.
Subramanyam Dogiparthi …. జంధ్యాల మార్క్ హిలేరియస్ మూవీ . ప్రముఖ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారి నవల సంపూర్ణ గోలాయణం ఆధారంగా నిర్మించబడింది 1991 సెప్టెంబరులో వచ్చిన ఈ ప్రేమ ఎంత మధురం సినిమా . ఈ టైటిల్ కన్నా ఆ టైటిలే బాగుందేమో ! లేదా ప్రేమ గోలాయణం అని పెట్టినా ఇంకా బాగుండేదేమో ! ఏమో ! కథంతా గోల గోల..
స్క్రీన్ ప్లే , మాటలు , దర్శకత్వం జంధ్యాల గారివి . షూటింగ్ అంతా విశాఖపట్టణం . ఆయనకు సెంటిమెంట్ కూడా కదా ! కధ ఏమిటంటే : నరేష్ నిరుద్యోగి . తండ్రి రాళ్ళపల్లి ఉద్యోగం చేయాలని విసిగిస్తూ ఉంటాడు . ఉద్యోగం కోసం పట్నం వచ్చి ఓ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదిస్తాడు . అతనితో పాటు ఉద్యోగానికి వచ్చిన అచ్యుత్ (ఇదే మొదటి సినిమా) కూడా సెలక్ట్ అయి ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు .
Ads
కంపెనీ ఓనర్ మహర్షి రాఘవ నరేషుతో ఓ పందెం కాస్తాడు . నెల రోజుల్లో హీరోయిన్ మయూరిని ప్రేమించేలా చేసుకుంటే మేనేజరుగా ప్రమోషన్ , స్కూటర్ ఇస్తానంటాడు . తన తండ్రి స్నేహితుడు గొల్లపూడి మారుతీరావు ఇంట్లో మకాం . పక్కింట్లో కోట శ్రీనివాసరావు . ఆయన కూతురే హీరోయిన్ మయూరి .
గొల్లపూడి కూతురు వరలక్ష్మి అచ్యుతుని , కోట కొడుకు సినిమా పిచ్చోడు బ్రహ్మానందం శిల్పను ప్రేమిస్తారు . నరేష్ వన్ సైడ్ లవ్ సాగుతూ ఉంటుంది . తన ప్రేమను తెలియపరుద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో మహర్షి రాఘవకు తనకు నిశ్చితార్థం అయిందని చెప్పి బాంబు పేలుస్తుంది . మరో అమ్మాయితో ప్రేమాయణం నిర్వహిస్తున్న రాఘవని ఉతకటం , ఆ క్రమంలో నరేషుకి దెబ్బలు తగలటం , హీరోయిన్ మయూరికి నరేష్ మీద ప్రేమ కలగటం , వారు ఒకటి అవటం , మూడు జంటలు పెద్ద వారికి చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకోవటంతో సినిమా శుభాంతం అవుతుంది .
ఇంత తేలిగ్గా ఏం ఉండదు సినిమా . జంధ్యాల మార్క్ మలుపులు , నవ్వులు పువ్వులు , లంకె బిందెల కోసం కోట తిప్పలు , వాటిని కనిపెట్టిచ్చే సైంటిస్టుగా సుత్తి వేలు , నరేష్ చేత రోడ్లు కార్లు కొలిపించటాలు వంటి హాస్యగుళికలు చాలా ఉంటాయి .
మూడు జంటలతో పాటు కోట శ్రీనివాసరావు , డబ్బింగ్ జానకి , గొల్లపూడి , రాళ్ళపల్లి , కళ్ళు చిదంబరం , ధమ్ , మిశ్రో , జిత్ మోహన్ మిత్రా , గుండు హనుమంతరావు , సుత్తి వేలు , మరెంతో మంది ఔత్సాహికులు నటించారు .
విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో సిరివెన్నెల వారి పాటలను బాలసుబ్రమణ్యం , వాణీ జయరాం , చిత్ర , శైలజ , మాధవపెద్ది రమేష్ శ్రావ్యంగా పాడారు . అహహా మా పెళ్ళంట ఒహొహో మా పెళ్ళంట , శ్రీకారంలా కదిలే అనురాగము , ఓరయ్యో ఓరయ్యో , శ్రీకరి వదనం , చిలిపి వలపు అంటూ సాగే పాటలు బాగుంటాయి . శ్రీకరి వదనం పాట , చిత్రీకరణ , హీరోయిన్ మయూరి శాస్త్రీయ నృత్యం అద్భుతం . లొకేషన్ ఎక్కడో కానీ చాలా బావుంది .
It’s a romantic , hilarious , entertaining love story . కుర్రాళ్ళ ప్రేమ సినిమా . ప్రేమకు కుర్ర , ముసలి ఉండవనుకోండి . ప్రేమ ఎప్పుడూ మధురమే . సినిమా యూట్యూబులో ఉంది . హాస్యప్రియులకు నచ్చుతుంది …

- ఇక్కడ హీరోయిన్ మయూరి (మయూరి కాంగో) గురించి కొన్ని సంగతులు… 1995లో సినిమా ఎంట్రీ… ఈ ప్రేమ ఎంత మధురం సినిమాతోపాటు వంశీ అనే మరో సినిమా చేసింది, అంతే… అందుకెే తెలుగువాళ్లకు ఎక్కువగా తెలియదు…
- ఆమెకు ఈ సినిమా కెరీర్ ఏమాత్రం నచ్చలేదు… 2003లో ఆదిత్య ధిల్లాన్ అనే ప్రవాస భారతీయుడిని వివాహం చేసుకుని అమెరికా వెళ్ళింది… అక్కడ న్యూయార్క్‌లోని సిటీ యూనివర్శిటీ (Baruch College) నుండి మార్కెటింగ్, ఫైనాన్స్‌లో MBA చేసింది… గూగుల్ ఇండియా (Google India) లో ఇండస్ట్రీ హెడ్… 2025 ఆగస్టు నాటి తాజా సమాచారం ప్రకారం, ఆమె Publicis Global Delivery (PGD) సంస్థకు CEO…
Share this Article