Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్రంప్ సేఫ్ ! కానీ ఆ జర్నలిస్టులు, వైట్‌హౌజ్ స్టాఫ్ పరిస్థితి..!?

August 13, 2026 by M S R

.

ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ లేరు..! శత్రువుల కళ్లకు కనిపించిన అధ్యక్షుడు… నిజానికి మరో విమానంలో! అసలు ఏమిటి ఈ కథ… సినిమా స్క్రిప్టుకన్నా ఎక్కువ… రాజమౌళి, కాదు, కాదు, ఆదిత్య ధర్ కూడా దిగదుడుపే… పదండి ఆ కథలోకి వెళ్దాం…

విమానం బయలుదేరబోతోంది… కెమెరాలన్నీ దానిపైనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కారు. చేతులు ఊపారు. కెమెరాలకు కనిపించారు. ఇక విమానం బయలుదేరడమే తరువాయి.

Ads

కానీ… అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. విమానం లోపలికి వెళ్లిన ట్రంప్ కొద్దిసేపటికే మరో మార్గంలో బయటకు వచ్చేశారు. సాధారణ మెట్లపై నుంచి కాదు. ఎయిర్‌పోర్టులోని ఓ క్యాటరింగ్ ట్రక్కులో!

ఆ ట్రక్కు ఎయిర్ ఫోర్స్ వన్ పక్కకు వెళ్లింది. దాని కంటైనర్‌ను విమానం తలుపు స్థాయికి పైకి ఎత్తారు. ట్రంప్, ఆయనకు అత్యంత సన్నిహితమైన కొందరు సిబ్బంది అందులోకి వెళ్లారు. ఆ తర్వాత ట్రక్కు అక్కడి నుంచి కదిలింది.

ఎక్కడికి? కొద్ది దూరంలో సిద్ధంగా ఉన్న మరో చిన్న సైనిక విమానం దగ్గరకు. అది C-32A. ట్రంప్ అందులోకి ఎక్కారు. అంతే… ఒకే సమయంలో రెండు విమానాలు ఒకే కథ చెబుతున్నట్టు కనిపించాయి. కానీ నిజం ఒక్కటే.

అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ వన్‌లో లేరు! అసలు సినిమా కథ ఇక్కడే మొదలవుతుంది… ఇది జులై 8న టర్కీలోని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం తర్వాత చోటుచేసుకున్న ఘటన. ట్రంప్ టర్కీకి వెళ్లేటప్పుడు ఖతార్ అందించిన కొత్త బోయింగ్ 747-8లో వెళ్లారు. తిరుగు ప్రయాణానికి మాత్రం పాత ఎయిర్ ఫోర్స్ వన్‌ను ఉపయోగిస్తారని ముందుగానే ప్రచారం జరిగింది.

కెమెరాల ముందు కూడా అదే జరిగింది. ట్రంప్ పాత ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కారు. అందరూ అదే నిజమని అనుకున్నారు. కానీ భద్రతా వ్యవస్థకు అందిన సమాచారం వేరే కథ చెప్పింది. అధ్యక్షుడి విమానాన్ని లక్ష్యంగా చేసుకునే ఇరాన్ ముప్పు ఉందన్న సమాచారం వచ్చింది.

అమెరికా సీక్రెట్ సర్వీస్ నిర్ణయం తీసుకుంది. ట్రంప్ అదే విమానంలో వెళ్లకూడదు. కానీ అధ్యక్షుడిని మరో విమానంలోకి మార్చుతున్నారని బయటకు తెలియకూడదు. అందుకే… క్యాటరింగ్ ట్రక్కే రహస్య వాహనంగా మారింది. ట్రంప్ ఉన్న విమానం మాత్రం బయలుదేరింది.

అందులో జర్నలిస్టులు ఉన్నారు. వైట్‌హౌస్ సిబ్బంది ఉన్నారు. అధ్యక్షుడు ఉన్నారనే నమ్మకంతో వాళ్లు ప్రయాణించారు. విమానం ఆకాశంలోకి ఎగిరింది. కానీ అది అప్పటికే ఒక డీకాయ్. అసలు అధ్యక్షుడు మాత్రం మరో విమానంలో ఉన్నారు.

Washington Post కథనం ప్రకారం…, ట్రంప్ ప్రయాణించిన C-32A విమానం సాధారణంగా కనిపించే విధంగా కాకుండా “Reach 18” అనే కాల్‌సైన్‌తో ప్రయాణించింది. అదే సమయంలో అధ్యక్షుడు లేని పాత ఎయిర్ ఫోర్స్ వన్ మాత్రం మధ్యలో “AF1” కాల్‌సైన్‌తో కనిపించింది.

అంటే శత్రువు ఆకాశంలో గమనిస్తే? “అధ్యక్షుడు ఇదిగో ఈ విమానంలో ఉన్నాడు” అని కనిపించే విమానం ఒకటి. నిజానికి… అధ్యక్షుడు మరో విమానంలో! మరి ట్రంప్‌కు ఎందుకు చెప్పలేదట? ట్రంప్ స్వయంగా ఇప్పుడు చెప్పిన సమాధానం కూడా ఆయన శైలిలోనే ఉంది.

  • “సీక్రెట్ సర్వీస్, మిలిటరీ ఏం చెబితే అది చేస్తాను. వేరే విమానంలో వెళ్లమన్నారు. వెళ్లాను. బహుశా ఏదో ముప్పు ఉండొచ్చు. పెద్దగా అడగలేదు” అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు.

తనకు బెదిరింపులు రావడం కొత్తేమీ కాదని కూడా చెప్పారు. “ప్రాముఖ్యత ఉన్న అధ్యక్షుడికి బెదిరింపులు ఉంటాయి. ప్రాముఖ్యత లేని అధ్యక్షుడికి ఉండవు” అన్నది ట్రంప్ వ్యాఖ్య. అంటే… “నాకు బెదిరింపులు వస్తున్నాయంటే నేను ముఖ్యమైనవాడినే కదా!” అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యను చూడొచ్చు.

కానీ అసలు ప్రశ్న అక్కడ కాదు. మరి ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఉన్నవాళ్ల సంగతి? జర్నలిస్టులు, వైట్ హౌజ్ సిబ్బంది ఎట్సెట్రా… ఇరాన్ ఏదైనా చేసి ఉంటే… వాళ్ల పని..? ఇక్కడే ఈ కథలో మరో ట్విస్ట్. అధ్యక్షుడిని రక్షించడానికి రూపొందించిన ఆపరేషన్‌లో, అధ్యక్షుడు లేని విమానంలోనే కొంతమంది జర్నలిస్టులు, సిబ్బంది ప్రయాణించారు కదా, వారికి అసలు ముప్పు విషయం పూర్తిగా తెలియదు. విమానం కిటికీల షేడ్లు కూడా మూసేయాలని సూచించారు.

వాళ్లు అనుకున్నది ఒక్కటే… ట్రంప్ తమతోనే ఉన్నారు. కానీ ఆయన అప్పటికే మరో విమానంలో సురక్షితంగా వెళ్లిపోయారు. Washington Post తాజా వివరాల ప్రకారం…, ట్రంప్‌తో పాటు కొందరు అత్యంత సన్నిహిత సిబ్బంది మాత్రమే ఆ రహస్య మార్పిడిలో పాల్గొన్నారు; పలువురు ఉన్నతాధికారులు, జర్నలిస్టులు మాత్రం పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లోనే ఉన్నారు.

అందుకే ఇప్పుడు మరో ప్రశ్న కూడా వస్తోంది. అధ్యక్షుడిని రక్షించడానికి చేసిన ఆపరేషన్‌లో, అధ్యక్షుడితో ప్రయాణిస్తున్నామని భావించిన వాళ్లను మాత్రం ఎందుకు చీకట్లో ఉంచారు? అది భద్రతా అవసరమా? లేక అతిగా రహస్యంగా వ్యవహరించడమా? అది మరో చర్చ.

ఇది కొత్త వ్యూహమేమీ కాదు… నాయకులను శత్రువుల కళ్లకు చిక్కకుండా తరలించడం ప్రపంచ రాజకీయాల్లో కొత్త విషయం కాదు. యుద్ధాలు, ఉగ్రవాద ముప్పు, హత్య కుట్రలు ఉన్నప్పుడు దేశాధినేతల ప్రయాణ మార్గాలను చివరి నిమిషం వరకు రహస్యంగా ఉంచడం, డీకాయ్ వాహనాలు లేదా విమానాలను ఉపయోగించడం వంటి భద్రతా పద్ధతులు గతంలోనూ కనిపించాయి.

Washington Post కూడా గతంలో అమెరికా అధ్యక్షుల ప్రయాణాల్లో డీకాయ్ విమానాలను ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంది. 2000లో బిల్ క్లింటన్ పాకిస్థాన్ పర్యటన సందర్భంగా కూడా ఇలాంటి డీకాయ్ పద్ధతి బయటపడిన ఉదాహరణను ప్రస్తావించింది.

కొన్ని దేశాల్లో అయితే… అధ్యక్షుడిలా కనిపించే వ్యక్తినే బయటకు పంపించి అసలు అధ్యక్షుడిని మరో మార్గంలో తరలిస్తారనే కథలు కూడా చాలాకాలంగా ప్రచారంలో ఉన్నాయి. అది నిజంగా ఎక్కడెక్కడ జరిగిందన్నది వేరే విషయం. కానీ వ్యూహం మాత్రం ఒకటే. శత్రువుకు కనిపించేది నిజమైన లక్ష్యం కాకూడదు.

ట్రంప్ కథలో అసలు ట్విస్ట్ ఏమిటంటే… టర్కీ నుంచి అమెరికా అధ్యక్షుడు బయలు దేరుతున్నాడు. కెమెరాల ముందు ఎయిర్ ఫోర్స్ వన్ సిద్ధంగా ఉంది. అధ్యక్షుడు అందులోకి ఎక్కాడు. విమానం బయలుదేరింది. అందరూ… “ట్రంప్ ఈ విమానంలోనే ఉన్నారు” అనుకున్నారు. కానీ ఆకాశంలోకి వెళ్లిన ఆ విమానం ఒక రకంగా అధ్యక్షుడి నీడ మాత్రమే. కాదు, అధ్యక్షుడూ అందులో ఉన్నాడనే ఓ భ్రమ…

అసలు ట్రంప్ మాత్రం అప్పటికే మరో విమానంలో దేశం వైపు ప్రయాణిస్తున్నారు. ఒక సినిమా తీస్తే ఇంతకంటే మంచి సీన్ రాయడం కూడా కష్టమే.

హీరో కనిపించేది ఒక విమానంలో…
శత్రువు గురి పెట్టేది అదే విమానంపై…
కానీ హీరో మాత్రం అప్పటికే మరో విమానంలో!

అధ్యక్షుడి భద్రతా వ్యవస్థలో అసలు ఆట ఇదే. శత్రువును ఓడించడానికి ముందు… శత్రువుకు అసలు లక్ష్యం ఎవరో తెలియకుండా చేయాలి. అందుకే ఈసారి ట్రంప్ విమానం మార్చడం కేవలం విమానం మార్పు కాదు. ఎయిర్ ఫోర్స్ వన్‌ను డీకాయ్‌గా మార్చి… అధ్యక్షుడిని మాయ చేసి తరలించిన ఆపరేషన్.

ఇక చివరి ట్విస్ట్ ఏమిటంటే… ఈ ఆపరేషన్‌కు కారణమైన ఇరాన్ ముప్పుపై అమెరికా ఇంటెలిజెన్స్‌లోనే అందరూ ఒకే అభిప్రాయంలో లేరట. Washington Post తాజా కథనం ప్రకారం, CIAలోని కొందరు విశ్లేషకులు ఆ సమాచారాన్ని తక్కువ విశ్వసనీయత కలిగినదిగా భావించారు.

అంటే సినిమా ఇంకా అయిపోలేదు…. ట్రంప్‌ను చంపేందుకు నిజంగానే ఎవరో గురి పెట్టారా? లేక ఆ ముప్పు అనుమానంతోనే అమెరికా ఇంత పెద్ద రహస్య ఆపరేషన్ నడిపిందా? ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రిచ్ – రిచర్ – రిచెస్ట్ ! బీఆర్ఎస్ ఖజానాకు అడ్డగోలు ధనకళ !!
  • తప్పుడు కేసుతో నష్టం విలువ ఎంత..? మరి న్యాయం మాటేమిటి..?
  • జగన్ బొద్దింకల్ని ముద్దాడటం వెనుక ఇంత పే-ద్ద కథుందా..?!
  • ఇడిసిపెట్టలేదు- ఒడిసిపట్టలేదు… హరీష్- కేటీయార్ క్షుద్ర రాజకీయం !
  • కావ్య అనిరుధ్ పెళ్లి … కరుణానిధి – రజినీకాంత్ కుటుంబాల వియ్యం !!
  • నా చిన్నప్పటి ప్రియురాలు… ఈరోజుకూ కలలో పలకరిస్తుంది…
  • ప్రహార్ ! బాలీవుడ్ మరో మేలిమి కథ ! కసబ్ విచారణలో కొత్త కోణాలు !!
  • అమ్మ పేర్చిన బతుకమ్మ అమ్మంత అందంగా ఉండేది…!
  • యూపీలో యోగి *పవర్ తగ్గలేదు! *డీప్ స్టేట్ ఇంకా కష్టపడాలి !!
  • అనూహ్యం- 48 కోట్ల నుంచి 5,800 కోట్ల సంపద! ఎవరీ మహేంద్ర నహతా !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions