.
Subramanyam Dogiparthi …. ఈ సినిమాకు మాకు ఓ బంధం ఉంది . ఈ ‘ప్రార్థన’ సినిమాలో చాలా భాగం షూటింగ్ మా గుంటూరులోనే జరిగింది . సినిమాకు హీరో సురేష్ కూడా ఒక భాగస్తుడు . మరి గుంటూరు ఎందుకు ఎంపిక చేసుకున్నారో నాకు తెలియదు . సినిమా ట్రూప్ అంతా హోటల్ విజయకృష్ణ ఇంటర్నేషనల్లో మకాం . విజయకృష్ణ హోటల్ అంటే ఇప్పుడు వికాస్ హాస్పిటల్స్ . ఆ హోటల్ ఓనర్ వి సి ఆర్ రెడ్డి , GM గంధం కృష్ణ నాకు మిత్రులు .
సినిమాలో ఓ మధ్య తరగతి కుటుంబీకుడి ఇల్లు అవసరం అయింది . మా మిత్రులు 5/9 బ్రాడీపేటలోని మా ఇంటిని సురేషుకు సజెస్ట్ చేసారు . సురేష్ , వాళ్ళ ట్రూపుని తీసుకుని మిత్రుడు కృష్ణ మా ఇంటికి వచ్చారు . అయితే వాళ్ళకు సెట్ కాక మరో ఇంటిని ఎంపిక చేసుకున్నారు .
Ads
అంతే కాదు, మా T.J.P.S. కళాశాలకు కూడా ట్రూపంతా వచ్చింది . నా ముందు ప్రిన్సిపాల్ సుబ్బారావు గారికి సినిమా వాళ్ళను కాలేజీకి తీసుకుని రావటం , విద్యార్థులకు చూపటం సరదా . ఎవరు తీసుకుని వచ్చారో నాకు గుర్తు లేదు కానీ మా కాలేజీకి వచ్చారు . సభికులలో మొదటి వరుసలో నేను ఉన్నా . వేదిక మీద నుండి హీరో సురేష్ నన్ను గుర్తు పట్టి వేదిక ముందుకొచ్చి విష్ చేసాడు . అలా 1991 లో వచ్చిన ఈ ప్రార్ధన సినిమాతో మాకో బంధం ఏర్పడింది .
ఇంక సినిమాకొస్తే చక్కటి ఎమోషనల్ మూవీ . నువ్వే కావాలి , మన్మధుడు , మల్లీశ్వరి , జై చిరంజీవ వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన కె విజయ భాస్కరు ఈ సినిమాకు దర్శకుడు మాత్రమే కాదు, కధ , స్క్రీన్ ప్లే , మాటలు కూడా ఆయనవే . చాలా ఎమోషనల్ కధను ఎన్నుకున్నారు .
హీరో ఓ తాగుబోతు , జులాయి మెకానిక్ . అతని వద్ద ముగ్గురు కుర్రాళ్లు పనిచేస్తుంటారు . మంచి ఫ్రెండ్స్ కూడా . ఆ ఊళ్ళో ఓ డబ్బున్న వారమ్మాయి తన కారు రిపేరుకు అతని షెడ్ వద్దకే వస్తుంటుంది . మెకానిక్ తండ్రి ఒకప్పుడు వాళ్ళ దగ్గర సిన్సియరుగా పనిచేసిన ఉద్యోగి కావటంతో హీరోతో కాస్త చనువుగా కూడా ఉంటుంది .
ప్రేమలోకి జారుతారు . షెడ్లో పనిచేసే కుర్రాళ్ళతో కూడా కలిసిమెలిసి ఉంటుంది హీరోయిన్. తండ్రికి ప్రేమ గురించి చెపుతుంది . ఆయన అంగీకరిస్తాడు కూడా . ఇంతలో ఆయనకు గుండె ఆపరేషనుకు డబ్బు అవసరం రావటం , ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉండటం వలన ఇష్టం లేకపోయినా ఓ డబ్బున్న వాడిని హడావుడిగా రిజిస్టర్ మేరేజి చేసుకుంటుంది .
హీరో దేవదాస్ అయిపోతాడు . హీరోయిన్ ఓ కూతురిని కని చనిపోతుంది . చెడ్డ తండ్రి ఒక లేడీని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు . కూతురిని పనిమనిషిగా చూస్తూ హింసిస్తూ ఉంటారు . ఆ హింసను భరించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయిన పాప అనుకోకుండా హీరో సురేష్ వద్దకు చేరుతుంది . హీరోకి , అతని ఫ్రెండ్సుకి ఆ పాప సురేష్ మాజీ ప్రేయసి కూతురు అని తెలిసి ప్రేమ ఆప్యాయాలతో చూసుకుంటూ ఉంటారు .
ఇంతలో ఆ పాపకు ఆస్తి వస్తుంది . ఆ ఆస్తి కోసం చెడ్డ తండ్రి పాపను చంపించేందుకు కిరాయి రౌడీలను పెడతాడు . వారి బారి నుండి హీరో కాపాడటం , క్లైమాక్సులో పాపకు ఎమర్జెన్సీ ఆపరేషన్ అవసరం పడటం , విలన్ల ప్లానులను ఛేదించి హీరో పాపను కాపాడుకుంటాడు . పాప బతికి బయటపడటంతో సినిమా శుభాంతం అవుతుంది . ఇదీ టూకీగా కధ .
ఇది దర్శకుడు విజయ భాస్కర్ సినిమా అనే చెప్పాలి . చక్కటి ఎమోషనల్ కధకు బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకుని పకడ్బందీగా లాక్కెళ్లాడు సినిమాను . సినిమాకు మంచి సంగీత దర్శకుడు కూడా దొరికాడు . పేరు దేవేంద్రన్ . తమిళ తంబి . తెలుగులో ఇదే మొదటి సినిమా . పాటలకు శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . బేక్ గ్రౌండ్ మ్యూజిక్కుని ప్రత్యేకంగా అభినందించాలి . ఫైట్లకు కూడా శాకాహార బేక్ గ్రౌండ్ మ్యూజిక్కుని అందించారు . ఇప్పటి దర్శకులు , సంగీత దర్శకులు ఈ సినిమా మ్యూజిక్కుని చూడాలి .
సిరివెన్నెల వారు పాటల్ని బాగా వ్రాసారు . ముఖ్యంగా ఎద నట్టింటిను మెట్టిందొక మధు కధ నర్తించెను చాలా శ్రావ్యంగా పాడారు బాలసుబ్రమణ్యం , జానకమ్మ . దేహం దేహం దేహం దూరం పెంచే డ్యూయెట్ బాగుంటుంది . జోరులో బజారులో కుర్రకారు జారు వేళలో అంటూ పాట కూడా బాగుంటుంది .
హీరో ఫ్రెండ్స్ పాపతో ఆడుకుంటూ పాడే పాట చిన్ని చిలకలా వరాల చిట్టి తల్లి వెన్నెలొలికెరా బాగుంటుంది . పాపమెరుగని పాప కదిలి పదవమ్మా విషాద గీతం బాగుంటుంది . బాలసుబ్రమణ్యం , జానకమ్మ , సురేష్ మాజీ భార్య అనితారెడ్డి పాటల్ని పాడారు .
సినిమాలో కీలక పాత్ర పాపదే . పాత్ర పేరు జ్యోతి . నటించిన పాప పేరు కూడా జ్యోతే . బాగా నటించింది . మెచ్చుకోవలసిందే . హీరోయినుగా అంజలి నటించింది . అంజలి అంటే వకీల్ సాబ్ సినిమాలో అంజలి కాదు . తర్వాత పెద్దగా కనిపించినట్లు లేదు . హీరోయిన్ మైనస్సే సినిమాకు .
ఇతర ప్రధాన పాత్రల్లో చారుహాసన్ , ధర్మవరపు సుబ్రమణ్యం , బెనర్జీ , చాలామంది ఔత్సాహికులు నటించారు . వాళ్ళ పేర్లు కూడా మనకు తెలిసినవి కావు .సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . ఎమోషనల్ మూవీ …
- ఈ సినిమాలో నటించిన అంజలి కడమ్ పెద్దగా సినిమాల్లో అవకాశాలు సంపాదించుకోలేదు… సినిమాలు మానేశాక ఏం చేస్తుందనే వివరాలు కూడా ఎవరికీ తెలియవు…
Share this Article