Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దొంగ మొగుడిలాగే రౌడీ అల్లుడు… పక్కా చిరంజీవి మార్క్…

April 17, 2026 by M S R

.
Subramanyam Dogiparthi ….. స్విట్జర్లాండులో షూటింగ్ జరుపుకున్న మొదటి తెలుగు సినిమా 1991 అక్టోబరులో వచ్చిన ఈ రౌడీ అల్లుడు సినిమా . చిరంజీవి కుటుంబ సభ్యులే నిర్మాతలు . బావమరిది అల్లు అరవింద్ , తోడల్లుడు డా కె వెంకటేశ్వరరావు , బావగారు పంజా ప్రసాద్ . మరి ఆయనకు కూడా షేర్ ఉందేమో !

చిరంజీవి విజయ పరంపరలో మరో అధ్యాయం , ఫుల్ వినోదాత్మకం చిత్రం ఈ రౌడీ అల్లుడు . 56 సెంటర్లలో యాభై రోజులు , 21 సెంటర్లలో వంద రోజులు అడింది . వంద రోజుల ఫంక్షన్ నెల్లూరులోని మాగుంట సుబ్బరామిరెడ్డి గారి అర్చన థియేటర్లో జరిగింది .

చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన మరో సినిమా . రాముడు భీముడు , ఇద్దరు మిత్రులు , గంగ మంగ వంటి డబుల్ ఫోజ్ సినిమాల్లోలాగానే ఈ సినిమాలో కూడా ఇద్దరు చిరంజీవులలో ఒకరు కోటీశ్వరుడు , వ్యాపారవేత్త కళ్యాణ్ ; మరొకరు ఆటో జానీ . కళ్యాణ్ అల్లుడిని చేసుకుని ఆస్తి అంతా కొట్టేయాలని కాచుకు కూర్చొని ఉంటాడు గుంటనక్క మేనమామ కోట శ్రీనివాసరావు , ఆయనకో తోక అల్లు రామలింగయ్య .

Ads

అప్పటికే వ్యాపారాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని అలర్ట్ చేసే పాత్రలో మేనేజర్ జె వి సోమయాజులు . అనుకోకుండా కళ్యాణ్ లాగానే ఉన్న ఆటో జానీ తారసపడటం , అతన్ని కళ్యాణ్ లాగా దించేయటం చేస్తారు కోట , అల్లు . ఈ వ్యవహారం అంతా తెలిసిపోయి ఇద్దరు చిరంజీవులు ఘర్షణ పడటం , అసలు మేటర్ అర్థం కావటం , ఫ్రెండ్స్ అయిపోతారు .

ఇంతలో కళ్యాణుని సోమయాజులు హత్య కేసులో ఇరికించి జైలుకు పంపటం , అతన్ని కాపాడేందుకు ఆటో జానీ రంగం లోకి దుమకటం , కోట శ్రీనివాసరావు కూతురు దివ్య భారతి సాయం చేయటం , కళ్యాణ్ ఆఖరి నిమిషంలో గవర్నర్ గారి స్టాప్ ఆర్డర్లతో ఉరి కంబం నుండి బయటపడటంతో సినిమా శుభాంతం అవుతుంది .
ఇదీ టూకీగా కధ .

సినిమా మధ్యలో అప్పుడప్పుడు దొంగ మొగుడు సినిమా చూస్తున్నామా అనే అనుమానం వస్తూ ఉంటుంది . సినిమా అంతా సరదా సరదాగా లాగించేసారు దర్శకుడు రాఘవేంద్రరావు . ఆటో జానీ పాత్రలో చిరంజీవి అల్లరికి ధీటుగా దివ్య భారతి కూడా బాగా అందమైన అల్లరి చేస్తుంది .

మరో చిరంజీవికి జోడీగా , సోమయాజులు కుమార్తెగా శోభన హుందాగా , చక్కగా నటించింది . విలన్ రంజిత్ కుమార్ పాత్రలో కెప్టెన్ రాజు , గుంటనక్కలుగా కోట శ్రీనివాసరావు , అల్లు, కోటీశ్వరుడు చిరంజీవి తల్లిదండ్రులుగా సత్యనారాయణ , అన్నపూర్ణమ్మ , అక్క బావలుగా సుధ , చక్రపాణి నటించారు . ఇతర పాత్రల్లో బ్రహ్మానందం , రాధాకుమారి , ఐరన్ లెగ్ శాస్త్రి , డిస్కో శాంతి  తదితరులు నటించారు .

చిరంజీవి సినిమా అంటే ఆటలు , పాటలు , ఫైట్లు … పుష్కలంగా పెట్టారు రాఘవేంద్రరావు . బప్పీ లహరి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ ఊపేస్తాయి . భువనచంద్ర మూడు పాటల్ని , సిరివెన్నెల వారు మూడు పాటల్ని వ్రాసారు . సినిమా నిడివి పెరిగిందని ఒక పాటను తీసేసారట .

భువనచంద్ర వ్రాసిన అనకాపల్లి బుల్లెమ్మా నీకేం కావాలా అంటూ సాగే పాట డిస్కో శాంతి , చిరంజీవిల మీద హుషారుగా ఉంటుంది . ఆయన వ్రాసినవే మరో రెండు డ్యూయెట్లు చిరంజీవి , దివ్య భారతిల మీద . ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు , లవ్ మీ మై హీరో మజాగా అంటూ సాగుతాయి .

దివ్యభారతి

సిరివెన్నెల వారు వ్రాసిన చిలుకా క్షేమమా కులుకా కుశలమా శోభన , చిరంజీవిల మీద చాలా క్లాసుగా ఉంటుంది . ఆయన వ్రాసిన మరో రెండు డ్యూయెట్లు దివ్యభారతి , చిరంజీవిల మీద హాటుగా ఉంటాయి . కోరి కోరి కాలుతుంది ఈడు ఎందుకో , తద్దినకా తప్పదికా ధీంతనక తగ్గదిక అంటూ సాగుతాయి . ఈ రెండో పాటలో ప్రాస బాగుంటుంది .

డాన్సుల్ని ప్రభుదేవా చిరంజీవి లెవెల్లోనే కంపోజ్ చేసారు . పాటల్ని బాలసుబ్రమణ్యం , చిత్ర , రాధిక హిట్ చేసారు . ఫైట్లను విజయన్ కంపోజ్ చేసారు . రాఘవేంద్రరావు సినిమా అంటే పాటల్ని ఊపేసేలా చూపించాలి కదా ! కె యస్ హరి ఫొటోగ్రఫీ డైరెక్టరుగా ఆ పని పూర్తి చేసారు .

చిరంజీవి హిలేరియస్ సినిమాలలో ఏదో ఒక take away ని ఆశిస్తారు ప్రేక్షకులు . అలాంటి take away ఈ సినిమాలో బాక్సులు బద్దలవుతాయి అనే ఆటో జానీ ఊతపదం . కధతో పాటు డైలాగులను వ్రాసిన సత్యానంద్ చిరంజీవి అభిమానులకు ఈ take away ని ఇచ్చారు .

ఈ మాస్ మసాలా సినిమా యూట్యూబులో ఉంది . అప్పుడప్పుడు టివి చానల్సులో వస్తూ ఉంటుంది . చిరంజీవి అభిమానులు చూడకుండా ఉండే ప్రసక్తే లేదు . టైం ఉన్నప్పుడు మళ్ళా చూడొచ్చు . అర్ధాంతరంగా దివికేగిన దివ్యభారతి అభిమానులు మాత్రం తప్పక చూడాలి . చాలా అల్లరి చేస్తుందీ సినిమాలో .

టబు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • … మూలిగే తెలంగాణ బీజేపీపై కన్నడ తేజస్వి సూర్య పోటు…
  • ఎవరి కోసం ఈ సీట్ల పెంపు..? ప్రజలకు ఏం ప్రయోజనం..?
  • నాటి పారుపల్లి రామకృష్ణయ్యే శంకరాభరణం శంకరశాస్త్రి…
  • దొంగ మొగుడిలాగే రౌడీ అల్లుడు… పక్కా చిరంజీవి మార్క్…
  • అవునూ… హఠాత్తుగా ఈ కులగణన తెరపైకి తెచ్చారెందుకు భయ్యా..?!
  • చైనాలో ఏం జరుగుతోంది..? వంద మంది సైనిక జనరల్స్ గల్లంతు..?
  • ఒమర్ అబ్దుల్లా తెలివైనవాడు… సమయస్పూర్తి ప్రదర్శించాడు…
  • కథ రాసేవాడికి చూసేవాడు లోకువ… ఫాఫం, రోజా ఫస్ట్ ఫిలిమ్ కథ ఇదే…
  • 77 వయస్సులో… 55 ఏళ్ల నాటి… ఓ ప్రేమ- పెళ్లి మురిపెం కథ…
  • సీఎం రేవంత్ రెడ్డి ఇది తప్పకుండా చదవాలని కోరుకుంటూ..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions