.
జననాయకన్‌కు కత్తెర దెబ్బ.. ప్రణాళిక లోపమే చిత్ర యూనిట్‌ను ఇబ్బంది పెడుతోందా? అసలే కొన్నేళ్లుగా వరుస ఫెయిల్యూర్లు, తీవ్ర నైరాశ్యంలో ఉన్న పూజా హెగ్డేకు రన్ టైమ్ దెబ్బ..?
మామూలు సినిమా అయితే ఇతర తారలకు సరైన, కథకు అనువైన రన్ టైమ్ ఉంటుంది… ఎప్పుడైతే హీరోయిజాన్ని ఓవర్ ఎక్స్‌పోజ్ చేసే, పొలిటికల్ ఫాయిదా బేస్డ్ కథగా మారుతుందో… ఇక హీరో తప్ప ఇంకెవరూ కనిపించరు… అవే డైలాగ్స్, అవే ఎలివేషన్స్… ఈ సూత్రంతో పూజా హెగ్డే సీన్లకు ఎడాపెడా కత్తెర్లు పడ్డాయట… ఆమెకు మళ్లీ నిరాశే…
Ads
అంతటి సిరివెన్నెల కూడా ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవే చూడే నా కళ్లు’ అని మనసు పారేసుకుని, పాదాభివందనం చేశాడు ఏదో పాటలో… ప్చ్, తరువాత అవి ఐరన్ లెగ్స్ అనిపించుకున్నాయి పాపం… ఇప్పటికీ నో ఛేంజ్… సరే, వివరాల్లోకి వెళ్తే…
భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణంలో చిన్న ప్రణాళికా లోపమే చివరికి ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో చెప్పేందుకు జననాయకన్ తాజా ఉదాహరణగా నిలుస్తోంది. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కి నేడు రిలీజ్ కాబోతోంది…
ఈ సినిమా సెన్సార్ చిక్కుల్లో పడి చాన్నాళ్లు కోల్డ్ స్టోరేజీలో పడి మూలగడం, విజయ్ ఏకంగా సీఎం అయ్యేసరికి ఇక అది రిలీజుకు నోచుకోవడం అందరికీ తెలిసిన కథే.., తమిళనాట భారీ బుకింగ్స్ సాగుతున్నాయి… అది బాలయ్య భగవంత్ కేసరి రీమేక్ కాబట్టి తెలుగులో దానిపై పెద్ద ఆసక్తి లేదు ఇప్పటివరకూ…
విజయ్ చివరి చిత్రంగా ప్రచారం జరుగుతుండటంతో ఈ సినిమాపై తమిళ అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది… కానీ మరోవైపు వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూజా హెగ్డేకు కూడా ఈ చిత్రం కీలకంగా మారింది. ఇందులో ఆమె జర్నలిస్టు పాత్రలో కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి మొదట్లో…

రన్‌టైమ్ కోసం కత్తెర.. తగ్గిన పూజా స్క్రీన్ టైమ్?
సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకునే సరికి రన్‌టైమ్ సమస్యలు తలెత్తడం కొత్త విషయం కాదు. అయితే జననాయకన్ విషయంలో ఈ ప్రభావం హీరోయిన్ పాత్రపైనే ఎక్కువగా పడినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మొదట పూజా హెగ్డే పాత్రను బలంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో అనేక కీలక సన్నివేశాలను ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ సినిమా నిడివి అనుకున్న దానికంటే ఎక్కువగా పెరగడంతో దర్శకుడు హెచ్. వినోద్ కొన్ని సన్నివేశాలను షూట్ చేయకుండానే పక్కన పెట్టినట్లు, చిత్రీకరించిన మరికొన్ని భాగాలను తుది ఎడిటింగ్‌లో తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పూజా స్క్రీన్ టైమ్ గణనీయంగా తగ్గే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
ఈ పరిణామం నేపథ్యంలో దర్శకుడు వ్యక్తిగతంగా పూజా హెగ్డేకు వివరణ ఇచ్చారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన లేకపోయినా, ఈ అంశం మాత్రం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

సమస్య ఒక్క ‘జననాయకన్’దే కాదు…
ఇది కేవలం ఒక సినిమా కథ మాత్రమే కాదు. ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్ చిత్రాల్లో షూటింగ్ ప్రారంభమైన తర్వాతే స్క్రిప్ట్‌లో మార్పులు, సన్నివేశాల కోతలు, రీషూట్లు, చివరి నిమిషంలో ఎడిటింగ్ మార్పులు సాధారణంగా మారిపోయాయి. ఫలితంగా నిర్మాతలకు అదనపు భారం పడుతుండగా, నటీనటుల పాత్రల ప్రభావం కూడా తగ్గిపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. (రాంచరణ్ పెద్ది సినిమా పెద్ద ఉదాహరణ)
షూటింగ్ ప్రారంభానికి ముందే కథ, స్క్రీన్‌ప్లే, రన్‌టైమ్‌పై స్పష్టమైన అవగాహన ఉంటే కోట్ల రూపాయల వృథాను, అనవసర కోతలను చాలా వరకు నివారించవచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవల అక్కినేని నాగార్జున కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రణాళిక లోపాలపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఏ తేదీకి విడుదలవుతుందో ముందుగానే స్పష్టత లేకపోవడం వల్ల నిర్మాతలతో పాటు మొత్తం యూనిట్‌పై ఒత్తిడి పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించాడు. షూటింగ్ పూర్తయ్యాక ఎడిటింగ్ టేబుల్‌పై పెద్ద ఎత్తున మార్పులు చేయడం కథనంపైనా ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ఫలితంపై ప్రభావం ఉంటుందా?
రన్‌టైమ్ కోసం కీలక సన్నివేశాలు తొలగించడం ప్రతి సినిమాకూ తప్పనిసరిగా నష్టమే అని చెప్పలేం. కొన్నిసార్లు అదే సినిమాను మరింత కచ్చితంగా, క్రిస్పీగా మార్చవచ్చు. కానీ కథలో కీలకమైన పాత్రలకు సంబంధించిన ఘట్టాలే కోతకు గురైతే మాత్రం వాటి ప్రభావం తెరపై కనిపించే అవకాశం ఉంటుంది.
జననాయకన్ విషయంలో కూడా అలాంటి పరిస్థితి నెలకొంటుందా? లేక ఎడిటింగ్ వల్ల సినిమా మరింత బిగుతుగా తయారవుతుందా? అన్నది విడుదల తర్వాతే తేలనుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, భారీ అంచనాలు మాత్రమే విజయాన్ని నిర్ణయించవు. వాటికి తోడు పక్కా ప్రణాళిక, సమయపాలన, కథపై స్పష్టమైన అవగాహన కూడా అంతే కీలకం. జననాయకన్ చుట్టూ జరుగుతున్న ఈ చర్చ మరోసారి అదే విషయాన్ని గుర్తు చేస్తోంది…
Share this Article