.
Subramanyam Dogiparthi … వెంకటేష్ జైత్రయాత్రలో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 1992 సంక్రాంతికి వచ్చిన ఈ చంటి సినిమా . We should really appreciate venkatesh who is a highly professional artiste without noise . ఈరోజుకీ ఇగోలతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అని లేకుండా అందరితో కలిసి మల్టీ స్టారర్ సినిమాల్లో నటించుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు .
తమిళంలో సూపర్ డూపర్ హిట్టయిన చిన్న తంబి సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో ప్రభు , ఖుష్బూ నటించారు . తెలుగుతో పాటు కన్నడంలో , హిందీలో కూడా రీమేక్ అయింది . కన్నడంలో రవిచంద్రన్ , మాలాశ్రీ నటించగా హిందీలో తన పాత్రను తానే నటించారు వెంకటేష్ . జోడీగా కరిష్మా కపూర్ నటించింది . అన్ని భాషల్లోను సక్సెస్ అయింది .
Ads
కధ కాశీ మజిలీ కధ లాంటిదే . తమిళ కధ కాబట్టి బూర్జువా తరహాలోనే ఉంటుంది . జమీందారు గారింట్లో మూడు తరాల తర్వాత ఆడపిల్ల జన్మిస్తే ఊరు ఊరంతా పండగే . అందరికీ భోజనాలు , బట్టలు , నగదు పంపిణీ . అలాగే జమీందారు గారికి కోపం వస్తే గుండు కొట్టిస్తారు , ఏదయినా చేస్తారు .
కాశీ మజిలీ కధలోలాగా దివాణం జ్యోతిష్యడు చెల్లెలు సంచలన వివాహం చేసుకుంటుందని చెపితే ఆమెకు మగవారే కనిపించకుండా పెంచుతారు . అమాయకుడయిన చంటి ఆమెకు సహాయకుడిగా సేవలను చేస్తుంటాడు . అతని మీదనే మనసవటం , భర్తగా పరిగణించటం , అన్నలు విలన్లు కావటం వగైరా జరిగిపోతాయి .
ఎంత అరవ విలనిజం అంటే చంటి విధవ తల్లిని ముత్తయిదువు అయ్యేలా రంగు నీళ్లు కుమ్మరించటం , బొట్టు పూలు పెట్టడం వంటివి 1990s లో ఎబ్బెట్టుగా ఉంటాయి . అయితే ఇలాంటి సినిమాలకు ఆ సీనే ఆయువు పట్టు అవుతుంది . చంటి నిగూఢంగా ఉన్న తన శక్తిని చూపి , అన్నలకు తమ చెల్లెలిని ఇవ్వక తప్పని పరిస్థితి కలిగిస్తాడు . సినిమా శుభాంతం అవుతుంది .
నటనపరంగా ఏ ఒక్కరినీ తీసేయలేం . అందరూ బాగా నటించారు . తమిళంలో ప్రభు , ఖుష్బూ ఎలా నటించారో నాకు తెలియదు కానీ మన తెలుగులో వెంకటేష్ , మీనా మరెవ్వరూ అలా నటించలేరు అన్నట్లుగా నటించారు . అలాగే తల్లిగా సుజాత . గొప్పగా నటించింది .
ఇంక విలన్లు . ముగ్గురు అన్నలుగా నాజర్ , వినోద్ , ప్రసన్న కుమార్లు బ్రహ్మాండంగా నటించారు . నాజరుకు బెస్ట్ విలన్ నంది అవార్డు కూడా వచ్చింది . వదినలుగా మంజుల , సుధారాణి చక్కగా నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో బ్రహ్మానందం , అల్లు రామలింగయ్య , మహర్షి రాఘవ తదితరులు నటించారు .
ఈ సినిమా ఇంత ఘన విజయానికి ఇళయరాజా సంగీతం , వేటూరి పాటలు , బాలసుబ్రమణ్యం , చిత్ర శ్రావ్యమైన కంఠాలు కారణాలు . పావురానికి పంజరానికి పెళ్ళి చేసె పాడు లోకం పాట సూపర్ హిట్ సాంగ్ . ఎన్నో పేరడీలు కూడా వచ్చాయి . బాలసుబ్రమణ్యానికి ఉత్తమ గాయకునిగా నంది అవార్డు కూడా వచ్చింది .
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు , ఓ ప్రేమా నా ప్రేమా దైవాలాడే జూదం , జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే , ఇది తైలం పెట్టి తాళం పట్టి , అన్నుల మిన్నుల అమ్మడి పాటలు శ్రావ్యంగా ఉంటాయి . సూపర్ హిట్టయ్యాయి . పాటల్ని వ్రాసిన వేటూరికి ఉత్తమ పాటల రచయితగా నంది అవార్డు వచ్చింది . మరెందుకనో ఇళయరాజాకు మిస్సయింది . బెస్ట్ మేకప్ ఆర్టిస్టుగా శోభాలతకు కూడా నంది అవార్డు వచ్చింది . వెంకటేషుకు కళాసాగర్ , మరి కొన్ని సంస్థల నుండి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది.
ప్రముఖ నిర్మాత కె యస్ రామారావు ఆధ్వర్యంలో క్రియేటివ్ కమర్షియల్స్ బేనరుపై ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు . 52 కేంద్రాల్లో 50 రోజులు , 33 కేంద్రాల్లో 100 రోజులు , రెండు కేంద్రాల్లో 175 రోజులు ఆడింది . తరచూ ఏదో ఒక చానల్లో వస్తూ ఉంటుంది . యూట్యూబులో కూడా ఉంది . ఇంతకముందు చూసి ఉన్నా మళ్ళా కూడా చూడవచ్చు .
Share this Article