.
బెంగాల్ రాజకీయాల్లో భారీ కుదుపు… టీఎంసీ నిలువునా చీలిపోయి, మమత వర్గం ఓ చిన్న పీలికలాగా… అంటే, మహారాష్ట్రలో ఓ ఠాక్రే గ్రూపులాగా, ఓ శరద్ పవార్ గ్రూపులాగా మిగిలిపోయి, అస్థిత్వ ప్రమాదంలో పడేలాగా..! మమతను ఎదిరించి, వేరు కుంపటి పెట్టి, 60కు పైగా ఎమ్మెల్యేలను సమీకరించి, తనను ప్రతిపక్షనేతగా గుర్తించాలని రితాబ్రత బెనర్జీ అసెంబ్లీ స్పీకర్‌ను కోరాడు…
అవుతాడు… 80 మందిలో 60 మందికిపైగా మమతను ధిక్కరిస్తున్నారంటే అది విశేషమే… మూడింట రెండొంతుల మంది చీలిపోయి, తమదే అసలైన టీఎంసీ అని క్లెయిమ్ చేసుకుంటే స్పీకర్ కూడా సరే అనాల్సిందే… ఈమేరకు టీఎంసీ ఎంపీలను కూడా సమీకరిస్తున్నాడు… ఎవరు ఆయన..? మరో షిండే అవుతున్నాడా..? అభిషేక్ బెనర్జీకి చుక్కలు చూపించబోతున్నారా..?
Ads
అసలు ఎవరు ఈ రితాబ్రత బెనర్జీ..? వయస్సు 46 ఏళ్లు… ధిక్కారం, తిరుగుబాటు రక్తంలో ఉన్నవే… విద్యార్థి దశ నుంచే రాజకీయాలు… వామపక్ష ఉద్యమాల్లో చురుకుగా ఉంటూ రాజకీయవేత్తగా ఎదిగాడు… సీపీఎం నుంచి టీఎంసీ వరకు సాగింది తన ప్రస్థానం…
2008 నుండి 2016 వరకు SFI ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ… సీపీఐ(ఎం) పార్టీ తరఫున కేవలం 34 ఏళ్ల వయసులోనే 2014 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికయ్యాడు…. 2017లో సీపీఐ(ఎం) నుండి బహిష్కరణకు గురైన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ (TMC) వైపు మొగ్గు చూపాడు… పార్టీ కార్మిక విభాగమైన INTTUC (ఇండియన్ నేషనల్ తృణమూల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు…
2024 లో జవహర్ సిర్కార్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి TMC తరఫున రితాబ్రతను పంపారు. ఆపై 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉలుబేరియా పుర్బా (Uluberia Purba) నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు…
వివాదాలు & సస్పెన్షన్లు … రితాబ్రత బెనర్జీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ వివాదాలతోనే ముడిపడి ఉంది… న్యూఢిల్లీలోని ప్లానింగ్ కమిషన్ కార్యాలయం వెలుపల బెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాను కొందరు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఘోరంగా అవమానించిన, హల్చల్ చేసిన ఘటనలో రితాబ్రత బెనర్జీపై ఆరోపణలు వచ్చాయి…
కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆయన లగ్జరీ లైఫ్‌స్టైల్ సాగిస్తున్నారంటూ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. ఆయన చేతికి ఉన్న యాపిల్ వాచ్, మోంట్ బ్లాంక్ పెన్ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రశ్నించిన వ్యక్తి కంపెనీకి రితాబ్రత ఈమెయిల్ పంపి ఫిర్యాదు చేయడం వివాదాస్పదమైంది. క్రమశిక్షణా ఉల్లంఘనల కింద 2017 జూన్ 2న ఆయన్ను 3 నెలల పాటు సస్పెండ్ చేశారు…
సస్పెన్షన్ కాలంలోనే ఒక బెంగాలీ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. పార్టీ అగ్రనేతలు ప్రకాష్ కారత్, బృందా కారత్, మొహమ్మద్ సలీమ్‌లపై తీవ్ర విమర్శలు చేశాడు. తనపై విచారణ చేసే కమిటీని “కంగారూ కమిషన్” అని వ్యాఖ్యానించడంతో 2017 సెప్టెంబర్ 15న సీపీఐ(ఎం) ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి శాశ్వతంగా బహిష్కరించింది…
2017 లోనే ఒక రీసెర్చ్ స్కాలర్ రితాబ్రతపై పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. అయితే ఆమె తనను రూ. 50 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తోందని, వాట్సాప్ చాట్‌లను రితాబ్రత బయటపెట్టారు.
ఇటీవల ముగిసిన 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ల్యాండ్‌స్లైడ్ విజయం సాధించి అధికారంలోకి రాగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో రితాబ్రత బెనర్జీ కేంద్రంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా (Leader of Opposition) శోభన్‌దేబ్ చటోపాధ్యాయను నామినేట్ చేస్తూ TMC పార్టీ స్పీకర్‌కు ఒక లేఖ సమర్పించింది. అయితే, ఆ లేఖలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ రితాబ్రత బెనర్జీ, మరో ఎమ్మెల్యే సందీపన్ సాహా స్పీకర్ రతీంద్ర బోస్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి, బీజేపీ నేత సువేందు అధికారి మీడియా ముఖంగా బహిర్గతం చేశాడు.
ఈ పరిణామం జరిగిన కొన్ని నిమిషాల్లోనే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రితాబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి అధిష్ఠానం బహిష్కరించింది. అభిషేక్ బెనర్జీ కార్పొరేట్ తరహా నాయకత్వ శైలి నచ్చకే ఈ అసమ్మతి మొదలైందని అసంతృప్త నేతలు చెప్తున్నారు.
రితాబ్రత బెనర్జీ బహిష్కరణతో TMC లో భారీ చీలిక వచ్చేట్టుంది. దాదాపు 60 మంది అసంతృప్త TMC ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని రితాబ్రత క్లెయిమ్ చేస్తున్నాడు.. మహారాష్ట్ర తరహాలోనే బెంగాల్‌లో కూడా అసలైన TMC తమదే అని ఈ అసమ్మతి వర్గం ప్రకటించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి…
తన వైవాహిక స్థితి కూడా కంట్రవర్సీయే… రితాబ్రత బెనర్జీ భార్య పేరు అనన్యా చక్రవర్తి … ప్రస్తుతం విడిగా ఉంటున్నట్లు సమాచారం. అనన్యా చక్రవర్తి అసిస్టెంట్ చైల్డ్ రైట్స్ కమిషనర్ (State Child Rights Body) గా బాధ్యతలు నిర్వర్తించింది. 2017లో రితాబ్రత బెనర్జీపై ఒక మహిళా రీసెర్చ్ స్కాలర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సమయంలో.. తాను ఇప్పటికే రితాబ్రతతో విడిగా ఉంటున్నానని, చట్టపరంగా విడాకుల ప్రక్రియ నడుస్తోందని ఆమె మీడియాకు స్పష్టం చేసింది… మొత్తంగా రితాబ్రత బెనర్జీ ఓ ఇంట్రస్టింగ్ కేరక్టర్..!!
Share this Article