.
అందరూ బాగానే ఉంటారు… డబ్బులున్న మారాజులు బాగానే ఉంటారు… వత్తాసు పలికే పాలక ప్రభువులు బాగానే ఉంటారు… ఏదైనా ఇష్యూ వస్తే బలయ్యేది ఎవరు..? అధికారులు, ఇతరులు… రాయలసీమలో జిందాల్ ‘రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్’ పెడుతోంది కదా, ఆ నిర్మాణ పనుల ప్రారంభానికి చంద్రబాబు కూడా వెళ్లాడు కదా… అప్పుడు అనిపించింది పైన చెప్పినట్టు!!
ఎందుకో చెప్పాలంటే ఒక పేరు గుర్తుకు తెచ్చుకోవాలి… ఆమె పేరు కాదంబరి జెత్వానీ… ముంబై నటి… ఏదో యవ్వారం, దాని జోలికి ఇక్కడ పోలీేం… కానీ ఆమె సజ్జన్ జిందాల్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టింది… జిందాల్‌కు కోపమొచ్చింది, ముంబై పోలీసులను కాదని ఏపీ పోలీసులను అలియాస్ జగన్‌ను ఆశ్రయించాడు…
Ads
జగన్ మరోమాట ఆలోచించకుండా తన పోలీసులకు పని అప్పగించాడు… అంతే… ఏపీకి చెందిన ఓ పోలీసు బృందం ముంబై వెళ్లింది, ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసింది విజయవాడకు తీసుకువచ్చింది… వేధించారు, నిర్బంధించారు, బెదిరించారు… కొన్నిరోజులు ఆమె ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియని దురవస్థ… అరాచకం… సుమారు 42 రోజుల పాటు ఆమె జైల్లో ఉండాల్సి వచ్చింది…
సీన్ కట్ చేయండి… ఎవరెవరి ఉసురు తగిలిందో గానీ జగన్ అత్యంత ఘోరంగా ఓడిపోయాడు… చంద్రబాబు గద్దెనెక్కాడు… కాదంబరి జెత్వానీ, 2024 ఫిబ్రవరిలో తనపై, తన కుటుంబ సభ్యులపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించింది… జిందాల్‌పనై తను పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని, అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో కలిసి కొంతమంది పోలీసు అధికారులు తనను వేధించారని ఆమె ఆరోపణ…
ప్రభుత్వం మారింది కదా … ఎవరెవరు ఈ కేసులో ఓవరాక్షన్ చేశారో గుర్తించింది చంద్రబాబు ప్రభుత్వం… సెప్టెంబర్ 2024లో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పి. సీతారామాంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా, మాజీ డీసీపీ విశాల్ గున్నిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది…

ఈ అధికారులపై విచారణ కొనసాగుతోంది పేరుకు… కానీ ఎక్కడికక్కడ గప్‌చుప్ అయిపోయినట్టే కనిపిస్తోంది… ఆమె జాడాపత్తా లేదు మళ్లీ… విశాల్ గున్ని సస్పెన్షన్ విషయంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) నుంచి కొంత ఊరట లభించిందనీ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేయడంతో, వారి సస్పెన్షన్ కొనసాగుతోందనీ సమాచారం… (Subject to corrections)…
అదే సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెడుతోంది… చంద్రబాబుతో డీల్ సెట్… కడప జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ భారీ ఎత్తున ‘రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్’ నిర్మాణ పనులను ప్రారంభించింది… దీనిపై సుమారు ₹16,350 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు… ఈ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు…

నిజానికి ఒక పారిశ్రామికవేత్తపై కేసు ఉండటం వేరు, ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం పెట్టుబడులను ఆహ్వానించడం వేరు… స్థూలంగా అంతే… కానీ అదే సజ్జన్ జిందాల్… ప్రభుత్వం మారింది, పాలకుడు ఎవరొచ్చినా సరే, ఇలాంటోళ్లకు వత్తాసే… మధ్యలో బలయ్యేది ఎవరయ్యా అంటే… ఇదుగో కాదంబరి వంటి బాధితులు… చెప్పింది విని, చెడు ఆచరించే ఉన్నతాధికారులు… పాలకుడు బాగానే ఉంటాడు, డబ్బున్నోడు కూడా బాగానే ఉంటాడు..!!
Share this Article