.
Subramanyam Dogiparthi ….. మొరటు మొగుళ్ళు vs నాజూకు మొగుళ్ళు . ఓ నలభై యాభై ఏళ్ల కింద మొగుళ్ళు శోభన్ బాబులాగా నాజూకుగా ఉండేవాళ్ళు . గ్రామాల్లో మొగుళ్ళు ఏమో గానీ బస్తీల్లో మొగుళ్ళు రోజూ నున్నంగా గడ్డం గీసుకుని శుభ్రంగా ఉండేవాళ్ళు . యన్టీఆర్ , ఏయన్నార్ , కృష్ణ , శోభన్ బాబు వంటి టాప్ స్టార్స్ నున్నంగా ఉండేవాళ్ళు . హిందీ స్టార్లకు మీసాలు కూడా ఉండేవి కావు.
ఆరోజుల్లో భార్యలు కూడా తమ భర్తలు నున్నంగా ఉండాలి , నాజూకుగా ఉండాలి అనే కోరుకునేవాళ్ళు అని నేను అనుకుంటున్నాను . ఇది అవునో కాదో ఆనాటి భార్యలే చెప్పాలి . రోజులు మారాయి . మొగుళ్ళు బడా బడా గడ్డాలు పెంచుకుని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగా ఉంటున్నారు గత ఇరవై పాతికేళ్ళ నుండి . ఇదే ఫేషన్ అయిపోయినట్లుగా ఉంది . ఇప్పుడు గడ్డం లేని వారు చాలా తక్కువ . భార్యలు , గర్ల్ ఫ్రెండ్స్ , వుమన్ ఫ్రెండ్స్ కూడా తమ జోడీలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లుగా ఉంది .
Ads
తర్వాత తాగుడు , సిగరెట్ , బీడీలు . కొంచెం కొంచెం విస్కీ తాగే మొగుళ్ళంటే కొందరు భార్యలకు గర్వంగా ఉండేది . అలాగే స్టైలుగా సిగరెట్ తాగే మొగుళ్ళన్నా ఒకింత ఎక్కువ గర్వంగా ఉండేది . ఇప్పుడు నగరాల్లో కలిసే తాగుతున్నారు . కలిసే డ్రగ్స్ పుచ్చుకుంటున్నారు . ఇంకా ఇంకా ముందుకు వెళుతున్నారు . అందుకే ఇన్ని మర్డర్లు . మొరటు మొగుళ్ళు vs నాజూకు మొగుళ్ళ గురించి చాలా చెప్పాను . ఎవరయినా M Phil చేయవచ్చు కూడా . ఇంక ఈ సినిమాలోకి వెళదాం .
సినిమా ప్రారంభంలో తమిళనాడులోని మధురై జిల్లా దగ్గరలో ఓ మారుమూల గ్రామంలో జరిగిన యదార్ధ గాధ అని వాయిస్ ఓవర్లో చెపుతారు . చూసేందుకు రావణుడులాగా కనిపించినా మనిషి శ్రీరామచంద్రుడు వంటి సాంబయ్య గడ్డం లేని ఫుల్ మొరటోడు .
మరదలు మీనా మీద చాలా ప్రేమ . ఆమెకేమో ఇతని వాలకం చూస్తేనే వణికిపోతుంది . అమ్మమ్మ భానుమతి నచ్చచెప్పాక పెళ్ళికి ఒప్పుకుంటుంది . అయినా మొరటోడంటే భయం , అసహ్యం పోదు . శోభనం మూడో రోజు భర్త తన హక్కులను ఉపయోగించుకుంటాడు . అయినా దూరం దగ్గరవదు .
అమ్మమ్మ ఇద్దరికీ నచ్చచెప్పి దగ్గరకు తెచ్చేందుకు తిప్పలు పడుతుంది . ఈలోపు మీనా ప్రసవానంతరం చనిపోతుంది . పుట్టిన బిడ్డ గురించి ఆలోచించటం మొదలు పెడతాడు . తన మరదలు ప్రేమించిన ఊరి విలన్ ప్రెసిడెంట్ కొడుకుతో బలవంతంగా పెళ్ళి జరిపిస్తాడు . క్లైమాక్సులో విలన్ ప్రెసిడెంట్ హీరో రాజశేఖర్ని చంపిస్తాడు . విషాదంతో సినిమా ముగుస్తుంది .
నటనపరంగా రాజశేఖర్ , మీనాలది అగ్ర తాంబూలం . ఇద్దరూ బాగా నటించారు . అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారిని ఆ పాత్రలో ఎందుకు పెట్టుకున్నారో, ఆమె ఎందుకు అంగీకరించిందో అర్థం కాదు . Underused . కోట శ్రీనివాసరావు , బాబూమోహన్ జంట హాస్యం కాస్త రిలీఫే . విలన్ ప్రెసిడెంటుగా కొత్త నటుడు జగన్మోహనరావుని , మరో ఇద్దరు యువ నటులు రజనిశ్రీ , రాజ్ చందర్లను పరిచయం చేసారు .
ఇతర పాత్రల్లో కాకరాల , తాతినేని రాజేశ్వరి , కృష్ణవేణి , పి జె శర్మ , మా నరసరావుపేట వాడయిన ఫణి తదితరులు నటించారు . సినిమా షూటింగ్ అంతా పట్టిసీమ , పోలవరం , పాపికొండలు , చుట్టుపక్కల తీసారు . ప్రకృతి అందాలను ఆరబోసారు . బాగుంటాయి .
ఇంక సినిమాకు ఎస్సెట్ ఇళయరాజా సంగీతం . ఐకానిక్ సాంగ్ జొన్నవిత్తుల వ్రాసిన కొయిలాల ఆ కమ్మటి కబురినవేల సల్లటేల ఆ సంగతి చెవినేయాల శ్రావ్యంగా ఉంటుంది . చిత్రీకరణ కూడా బాగుంటుంది .
మరో శ్రావ్యమైన పాట పారిజాత పువ్వా పరువాల పైడి గువ్వా . దీన్ని కూడా జొన్నవిత్తులే వ్రాసారు . కోదండరామిరెడ్డి లెవెల్లో ఉంటుంది .
రాయంటోడనుకోకు తలరాతని నిందించబోకు , అందరికీ అందనిది ఆడదాని మనసు (సందేహం ఏముంది?!) , పోరా పోరా పుడింగు ఏందిరో నీ ఫిట్టింగు , ఓ రామచిలకమ్మా నూరేళ్లు నిండేనా అంటూ సాగే మిగిలిన పాటలు కూడా బాగానే ఉంటాయి .
1990 లలో రావలసిన సినిమా కాదేమో అనిపిస్తుంది . కోదండరామిరెడ్డి ఇంకాస్త మసాళాలు దట్టిస్తే ఎలా ఉండేదో ! డైలాగులను పరుచూరి బ్రదర్స్ వ్రాసారు . పాటల్ని జొన్నవిత్తులతో పాటు సిరివెన్నెల , సి నారాయణరెడ్డి వ్రాసారు . బాలసుబ్రమణ్యం , చిత్ర , స్వర్ణలత , కల్పనల పాడారు . సినిమా యూట్యూబులో ఉంది . ఫేమిలి సెంటిమెంట్ , భార్యాభర్తల సెంటిమెంట్ ఇష్టపడే వాళ్ళు ట్రై చేయవచ్చునేమో.
Share this Article