Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

…. చివరకు దాసరితో కూడా యముడి వేషం వేయించేశారు…

March 13, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. తా మునిగింది గంగ , తా వలచింది రంభ . అయితే ఈ సినిమాలో హీరో ఏకంగా ఆ దేవనర్తకి రంభనే వలుస్తాడు . అనగనగా ఓ ఊళ్ళో ఓ రాంబాబు . అతని కలల రాణి రంభ . కలల్లో అలరిస్తూ ఉంటుంది . ఇంకేముంది ? ఆ రంభనే పెళ్ళి చేసుకుంటానని హఠం వేస్తాడు తల్లితో . ఆ రాంబాబుకి తన కూతురినిచ్చి పెళ్ళి చేయాలని మేనమామ గుంట కాడ నక్కలాగా మాటువేసి ఉంటాడు .

జగదేకవీరుడు సినిమాలో ఇంద్రకుమారిలాగా జలకాలాడటానికి రంభ భూలోకానికి వచ్చినప్పుడు బట్టలెత్తుకు పోతాడు రాంబాబు . ప్రేమిస్తే కాని దుస్తులు ఇవ్వనంటాడు . చేసేదేమి లేక సరే అంటుంది రంభ . ఆ ఊరి గుళ్లో పెళ్లి చేసేసుకుంటారు .

Ads

సువర్ణసుందరి సినిమాలోలాగా రంభ రాంబాబుకి ఓ వేణువుని ఇస్తుంది . దానిని వాయిస్తే వస్తానని చెపుతుంది . ఇంద్ర సభలో నృత్యం చేసేటప్పుడు రాంబాబు వదలకుండా వేణువుని ఊదటం , ఇంద్రుడికి మండటం , కోపోద్రిక్తుడు కావటం , వారివురు రోడ్ ప్రమాదంలో మరణించటం చకచకా జరిగిపోతాయి .

ఇప్పుడు రాంబాబు , రంభ యమలోకానికి పోయి యన్టీఆర్ దేవాంతకుడు , యమదొంగ యన్టీఆర్ లాగా , యమగోల యన్టీఆర్ , యముడికి మొగుడు అల్లరి నరేష్ లాగా యముడిని నానా తిప్పలు పెట్టి చనిపోయిన తల్లిని సతీ సావిత్రి లెవెల్లో బతికించుకుంటాడు . మిత్రోం ! ఇదంతా కల . వాళ్ళమ్మ వచ్చి చెట్టు మీద నుంచి దించి బలవంతంగా పెళ్లి పీటల మీద కూర్చోపెడుతుంది . అచ్చం రంభ లాగే ఉన్నమ్మాయిని పెళ్లి చేసుకోవటంతో సినిమా శుభాంతం అవుతుంది .

మనకు చాలా సోషల్ ఫేంటసీలు ఉన్నాయి . పెద్ద యన్టీఆర్ , చిన్న యన్టీఆర్ , చిరంజీవి , రవితేజ , అల్లరి నరేష్ , ఆలీలు ఈ ఫేంటసీలలో నటించారు . ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్ అయ్యాయి . ఈ సినిమా కూడా సక్సెస్ అయిందా..?

1956 లో తమిళంలో వచ్చిన Rambaian Kaadal సినిమా ఆధారంగా ఈ రంభ రాంబాబు నిర్మితమయింది . అప్పటి తమిళ సినిమాలో భానుమతి , తంగవేలు , నంబియార్ , ఇ వి సరోజ , అంబిక నటించారు . ఈ సినిమా ఆధారంగా నిర్మాతలు జి మట్టయ్య , యం యస్ ఆర్ ప్రసాద్ మన తెలుగు సినిమాను నిర్మించారు . హాస్య చిత్రాల బడి నుండి వచ్చిన రేలంగి నరసింహారావు కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వాన్ని నిర్వహించారు . గురువు దాసరి నారాయణరావు గారి చేత యముడి వేషాన్ని కట్టించారు కూడా .

సినిమాలో పాటలు కూడా బాగుంటాయి . మాధవపెధ్ది సురేష్ సంగీతాన్ని అందించారు . అంజలీదేవి , ఏయన్నార్ నటించిన సువర్ణసుందరి సినిమాలో పిలువకురా అలుగకురా అనే సముద్రాల వారి పాట గుర్తుండే ఉంటుంది . అలాంటి పాటే ప్రియతమా ప్రియతమా పిలవకుమా అనే పాట ఇంద్రసభలో చాలా బాగా చిత్రీకరించబడింది .

యన్టీఆర్ నటించిన దేవాంతకుడు సినిమాలో గో గో గో గోంగూర జై జై జై జైఆంధ్ర పాట లాంటిదే కూర కూర గోంగూర కాయ కాయ ఆవకాయ ఉంది . చిత్రీకరణ బాగుంటుంది . రంభ రంభ అంటూ డంబాలు కొడతాడు రాంబాబు , బాలామణీ రావే అంటూ సాగే పాటలు ఉన్నాయి .

పాటిబండ్ల ఆనందరావు మొదటిసారిగా ఈ సినిమాకు మాటలు , పద్యాలు వ్రాసారు . పాటల్ని ఆత్రేయ , ముళ్ళపూడి శాస్త్రి వ్రాసారు . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , మనో , శైలజ , లలితా సాగర్ శ్రావ్యంగా పాడారు .
రాంబాబుగా రాజేంద్రప్రసాదుకి ఈ పాత్ర కొట్టిన పిండే .

ప్రత్యేకంగా చెప్పుకోవలసింది రంభ పాత్రను వేసిన పారిజాత గురించే. మన తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించినట్లుగా లేదు. ఈ సినిమాలో ముద్దుముద్దుగా అందంగా నటించింది . యమునిగా దాసరి , నారదుడిగా చంద్రమోహన్ , చిత్రగుప్తునిగా రావి కొండలరావు , ఇతర పాత్రల్లో కాకినాడ శ్యామల , సుత్తి వేలు , శ్రీలక్ష్మి , సాక్షి రంగారావు , తదితరులు నటించారు .

ఇంద్రునిగా నటించిందెవరో నాకు తెలియదు . యన్టీఆర్ డైలాగ్ డెలివరీని ఇమిటేట్ చేసాడు . బాగానే ఉంది . రంభ , రాంబాబు నృత్యాలు ఏ జలపాతాల వద్ద తీసారో కానీ చాలా అందంగా ఉంటాయి . 1990 లో వచ్చిన ఈ సోషియో కామెడీ ఫేంటసీ యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే ఓసారి ట్రై చేయండి .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • …. చివరకు దాసరితో కూడా యముడి వేషం వేయించేశారు…
  • ‘‘మీరు శివం దూబె కదా… అయ్యో, నో, నో, అందరూ అలాగే పొరబడతారు సర్’’
  • అందరూ ప్రేమించారు… సీన్ కట్ చేస్తే… ఇప్పుడు థూత్కరిస్తున్నారు…
  • కసబ్ గాడి కళ్లల్లోకి చూస్తూ… ‘వీడే వాడు’ అని వేలెత్తి చూపిన నైటింగేల్…
  • కన్నడ వేణుస్వామి..! ఈ గ్యాస్ కష్టాల గురించీ ఎప్పుడో చెప్పాడు..!!
  • రాజా విక్రమార్క… ఒక వేట, ఒక బందిపోటు, ఒక అగ్గిబరాటా…
  • ఓ వైద్యుడి మానవత- ఓ పేద కూలీ నిజాయితీ… ఆహా; రుణానుబంధం…
  • రైట్ టు డై..! ఈ తీర్పు చెప్పేవేళ… ఆ జడ్జి కంటతడి ఎందుకంటే..?
  • నేను పావనిపుత్ర, నాట్ సరస్వతిపుత్ర… అనంతశ్రీరామ్ సెటైర్ ఎవరిపై..?
  • ఓ చిన్నమాట… చెలరేగిన సీపీఎం సోషల్ ఆర్మీ… చివరకు సీఎం క్షమాపణ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions