడ్డితో ఫైటింగ్‌‌. పచ్చడి చేసెళ్ళిపోయేడు తప్ప గేటు తీసి బయటికి పంపలేదా సి.ఐ.డి గారు.

***
ఇంకో వారమయింది.
పోలీసుల ఇన్వెస్టిగేషన్లో చాలా కొత్త కొత్త విషయాలు బయటపడ్డంతో మా కాంపౌండు మాకో వెడల్పాటి జైలయిపోయింది.
అర్జంటుగా రమ్మంటా భారతీరాజా కంపెనీ నించి కారొస్తే వాళ్ళ కాళ్ళావేళా పడ్డాడు రాజారెడ్డి. “నైటు మీ ఇంటికొచ్చి బట్టలుతుకుతాను,మీ మిసెస్ కాళ్లు నొక్కుతాను” అని కూడా అన్నాడు.
కుదరదంటే కుదరదన్నారు పోలీసులు.

ఆ రాత్రి రాజారెడ్డి, శ్రీకర్, సుదర్శన్‌‌రెడ్డీలతో పాటు కూర్చున్న నేను “సరిగ్గా, టైము చూసుకుని మరీ ఇన్ని ఛాన్సులొస్తున్నాయేంటీ ఈ రాజారెడ్డి గాడికీ?” అన్నాను.
బాలానందంలో బాలల కథకి బొమ్మేస్తున్న శ్రీకర్ తలమాత్రం తిప్పకుండా “మనం ఊరు వెళదామని బస్టాండ్లో నిలబడితే ఒక్క బస్సూ రాదు. ఒట్టప్పుడు మట్టుకి మనూరి బస్సులు మన పక్కనించే వెళ్ళి పోతుంటాయి.

ముందు నింబొచ్చేస్తుంటాయి. ఇప్పుడు మనోడి పరిస్థితి కూడా అలాగే వుంది” అంటుంటే బాత్‌‌రూమ్ కెళ్ళొచ్చి నీళ్ళు కొడ్తున్న ఇడ్లీల సావిత్రి నల్లకూతురు నళిని కరక్టే సుమా!” అన్నట్టు చూస్తుంది.

***
విజయా స్టూడియోలో వాచ్‌‌మెన్‌‌గా పనిచేస్తున్న పళనిసామి, మా కాంపౌండులో ఆడి పక్కపోర్షన్లోనే అద్దెకుంటున్న ఇదయిని అనే జూనియర్ ఆర్టిస్ట్‌‌ని చాలా హృదయంతో లవ్ చేస్తున్నాడు.
అతన్నే మాత్రం పట్టించుకోని ఆ ఇదయిని మనోబాలన్ అనే అసిస్టెంటు డైరెక్టర్ని వడపళని కుమరన్ కోయిల్లో పెళ్ళి చేసుకుంది.

అది తెల్సిన పళనిసామి చాలా పెద్ద సైజు కక్షే పెంచుకున్నాడా ఇదయిని మీద. నన్నింత హింస పెట్టిన ఆ మనిషి ఏ మాత్రం సుఖపడగూడదు. మర్డర్ చేసిందన్న నేరం మీద ఉరి శిక్ష పడాలి దానికి అనుకున్న పళనిసామి బాగా తాగేసి ఉలిపాయల కత్తి తీసుకుని పొత్తి కడుపులో కసాకసా మంటా పొడిచేసుకుని హత్య టైపులో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ కాంపౌండ్‌‌లో జనాన్ని రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసి, డిటెక్షన్ చేసిన పోలీసులకి ఇది తేల్చడానికి నెలా పదిహేను రోజులు పైనే పట్టింది.
ఇప్పుడు మా కాంపౌండు గేటు ఓపెన్ చేసేసిన పోలీసులు ఎవరిదారిన వాళ్ళెళ్ళొచ్చంటా వాళ్ళ దారిన వాళ్ళెళ్ళిపోయేరు.

***
ఆ వేళ తెల్లవారు ఝామున సుబ్బరాయనగర్ వేపెళ్ళిన నేను, నడుచుకుంటా తిరిగొస్తుంటే ఆ కోడంబాక్కం పవర్ హౌస్ గోడ మీద కొత్తగా అంటించున్న సినిమా పోస్టర్ చూసేను.
చాలా గట్టిగా కౌగిలించుకున్న ఆ కుర్ర హీరో హీరోయిన్ల ముఖాలు ఆ వెలుగు నీడల ఫొటోగ్రఫీలో సరిగ్గా కనపడి చావడం లేదు. కాస్త కూడ బలుక్కుంటా తమిళంలో ఉన్న ఆ సినిమా టైటిల్ చదవగలిగేను. “కిళక్కేపోగుం రెయిల్” అంటే తూర్పు వెళ్ళే రైలు అనర్థం. మ్యూజిక్ ఇళయరాజా, డైరెక్టర్ భారతీరాజా.

ఆ మధ్య మా రూమ్మేట్ రాజారెడ్డి కోసం కారు పంపిన ఆ కంపెనీ వాళ్ళ సినిమా పోస్టర్ ఇది….. అప్పుడే తీసేసేరా సినిమా? విక్రమ్ స్టూడియో పక్కనున్న కమలా దియేటర్లో ఇవాళే రీలీజు.
ఇంకోసారి ఆ పోస్టర్ చూసిన నేను ఆ కొత్త హీరోయినెవరో పసిగట్టలేకపోయేను గానీ హీరో మట్టుకి అప్పుడప్పుడూ మా రూమ్ కొచ్చి మా మధ్య చాపల మీద దొర్లే సుధాకర్ (తర్వాత కాలంలో బిషా) లాగ లేడూ?
మళ్ళీ చూసేను.
లాగేంటీ…. ఆ సుధాకరే.
అవును అచ్చం ఆ సుధాకరే.

పరిగెట్టుకుంటా మధ్యలో పడతా లేస్తా మా రూమ్‌‌లో కెళ్ళిన నేను, ఎప్పట్లాగే దొర్లుతున్న రాజారెడ్డిని లేపి చూసిన మేటర్ చెపితే ఆడిమెళ్ళో చెయిను తాకట్టెట్టేసి కమలా దియేటర్లో రిలీజైన ఆ సినిమాకెళ్ళి పోయేం.
ఆ కొత్తమ్మాయి రాధికతో కనీవినీ ఎరగని లవ్ సీన్లు, కొత్త కొత్త డ్యూయెట్లు సినిమాకి సూపర్ హిట్టు టాక్ వచ్చెయ్యడంతో హాలు బయట కొచ్చి బోర్లా పడిపోయినా రాజారెడ్డి ఇంటర్వెల్లన్న ఇవ్వకుండా ఒకటే ఏడుపు.
ఆ భారతీరాజా సినిమా కంపెనీ కెళ్తున్నప్పుడు తన పాత రూమ్మేటయిన ఈ సుధాకర్ కూడా వచ్చేవోడంట. ఆ మధ్య మర్డరైనప్పుడు తనెళ్ళలేక పోతే ఈడెళ్ళిపోయి హీరోగా ఫిక్సయిపోయేడన్నమాట.

***
ఆ తర్వాత భాగ్యరాజా “ఒరుకై ఓసై” లో కూడా వచ్చినట్టే వచ్చిపోయింది ఛాన్సు.
మళ్ళీ భారతీరాజా “నిళల్‌‌గళ్” సిన్మాలో ఈడెయ్యాల్సిన వేషం రవి అనే అతనేసి నిళల్‌‌గళ్‌‌ రవి అని పేరు తెచ్చేసుకున్నాడు.

***
ఆ వేళ పొద్దుట మా ఒత్తవాడై స్ట్రీట్‌‌లో పల్చగా తిరుగుతున్నారు జనం. మసీదుతెరు చౌదరీప్రెస్‌‌లో పనుండటం వల్ల పరుగెడతా వెళ్తున్నాడా బైండర్ కృష్ణారెడ్డి. గూడ్స్‌‌ రైలు కూతేసి నట్టరుస్తా వెళ్తున్నాడు కూరల బండి మురుగేసన్. డాబా మీద కడిగిన నీళ్ళు మీద పడ్తున్నాయంటా అరుస్తుందా దారమ్మటెళ్తున్న ముసలి మామియార్ .అయిదారుగురు కుర్రోళ్ళని కూరేసుకునొచ్చినా డొక్కు అంబాసిడర్ కారు మా గేటు ముందాగింది.

బయటికెళ్లున్న నన్ను వెనక్కి పిల్చినా కారు డ్రైవరు “అన్ని మెట్లెక్కలేను. కారొచ్చిందని మీ రూమ్మేటు రాజారెడ్డికి చెప్పవా?” అన్నాడు.
సరే అంటా పైకెళ్ళిన నేను చాప మీద దొర్లుతున్న రాజారెడ్డితో “నిన్ను పికప్ చేసుకోడానికి కారొచ్చింది రాజారెడ్డీ….లే” అన్నాను.
“ఏం లేస్తామెహె ఎదవ జీవితం” అంటా ఇంకో పక్కకి తిరిగి పడుకున్నాడా రాజారెడ్డి.

“ఇవ్వేళ ఎర్లీ మార్నింగ్ కాల్‌‌ షీటంట. కారులో చాలా మందున్నారు. అంతా మీ ఫీల్మ్‌‌ ఇన్స్‌‌ట్యూట్ స్టూడెంట్సే. లేవరా బాబూ” అంటా బతిమాల్తుంటే” ఏంటో ఎంతకీ కలిసిరాని ఎదవ జీవితం” అంటా దొర్లుతున్నాడు తప్ప లేవడం లేదా రాజారెడ్డి.
ఆ కారు దగ్గరకెళ్ళి జరిగింది చెపితే, ఒంచివదిలిన స్ప్రింగ్‌‌లా లేచిన అతను “అసలేమయింది మీ రూమ్మేటుకీ?” అన్నాడు.
“ఏ మాత్రం కలిసి రాకపోడంతో చాలా డల్లయిపోయేడు మా వోడు. అసలు బతకడమే దండగన్నట్టున్నాయి ఆడి మాటలు” అన్నాను.

నవ్వేసిన అతను నా భుజమ్మీద చెయ్యేసి చాలా హుషారుగా మా ఫ్లోరు మెట్లెక్కొచ్చి మా రాజారెడ్డిగాడి చాప ముందు చతికిలబడిపోయి “ఇదిగో రాజారెడ్డి! ఇలాంటప్పుడే ధైర్యంగా పోరాడాలి మనం. నిన్న రాత్రి నా జావాబండి పాడయ్యి నడుచుకుంటా వస్తుంటే వెంకట్‌‌నారాయణ రోడ్డులో నా కాలి చీలమండల దగ్గర చూడు ఎంత దెబ్బ తగిలిందో…. చూడు” అంటా చూపిస్తా “జరిగిందానికీ జరుగుతున్న దానికీ ఏ మాత్రం నిరాశ పడకుండా పగబట్టి మరీ కృషి చెయ్యాలి. అలా చేసి, చేసి మనదంటూ ఒక స్టైల్‌‌ని తయారు చేసుకుంటే ఈ లోకంలో మనకి తిరుగుండదు. మన దరిదాపుల్లోకి రావడానికి ఒకటే ఒణికిపోద్ది అపజయం…. తెలుసా…. కాబట్టిలే… లేచి రెడీ అవ్వు ముందు” అంటున్న అతన్నే రెప్పార్పకుండా చూస్తున్నాను.
అతను………..
ఆ తర్వాత కాలంలో మెగాస్టార్‌‌ అయిన చిరంజీవి…… వీళ్లంతా షూటింగ్ కెళ్ళాల్సిన ఆ సినిమా పేరు పునాదిరాళ్ళు….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…
  • కాంతారా చాప్టర్-1 … ఇది వనరుల దోపిడీ కథ… ఓ డిఫరెంట్ రివ్యూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions