.
మొన్న సీనియర్ సినిమా విశ్లేషకులు ‘దోగిపర్తి సుబ్రహ్మణ్యం’ రాసిన అక్కమొగుడు సినిమా రివ్యూ షేర్ చేస్తున్నప్పుడు అందులో ఆకర్షించిన ఓ పదం మిన్మిని… ఇది ఓ సింగర్ పేరు… స్వతహాగా మలయాళీ… అసలు పేరు పి.జె. రోసలిన్… ఒక మధుర స్వరం…
సరిగ్గా మీకు గుర్తురావాలంటే ఓ ఉదాహరణ… రోజా సినిమాలో చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ పాట పాడింది ఆమే… అప్పట్లో సూపర్ బంపర్ హిట్… అప్పట్లో విపరీతమైన అవకాశాలు ఆమెకు… ఫుల్ డిమాండ్… తెలుగులో కూడా పాడేది… అక్కమొగుడు సినిమాలో మూడు పాటలు… తొంభైల ప్రారంభంలో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక సరికొత్త సంచలనం మిన్మిని…. కేవలం ఒక్క పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మంది గాయనీమణుల్లో ఆమె ఒకరు…
Ads
ఆమె వివరాల కోసం సెర్చుతుంటే కొన్ని విశేషాలు… ఆమె కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు (దాదాపు 1993-94 ప్రాంతంలో) ఊహించని విషాదం ఎదురైంది… లండన్‌లో జరిగిన ఒక స్టేజ్ షోలో పాల్గొన్న సమయంలో ఆమె ఒక్కసారిగా తన గొంతును కోల్పోయింది... సరైన కారణం ఎవరికీ అర్థం కాలేదు… వృత్తిపరమైన ఒత్తిడి లేదా ఇన్ఫెక్షన్ వల్ల వోకల్ కార్డ్స్ దెబ్బతినడంతో ఆమె కనీసం మాట్లాడలేని స్థితికి చేరుకున్నట్టు చెబుతారు…. ఒక సింగర్‌కు ఇది అత్యంత బాధాకరమైన సమయం…
దాదాపు దశాబ్దంన్నర కాలం పాటు ఆమె సంగీతానికి దూరంగా ఉండాల్సి వచ్చింది… ఎంతోమంది వైద్యులను సంప్రదించినా వెంటనే ఫలితం లేకపోయింది… అయితే, మనోధైర్యమో, చికిత్సల ఫలితమో, దైవ ప్రార్థనల ఫలమో ఏమో… 2000వ సంవత్సరం తర్వాత ఆమె గొంతు మళ్ళీ యధాస్థితికి రావడం మొదలైంది…
ఆమె తిరిగి మలయాళ చిత్ర పరిశ్రమలో కొన్ని పాటలు పాడింది… కానీ ఆనాటి ప్రభ మళ్లీ రాలేదు… ప్రస్తుతం ఆమె కేరళలోని కొచ్చిలో ‘మిన్మినిస్ మ్యూజిక్ అకాడమీ’ పేరుతో ఒక సంగీత పాఠశాలను నడుపుతూ, ఎంతోమంది యువ ప్రతిభావంతులకు శిక్షణ ఇస్తోంది…
నిజానికి ఈ కథనంలో చెప్పాల్సిన విషయం మరొకటుంది… 2023లో మిన్మిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇళయరాజా తనపై పెట్టిన ఆంక్షల వల్ల కెరీర్ పరంగా చాలా నష్టపోయానని పేర్కొంది… ఇళయరాజా దగ్గర పాడే గాయకులు మరెవరికీ పాడకూడదని లేదా నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఉండాలని ఆయన కోరుకునేవాడనీ, దీనివల్ల రెహమాన్ వంటి కొత్త సంగీత దర్శకులతో పనిచేసే అవకాశాలు ఆమె కోల్పోయినట్లు తెలుస్తోంది…
గొంతు సమస్య రాకముందే ఇటువంటి ‘ఎక్స్‌క్లూజివ్’ ఒప్పందాల వల్ల ఆమె కేవలం పరిమితమైన పాటలకే అంకితమవ్వాల్సి వచ్చింది… నో డౌట్… సినిమా సంగీతం కోణంలో ఇళయరాజా ఓ లెజెండ్… వర్ణనలకు అతీతుడు… కానీ వ్యక్తిగా అనేక అవలక్షణాలు… చూస్తున్నాం కదా, డబ్బు కక్కుర్తితో ఆయన వేసే కేసులు, వేధింపులు… తన సంగీత ప్రతిభకు పూర్తి భిన్నమైన చీకటి పార్శ్వం… గతంలోనూ బోలెడు చెప్పుకున్నాం కదా…
చివరకు వర్దమాన గాయకుల్నీ వదల్లేదు తను… తన పాటలను కచేరీల్లో పాడకూడదని లెజెండరీ సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు కూడా లీగల్ నోటీసులు పంపడం అందరినీ షాక్‌కు గురిచేసింది… అసలు ఒక నిర్మాత తన ఖర్చుతో పాటలు చేయించుకున్నాక సంగీత దర్శకుడికి రాయల్టీలు ఎందుకనేదే పెద్ద ప్రశ్న… ఆయన నిర్మాతల నుంచి మ్యూజికల్ రైట్స్ కొనుక్కున్న ఆడియో కంపెనీలనూ వదల్లేదు…
కళ గొప్పదే కానీ, కళాకారుల మధ్య ఉండే అహంకారాలు, వ్యాపార ధోరణులు, కక్కుర్తి వ్యవహారాలు అసలైన ప్రతిభను ఎలా నొక్కివేస్తాయో చెప్పడానికి మిన్మిని ప్రయాణం ఒక ఉదాహరణ…
Share this Article
