.
Bhavanarayana Thota …. రామర్ కథ కంచికి చేరలేదు.. కానీ తెరకెక్కింది …. (రెండో భాగం) ….రామర్ పిళ్ళైని ఎలాగైనా ఒప్పించి ఒప్పందం చేసుకోవాలని చాలామంది తహతహలాడుతూ ఉన్నారు. ఒకవైపు అతని పెట్రోల్ అసలు పెట్రోలే కాదన్న ప్రచారం కూడా మొదలైంది. ఇది గిట్టనివాళ్ళ పని అంటూ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నాడు రామర్.
నేను వార్త నుంచి జెమినీకి మారాను. అయినా, ఇతగాడి వార్తలు ఫాలో అవుతూనే ఉన్నా. ఒకరోజు గిరీష్ సంఘీ గారి నుంచి ఫోన్. అర్జెంటుగా కేంద్ర మంత్రి ధనుష్కోటి ఆదిత్యన్ ఫోన్ నెంబర్ కావాలని. 1996 ఎలక్షన్స్ లో పీవీని ధిక్కరించి కాంగ్రెస్ నుంచి బైటికొచ్చి పార్టీ పెట్టిన మూపనార్, చిదంబరం లాంటి నాయకులను అనుసరించిన వాడు ధనుష్కోటి ఆదిత్యన్.
Ads
20 కి 20 ఎంపీ స్థానాలు గెలుచుకున్న తమిళ మానిల కాంగ్రెస్ ప్రతినిధిగా ఆయన కేంద్ర కాబినెట్ లో ఉన్నారప్పుడు. సంఘీ గారికి ఆయన నెంబర్ అవసరమేంటో అప్పుడు అర్థం కాలేదు. అదేమీ పట్టించుకోకుండా.. నెంబర్ ఎవరి దగ్గర దొరుకుతుందా అని ఆలోచించా. డీఎంకే మంత్రి టీఆర్ బాలు కూతురు మనోన్మణి గుర్తొచ్చింది. అప్పుడామె సన్ టీవీలో రిపోర్టర్. అక్కడే పనిచేసే కెమెరామన్ ను ప్రేమపెళ్లి చేసుకుంది. ఆమెను అడిగితే వెంటనే ఇచ్చింది. సంఘీ గారికి పంపించా.
తరువాత తెలిసిన విషయమేంటంటే.. రామర్ పిళ్లైని మంత్రి ధనుష్కోటి ఆదిత్యన్ బలవంతంగా తనవైపు లాక్కున్నారని. ఈ సంగతి తెలిసి ఆయనతో బేరసారాలకు దిగాలన్న ఆలోచనతో నెంబర్ సంపాదించారని. ప్రభుత్వంలో ఉండటం, తమిళనాడు వాడై ఉండటం వల్ల ఆదిత్యన్ బలమేంటో సంఘీకి అర్థమైంది. అందుకే ఆయనతో రాజీపడ్డారు. అంటే.. రామర్ పిళ్లై ని ఇద్దరూ పంచుకున్నారన్నమాట.
- ఈ కథ ఇలా నడుస్తూ ఉండగానే రామర్ పిళ్లై కోసం చాలామంది ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. ఎవరికి వాళ్ళు డబ్బు ఆశ చూపిస్తూ ఉండటంతో ఒకరికి తెలియకుండా ఇంకొకరి దగ్గర పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకుంటూ ఎడాపెడా అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెడుతూ వచ్చాడు రామర్.
అసలు రామర్ తయారుచేసింది పెట్రోల్ కానే కాదని కొన్ని లాబ్స్ ఇచ్చిన రిపోర్ట్స్ మీద చర్చ మొదలైంది. ఒప్పందం చేసుకోలేదని, ఇలా ప్రచారం చేస్తున్నారంటూ రామర్ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కేంద్ర ప్రభుత్వ శాఖ అతనికి ఇవ్వజూపిన ప్రోత్సాహకాన్ని వెనక్కు తీసుకుంది. తమిళనాడులో కరుణానిధి ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది.
ఒక యువకుడు పెట్రోల్ కనుక్కుంటే అంతర్జాతీయ స్థాయిలో కుట్ర చేసి తొక్కేస్తున్నారంటూ స్వదేశీ జాగరణ్ మంచ్ లాంటి సంస్థలు రామర్ ను వెనకేసుకొచ్చేందుకు విఫలయత్నం చేశాయి. ఇంకోవైపు అతని మీద చిన్న చిన్న కేసులు కూడా నమోదవుతూ వచ్చాయి.
ఈ దశలో ముందుకు వెళ్ళటం అనవసరమనే అభిప్రాయానికొచ్చారు గిరీష్ సంఘీ. అన్ని లెక్కలూ వేసుకున్నారు. అప్పటివరకూ పెట్టిన పెట్టుబడి పోయినా పరవాలేదు గాని, అలాంటి మోసగాణ్ణి నమ్మినందుకు ఎగతాళి పాలవుతానని గ్రహించారు. ఏమైతేనేం సంఘీ రిటైర్డ్ హర్ట్.
తన అధికార పదవిని మాత్రమే పెట్టుబడిగా పెట్టిన ధనుష్కోటి ఆదిత్యన్ పైసా నష్టం లేకుండా బైటపడ్డారు. (2004లో చివరి ఎన్నిక సహా ఐదుసార్లు తిరునెల్వేలి నుంచి ఎంపీగా గెలిచిన ఆదిత్యన్ 2006 లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. భార్య చనిపోగా, ఈయన ఎడమ చేయి పోయింది. ఆ తరువాత పోటీ చేకపోయినా, మళ్ళీ కాంగ్రెస్ లో చేరి పార్టీ పనుల్లో చురుగ్గా ఉంటున్నారు)
నమ్మినవాళ్ళందరితో ఒప్పందాలు చేసుకుంటూ, పెట్రోల్ కంపెనీల నుంచి రహస్యంగా కొన్ని రసాయనాలు తెప్పించుకుంటూ మోసాలు చేస్తున్న అభియోగాల మీద సీబీఐ విచారణ జరిపింది. కేసు పెట్టింది. మూడు కోట్లకు పైగా మోసం చేసినట్టు ఆధారాలు సేకరించింది. రామర్ పిళ్ళైకి మూడేళ్ళ జైలు శిక్ష పడింది.
1996 లో మొదలైన ఇతగాడి మోసం బైటపడి శిక్షపడటానికి పదేళ్ళు పట్టింది. కానీ జైలు నుంచి వచ్చాక కూడా అతడి ధోరణి మారలేదు. ఇప్పటికీ తాను మూలికల పెట్రోలు తయారీదారుడిననే చెప్పుకుంటున్నాడు. అయితే, పెట్రోల్ అనే మాట వాడకూడదని కోర్టు చెప్పటం వల్ల ‘మూలికల ఇంధనం’ అంటున్నాడు.
- రామర్ పిళ్లై ప్రహసనం మొదలై ఇప్పటికి 30 ఏళ్ళు. ఈ మధ్యనే ఒక ఎంపీ కూతురితో ఒప్పందం చేసుకున్నాడు. ఫాక్టరీ పెట్టబోతున్నట్టు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళిద్దరూ చెప్పారు. కానీ మీడియా ప్రశ్నలకు సూటిగా జవాబివ్వలేదు. సీబీఐని రామర్ తిట్టిపోశాడు. జనం సంగతెలా ఉన్నా, అతనికి అతను నిజమని నమ్మటమే ఆశ్చర్యకరం.
చాలా ఆసక్తి కరమైన విషయమేంటంటే రామర్ పిళ్లై గురించి జీ 5 ఒక వెబ్ సిరీస్ తీసింది. దాని పేరు ‘ద్రవం’. 2019లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి.
రవి ప్రకాశం అనే ఒక సాధారణ శాస్త్రవేత్త మూలికలతో పెట్రోల్ తయారు చేస్తానని చెప్పి సంచలనం సృష్టించడం, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే చమురు మాఫియా, రాజకీయ నాయకుల కుట్రలను చూపిస్తూ రామర్ పాత్రను ఈ సిరీస్ గ్లోరిఫై చేస్తుంది. ఇందులో రామర్ (రవిప్రకాశం) గా నటించింది హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న. వెబ్ సిరీస్ చూడాలనుకునేవాళ్ళు ఈ లింక్ లో చూడవచ్చు. https://www.zee5.com/web-series/details/thiravam/0-6-1702 – తోట భావనారాయణ
Share this Article