.
( రమణ కొంటికర్ల 99126 99960 ) … పగలంతా అమెరికన్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం.. రాత్రి మాత్రం బ్రిటీష్ రాజ్ కు వ్యతిరేకంగా పోరాటం… ఇది అన్ సంగ్ హీరో తారకనాథ్ దాస్ ఓ అద్భుతగాధ.
తమ దేశ పౌరులు అమెరికాకు రావాలా వద్దా అనే నిర్ణియించేలా వారి పత్రాలపై స్టాంప్స్ వేసే యువకుడు… అదే తన దేశ పౌరులను బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూల్చివేసే సంకల్పంలో ఓ గూఢచారిలా ఎలాంటి రహస్య పాత్ర పోషించాడో మనకు తారక్ నాథ్ కథ చెబుతుంది.
Ads
అంతేకాదు, తన లక్ష్యాన్ని బాహాటంగా ప్రకటించే ఓ పత్రికను కూడా ప్రచురించాడు తారక్ నాథ్ దాస్. భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అత్యంత సాహసోపోతమైన ద్వంద్వ జీవితాన్ని గడిపిన ఆయన… నేడు చాలా కొద్దిమందికి మాత్రమే గుర్తేమో బహుశా!
అసలెవరీ తారక్ నాథ్ దాస్..?
1884లో కోల్ కత్తా సమీపంలో ఓ గ్రామంలో ఓ గుమాస్తా కుటుంబంలో పుట్టాడు. యుక్తవయస్సుకొచ్చేసరికి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తాడు. సాయుధ పోరాటాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. అనుశీలన్ సమితి అనే రహస్యంగా పనిచేసే ఓ విప్లవసంస్థలో చేరాడు.
చదువు మధ్యలోనే వదిలేశాడు. బ్రహ్మచారి అనే మారుపేరుతో సంచార సన్యాసి అవతారమెత్తి.. ఊళ్లు, పట్టణాలు పట్టుకు తిరిగేవాడు. విప్లవ భావజాలాన్ని ప్రచారం చేసేవాడు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వానికి మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా మారాడు ఆ రోజుల్లో.
దాంతో విప్లవ నాయకుడు బాఘా జతిన్ అలియాస్ జతీంద్రనాథ్ ముఖర్జీ సలహాతో భారత్ విడిచి ముందు జపాన్ వెళ్లిపోయాడు. బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను అప్పగించాలని ఒత్తిడి చేయడంతో అక్కడి నుంచి పసిఫిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికాకు చేరుకున్నాడు. 1906 సంవత్సరంలో కేవలం 20 ఏళ్ల వయస్సులో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా సియాటిల్ లో అడుగుపెట్టాడు.
వ్యతిరేకించిన వ్యవస్థలోనే ఉద్యోగం సంపాదించిన దాస్!
అమెరికాలో ఆరంభ జీవితం చాలా కష్టంగానే సాగింది. పొలాల్లో కూలీగా పనిచేశాడు. విశ్వవిద్యాలయ ప్రయోగశాలలో పనిచేస్తూనే చదువును కొనసాగించాడు. అప్పుడే దాస్ జీవిత కథ ఓ మలుపు తీసుకుంది. పలు భాషల్లో ప్రవీణుడైన తారక్ నాథ్… అనువాదకుడిగా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో అర్హత సాధించి ఉద్యోగం సంపాదించాడు. 1908 ఆరంభంలో ఆయనను కెనడాలోని వాంకోవర్ ఇమిగ్రేషన్ సెంటర్ లో ఉద్యోగం కోసం నియమించారు.
అధికారికంగా ఆయన పని భారతీయ వలసదారుల దరఖాస్తులను పరిశీలించి, వారిని నియంత్రించడం. కానీ, అదే ఉద్యోగాన్ని తారక్ నాథ్ విప్లవం కోసం ఆయుధంగా మార్చుకున్నాడు. తన ముందుకు వచ్చిన భారతీయ కార్మికులు, విద్యార్థులతో రహస్య సంబంధాలు పెంచుకున్నాడు. అధికారికంగా ఓవైపు పని చేస్తూనే… ఇంకోవైపు, విప్లవసంస్థకు బలమైన పునాదులు వేశాడు.
ఫ్రీ హిందుస్థాన్ అంటే ఏమిటి…? అది టాల్ స్టాయ్ వరకు ఎలా చేరింది..?
1907లో బెల్లింగ్ హామ్, వాంకోవర్ ప్రాంతాల్లో భారతీయ వలస కార్మికులపై శ్వేతజాతీయుల దాడులు జరిగిన తర్వాత.. దాస్ ఫ్రీ హిందుస్థాన్ అనే పత్రికను ఆరంభించాడు. బ్రిటీష్ పాలకులను తీవ్రంగా ఖండిస్తూనే.. భారతదేశం ఎప్పటికీ భారతీయులదే, వలసవాదులది కాదంటూ గట్టిగా తన పత్రిక ద్వారా ప్రకటించేవాడు. ఆయన సహచరులు కొందరు ఆ పత్రికను ఆ రోజుల్లో ఉర్దూలోకి, గురుముఖి భాషల్లోకీ అనువదించేవారు. దాంతో పంజాబీ కార్మికులు కూడా ఆ పత్రికను చదవగల్గారు.
ఫ్రీ హిందుస్థాన్ పత్రిక ప్రభావం ఏకంగా ప్రపంచ ప్రసిద్ధ రష్యన్ రచయితైన లియో టాల్ స్టాయ్ వరకూ చేరింది. దాస్ ఆయనకు ఓ లేఖ రాసి మద్దతు కోరారు. దానికి ప్రతిగా 1908లో టాల్ స్టాయ్ ఏ లెటర్ టూ ఏ హిందు పేరిట ఒక సుప్రసిద్ధమైన వ్యాసాన్నీ రాశారు. అది తొలిసారిగా ఫ్రీ హిందుస్థాన్ పత్రికలోనే ప్రచురితమైంది.
అమెరికా పశ్చిమ తీరంలోని ఓ చిన్న వలసదారుడి పత్రికకు ప్రపంచ ప్రసిద్ధ రచయిత స్పందించడం.. దాస్ నిర్మించిన విప్లవ ప్రభావాన్ని అదే ప్రపంచానికి చాటిచెప్పింది.
దాస్ ది స్వతంత్ర ఆలోచనలు కల్గిన వ్యక్తిత్వం. టాల్ స్టాయ్ అహింసా సిద్ధాంతాన్ని పూర్తిగా అంగీకరించకుండానే.. తను విభేదించిన విషయాలను కూడా ఆయనకు స్పష్టంగా తెలియజేశారు తారక్ నాథ్.
దాస్ తిరుగుబాటు ఎంతటి మూల్యానికి కారణమైంది..?
పెరుగతున్న దాస్ విప్లవ పంథా ధోరణులు బ్రిటీష్ ప్రభుత్వం ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. ఆయన కార్యకలాపాలను ఏ మాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. బ్రిటన్ ఒత్తిడితో కెనడా, అమెరికా రెండు దేశాల్లో ప్రభుత్వాలు ఫ్రీ హిందుస్థాన్ పత్రికపై నిషేధం విధించాయి. చివరకు దాస్ కూడా కెనడా విడిచి వెళ్లాల్సి వచ్చింది. అయినా ఆయన పోరాటం మాత్రం ఆగలేదు. నిరంతరం సంఘటితమైన కృషి మాత్రం ఆపలేదు.
మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైన తర్వాత జర్మనీ సాయంతో భారతదేశంలో సాయుధ తిరుగుబాటు రగిలించాలన్న గదర్ ఉద్యమంలోనూ తారక్ నాథ్ ది కీలకపాత్ర. 1917లో అమెరికా ప్రభుత్వం.. బ్రిటీష్ గూఢచారులతో కలిసి విప్లవకారులను అరెస్ట్ చేసింది.
శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ప్రసిద్ధ హిందూ- జర్మన్ కుట్ర కేసులో తారక్ నాథ్ దాస్ దోషిగా తేలాడు. దాంతో తారక్ నాథ్ ను కాన్సాస్ రాష్ట్రంలోని లీవెన్ వర్త్ ఫెడరల్ జైలుకు తరలించారు. విచారణ సమయంలో ప్రభుత్వ న్యాయవాది తారక్ నాథ్ పై విపరీత మనస్తత్వంతో చేసిన జాత్యాహంకార వ్యాఖ్యలు కూడా ఇప్పటికీ చరిత్రలో నాటి రోజులను కళ్లకు కట్టేవి.
తారక్ నాథ్ దాస్ కు అమెరికా పౌరసత్వం వచ్చి అప్పటికే మూడేళ్లైంది. అయినప్పటికీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తన మాతృదేశం స్వాతంత్ర్యం కోసం అమెరికా జైలులో శిక్షననుభవించారు తారక్ నాథ్ దాస్.
పరారీలో ఉన్న విప్లవకారుడు కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అవతారమెలా ఎత్తాడు..?
జైలు నుంచి విడుదలైన తర్వాత దాస్ జీవితంలో మరో విశేషమైన మలుపు చోటుచేసుకుంది. ఆయన అమెరికన్ సామాజిక సంస్కర్త మేరీ కీటింగ్ మోర్స్ ను వివాహం చేసుకున్నారు. ఆమె నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ (NAACP)స్థాపకుల్లో ఒకరు.
ఆ తర్వాత దాస్ యూరప్ పర్యటించి విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థులకు సాయం చేయడానికి ఒక నిధిని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో పొల్టికల్ సైన్స్ బోధించే ప్రొఫెసర్ గా పనిచేశారు.
1935లో దాస్, ఆయన భార్య మేరీ కీటింగ్ మోర్స్ కలిసి… తారక్ నాథ్ దాస్ ఫౌండేషన్ ను స్థాపించారు. ఆ సంస్థ ఇప్పటికీ అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు సాయమందిస్తోంది. సంచార సన్యాసిలా ఆరంభమైన దాస్ జీవితం.. చివరకు విద్యావేత్తగా స్థిరపడినా.. భారత స్వాతంత్రానికి మద్దతు పలికే విషయంలో మాత్రం ఆయనేనాడూ రాజీపడలేదు.
తారక్ నాథ్ దాసును ఎందుకు గుర్తుంచుకోవాలి..?
భారత స్వాతంత్ర్య పోరాటమంటే కేవలం కలకత్తా, ఢిల్లీ వీధుల్లో మాత్రమే జరిగింది మాత్రమే కాదు. అక్కడి పోరాటాల వల్లే స్వాతంత్ర్యం రాలేదు. ప్రపంచం మరోవైపు ఉన్న పొలాల్లో, వలసశాఖ కార్యాలయాల్లో, జైళ్ల గదుల్లో కూడా ఆ స్వేచ్ఛ కోసం పోరాటాలు కొనసాగాయి.
అలాంటి ఉద్యమాల్ని ముందుండి నడిపించిన ఎందరి పేర్లో ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎవరో కొందరి పేర్లే శాశ్వతత్వం సంపాదించాయి. అలా కాలగర్భంలో కలిసిపోయి చర్చకు రాని పేరే తారక్ నాథ్ దాస్.
విప్లవకారుడిగా, ప్రవాసిగా, విద్యావేత్తగా మూడు భిన్న జీవితాల మధ్య… వాటన్నింటినీ ఒకే ఒక్క లక్ష్యం భారతదేశ స్వాతంత్ర్యం కోసం మల్చినవాడు.
1958లో న్యూయార్క్ లో మరణించిన దాస్.. విదేశాల్లో గౌరవం పొందినా స్వదేశంలో మాత్రం ఆయన పేరు మరుగున పడిపోవడం విషాదం.
బ్రిటీష్ సామ్రాజ్యం అసలు ఊహించని నేలపై నిలబడి.. దాని గుండెల్లో గునపాలు దింపినవాడు తారక్ నాథ్ దాస్. అందుకే, స్వాతంత్ర్య దినోత్సవాల రోజున ఇలాంటి అన్ సంగ్ హీరోస్ గురించి కూడా కాస్తా ఇప్పుడు చెప్పుకోవచ్చు. తప్పేం లేదు. పైగా వాళ్లు జీవితకాలం చేసిన పోరాటాలకు ఓ చిన్న ట్రిబ్యూట్.. భావితరాలకు చెప్పేందుకు ఓ అవకాశం.
Share this Article