.
అందరూ విశేషంగా చెబుతున్నారు… నిజమే, ఆఫ్టరాల్ ఒక మిలియన్ డాలర్లలోపే… అంటే 7.5 లక్షల డాలర్ల ఖర్చుతో, అంటే 7- 8 కోట్లతో నిర్మించిన ఓ Indie Horror Thriller సినిమా ఇప్పటికే 750 కోట్లు వసూలు చేసింది… ఇంకా నడుస్తోంది… 1000 కోట్లు గ్యారంటీ అట… సెన్సేషన్… కథాబలం, సినిమాలో సరుకు ఉంటే… మన తెలుగు పాన్ ఇండియా సోది ఫార్ములా సినిమాలకు ఆరేడు వందల కోట్లు శుద్ధ దండుగ…
ఈ సెన్సేషన్ పేరు ‘అబ్సెషన్’ (Obsession)… ఒక చిన్న సినిమా ఇంతటి భారీ విజయం సాధించడం వెనుక ఉన్న విశేషాలేమిటో ఓసారి చెప్పుకుందాం…
Ads
అసలు ఏమిటి ఇందులో విశేషం?
యూట్యూబ్ టాలెంట్ – హాలీవుడ్ ఎంట్రీ…: ఈ చిత్ర దర్శకుడు, 26 ఏళ్ల కర్రీ బార్కర్ (Curry Barker)… ఇన్నాళ్లూ యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈ యువకుడు, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను కూడా తనే స్వయంగా నిర్వహించి ఈ అద్భుతాన్ని సృష్టించాడు… మల్టీ టాలెంటెడ్…
అపూర్వమైన బాక్సాఫీస్ రికార్డ్…: సాధారణంగా హర్రర్ సినిమాలకు మొదటి వీకెండ్ తర్వాత కలెక్షన్లు పడిపోతాయి… కానీ ‘అబ్సెషన్’ మొదటి వారం కంటే రెండో వారంలో 39% ఎక్కువ వసూళ్లను సాధించి హాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది… మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ వంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టి ఇది అమెరికా బాక్సాఫీస్ వద్ద టాప్ ప్లేస్‌కు దూసుకొచ్చింది…
కల్ట్ క్లాసిక్స్ సరసన…: గతంలో ‘ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’, ‘పారానార్మల్ యాక్టివిటీ’ చిత్రాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో, 2026లో ‘అబ్సెషన్’ ఆ స్థాయి లాభాలను (10,000% పైగా ROI) ఆర్జిస్తూ చరిత్ర సృష్టిస్తోంది….
జానర్…: సైకలాజికల్ సూపర్ నేచురల్ హర్రర్… కథాంశం (Plot) ఏమిటంటే..? ‘బేర్’ (మైఖేల్ జాన్స్టన్) ఒక మ్యూజిక్ స్టోర్‌లో పనిచేసే ఒంటరి యువకుడు… అతనికి తన చిన్ననాటి స్నేహితురాలు ‘నిక్కీ’ (ఇండే నవారెట్) అంటే ప్రాణం, కానీ ఆమె ఇతడిని కేవలం స్నేహితుడిగానే చూస్తుంది… ఈ క్రమంలో బేర్‌కు ఒక విచిత్రమైన, శక్తులున్న ఒక పాత బొమ్మ (Supernatural Toy) దొరుకుతుంది…
అది కోరిన కోర్కెలను తీరుస్తుందని తెలుసుకున్న బేర్, నిక్కీ తన ప్రేమలో పడాలని కోరుకుంటాడు… ఆ కోరిక నెరవేరుతుంది కానీ, దాంతో పాటే ఆ బొమ్మ వెనుక ఉన్న దుష్టశక్తి వారి జీవితాల్లోకి ప్రవేశిస్తుంది… ఆ ‘అబ్సెషన్’ (అతివ్యామోహం) ఎలాంటి భయానక పరిణామాలకు దారితీసింది..? వారి మానసిక స్థితి ఎలా మారిపోయింది…? అనేదే మిగతా కథ…
ప్లస్ పాయింట్స్ (What Works)…: కథనం & స్క్రీన్‌ప్లే…: దర్శకుడు కర్రీ బార్కర్ ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా, దానిని నడిపించిన తీరు అద్భుతం… అనవసరమైన గ్రాఫిక్స్, భారీ జంప్- స్కేర్స్ (ఉలిక్కిపడేలా చేసే శబ్దాలు) నమ్ముకోకుండా, కేవలం సన్నివేశాల ద్వారానే ప్రేక్షకుడిలో భయాన్ని, ఉత్కంఠను కలిగించడంలో సఫలమయ్యాడు…

నటన…: ప్రధాన పాత్రధారులు మైఖేల్ జాన్స్టన్, ఇండే నవారెట్ ఇద్దరూ అద్భుతమైన నటన కనబరిచారు… ముఖ్యంగా సైకోటిక్ లవర్‌గా, భయంతో కూడిన వ్యామోహాన్ని ప్రదర్శించడంలో మైఖేల్ నటన సినిమాకు ప్రాణంగా నిలిచింది…
మేకింగ్ వాల్యూస్…: తక్కువ బడ్జెట్ అయినప్పటికీ, లైటింగ్, సౌండ్ డిజైన్ పరంగా సినిమా చాలా రిచ్‌గా, సహజంగా అనిపిస్తుంది… థ్రిల్స్ – వయోలెంట్ ఎలిమెంట్స్ చాలా రా (Raw) గా, పకడ్బందీగా ఉంచారు…
కాకపోతే సినిమా మొదటి అరగంట పాత్రల పరిచయం, కథా స్థాపనకు ఎక్కువ సమయం తీసుకుంటుంది… రెగ్యులర్ కమర్షియల్ హర్రర్ సినిమాలను ఆశించే వారికి కొద్దిగా నెమ్మదిగా అనిపించవచ్చు…. ముగింపు భాగం సైకలాజికల్ కోణంలో బాగున్నప్పటికీ, సాధారణ ప్రేక్షకులకు కొన్ని ప్రశ్నలను మిగిల్చే అవకాశం ఉంది…
చివరిగా… ‘అబ్సెషన్’ కేవలం దయ్యాల సినిమా కాదు, మనుషుల్లో ఉండే అతివ్యామోహం ఎంత భయంకరమైనదో చూపించే ఒక అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్… కథలో దమ్ముంటే, భారీ బడ్జెట్, పెద్ద స్టార్లు అవసరం లేదని, కేవలం ఒక మంచి ఐడియాతో ప్రపంచ బాక్సాఫీస్‌ను శాసించవచ్చని ఈ చిత్రం నిరూపించింది… హర్రర్, సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వారు అస్సలు మిస్ అవ్వకూడని చిత్రం ఇది…
Share this Article