Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మంచు మేఘాలు తొలిగితేనే… కాంచనగంగ శిఖర దర్శనం… గొప్ప మూవీ…

May 31, 2026 by M S R

.

Vamsy Krishna …. “కాంచన గంగ”. 102 నిమిషాల వేడుక… సత్యజిత్ రే అన్నిసినిమాలలో బాగా నచ్చిన ఒక సినిమా చెప్పమని ఎవరైనా అడిగితే నేను తడుముకోకుండా “కాంచన గంగ” అంటాను . సత్యజిత్ రే అన్ని సినిమాలు ఇష్టమే, అయినా నా మనసెందుకో తెలీదు కానీ కాంచన గంగలో నా ప్రయత్నం లేకుండానే ఒదిగిపోయింది .

బహుశా ఆ సినిమా అంతా అంతర్లీనంగా కనిపించే మార్మిక సౌందర్యం అందుకు కారణం కావచ్చు . బహుశా ఆ సినిమా అంతా వినిపించే అంతర గాంధారం అందుకు కారణం కావచ్చు . బహుశా ఆ సినిమా అంతా పలకరించే మంచు మేఘాల మౌన కవిత్వ సంభాషణ అందుకు కారణం కావచ్చు .

Ads

బహుశా , ప్రేక్షకుడిని తనలోకి తీసుకుని, ప్రేక్షకుడిని ప్రేక్షకుడుగా మిగలనీయకుండా , ఒక అత్యున్నతమైన కళారూపం కళా రూపంగా మిగలకుండా ఇద్దరూ ఒక తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళడానికి కావలసిన భూమికలను ఏర్చి కూర్చే అరుదైన లక్షణం ఏదో కాంచన గంగలో ఉండి ఉండటం అందుకు కారణం కావచ్చు.

సత్యజిత్ రే మొట్టమొదటి రంగుల చిత్రం కాంచనగంగ . 1964 లో తీసిన ఈ సినిమా తన కాలం కంటే కాస్త ముందు ఉండటం వలననో ఏమో తెలీదు కానీ రే ఇతర సినిమాలలాగా అంతగా విజయవంతం కాలేదు . కథగా చెప్పుకుంటే ఇందులో ఏమీ లేదు .

ఇంద్రనాథ్ కలకత్తాలో బాగా విజయవంతమైన బిజినెస్ మాన్ . బ్రిటీష్ వారి నుండి రావుసాహెబ్ అన్న బిరుదు అందుకున్న వాడు . బ్రిటీష్ వారు వెళ్ళిపోయినందుకు ఒకరకంగా బాధపడుతున్నవారు . నా మాటే శాసనం అని కుటుంబం మొత్తాన్నిశాసించగల ఆధిపత్య భావజాలం కలిగినవాడు . భార్యా పిల్లలు ఎవరూ తాను గీచిన గీటు దాటకూడదు అనుకునే వాడు . అలా ఉండటం జీవితంలో విజయం సాధించడానికి మొదటి మెట్టు అన్నది అతడి భావన .

లావణ్య ఇంద్రనాథ్ భార్య . భర్త అడుగు జాడలలో నడిచే మధ్య వయసు మహిళ . ఇంద్రనాథ్ మాట ఆమెకి శాసనం. మోనీషా చిన్నకూతురు. అనిమా ఇంద్రనాథ్ పెద్ద కూతురు . శంకర్ పెద్ద అల్లుడు . కుటుంబం అంతా కలిసి వేసవి విహార యాత్రకి డార్జిలింగ్ వెళతారు. ఆ యాత్రలో చివరి రోజు కాంచనగంగ దర్శనం . ఆరోజే తన చిన్న కూతురికి తాను పెళ్లి చేయదలచుకున్న ఫారిన్ రిటర్న్డ్ బెనర్జీని పరిచయం
చేసి ఆమెతో ఔను అనిపించే కార్యక్రమం .

అపూ ట్రయాలజీలో ఒక సుదీర్ఘమైన జీవితాన్ని తన కథా కాన్వాస్ గా తీసుకున్న సత్యజిత్ రే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి తీసుకున్న సమయం కేవలం పదిగంటలు . సినిమా మొత్తం ఒక మారథాన్‌ ‌లా పాత్రలు నడుస్తూనే ఉంటాయి . కాంచనగంగ శిఖర నేపథ్యంలో దృశ్యా దృశ్యమవుతుడే మంచు మేఘాలు , చలిగాలులు , అలా టీ తోటలలోకి నడిచి వెళ్లే కూలీల తోరణాలు, అన్నీ ఒక సౌందర్యాన్ని కళ్ళ నిండా , హృదయం నిండా నింపుతాయి.

ఇరుకిరుకు కలకత్తా వీధుల నుండి , అహంకారం , ఆభిజాత్యం నిండి వుండే భద్రలోక మేడల నుండి బయటకు అలా ఆ విశాల ప్రపంచంలోకి , డార్జిలింగ్ పర్వతాలలోకి , కాంచన గంగ పాద సమీపానికి వచ్చేసరికి హృదయం ఒక్కసారిగా స్వచ్ఛ శుభ్ర గంగాజలంలో శుభ్రపడిన భావన . హృదయం లోపల దాగి వున్న మాత్సర్యం అంతా తొలగిపోయి హృదయం ఒక చిరు గాలి అలలాగా , ఒక సెలయేటి జలలాగా మారిపోయిన భావన . ప్రకృతి చేసే మేజిక్ అది.

సినిమా చూసే ప్రేక్షకుడే కాదు , సినిమాలోని ఆ పాత్రలు కూడా అలాగే అనుభూతిస్తాయి . ఈ భావన ఆ పాత్రల గమనాన్ని నిర్దేశిస్తుంది. మోనిషా బయటకు వెళుతూ,  అక్కా బావ గదిలోకి వచ్చినప్పుడు, బావ శంకర్ ఆమెకో సలహా ఇస్తాడు.. “మోనీషా మనసులో ప్రేమ లేకుండాఎవరినీ పెళ్లి చేసుకోకు ” అన్నదే ఆ సలహా .

ఆ డార్జిలింగ్ పర్వత సానువులలో కాబోయే వధూవరులను ఒంటరిగా వదిలి వేస్తే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మరింతగా తెలుసుకుంటారని భావించి ఇంద్రనాధ్ ఫారిన్ రిటర్న్డ్ బెనర్జీకి ,మోనీషాకి ఏకాంతం కల్పించడం కోసం భార్యతో కలిసి ఒక జట్టుగా మరొక వైపు వెళతాడు . అనీమా శంకర్ ఒక జంటగా , ఇంద్రనాథ్ లావణ్య ఒక జంటగా , బెనర్జీ మోనీషా ఒక జంటగా అలా నడుస్తూ తమను తాము అన్వేషించుకుంటూ , తమ భాగస్వాముల
గురించి తెలుసుకోవడానికి చేసే ఒక మారథాన్ ప్రయత్నం…

కాంచన గంగను చూడటానికి అందరూ వస్తారు . కానీ ఆ నిజ శిఖర దర్శనం ఎప్పుడో కానీ, ఎవరికో కానీ కాదు . ఎందుకంటే ఎప్పుడూ ఆ శిఖరాన్ని మంచు మేఘాలు కమ్ముకునే ఉంటాయి . ఆ మంచు మేఘాలు తొలగితే కానీ నిజ శిఖర దర్శనం ఎలా అయితే అవదో, హృదయాన్ని ఆవరించుకుని ఉన్న అనేకానేక భావనల , ఉద్వేగాల పొరలను తొలగించుకుంటే కానీ నిజ హృదయ దర్శనం కాదు.

అనీమా శంకర్ లది అన్యోన్యమైన జంటే . కానీ వాళ్ళిద్దరి మానసిక ప్రపంచాల మధ్య ఒక అంతరం . ఏమిటది ? అనీమా పాత ప్రియుడొకరు ఆమెకి ఉత్తరాలు రాసి వేధిస్తూ ఉంటాడు . ఆమె ఆ ఉత్తరాల గురించీ , పాత ప్రియుడి గురించీ శంకర్ కి చెప్పలేదు . చెపితే ఏమవుతుందో అన్న భయం . శంకర్ ఆ ఉత్తరాలని చూస్తాడు . అతడూ అడగడు . భార్య తనను ప్రేమించడం లేదని అతడి నమ్మకం . భార్య ప్రేమ ఆ పాత ప్రియుడి మీదే వున్నది అన్నది అతడి విశ్వాసం . తన అనుభవంలో నుండి అతడు మోనీషాకి సలహా ఇస్తాడు . కాంచన గంగ వైపు సాగిన నడకలో ఆ అనుమానాల , అవిశ్వాసాల, మంచు మేఘాలు తొలగిపోతాయా ? వాళ్ళిద్దరి మధ్యా ఉన్న కాంచన గంగ శిఖర నిజదర్శనం అయిందా ?

బెనర్జీ వస్తాను అన్న స్పాట్‌కి వెళుతుంటే మోనీషాకి అశోక్ పరిచయం అవుతాడు . అశోక్ ఎవరు ? ఇంద్రనాధ్
ఏకైక కుమారుడికి కలకత్తాలో ట్యూషన్ చెప్పిన ట్యూషన్ మాస్టారి మేనల్లుడు . వాళ్లిద్దరూ డార్జిలింగ్ మాల్ వైపు వెళుతూ ఒక ఎత్తైన ప్రదేశంలో ఆగినపుడు ట్యూషన్ మాస్టర్, అతడి మేనల్లుడు అశోక్ కి ఇంద్రనాధ్
కనిపిస్తాడు .

ట్యూషన్ మాస్టర్ ఇంద్రనాధ్ ని గుర్తుపట్టి , తనను తాను పునః పరిచయం చేసుకుని, తన మేనల్లుడికి వుద్యోగం ఇవ్వమని అర్ధిస్తాడు . అక్కడ అశోక్ పరిచయం అవుతాడు . బెనర్జీ పూర్తిగా మెటీరియలిస్ట్ . తన గురించి తానే రాసుకున్న ఒక పిహెచ్ డి థీసీస్ ను మోనీషా ముందు ఆవిష్కరిస్తాడు . చుట్టూ అందమైన ప్రకృతి . లోలోపల సౌందర్య భావనలు రేకెత్తించగల వాతావరణం. ఆ మెటీరియలిస్ట్ బెనర్జీ , పిరికి పిల్ల మోనీషా వాళ్ళిద్దరి మధ్యా సంభాషణ లేదు ఏక భాషణే.

లావణ్య మనసంతా ఒక దిగులు మేఘం కమ్ముకుని ఉంటుంది . ఆమెకు తన పెద్ద కూతురు అనీమా జీవితంలో ఏదో అపశ్రుతి వున్నది అని తెలుసు . అదేమిటో ఆమెకు తెలుసు . చిన్న కూతురు మోనీషాకి పెళ్లి పట్ల ఎలాంటి అభిప్రాయాలూ లేవని తెలుసు . నిండా పందొమ్మిది ఏళ్ళు లేని మోనీషాకి ఈ చండశాసనుడు పెళ్లి కుదిరించడం , ఆ పిల్లాడితో మాట్లాడమనడం , ఆమెకు అంతా అగమ్య గోచరంగా ఉంటుంది .  ఏదో తెలియని ఆందోళన . ఆమె సందేహాలు భర్త ముందు ఉంచుతుంది . అతడు అన్నీ ఒక్క ఉదుటున కొట్టి పడేస్తాడు .

నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నీ వయసెంత అని ఎదురు ప్రశ్నిస్తాడు . మోనీషా భవిష్యత్తు గురించి మనకంటే ఎక్కువగా మోనీషాకి తెలుసా అని వాదిస్తాడు . అయినా ఆమె మనసు కుదుట పడదు. రోజు గడుస్తున్న కొద్దీ పాత్రల మధ్య సంఘర్షణ వేడెక్కుతుంది . చలి వాతావరణంలో ప్రేక్షకుడిలో వేడి మొదలవుతుంది . అనీమా శంకర్ ఆ వినీలాకాశం కింద కూర్చుని తమ హృదయాలను కమ్ముకుని ఉన్న మేఘాల ముసుగు తొలగించి వేస్తారు .

లావణ్య తాను కట్టుకున్న ఎర్రంచు బోర్డెర్ ఉన్న తెల్ల చీర మీద వేసుకున్న షాల్ భుజం మీద నుండి తీసి వేసి, తన తమ్ముడు జగదీశ్‌తో కూతురికి ఒక సందేశం పంపిస్తుంది . ఎవరి కోసమూ తన మనసుకు నచ్చని పని ఏదీ చేయవద్దని.

చాలా చాలా సంభాషణ తరువాత మోనీషా బెనర్జీ దగ్గర నుండి నాట్ టు గెట్ మ్యారీడ్ అన్న నిశ్చయంతో తిరిగి వస్తూ, మళ్ళీ అశోక్ ని కలుసుకుంటుంది . బెనర్జీ దగ్గర మూగపోయిన ఆమె స్వరం అశోక్ దగ్గర సరిగమ
పలుకుతుంది . మేఘాలు తొలగిపోతూ కాంచన గంగ శిఖరం దృశ్యమానం అవుతుంది . ఇంద్రనాధ్ కి ఆ శిఖర దర్శనం జరిగిందా ?

ఈ సినిమా గురించి సత్యజిత్ రే సినీ ఎస్టేట్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో “It was a very personal film. It was a good ten to fifteen years ahead of its time…” అన్నాడు . కాంచన గంగ అనే శిఖరం ఒక మెటాఫర్ . ఆ మెటాఫర్ ని ఎవరికీ వారు విశ్లేషించుకోవలసిందే . ఇమానిసిపేషన్ ఆఫ్ ఉమన్ అంటే అది భౌతికంగానా ?ఆంతరంగికంగానా ? అన్న ప్రశ్న వేసుకుని స్పిరిట్యుయల్ ఇమానిసిపేషన్ అసలైన విముక్తి అన్న అర్ధం ఏదో ఈ సినిమాలో అంతర్లీనంగా వినిపిస్తుంది.

మోనీషా బెనర్జీని పెళ్లి చేసుకోవద్దు అన్న నిర్ణయం తీసుకుని పరుగుపరుగున వస్తున్నప్పుడు పక్కనే టీ తోటల్లో పనిచేసే కూలీలు వరుసగా వెళ్ళిపోతున్న దృశ్యాన్ని చూపిస్తాడు రే . మ్యారేజ్ అనే ఒక బర్డెన్ తప్పిపోయి స్వేచ్ఛలోకి ఆమె వెళుతున్న సమయంలోనే ఆ తేయాకు తోటల కూలీలు పేదరికం అనే బరువును భుజాల మీద మోస్తున్నట్టు చూపించడం రే సునిశిత దృష్టికి నిదర్శనం .

ఈ దేశంలో అన్నీ ఉన్న ఇండియా ఒక వైపు ఉంటే ఏమీ లేని భారతదేశం కూడా మరొక వైపు వున్నదని చెప్పకనే చెప్తాడు . ఇండియాకు కావలసినది స్పిరిట్యుయల్ ఇమానిసిపేషన్ . 1964 నాటి సినిమాలో బ్రిటీష్ కాలం నాటి భావజాలానికి ప్రతీకగా ఇంద్రనాధ్ ను చూపించాడు కనుక ఇండియాకి కావల్సినది స్పిరిట్యుయల్ ఇమానిసిపేషన్ కానీ భారత్ దేశానికి కావలసింది పేదరికం నుండి ఇమానిసిపేషన్ అని కూడా చెప్పకనే చెప్తాడు.

సూర్యుడి వెలుగు రేఖలతో సినిమా మొదలై, మెల్లగా మేఘాలు వచ్చి, మంచు ముసురుకుని, మళ్ళీ మేఘాలు విడిపోయి , మంచు తొలగి పోయి మళ్ళీ సూర్యుడు వెలుగులీనే దృశ్యంతో సినిమా ప్రారంభం కావడమే ఒక గొప్ప సౌందర్యం. ఆ సౌందర్యాన్ని సినిమా అంతా కొనసాగించడం , అంతా చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది.

ఇంద్రనాధ్ గా రే కి ఇష్టమైన చబ్బీ బిస్వస్ , లావణ్యగా కరుణా బెనర్జీ ఆలోకనంద రాయ్ మోనీషాగా హృదయంలో తిష్ట వేసుకుంటారు . సుబ్రతా మిత్రా ఫొటోగ్రఫీ ఈ సినిమాలో మరొక ప్రధానమైన పాత్ర . 102 నిమిషాల ఈ సినిమా చూడటం కళ్ళకు వేడుక… వంశీకృష్ణ.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మంచు మేఘాలు తొలిగితేనే… కాంచనగంగ శిఖర దర్శనం… గొప్ప మూవీ…
  • Madhuvidhu … క్లీన్ ఫ్యామిలీ కామెడీ మూవీ..! మన జంధ్యాల గుర్తొస్తాడు..!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • ఆ బుడ్డోడు వైభవ్ మాత్రమే కాదు… ఈ గొప్పోడు కూడా గుర్తుకురావాలి…
  • దొందూ దొందే… నాగేశ్వర్- పవన్ కల్యాణ్… తెలంగాణకు అక్కర్లేని కేరక్టర్లు…
  • ఇక నీ కెరీర్ క్లోజ్ అన్నారందరూ… ఈమె అస్సలు లెక్కచేయలేదు…
  • ప్చ్, ఏం చేస్తాం..? జపానోడికి మన మామిడి తినే యోగం లేదు..!!
  • రేవంత్ సవాల్‌కు బీఆర్ఎస్ వద్ద జవాబు లేదు..! కిక్కుమనరు..!!
  • KCR పాలన బాపతు ఆ గ్లోబరీనా… కొత్త పేరుతో మళ్లీ పిల్లల జీవితాలతో ఆటలు..!!
  • ఆహా… నేతల్ని పట్టుకుని బజారులోనే జనం ‘ఇరగ తన్నడం’ అపూర్వం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions