Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వితండ- తొండి వాదన ! మళ్లీ మళ్లీ కేసీయార్ అదే శుష్కవాదం !

July 23, 2026 by M S R

.

కాలచక్రంలో ఓసారి 2022 జూలైలోకి వెళ్దామా… అవును, సరిగ్గా నాలుగేళ్ల క్రితం… గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి… అసహజం ఏమీ కాదు, 50 లక్షల క్యూసెక్కులు కూడా నమోదైన ఉదాహరణలున్నాయి… భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటింది… ఆ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేసీఆర్ జూలై 17న మీడియా సమావేశంలో మాట్లాడాడు…

ఏమన్నాడో తెలుసా..? జనం హాశ్చర్యపోయేలా..? ఒక సీఎం ఇంత అపరిణత, అధమ స్థాయి వ్యాఖ్యలు చేస్తాడా అన్నట్టుగా… మన దేశంలో కొన్ని విదేశీ శక్తులు కావాలనే కుట్రపూరితంగా కొన్ని ప్రాంతాల్లో కృత్రిమంగా వర్షాలను కురిపిస్తున్నాయని (Cloudbursts), దీని వెనుక విదేశీ హ్యాండ్ ఉందని తనకు “గ్లూమీ ఇన్ఫర్మేషన్” (అంతర్గత సమాచారం) వచ్చిందని అన్నాడు…

Ads

గతంలో లేహ్-లడఖ్, ఉత్తరాఖండ్‌లలో ఇలాగే చేశారని (చైనా), ఇప్పుడు గోదావరి బేసిన్‌లో కూడా అలా చేయిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశాడు… అవును, ఇప్పుడు బీఆర్ఎస్ పదే పదే చెబుతున్న కన్నెపల్లి పంప్ హౌజ్ మునిగి, సోకాల్డ్ బాహుబలి మోటార్లు దెబ్బతిన్నది అప్పుడే… అప్పుడు 28 లక్షల క్యూసెక్కుల వరద అది… సీన్ కట్ చేయండి…

వర్తమానంలోకి వద్దాం… ఇక ఇంతకుమించిన పాతాళ స్థాయి వ్యాఖ్యలు ఇక చేయడు అనుకున్న ప్రతిసారీ తను ఇంకా లోతుల్లోకి వెళ్తూనే ఉంటాడు… ఈరోజు తన వాయిస్ నమస్తే తెలంగాణలో రాసిన కథనం అచ్చంగా అదే… ఆ శీర్షిక ‘‘కుట్ర కూలింది- నిజం తేలింది’’… ఆ పత్రిక ధోరణిలాగే గందరగోళంగా ఉన్నట్టుందా..? ఆ కథనరత్నం సారాంశం ఏమిటయ్యా అంటే..?

నమస్తే

కన్నెపల్లి పంప్ హౌజ్ నడిపిస్తే బరాజులకే ప్రమాదం, రిపేర్లు చేయనిదే నడిపించలేం అని రేవంత్ రెడ్డి NDSA సాగునీటి నిపుణుల సూచనల నేపథ్యంలో కట్టుబడి ఉన్నాడు కదా… తమ అనుబంధ కవర్ సంఘం రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం పేరిట ‘ఏమీ కాదు, పంప్ హౌజ్ నడిపించాలి’ అని డిమాండ్లు చేయించాడు, బరాజులకు నష్టం వాటిల్లితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ట్రాప్ కుట్ర…

ఇప్పుడట ఎవరో అనామక ఎన్నారై ఏకంగా NDSA సభ్యుడికి మెయిల్ పెట్టాడట, ఏమయ్యా, నీటిని ఎత్తిపోయాలి కదా, మీరెందుకు అడ్డుపడుతున్నారు అని… ఆ మెయిల్ ఏకంగా  NDSA చైర్మన్ అనిల్ జైన్‌కో, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కో రాయొచ్చు కదా అంటారా..? కేసీయార్ స్క్రిప్టు మరీ నాసిరకం… తనకు ఒకరో ఇద్దరో ఎంపీలున్నారు కదా, వాళ్లతో పార్లమెంటులో ప్రశ్న వేయించొచ్చుగా… నో, కుదరదు, అప్పుడు అసలు నిజం జనానికి తెలుస్తుంది కదా, తెలిస్తే తన నాటక ప్రహసనం తేలిపోతుంది కదా…

సదరు NDSA సభ్యుడు సదరు ఎన్నారైకి రిప్లయ్ ఇచ్చాడట… ఏమనీ..? అయ్యా, బరాజుల భద్రత, విపత్తు నివారణ, నిర్వహణలు మాత్రమే మా పని, నీళ్లు ఎత్తిపోసుకుంటారా లేదానేది రాష్ట్రాల విధాన నిర్ణయం అని చెప్పాడట… (అదేమిటో NDSA సమాచార హక్కు కింద అడిగినా స్పందించదు, అందులో ఒక సభ్యుడు బాధ్యత తీసుకుని సమాధానం ఇవ్వడం బరాజు కుంగినంత విపత్తు, విశేషం)

సరే, ఆ సభ్యుడు చెప్పాడనే అనుకుందాం, నిజమే కదా, బరాజుల భద్రత మా పని అన్నాడు… అందుకే కదా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ బరాజులకు శల్యపరీక్షలు చేసి, గేట్లు మూస్తే, నీరు నిల్వ చేస్తే కొట్టుకుపోతాయని కదా రిపోర్ట్ ఇచ్చింది, ఇప్పుడూ అదే అంటున్నాడు, భద్రత మా పని, నీటిని ఎత్తిపోయడం మా పని కాదు అని…

దాన్ని అటు పీకి ఇటు పీకి, ఓ వితండవాదనను పైకి లేపి, ఇదుగో NDSA చెప్పినా రేవంత్ రెడ్డి పంపులు నడిపిస్తలేడు, రైతులకు ద్రోహం చేస్తున్నాడు అనే ఓ క్షుద్ర నెరేటివ్..! నిజంగా ఆ మెయిల్‌కు, ఆ రిప్లయ్‌కు అంత విలువ ఉంటే ఇప్పటికే హరీష్ రావు రెండో మూడో ప్రెస్‌మీట్లు పెట్టేవాడు కదా!! అదే తనకు అలవాటైన గురుదక్షిణ అనబడే ఓ శుష్కవాదనతో!!

చివరగా… నిన్న ఎక్కడో ఓ సామాన్యుడు చెబుతున్నాడు… మేడిపల్లి బరాజు గేట్లు మూయకుండానే, నీళ్లు నిల్వ చేయకుండానే కన్నెపల్లి పంపులు నడపొచ్చు అంటున్నారు కదా, మరి ఆ బరాజు ఎందుకు కట్టినట్టు అని! అదీ సామాన్యుడి కామన్ సెన్స్!! తను నమస్తే బీఆర్ఎస్ ప్రతినిధి కాదు కదా!!

పైగా ఆ నీళ్లు ఎత్తినా అన్నారం, సుందిళ్లలో కొంత నిల్వ చేస్తే తప్ప ఎల్లంపల్లికి ఎత్తిపోయడం కుదరదు, నిల్వ చేస్తే బరాజులు ఉండవు… ఇదీ రియాలిటీ… అందుకే గులాబీ క్యాంపు ఎంత ఏడ్చి మొత్తుకుంటున్నా సగటు రైతు నమ్మడం లేదు… తనకూ తెలుసు, ద్రోహం ఎక్కడ జరిగిందో!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • FCRA – అసలు ఏమిటి ఈ నియంత్రణ చట్టం ? ఎందుకోసం ?
  • హీరోతో హీరోయిన్ రొమాన్స్ – కెమిస్ట్రీ – ఇదే మీడియా ప్రయారిటీ !!
  • ఢాకాలో ఏదో జరుగుతోంది – మళ్లీ రాజకీయ పరిణామాలు ?!
  • సన్నాసి ? సన్యాసి ? నదిలో వదిలేసిన శవం బతికి తిరిగొచ్చిందా !?
  • Credit Theft Politics … హరీశ్ రావు నీటి రూటే సపరేటు…
  • నాగదుర్గ – అఖిల్ రాజ్ ! రీల్ జంట కమ్ రియల్ జంట !!
  • Great Escape ! వ్యవస్థలన్నీ విఫలమైనవేళ – ఓ అరుదైన ఎయిర్ ఫీట్ !!
  • పోచారం గాచారమా..? పశ్చాత్తాపమా..? ఏమైంది వీళ్లందరికీ !!
  • సిగ్గుపడ్డ అరవింద్ స్వామి.. నవ్వుకుని దగ్గరికి రమ్మన్న నగ్మా !
  • గంగూలీ సౌరభం ! దాదాగిరీ ఇక బిగ్‌బాస్‌లో ! హోస్ట్‌గా ఫస్ట్ క్రికెటర్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions