Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది బాబాయ్ హోటల్ స్టోరీ అస్సలు కాదు … జస్ట్, ఒక బాబాయ్ స్టోరీ …

May 10, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. బాబాయ్ హోటల్ సినిమా పేరు . చాలామంది అప్పట్లో ముందు ఏమనుకున్నారంటే విజయవాడ బాబాయ్ హోటల్ వ్యవస్థాపకుని బయో పిక్ అని . పబ్లిసిటీ ఎడ్వాంటేజ్ కొరకు ఆ పేరుని ఎంచుకున్నారు ఆనాటి ప్రముఖ నిర్మాత కె యస్ రామారావు . పైగా దర్శకుడు జంధ్యాల విజయవాడలో చదువుకున్నవాడు .

ఆ పేరు ఎంత పాపులర్ అంటే ఎన్నో పట్టణాలలో , నగరాలలో ఆ పేరుతో రెస్టారెంట్లు ఉన్నాయి . బెజవాడలో బాబాయ్ హోటల్ అంటే ఎంత క్రేజంటే నాలాంటి వాళ్ళు గుంటూరు నుండి వెళ్లి ఆరగించేవాళ్ళం . అలాగే ఎస్కిమో హోటల్ . మొదటి A/C రెస్టారెంట్ .

Ads

సినిమాలో కూడా చూపారు బాబాయ్ హోటల్ అంటే ఆప్యాయతకు మారు పేరు అని . ఆ ఆప్యాయత గురించి నాకు వ్యక్తిగత అనుభవం లేదు . కానీ , గుంటూరులో అలాంటి ఆప్యాయతకు ఈరోజుకీ చిరునామా ఆనంద భవన్ . నేను 1973 నుండి రెగ్యులర్ కస్టమర్ని . ఆ హోటల్ ఓనర్ బ్రదర్స్ పురుషోత్తం , జానకిరామ్ (జానీ) నాకే కాదు వేలాది మందికి ఆప్తమిత్రులు . బహుశా ఇలా ఉండే హోటళ్లు చాలా ఊళ్ళల్లో ఉండవచ్చేమో ! ఇంక సినిమాలోకి వద్దాం .

ఇది బాబాయ్ హోటల్ స్టోరీ కాదు . ఒక బాబాయ్ స్టోరీ . తల్లిని పోగొట్టుకున్న ఓ అనాధ . ఆకలి రుచి ఎరిగిన వాడు . స్వయంకృషితో పైకొచ్చి స్వంత హోటల్ నడపటమే కాకుండా కస్టమర్లందరికీ నోట్లో నాలిక వంటి వాడు . తనలాగే అనాధలయిన ఇద్దరు పిల్లల్ని సాకుతుంటాడు .

అతని హోటల్లో పనిచేసే చుక్క (కిన్నెర) బాబాయ్ మీద మనసు పారేసుకుంటుంది . బాబాయేమో అమాయకంగా తన హోటలుకు వచ్చే ఓ కాలేజి విద్యార్ధి స్వప్న (నటి పేరు మాధవి) మీద మనసు పారేసుకుంటాడు . తర్వాత ఆమె తన క్లాస్ మేటయిన ఓ ముద్దపప్పుని (సాయి కృష్ణ) ప్రేమిస్తుందని తెలుసుకుని మేరా నామ్ జోకర్ సినిమాలో రాజకపూర్ లాగా విషాదంలోకి వెళ్ళిపోతాడు .

ఆ అమ్మాయి పెళ్లి కోసం అతనితో పాటు అతని బృందం అంతా కష్టపడి పెళ్లి చేస్తారు . క్లైమాక్సులో ఆ అమ్మాయి తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయ్ నుండి వస్తున్నానని ఉత్తరం వ్రాస్తుంది . కానీ దురదృష్టవశాత్తు రోడ్ ప్రమాదంలో ఇద్దరూ చనిపోతారు . ప్రమాదంలో బతికిన ఇద్దరు పిల్లల పెంపకం బాధ్యతను చుక్కకు అప్పచెపుతూ ఆమెను పెళ్లి చేసుకోవటంతో సినిమా ముగుస్తుంది .

కధను సాయినాథ్ నేయగా మాటల్ని , స్క్రీన్ ప్లేని , దర్శకత్వాన్ని జంధ్యాల నిర్వహించారు . జంధ్యాల సినిమా అంటే చిత్ర విచిత్ర పాత్రలు . ఈ సినిమాలో అలాంటి పాత్ర శ్రీలక్ష్మిది . సినిమా పిచ్చిది . ముత్తయిదువులను సినిమాలకు ఇంట్లో సామానుని అమ్మి తీసుకెళుతూ ఉంటుంది .

బాబాయిగా బ్రహ్మానందానికి తన నటనను చూపేందుకు అవకాశం కలిగింది . వందల సినిమాల్లో నటించినా బ్రహ్మానందం నట చరిత్రలో ప్రేక్షకులకు గుర్తుండే పాత్రల్లో ఒకటి ఈ బాబాయ్ పాత్ర .

చుక్కగా కిన్నెర , పాలు పోసే వాడిగా కోట శ్రీనివాసరావు , పెద్ద దిక్కుగా సుత్తి వేలు , ఇతర పాత్రల్లో ధర్మవరపు సుబ్రమణ్యం , హనుమంతరావు , ఆలపాటి లక్ష్మి , పావలా శ్యామల  తదితరులు నటించారు .

మాధవపెధ్ది సురేష్ సంగీత దర్శకత్వంలో వేటూరి , సాహితి వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , చిత్ర , మాధవపెధ్ది రమేష్ శ్రావ్యంగా గాత్రించారు . పాటలు బాగుంటాయి . బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం ఫలహారాలే తింటే పరమానందం పాటలో సినీ ప్రముఖులను చూపటం సరదాగా ఉంటుంది .

శ్రావ్యంగా ఉండే పాట లాలీ జో లాలీ జో వెర్రి మారాజుకీ లాలీ జో . కిన్నెర , బ్రహ్మానందం మీద సాగే గోల పెట్టిందిరో మామా పాట హుషారుగా ఉంటుంది . మరో డ్యూయెట్ సాయికృష్ణ , మాధవిలపై ఉంటుంది .
1992 లో ఇదే మే నెలలో విడుదలయిన ఈ సినిమా అప్పట్లో ఎబౌ ఏవరేజుగా కూడా ఆడకపోయినా సినిమాకు మంచి పేరే వచ్చింది .

కమేడియన్లను హీరోగా పెట్టి సినిమాను కమర్షియల్ గా సక్సెస్ చేయాలంటే కష్టమే . మొత్తం మీద మంచి సినిమా . యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడండి . Worth watching .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇది బాబాయ్ హోటల్ స్టోరీ అస్సలు కాదు … జస్ట్, ఒక బాబాయ్ స్టోరీ …
  • ఇది యూనివర్శల్… ఇంత భట్టీయం పుస్తకం మరొకటి లేదు…
  • ఖైదీకి మనసిచ్చింది… మనువాడింది… లవ్ జిహాద్ కాదు… రివర్స్…
  • మ్యాచులు పెద్దగా చూడటం లేదు… జియో ఆదాయానికి భారీ దెబ్బ…
  • వ్యూహకర్త నుంచి ‘మంత్రి’ వరకు.., విజయ్ కేబినెట్‌లో కీర్తన మెరుపులు..!
  • బాబు గారి పాలన అంటే అంతే మరి… జస్ట్, 9 సెకన్లకు ఓ ఫైల్ క్లియర్…
  • విజయ్‌లో ఓ సుగుణం… తక్కువ మాట్లాడతాడు… అవసరమైతే తప్ప…
  • ‘ఆపరేషన్ సిందూర్-2’ …. ఇదే సంభవిస్తే కథ పూర్తిగా వేరే ఉంటది..!!
  • ‘చక్రధారి’ స్టాలిన్..! పర్‌ఫెక్ట్ ‘చదరంగం’… మళ్లీ తన పెత్తనమే…!!
  • పిల్లలు మన నీతులు వినరు – మన ప్రవర్తనను అనుసరిస్తారు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions