.
కొన్ని ట్రోలింగులు నవ్వు పుట్టిస్తాయి… ఆ ట్రోలర్ల క్వాలిటీ మీద కాదు, ఆ ట్రోలర్ల అజ్ఙానం మీద..! దురంధర్ రెండు భాగాల్లోనూ కథానాయిక యాలినా జమాలి పాత్రలో సారా అర్జున్… ఆమె వయస్సు జస్ట్ 20 ఏళ్లు… కానీ ఆ సినిమాలో కథానాయకుడు హంజా పాత్ర పోషించిన రణబీర్ సింగ్ వయస్సు తనకన్నా 20 ఏళ్లు పెద్ద… అంటే 40 ఏళ్లు…
ఠాట్, ఏమిటి ఈ జోడీ..? ఇంతగా వయస్సులో తేడా ఉన్నప్పుడు, ఆ కెమిస్ట్రీ ఏం పండుతుంది..? పైగా రణబీర్ బాడీ ఎదుట ఈ పిల్ల మరీ చిన్నపిల్లలా ఉంది… అంటూ ఒకటే ట్రోలింగ్… ఇంకా సాగుతోంది… ఆ ట్రోలర్ల అజ్ఙానం ఏమిటంటే..? సౌత్ ఇండియన్ టాప్ స్టార్లు 60, 70 ఏళ్ల వయస్సులోనూ… వీపులకు బద్దలు కట్టుకుని మరీ… తమకన్నా 30, 40 ఏళ్ల చిన్న వయస్సున్న పిల్లలతోనూ రొమాంటిక్ వెగటు స్టెప్పులు వేస్తున్నారని గుర్తించకపోవడం..!!
Ads
(రవితేజ తనకన్నా 34 సంవత్సరాల చిన్నదైన శ్రీలీలతో నీయమ్మని, నీయక్కని అని రోత పాటతో స్టెప్పులు వేశాడు… ఒక ఉదాహరణ… మరో పే-ద్ద 70 ఏళ్ల హీరో ఆమెతో ఐటమ్ సాంగ్ చేయాలని ఉబలాటపడిపోయాడు)…
అంతెందుకు..? షారూక్, సల్మాన్, ఆమీర్ వయస్సులు… వారి సరసన చేస్తున్న హీరోయిన్ల వయస్సుల తేడా చూడండి ఒకసారి… ఐనా ఇండియన్ సినిమాల్లో హీరోల వయస్సు పాతికేళ్ల దగ్గరే ఆగిపోతుంది, హీరోయిన్లే వేగంగా ముసలోళ్లు అయిపోయి… ఆ హీరోలకే వదినలు, తల్లులు అయిపోతుంటారు… ఇది రియాలిటీ… సరే, సారా అర్జున్ సంగతికి వద్దాం…
దురంధర్ రెండు పార్టులు చూసిన వాళ్లకు కూడా రణబీర్, సారా వయస్సులో తేడా ఏమీ ఆడ్‌గా కనిపించలేదు, కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది… దురంధర్ సీక్వెల్‌లో రెండుచోట్ల… 1) నువ్వు ఇండియన్ ఏజెంటువా అని రణబీర్‌ను ప్రశ్నిస్తున్నప్పుడు… 2) నిజం చెప్పు, నీ కొడుకును- నిన్ను వదిలేస్తాం, హంజా ఇండియన్ ఏజెంట్ కదా అని పాకిస్థానీ ఇంటలిజెన్స్ అధికారి ఆమెను నిలదీస్తున్నప్పుడు… భలే నటించింది ఆమె… గుర్తుండిపోయేలా…

ఇంతకీ ఎవరీమె..? రాజ్ అర్జున్ అని టీవీలు, వెబ్ సీరీస్‌లు, అడపాదడపా సినిమాల్లో నటుడి బిడ్డ… ఏడాదిన్నర వయస్సు నుంచే నటి… యాడ్స్, సినిమాలు… తెలుగులో కూడా దాగుడుమూతల దండాకోర్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మనమరాలు… విక్రమ్ సినిమా నాన్నలో కూడా నటించింది… పొన్నియన్ సెల్వన్ రెండు భాగాల్లోనూ నటించింది… తమిళం లేదా హిందీ… అవే ఆమె పనిచేసే భాషలు…
యాలినా జమాలి పాత్ర కోసం సారా అర్జున్‌ను ఎంపిక చేయడం వెనుక ఉన్న కథను కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా ఇటీవల వెల్లడించాడు… ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ పాత్ర కోసం చాలా మంది ప్రముఖ నటీమణులు, వేలాది మంది కొత్తవారు ఆడిషన్ ఇచ్చారన్నాడు…
‘‘‘చిత్రనిర్మాతలు మొదటి నుంచీ ఒక కొత్త ముఖాన్ని, అంటే పరిశ్రమలో బలమైన నేపథ్యం లేని వారిని తీసుకోవాలని స్పష్టంగా నిర్ణయించుకున్నారు… అప్పుడే ఆ పాత్ర సహజంగా, హంజా తనే ఆమె ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నట్లుగా అనిపిస్తుందని వాళ్లు భావించారు..’’’
ముఖేష్ ఛబ్రా సారా ఆడిషన్ క్లిప్‌ను దర్శకుడు ఆదిత్య ధర్‌కు పంపినప్పుడు, ఆయన వెంటనే ఆమె ఎవరని అడిగాడు…. ఆమె చిత్రరంగంలో కొత్త అయినప్పటికీ, బాలనటిగా సినిమాల్లో, ప్రకటనల్లో నటించిందని తనకు చెప్పాడు ముఖేష్… మరీ చిన్నపిల్లలా కనిపిస్తుందేమోననీ డిస్కషన్ జరిగింది… చివరికి, కథ అవసరాలకు ఆమె సరిగ్గా సరిపోతుందని, వయస్సు కంటే ఆ ‘క్యారెక్టర్ ఆర్క్’ ముఖ్యమని చిత్ర బృందం భావించింది…
రణబీర్ సింగ్ లాంటి ఎనర్జిటిక్ హీరో పక్కన ఆ చిన్నపిల్లలాంటి రూపమే ఒక ప్రత్యేకమైన ప్రొటెక్టివ్ బాండింగ్‌ను క్రియేట్ చేసింది…. అది ఆ కథకు అవసరం కూడా… ప్రేక్షకుల కోసం ఆ ఆడిషన్ క్లిప్ త్వరలో విడుదల చేయాలని సినిమా టీమ్ భావిస్తోందట...
Share this Article